Tiruppavai లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Tiruppavai లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, డిసెంబర్ 2025, సోమవారం

తిరుప్పావై - పాశురము 08 - "కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు" - Tiruppavai - Paasuram 08


తిరుప్పావై ఎనిమిదవ పాశురములో గోదాదేవి, తదితరులు ఇంకో బాలికను లేపుతూ, తెల్లవారిన సూచనలు వర్ణిస్తూ, ఏమంటున్నారంటే "మేము నీకు కూడ ఈ వ్రత ఫలితము తక్కాలని ఎంచి, ఒక్కళ్ళమే వెళ్లిపోకుండా నిన్ను కూడ పిలుచుకు పోదామని ఆగి ఉన్నాము" అని అంటున్నారు. 

అంతే కాకుండ శ్రీకృష్ణుని వీరగాథలు, అతని ఆత్మీయతను తెలియజేయడము కూడ జరుగుతోంది.    


తిరుప్పావై - పాశురము 08 - "కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు" 

 

కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు, ఎఱుమై శిఱువీడు
మేయ్ వాన్ పరందన గాణ్, మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్
పోవాన్- పోకిన్ఱారై పోగామల్ కాత్తు, ఉన్నై 
కూవువాన్ వందు నిన్రోమ్, కోదు కలముడైయ,
పావాయ్! ఎళున్దిరాయ్! పాడి పఱై కొండు 
మావాయ్ పిళన్దానై మల్లరై మాట్టియ 
దేవాది దేవనై, చెన్ఱు నామ్ శేవిత్తాల్
ఆవావెన్ఱు ఆరాయ్ న్దు అరుళేలో రెమ్బావాయ్ || 

అర్థము:

తెల్లవారుతున్న సూచనగా తూర్పు దిశన ఆకాశపు టంచులలో వెలుగు రేఖలు పొడుచుకు వస్తున్నాయి. అది చూసి గేదలు మేత మేయటాని కని నలుదిశల బయలు దేరాయి. 

మనతో ఉన్న తక్కిన గోపికలు అందరూ త్వరత్వరగా శ్రీకృష్ణుని వద్దకు పోదామని వెళ్లిపోతుంటే వాళ్ళని ఆపి, నిన్ను కూడ తీసుకుని, అందరమూ కలిసి పోదామని వచ్చాము. 

కాబట్టి ఓ పిల్లా! లేచి రా. ఆయనను కీర్తించి పఱై అనే బహుమతిని పొందుదాము. 

ఎవరైతే (బకాసురుని) నోరు చీల్చి చంపాడో, మల్లయుద్ధములో ఇద్దరు మహా మల్లులను (కంసుని సభలో) హతమార్చెనో, ఆ దేవాధి దేవుడైన శ్రీకృష్ణుని చేరి మనము దర్శించుకుందాము. అప్పుడు ఆయన అయ్యో! ఇంత శ్రమపడి మీరొచ్చారా! నేనే మీ దగ్గరకు వచ్చేవాడిని గదా! అని బోళ్ళు ఆప్యాయతతో, జాలితో మనల్ని పలుకరించి కటాక్షించును. 

కాబట్టి వెంటనే లేచి వచ్చి మాతో బాటు పద.              

21, డిసెంబర్ 2025, ఆదివారం

తిరుప్పావై - పాశురము 07 - "కీశు కీశెన్ఱు ఎంగు" - Tiruppavai - Paasuram 07


తిరుప్పావై ఏడవ పాశురము ద్వారా రెండో బాలికను లేపుతూ ఆమె ఇంటి చుట్టుపక్కల అవుతున్న చప్పుళ్లను వివరించడము జరిగింది. ఆ చప్పుళ్లకు మెలకువ తెచ్చుకుని రాక ఇంకా పడుకున్నావేమిటని లేపుతున్నారు. భరధ్వాజ పక్షులు, మంగళసూత్రాలు, గాజుల చప్పుళ్ళు, పెరుగు చిలుకుతున్న చప్పుళ్ళని ఇందులో చెప్పడము జరుగుతోంది. 
  

తిరుప్పావై - పాశురము 07 - "కీశు కీశెన్ఱు ఎంగు" 


కీశు కీశెన్ఱు ఎంగుం ఆనైచ్చాత్తన్ కలందుఁ
పేశిన పేచ్చరవం కేట్టిలైయో, పేయప్పెణ్ణే?
కాశుమ్ పిఱప్పుమ్ కల కల ప్పక్కే పేర్తు
వాశ నఱుంగుళల్ ఆయచ్ఛియర్, మత్తినాల్
ఓశైపడుత్త తయిరరవమ్ కేట్టిలైయో,
నాయక పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్తి 
కేశవనై ప్పాడవుమ్ నీ కేట్టే కిడత్తియో 
తేశముడైయాయ్! తిఱవేలో రెమ్బావాయ్ ||  

అర్థము:

తెల్లవారిందనే బెంగతో భరధ్వాజ పక్షుల జంటలు (ఆహారాన్వేషణకై తాము విడిపోవు సమయము వచ్చిందనే బెంగ) కిచకిచమని చేసే ధ్వనులు నీకు వినబడటము లేదా? ఓ పెద్దింటి పిల్లా! (వెఱ్ఱిదానా అని కూడా చెప్పుకోవచ్చును. ఎందుకంటే ఇంకా తెల్లారలేదని భ్రమలో ఉంది.)

గొల్ల వనితలు తమ మెడలోని మంగళసూత్రాలు ఒకదానితో ఒకటి తగుల్కుని చేసే చప్పుళ్లు, గాజుల ధ్వనులు చేస్తూనూ, కవ్వములతో పెరుగు చిలుకుతున్న ఆ పెద్ద పెద్ద ధ్వనులు కూడ నీకు వినబడటం లేదా? ఓ నాయకుని కూతురా, మా నాయకురాలవు కదే నువ్వు. మేము చెప్పిన వాణ్ణి కూడ విని తెల్లవారిందనటంలో ఇంకేం సందేహము లేదని తెలుసుకో. 

సమస్త బ్రహ్మాండ మంతటా వ్యాప్తి చెంది ఉన్న ఆ నారాయణ మూర్తిని, కేశవుని అందరమూ పాడుతుంటే నీకు వినిపిస్తోంది కదా. మరి ఆలస్యము చేయక, మత్తు వదలి తలుపు తీసి మాతో పాటు పద.  

ఈ విధముగా రెండో గోపికను లేపి బయలుదేరారు.                    

20, డిసెంబర్ 2025, శనివారం

తిరుప్పావై - పాశురము - 06 - "పుళ్ళుమ్ శిలంబిన కాణ్" - Tiruppavai - Paasuram 06

తిరుప్పావై ఆరవ పాశురము తెల్లవారిన సమయము ఏ విధముగా ఉందో తెలియజేస్తోంది. 

మొదటి ఐదు పాశురములలో గోదాదేవి తిరుప్పావై వ్రతము యొక్క నియమాలను, ఫలితములను తెలియ జెప్పింది. ఆ పిమ్మట 6 నుండి 15 పాశురముల వరకు ఒక్కొక్క దానిలోను ఒక్కొక్క గోపికను లేపుకుంటూ వస్తుంది. ఆ విధముగా మొత్తం 10 మందిని లేపి తనతో బాటు స్నానము చేసి వ్రతము ఆరంభిస్తుంది.

 

ప్రతీ బాలికకి తెల్లవారినదను సూచనలు తెలియజేస్తూ లేపుతోంది. ఇప్పుడు ఆరవ పాశురములో ఏం చెప్పి లేపుతోందో చూద్దాము.  

 తిరుప్పావై - పాశురము - 06 - "పుళ్ళుమ్ శిలంబిన కాణ్" 

పుళ్ళుమ్ శిలంబిన కాణ్, పుళ్లఱైయన్ కోయిలిల్ 
వెళ్లై విళి శంగిన్ పేరఱవుమ్ కేట్టిలైయో ?
పిళ్ళాయ్! ఎళున్దిరాయ్, పేయ్ ములై నంజుండు 
కళ్ళ చ్చగడం కలక్కజియ క్కాలోచ్చి 
వెళ్ళ త్తరవిల్ తుయిల్ మఱంద విత్తినై 
ఉళ్ళత్తు క్కొండు మునివర్ గళుమ్, యోగిగళుమ్ 
మెళ్ళవెళుందు అఱి ఎన్ఱ పేరరవుమ్ 
ఉళ్ళం పుగుందు కుళిరిన్దేలో రెమ్బావాయ్ || 

అర్థము: 

పక్షులు కిలకిలారవములతో అంతటా ఎగురుతున్నాయి. పక్షుల రాజగు గరుత్మంతుని ప్రభువు గుడిలో స్వఛ్చముగా ఆహ్వానములు పలుకుతూ గట్టిగా ధ్వని చేయబడుతున్న శంఖారావము నీకు వినబడుట లేదా?

ఓ పిల్లా, లేచి రావమ్మా! పూతన యొక్క విశాల, విషపూరిత స్తనముల నుండి జుర్రుకుంటూ ఆమె రక్తమునంతా పీల్చేసి, మరియు మాయల మారి శకట రూపములో నున్న శకటాసురుని కీళ్లూడిపోయేలా తన కాలితో తన్ని చంపిన వాడును, పాలకడలిలో ఆదిశేషునిపై యోగనిద్రలో పరుండి ఉన్నవాడునూ అయినా ఆ శ్రీమన్నారాయణునికి శ్రమ కలుగకుండ తమ మనస్సులలోనే మెల్లగా "హరి హరి" అని ధ్యానించుకుంటూ వెళ్తున్న లోకములోని మునులు, యోగులూ చేస్తున్న ధ్యానమంతా కూడ ఒక చిరుగాలి రూపములో మా మనస్సులకు తగిలి మాకు వెలువ వచ్చింది.  

ఈ విధముగా మేలుకుని మేమంతా కూడ వ్రతము కోసమని బయలు దేరాము. అలా మేము చిరుగాలి ధ్వనికే లేచి వచ్చాము. మరి మేమంతా పిలుస్తున్నా రాకపోతే ఎలా? త్వరగా లేచి బయలు దేరుము. 

గోదాదేవి పదిమంది గోపికలను లేపుతూ 10 పాశురాలు అల్లింది. కాని తను ముందుగానే ఇంకో ఒకరిద్దరితో కలిసి బయలు దేరింది అని మనము తెలుసుకోవాలి.              

19, డిసెంబర్ 2025, శుక్రవారం

తిరుప్పావై - పాశురము 05 - "మాయనై మన్ను" - Tiruppavai - Paasuram 05


తిరుప్పావై ఐదవ పాశురము కూడ ఈ వ్రతము చేయుట వల్ల కలిగే ఫలితాన్నే తెలియజేస్తూ, కృష్ణపరమాత్మ మహిమలను విశదీకరిస్తూ, గోదాదేవి మరొకసారి గోపికలందరికీ ప్రోత్సాహన కలిగించడము జరుగుతోంది.

కష్టమైన పని చెయ్యాలంటే అందరికి బద్ధకమే. తెల్లవారు ఝామునే లేచి నదిలో స్నానము చేసి, కొన్ని కఠినమైన నియమాలతో వ్రతము చేద్దామని గోదాదేవి అంటోంది కదా. మరి అలా చేయడం వల్ల మన కష్టమే కనిపిస్తుంది కాని దాని వల్ల ప్రయోజనము ఏముంటుంది అని సందేహాలు ఉంటాయి. ఆ సందేహాల్ని తీర్చడం కోసం ఆమె ఏమి చెబుతూ వాళ్ళని పురమాయిస్తోందో చూద్దాము. 


తిరుప్పావై - పాశురము 05 - "మాయనై మన్నువడమదురై మైన్దనై"

మాయనై మన్ను వడమదురై మైందనై
త్తూయ పెఱునీర్ యమునై త్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోన్ఱుమ్ మణివిళక్కై
తాయై కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై;
తూయోమాయ్ వందు నామ్ తూమలర్ తూ విత్తొళుదు 
వాయినాల్ ప్పాడి మనత్తినాల్ శిందిక్క 
పోయ పిళై యుమ్ పుగు తరువాన్ ఇన్ఱుఅనవుమ్
తీయినిల్ తూశాగుమ్ శెప్పే లో రెమ్బావాయ్ || 

అర్థము:

మాయావి అంటే మాయలు చేసి మన హృదయములను ఆకట్టుకునేవాడు. అటువంటి ఆశ్చర్యకరములైన మాయలు కలిగినవాడు, ఉత్తర మథుర నివాసి అగు శ్రీకృష్ణ పరమాత్మ, నిర్మలము, పవిత్రము అయిన యమునా తీరమందలి గొల్ల కులమందు మనకై ఆవిర్భవించెను.

గొల్లకులమంతటికీ ఒక రత్న దీపము వంటి యశోదమ్మ గర్భమును పవిత్రము, దేదీప్యమానము గావించెను. అతను దామోదరుడు. పద్మము నాభి యందు కలవాడు. ప్రపంచమంతా తన ఉదరములో ధరించినవాడు. 

అటువంటి ఆ పరమాత్మను నిదుర వదలి, ఎటువంటి సందేహములు, భ్రమలు లేకుండ మన హృదయమనే పద్మమును సమర్పించి, నోటితో కీర్తిస్తూ, మనస్సుతో ధ్యానించుదాము. 

అప్పుడు మనకు ఇప్పటి వరకునూ ఉన్న, మరియు ఇకముందు రాబోయే పాపాలన్నీ కూడ మంటల్లో పడిన దూది పింజలలాగా తత్క్షణమే కాలిపోయి, మన వ్రతము నిరాటంకముగా
కొనసాగును. 

కాబట్టి అందరూ లేచి రండి. భగవన్నామ కీర్తన చేసుకుంటూ వ్రతాన్ని మొదలు పెడుదాము.  

           

18, డిసెంబర్ 2025, గురువారం

తిరుప్పావై - పాశురము - 04 - ఆళి మళై కణ్ణా - Tiruppavai - Paasuram 04


తిరుప్పావై నాలుగవ పాశురములో "ఆళి మళై కణ్ణా" అంటూ ముద్దుగా వానదేవుని (వరుణుని) వేడుకుంటోంది గోదాదేవి. మంచిగా వానలు కురిపించమని, అప్పుడు అందరమూ ఆ పవిత్రమైన నీటిలో స్నానం చేసి ధన్యులము అవుతామని. 

ఏదైనా వ్రతము చెయ్యాలన్నా, లేదా రోజూ చేసుకునే పూజ కోసమైనా ముందుగా పవిత్రత ముఖ్యము. శరీరాన్ని, మనసుని పవిత్రం చేసుకోవాలి. మనస్సు పవిత్రతకు శరీర పవిత్రత ఒక నాంది లాంటిది. శరీరాన్ని శుభ్రము చేసుకుని, పవిత్రమైన (ఉతికి ఆరేసిన) బట్టలు ధరిస్తే మనస్సుకి ఆహ్లాదముగా ఉంటుంది. అప్పుడు మనస్సు కూడా పవిత్రతకు చోటు చేసుకుంటుంది. 

ఇప్పుడు నాలుగవ పాశురము, దాని అర్థములు తెలియజేస్తున్నాను.  


ఆళి మళై కణ్ణా ఒన్ఱు నీ క్కై కరవేల్,
ఆళి యుళ్ పుక్కు ముగన్దు కొడార్ తేఱి 
ఊళి ముదల్వ నురువంబోల్ మెయ్ కఱుత్తు, 
పాళి యందోళుడై పఱ్ప నాబన్ కై యిల్ 
ఆళి పోల్, మిన్ని వలమ్బురిపోల్ నిన్ర దిర్ న్దు, 
తాళా దే శార్ఙ్గ ముదైత్త శర మళై పోల్, 
వాళ వులకినిల్ నీ పెయ్ దిడాయ్, నాంగళుమ్ 
మార్గళి నీరాడ మగిళ్ న్దేలో రెమ్బావాయ్ || 

అర్థము:

ఓ, వానదేవుడా, పర్జన్యుడా! నువ్వు దయచేసి ఒక పని చెయ్యి. 

సముద్రములోకి చొచ్చుకు పోయి, నిండా మునిగి, తాగ గలిగి నన్నినీళ్లన్నీ తాగి, పైకి ఎగసి పోయి, భూమి అంతటా దద్దరిల్లు మాదిరి గర్జనలతో ఆకాశమంతటా వ్యాపించిపోయి, కటిక నీల మేఘాలు ధరించి, ఆ పద్మనాభుడి చేతిలోని సుదర్శన చక్రము వలె మెరుపులు మెరుస్తూ, ఆయన శంఖ ధ్వని వలె చప్పుళ్ళు చేస్తూ, ఆయన యొక్క శార్ఙ్గ ధనుస్సు నుండి ఎడతెరిపి లేకుండా వెలువడే బాణాల లాగ వర్షపు ధారలు ఈ లోకమంతటా కురిపించుము. 

అప్పుడు మేము ఆ వర్షపు నీటిలో స్నానమాచరించి ధన్యులము అవుతాము సుమా.                


17, డిసెంబర్ 2025, బుధవారం

తిరుప్పావై - పాశురము 03 - "ఓంగి ఉలగళంద" - Tiruppavai - Paasuram 03


"ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి"

తిరుప్పావై మూడవ పాశురములో గోదాదేవి ఈ తిరుప్పావై వ్రతము ఆచరిస్తే కలిగే లాభము, ఫలితములను వివరిస్తోంది. ప్రపంచమంతటా కూడా వర్షములు పడి పంటచేలతోను, పశు సంపదతోను, ఐశ్వర్యముతోను అందరూ సుఖంగా ఉంటారని చెబుతోంది. 




తిరుప్పావై - పాశురము 03   

ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి
నాంగళ్ నమ్బావైక్కు శాత్తి నీరాడినాల్
తీంగిన్రి నాడెల్లామ్ తింగళ్ ముమ్మారి పెయిదు 
ఓంగు పెరుం శెన్నెల్ ఊడు కయలుగళ 
పూంగు వళై ప్పోదిల్ ప్పొఱివణ్ణు కణ్ పడుప్ప 
త్తెంగా దే పుక్కిరందు శీత్తములై పత్తి 
వాంగ క్కుడం నిరైక్కుమ్ వళ్ళల్ పెరుం పశుక్కళ్ 
నీంగాద శెల్వమ్ నిరైందే లో రెమ్బావాయ్ ||    

అర్థము:

పెద్దగా పెరిగి ప్రపంచాన్ని కొలిచిన ఆ ఉత్తముడైన పరమాత్మను పొగడుతూ కీర్తించి, మనము దృఢమైన భక్తి విశ్వాసములతో ఈ వ్రతాన్ని పాటిస్తే:

ఈ ప్రపంచమంతటా కూడ ఎటువంటి ఇబ్బంది కలుగని విధముగా నెలకు మూడు వర్షములు కురియును. పంట చేలు ఏపుగా పెరిగి నాట్యము చేస్తాయి. 

ఆ చేల మధ్యలందునూ, నీటి కాలువ లందునూ చేపలు ఎగిరెగిరి గంతులు వేస్తూండును. తుమ్మెదలు అందామైన రెక్కలతో అంతటా విహరిస్తూ తేనెలు తాగి మత్తులో మునుగుతూంటాయి. 

బాగా బలిష్టమైన పశువులు పెద్ద పెద్ద బిందెల నిండా పాలు నింపేస్తూంటాయి. 

ఈ విధంగా అంతటా సుభిక్షం, ఐశ్వర్యములతో మునిగి తేలుతుంటారు అంతా. 

కాబట్టి పదండి ఈ వ్రతము చేద్దాము.       
        

16, డిసెంబర్ 2025, మంగళవారం

తిరుప్పావై - పాశురము 02 - వైయత్తు వాఙవీర్ గాళ్- Tiruppavai - Paasuram 02


తిరుప్పావై - పాశురము 2 - "వైయత్తు వాఙవీర్గాళ్"

ఈ రెండవ పాశురములో గోదాదేవి తిరుప్పావై వ్రతాన్ని చెయ్యడానికి నియమాలని చెబుతోంది. 

వ్రతము చేసేటప్పుడు మనము శుచిగా, నిష్కల్మషముగా ఉండాలి. భోగములను పక్కకి నెట్టెయ్యాలి. మితముగా భోజనము, మితముగా నిద్ర పాటించాలి. ఆడంబరములగు బట్టలు కానీ, ఆభరణములు కానీ, అలంకరణ సామాగ్రులను కాని వాడకూడదు. అవన్నీ ఆ భగవంతునికే పరిమితము చెయ్యాలి. 


ఇప్పుడు పాశురము తెలియజేస్తున్నాను.  


వైయత్తు వాఙవీర్ గాళ్ ! నాముమ్ నమ్బావైక్కు 
శెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో, పార్కడలుళ్ 
పైయత్తు యిన్ఱ పరమనడి పాడి 
నెయ్యుణ్ణోమ్, పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి 
మైయెట్టుళుదోం మలరిట్టు నా ముడియోమ్ 
శెయ్యోదన శెయ్యోమ్ తీక్కుఱళై శెన్రోదోమ్
అయ్యముమ్ పిచ్చెయుమ్ ఆందనైయుమ్ కై కాట్టి 
ఉయ్యుమాఱెణ్ణి యుగన్దే లో రెమ్బావాయ్ || 

అర్థము:

ఓ, భూమిపై(దుఃఖములు, సంఘర్షణలతో నిండి ఉన్న ఈ ప్రపంచములో పుట్టినప్పటికీ) సుఖాలు అనుభవిస్తున్నగోపికా మణులారా! మనము ఇప్పుడు చేయబోయే ఈ వ్రతము ఎలా ఆచరించాలో వినండి, చెబుతున్నాను. 

పాలకడలి యందు శయనించే ఆ పరమాత్ముడిని కీర్తించాలి. భోగ పదార్థములైన నెయ్యి, పాలు తాగకుందుము.

తెల్లవారు ఝామునే స్నానము చేద్దాము. 

కాటుక పెట్టుకోము. పువ్వులు, దండలు ధరించము. 

చెయ్యకూడని పనులు చెయ్యము. పెద్దలు చెప్పిన విధముగా మంచిగా మసలుకుందాము. తీక్కురళ్ అంటే తిరువళ్ళువరు చెప్పిన పధ్ధతి ప్రకారము అని కూడా అర్థము. అంటే సత్య, ధర్మ నిష్ఠలతో నడచుకొనుట. 

పెద్దవారలను గౌరవిస్తూ, భిక్షులకు చేతనైనంత, తగినంత సాయము చేస్తూ గడుపుదాము.

ఇలా శాశ్వతమగు ఆత్మ సుఖాన్ని, మోక్షాన్ని అందించే ఈ వ్రతమును ఆచరించుదము.               

  

15, డిసెంబర్ 2025, సోమవారం

తిరుప్పావై - పాశురము 01 - మార్గళి త్తింగళ్- Tiruppavai - Paasuram 01


తిరుప్పావై వ్రతము చేయువారు రోజుకొక పాశురము చొప్పున మొత్తం 30 రోజులలో 30 పాశురములు చదువుతూ శ్రీకృష్ణుడు, శ్రీరంగనాథస్వామి రూపములలో ఆ శ్రీమన్నారాయణుని భక్తితో పూజిస్తూ, పొంగలి వండి ఆరగింపు పెడుతూ, పూజ చేసుకోవాలి. 

ఆ పాశురాలనే నేను తెలుగు భాషలో అర్థములతో సహా రోజూ ఒక పోస్టు చొప్పున మొత్తము 30 పోస్టులలో తెలియజేస్తున్నాను.


 

ఒకటవ పాశురము - "మార్గళి త్తింగళ్" 

మార్గళి త్తింగళ్ మదినిఁరైంద నన్నాళాల్  
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళై యీర్ !
శీర్ మల్ గుమ్ ఆయ్ ప్పాడి శెల్వ చ్చిఱు మీర్ గాళ్!
కూర్వేల్ కొళున్దొళన్ నందగోపన్ కుమరన్
ఏఱార్ న్ద కణ్ణి యశోధై ఇళం శింగం  
కార్మేని చెంగణ్ కదిర్ మదియంబోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱై తరువాన్ 
పారోర్ పుగళ్ పడిం దేలోర్ ఎమ్బావాయ్ || 

అర్థము:

మార్గళి మాసము నిండు వెన్నెల హృదయమంతా నింపుకున్న శుభదినములలో స్నానం చేయుదాము పదండి. ఇక్కడ స్నానము అంటే వ్రతము గావించుట కోసమై స్నానము చెయ్యడము. ఇలా వ్రతము చేసే మక్కువతో రాదలచిన వారందరూ పదండి స్నానము చేద్దాము. 

ఓ సంపదలతో తులతూగు ఆయ్ ప్పాడి (నందుని ఊరు పేరు) లో నివసించు భాగ్యము పొందిన గోప బాలికలారా! పదండి శ్రీ కృష్ణుని ధ్యానము చేద్దాము. 

ఈ విధముగా నిష్ఠతో వ్రతము చేసిన యెడల:

పదునైన బల్లెము ధరించి బల పరాక్రమము లతో తన ప్రజలను కాపాడుకునే నందగోపుని కుమారుడూ, అందమైన, విప్పారిన కన్నులు కలిగిన యశోదమ్మ యొక్క సింహ కిశోరుడైన వాడునూ, నల్లని వాడు, ఎర్రని తామరల వంటి కనులవాడునూ, తేజోవంతమైన కిరణముల ప్రసరింప జేయు మోము కలవాడునూ, అయినటువంటి శ్రీమన్నారాయణుడు, ప్రపంచమంతటా మన కీర్తి వ్యాపించే విధముగా, మనకు బహుమతులను అందజేయును. 

పఱై ఇస్తాడు అంటే మామూలు అర్థము వాద్యము ఇస్తాడని. కాని గోదాదేవి చెప్పే పఱై మోక్షముతో సమానమైన బహుమానము ఇస్తాడని భావించాలి. 

అలాగే స్నానము చేయడము అంటే భక్తిలో ములిగి పవిత్రులు అవడము అని తెలుసుకోవాలి. 

భక్తితో ఆ యశోదమ్మ ముద్దుల కొడుకుని సేవించి జన్మ తరించుకోవడానికి, ముక్తిని పొందటానికి అందరూ పదండి అని ఆండాళ్ మాత మనకి చెబుతోంది.             
   

13, జనవరి 2025, సోమవారం

తిరుప్పావై - పాశురము 30 - "వఙ్గ క్కడల్ కడైంద మాధవనై" - Tiruppavai- Pasuram 30


 తిరుప్పావై 30వ పాశురము గోదాదేవి తన గురించి చెప్పుకుంటున్నట్లు, మరియు ఈ వ్రత ఫలితమును తెలియజేస్తున్నట్లు గాను చెప్పబడినది.  

ఆమె ఆ వ్రతాన్ని ఏవిధముగా, ఎవరిద్వారా తెలుసుకుని చేసినదీ, తను చేసినట్లే అందరమూ చేసి ఆమె లాగ ఆ భగవంతుని కటాక్షము పొంది ఆయన సన్నిధికి చేరుకోవచ్చుననీ నొక్కి చెబుతోంది ఇందులోని పంక్తుల ద్వారా. 


తిరుప్పావై - పాశురము 30


వఙ్గ క్కడల్ కడైంద మాధవనై కేశవనై 
తింగళ్ తిరుముగత్తు చేయిళైయార్ శెన్ఱిరైంజి
అంగప్పఱై కొండ వార్తయ్ అణి పుదువై 
ప్పైమ్ గమల తణ్ణెరియల్ బట్టర్ పిరాన్ కోదై శొన్న 
శంగత్తమిళ్ మాలై ముప్పదుమ్ తప్పామే 
ఇంగు ఇప్పరిశురై ప్పార్  ఈరిరండు మాల్వరైత్తోళ్ 
శెంగణ్ తిరుముగత్తు చ్చెల్వ త్తిరుమాలాల్ 
ఎంగుమ్ తిరువరుళ్ పెత్తు ఇంబురువ రెమ్బావాయ్ ||  

అర్థము :-

క్షీర సాగర మథనము చేసినప్పుడు అందులో నుండి ఆవిర్భవించిన లక్ష్మీదేవిని పొంది (ఆమెను సతిగా ధరించి) మాధవుడుగా అయి,  అలాగే జటలతో కూడిన బ్రహ్మ, రుద్రుడు మొదలైన వారిని కూడ ధరించి కేశవుడుగా పేరొందిన ఆ నారాయణుడుని అలనాడు చంద్ర బింబము వంటి ముఖమండలముల తోనూ, దివ్యాభరణములతోను ప్రకాశించుచున్న గోపికలు చేరి ఏ విధముగా నైతే వ్రతమును చేసి తరించారో ఆ వార్తను (కథను) విని, ధరణిలో ముత్యము వంటి శ్రీవిల్లిపుత్తూరు గ్రామమునందు నివసిస్తున్న శీతలజల తామర పుష్పమాలికలు ధరించు బ్రహ్మణోత్తముడైన విష్ణుచిత్తుని ముద్దుల బిడ్డ గోదాదేవి ఈ సంఘ సాహిత్య తమిళ మాల లోని 30 పాశురములనూ అల్లి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు అర్పించి ధన్యురాలు అయినది. 

ఆమె ఎలాగైతే తరించిందో, అదే విధముగా, ఈ తమిళ మాల అయిన తిరుప్పావై లోని ముప్ఫయి పాశురములనూ ఎవరైతే క్రమము తప్పకుండా అనుసంధిస్తారో (అంటే శ్రద్దా భక్తులతో పఠించి ఆయనను ఆరాధిస్తారో) వారు కూడ ఇక్కడే ఈ జన్మ లోనే (ఆ రెండు రెళ్ళ) ఆ నాలుగు భుజములు కలిగిన లక్ష్మీనారాయణుని   కటాక్షమును పొంది ఆయన సన్నిధికి జేరుకుంటారు అని ఆండాళ్ ఆశీర్వదిస్తూ హామీ ఇచ్చినట్లుగా చెప్పబడినది.             

12, జనవరి 2025, ఆదివారం

తిరుప్పావై - పాశురము 29 - "శిత్తుమ్ శిఱుకాలే వందు" - Tiruppavai- Pasuram 29

 

తిరుప్పావై 29వ పాశురము శ్రీకృష్ణుని పట్ల సమర్పణా భావనముతో అల్లబడినది. 

వేకువజామునే వచ్చి ఆ స్వామిని లేపినందుకు గాను గోదాదేవి తన క్షమాపణలు చెప్పుకుంటూ తననూ, తన తోటివారినీ కూడ ఆయన రక్షించి తీరాలని విన్నవించుకోవడము జరిగింది ఈ పాశురము ద్వారా. 

అంతే కాకుండా మేము ఎల్లప్పటికీ నీతో పాటు ఉండి, జన్మ జన్మలకీ నీకు సేవలు చేస్తూ ఆనందించేట్లా అనుగ్రహించమని కూడా ఆయనను వేడుకుంటోంది. 

   

తిరుప్పావై - పాశురము 29 - శిత్తుం శిఱుకాలే 


శిత్తుమ్ శిఱుకాలే వందు ఉన్నయ్ శేవిత్తు, ఉన్ 
పొత్తామరై యడియే పోత్తుమ్ పొరుళ్ కేళాయ్ 
పెత్తైమ్మేయిత్తుణ్ణుమ్ కులత్తిల్ పిఱన్దు, నీ 
కుత్తేవల్ ఎంగళై కొళ్ళామల్ పోగాదు ;
ఇత్తై పఱై కొళ్వాన్ అన్రుకాణ్; కోవిందా !
ఎత్తైక్కుమ్ ఏళేళు పిరవిక్కుమ్ ఉందన్నోడు 
ఉత్తో మేయావోమ్, ఉనక్కే నాం ఆట్ చెయ్ వోమ్ 
మత్తైనం కామంగళ్ మాత్తేలో రెమ్బావాయ్ ||  

అర్థము :-

మిక్కిలి వేకువ ఝామునే లేచి వచ్చి నిన్ను సేవించి, నీ మంగళకరములైన పాదారవిందములకు మంగళాశాసనములు పాడుటయే మాకు ఆనందకరమైనది. 

ఓ శ్రీకృష్ణా ! నువ్వు శ్రేష్ఠుడవైనప్పటికీ, పశువులను మేపుకొనే అజ్ఞానులమైన మా గొల్ల కులము నందు పుట్టి మా జాతినీ, మా జన్మలనూ ధన్యము చేశావు. అందుచేత నువ్వు మమ్ములను తరింపజేయక తప్పదు.  

ఇంతే కాదు సుమా! ఓ గోవిందా! మేము అదేదో చిన్న పఱై అనే వాద్యానికోసమై వచ్చామని అనుకోకు.

మేము ఎప్పటికీ, ఏడేడు జన్మలకీ నీతోనే ఉంటూ, నీతోనే మసలుచూ, నీకు సేవ చేయటం కోసమని వచ్చాము. 

మాకు నీతో ఉంటూ నీ సేవ చేయడము కన్నా గొప్ప కోరికలు ఇంకేవీ లేవు కృష్ణా !

 కావున దయచేసి మమ్మల్ని ఆదుకుని ఉద్ధరించుము స్వామీ !                   

11, జనవరి 2025, శనివారం

తిరుప్పావై - పాశురము 28 - "కఱవైగళ్ పిన్ శెన్ఱు" - Tiruppavai- Paasuram 28


తిరుప్పావై 28వ పాశురములో గోదాదేవి తన అజ్ఞానతను (అంటే మన అందరి అజ్ఞానాన్ని) ఒప్పుకుంటూ, మేము బుద్ధి లేక అనేకమైన పిచ్చి పిచ్చి పనులు చెయ్యడం, మాట్లాడడము చేశాము. అందుకని నువ్వు కోపగించుకోక మమ్ములను క్షమించి, మాకు మేము అర్థించే పఱై అన్న బహుమానాన్ని ఇవ్వాలి. మాకు అన్ని కష్టాలు, దుఃఖాల నుండి విముక్తిని ప్రసాదించి, నీ సన్నిధికి జేర్చుకోవాలి అని వేడుకుంటోంది. 


తిరుప్పావై - 28వ పాశురము 


కఱవైగళ్ పిన్ శెన్ఱు కానమ్ శేరుందు ఉణ్బోమ్ 
అఱి వొన్రుమ్ ఇల్లాద ఆయ్ కులత్తు ఉన్దన్నై 
ప్పిఱవి పెరుందనై పుణ్ణియమ్ యాముడై యోమ్;
కుఱై ఒన్ఱు ఇల్లాద కోవిందా! ఉందన్నోడు 
ఉఱవేల్ నమక్కింగు ఒక్క ఒడియాదు;
అఱియాద పిళ్ళైగళోమ్; అన్బి నాల్ ఉన్దన్నై 
చ్చిఱుపేర్ అత్తనవుమ్ శీరి యరుళాదే 
ఇఱైవా ! నీ తారాయ్ పఱై ఏలో రెమ్బావాయ్ || 

అర్థము :-

పశువుల వెంటబడి అడవులకు పోతుంటాము. 

పిసరంత కూడ జ్ఞానము లేని గొల్లవారము. అటువంటి గొల్ల కులములో నువ్వు జన్మించుట వలన మా జన్మలు ధన్యమైనవి. 

నీ మూలాన మాకు ఎటువంటి కొరతలూ, ఇక్కట్లూ లేకుండా హాయిగా ఉన్నాము. 

ఇంక మన ఈ సంబంధము తెగగొట్టు కోవాలన్నా తెగేది కాదు. (ఈ జన్మ అంతా మన సంబంధము ఇంతే, ఇలాగే ఉంటుంది).   

అజ్ఞానులము. తెలివితేటలు కాని చదువు కాని లేని మూర్ఖులము. అంతస్తుల తేడా (గొప్పింటి, బీదరకము, మరియు చిన్న, పెద్ద తేడాలు) తెలియని వారము. 

అందువలన నిన్ను మాలో ఒకడిగానే భావిస్తూ, ఎంతో ముద్దుగా చిన్న చిన్న పేర్లతో పిలిచేవాళ్ళము.           

కాబట్టి నువ్వు తప్పు పట్టుకుని మాపై కోపగించుకోక, ఓ స్వామీ! మాకు పఱై ప్రసాదించు. 

నీ సన్నిధిలోకి చేర్చుకుని మోక్షాన్ని ప్రసాదించు, తండ్రీ !    

10, జనవరి 2025, శుక్రవారం

తిరుప్పావై పాశురము 27 - కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా - Tiruppavai Pasuram 27

తిరుప్పావై 27వ పాశురము ద్వారా గోదాదేవి శ్రీ కృష్ణునికి తన వ్రత ఫలితము (అంటే బహుమానము) ఏ విధంగా ఉండాలో తెలియజేస్తోంది. 

ఈ తిరుప్పావై వ్రతమును ఆచరించిన తరువాత బహుమానముగా మేమందరమూ, ఓ కృష్ణా! నీతో బాటుగా కూర్చుండి పంచభక్ష్య పరమాన్నములతో తృప్తిగా విందు భోజనము చేయాలని కోరికగా ఉన్నట్లు తెలియబరుస్తోంది. అలా జరిగే ఆ విందుభోజనాలు ఏ విధముగా ఉండాలంటే వాటిని గురించి ఊళ్ళో వారంతా (లోకులందరూ కూడ) పది కాలాల పాటు గొప్పగా చెప్పుకునేట్లా ఉండాలని అంటుంది. 


తిరుప్పావై - పాశురము 27


కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా ! ఉన్దన్నై 
ప్పాడి పఱై కొండు యామ్ పెరు శమ్మానమ్
నాడు పుగళుమ్ పరిశినాల్ నన్ఱాగ 
చూడగమే, తోళ్ వళైయే, తోడే, శెవిఁ ప్పూవే, 
పాడగమే, యెన్ఱ నైయ పల్కలనుం యామణివోమ్, 
అడై యుడుప్పోమ్; అదన్ పిన్నే పాల్ శోరు 
మూడ నెయ్ పెయిదు, ముదన్ కై వళివార, 
కూడి యిరుందు కుళిరిందు, ఏలో రెమ్బావాయ్ || 

అర్థము :-

కృష్ణా! నీ ఉనికిని సహించలేని శత్రువుల నందరినీ జయించు కల్యాణ గుణములు, కీర్తి ప్రతిష్టలు కలిగిన ఓ గోవిందా ! నిన్ను స్తుతించి మేము పొందే పఱై అనే బహుమానము ఏవిధంగా ఉండాలో చెబుతున్నాము విను. 

నీ చేత మేము పొందే బహుమానము చాలా పెద్దది, గొప్పదై ఉండి దాన్ని గురించి లోకులందరూ కూడా ప్రశంసించే విధముగా ఉండాలి. 

చేతి కంకణములు, భుజములకు తొడుక్కునే కంకణములు, గాజులు, చెవులకి కర్ణాభరణములు, కర్ణ పుష్పములు, పాదాలకు తొడుక్కునే మువ్వలు, అందియలు (గజ్జెలు), ఇవే కాక ఇంకా మాకు తెలియని వస్తువులు, పలువిధములైన ఆభరణములు, ఇవన్నీ కూడ నువ్వు మాకు ధరింపజేయాలి. 

పట్టు వస్త్రములు కూడ (ఆడై ఉడుప్పోమ్) ధరిస్తాము.       

ఆ పిమ్మట నీతో కలసి కూర్చుండి క్షీరాన్నము విందు ఆరగించెదము. ఆ పాయసము ఎలా ఉండాలన్నది చెబుతా విను. అందులో బాగా నెయ్యి ఉండి, ఆ నెయ్యి పైకి తేలుతూ ఉండాలి. అప్పుడు మేము ఆ పాయసాన్నము తింటుంటే నేతి ధారలు మోచేతి నుండి కారుతుండేలా ఉండాలన్న మాట. అటువంటి క్షీరాన్నము నీతో కలిసి ఆరగించాలి మేము. 

ఈ విధముగా మా నోము ఫలము గొప్పదై ఉంది, లోకులందరూ ఈ తిరుప్పావై వ్రత మహిమ గురించి ఎల్లకాలము ప్రశంసిస్తూ ఉండేట్లా నువ్వు మమ్ములను బహూకరించాలి సుమా! 

9, జనవరి 2025, గురువారం

తిరుప్పావై - పాశురము 26 - మాలే మణివణ్ణా మార్గళి నీరాడువాన్ - Tiruppavai- Pasuram 26


తిరుప్పావై లోని 26వ పాశురము  ద్వారా గోదాదేవి ఈ తిరుప్పావై వ్రతము చెయ్యడానికి కావలసిన తదితర వస్తువులను వివరించి చెప్తోంది. మేము ఈ వ్రతాన్ని సంతుష్టితో మంచిగా జరుపుకోడానికి నువ్వు ఇవన్నీ కూడ మాకు అందజెయ్యాలని శ్రీకృష్ణుని వేడుకుంటోంది. 


కావాల్సినవన్నీ తెలియజేసి, ఇవన్నీ కూడ నువ్వు సులభముగా ఇవ్వగలిగినవే అని అతని ఔదార్యమునూ, వైభవమునూ చాటి చెప్తోంది. 

తిరుప్పావై - పాశురము 26


మాలే ! మణివణ్ణా ! మార్గళి నీరాడువాన్; 
మేలైయార్ శెయ్ వనగళ్ వేండువన, కేట్టియేల్!
జ్ఞాలత్తై యెల్లామ్ నడుంగ మురల్వన
పాలన్న వణ్ణత్తు, ఉన్ పాంజశన్నియమే 
పోల్వన శంఙ్గమ్ గళ్, పోయ్ ప్పాడుడైయనవే
శాల ప్పెరుంపఱైయే, పల్లాండి శైప్పారే,
కోల విళక్కే, కొడియే, వితానమే 
ఆలి నిలైయాయ్, అరుళేలో రెమ్బావాయ్ || 

అర్థము :-

ఆశ్రితుల యందు వ్యామోహము, ప్రేమ కలిగిన వాడా! ఇంద్రనీల మణి వర్ణము వంటి దేహ కాంతి గలవాడా!  

మేము మార్గ శీర్ష స్నానము ఆచరించ తలచాము. అందుకోసమై మాకు కావాల్సిన పరికరాలు ఉన్నాయి. నువ్వు దయచేసి వినేటట్లయితే తెలియజేస్తాము. 

ఈ భూమండలాన్ని అంతా వణకింపజేసే ధ్వని కలిగిన, పాల రంగు లాంటి స్వచ్ఛమైన తెల్లదనముతో ప్రకాశించే నీ పాంచజన్యమును పోలిన శంఖములు కావాలి. 

మేము ఈ వ్రతము మంచిగా శాస్త్రోక్తముగా చేసుకోవడానికి ఇంకా ఇవన్నీ కూడ కావాలి.  

చాలా పెద్దదైన పఱై వాద్యము (డప్పు లాంటిది) కావాలి. పల్లాండు పాడేవారు కావాలి. మంగళకరమైన దీపములు కావాలి. ఒక గరుడ ధ్వజమూ, చాందినీలు కూడ కావాలి. 

ఇవన్నీ కూడా లోకాలన్నిటినీ పొట్టలో పెట్టుకుని అవలీలగా ఒక  వటపత్రముపై ఎంతో అద్భుతంగా పడుకున్న నీవంటి మహనీయునికి అందుబాటులో నున్నవే సుమా ! 

కాబట్టి ఇవన్నీ మాకు అనుగ్రహింపుము ఓ స్వామీ !         

8, జనవరి 2025, బుధవారం

తిరుప్పావై- పాశురము 25 - "ఒరుత్తి మగనాయ్ పిఱన్దు" - Tiruppavai- Pasuram 25


తిరుప్పావై 25వ పాశురములో గోదాదేవి శ్రీకృష్ణునికి ఇద్దరు తల్లుల సౌభాగ్యము కలుగుట, మరియు అతను కంసుని వధించడము మున్నగు సాహస కార్యముల వర్ణన చేస్తూ అతనిని కీర్తించడము జరుగుతోంది. నీ కీర్తనలు చేసి పఱై పొందడానికి వచ్చామన్న సంగతి మరోసారి వక్కాణీంచి చెబుతోంది.    


తిరుప్పావై - పాశురము 25


ఒరుత్తి మగనాయ్ పిఱన్దు, ఓరిరవిల్ 
ఒరుత్తి మగనాయ్  యొళిత్తు వళర,
తరిక్కిలా నాగిత్తాన్ తీంగు నినైంద 
కరుత్తై ప్పిళైప్పిత్తు  కంజన్ వయిత్తిల్ 
నెరుప్పెన్న నిన్ఱ నెడుమాలే ! ఉన్నై 
ఆరుత్తిత్తు వన్దోమ్; పఱై తరుదియాగిల్,
తిరుత్తక్క శెల్వముమ్ శేవగముమ్ యాంపాడి 
వరుత్తముం తీరున్దు మగిళిందే లో రెమ్బావాయ్ || 

అర్థము :-

ఒకరి కుమారుడవుగా పుట్టి, ఒక అర్థరాత్రిలో వేరింటికి చేరి అక్కడ వారి కుమారుడవుగా పెరిగావు అని కీర్తిస్తోంది గోదాదేవి. 

దేవకీదేవి శ్రీమన్నారాయణుని నువ్వు నాలుగు చేతులతో నీ దివ్యస్వరూపము, తేజస్సుతో నాకు కొడుకుగా పుట్టాలని ప్రార్థిస్తే సరే నని అలాగే ఆమె గర్భములోనికి ప్రవేశించి పుడతాడు ఆ భగవంతుడు. 

యశోదమ్మ కూడా భగవంతుణ్ణి వేడుకుంది ఆయన తనకు కొడుకుగా పుట్టి ఆయన లాలన, పాలనలు చేస్తూ ఆ సుఖాన్ని, సౌభాగ్యాన్ని అనుభవించేట్లా వరము ప్రసాదించమని. ఆమెకు కూడ తథాస్తు అని పలికాడు కనుక అక్కడ దేవకీ కోరిక తీర్చేశాడు కనుక ఆ రాత్రికి రాత్రే వసుదేవుని నెత్తిపై బుట్టలో యమునా నదిని దాటి యశోదమ్మ ఇంటికి జేరి ఆమె లాలన, పాలనలో పెరిగాడు.

 ఈ విధముగా ఇద్దరి కోరికలూ తీర్చి ఇద్దరు తల్లుల కుమారుడు అయ్యాడు. 

అలా నువ్వు యశోదమ్మ ఇంట్లో రహస్యముగా శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుతుంటే, నీ కోసమని గూఢచారులని పంపి వెతికిస్తున్న కంసుని రాక్షసులందరినీ చంపేస్తూ అతని ప్రయత్నాలన్నింటిని వృధా చేసి, ఆ కంసుని పొట్టలో ఒక మండుతున్న నిప్పులాగ తయారయి నువ్వు అతన్ని క్షోభ పెట్టి సంహరించావు. 

ఓ కృష్ణా ! నువ్వు మాకు పఱై అన్న బహుమానాన్ని ఇస్తే ఇలాగే ఇంకా ఎన్నెన్నో అద్భుతమైన నీ లీలలను, వీరగాథలను లక్ష్మీదేవి కూడ విని ఆనందించే రీతిగా మేము గానమొనర్చుచూ, మేము ఇప్పటి వరకు పడ్డ వ్యథలన్నీ మరచిపోయి ధన్యులమౌతాము. కాబట్టి మమ్ములను అనుగ్రహించు.        

7, జనవరి 2025, మంగళవారం

తిరుప్పావై - పాశురము 24 - "అన్ఱి ఇవ్వులగం అళన్దాయ" - Tiruppavai- Pasuram 24

తిరుప్పావై 24వ పాశురము ద్వారా గోదాదేవి, నీళాదేవి, తదితరులంతా కలిసి శ్రీకృష్ణుని లీలలను, మహిమలను కీర్తించడం జరుగుతోంది. 

ఆనాడు ఆయన చేసిన ఘనకార్యముల మూలముగా ఆయన శరీర భాగములన్నీ కూడ ఎంతో కందిపోయి బాధ పెట్టి ఉంటాయి కదా అని, ఆ ఒక్కొక్క అంగములకూ, మరియు సంపూర్ణ దేహానికీ  కూడ అన్నివేళలా మంగళము అవుతుండు గాక అని మంగళాశాసనములు పలుకుతున్నారు. 


తిరుప్పావై - 24వ పాశురము 


 అన్ఱు ఇవ్వులగం అళన్దాయ్ ! అడి పోత్తి 
చ్చెన్ఱు ఎంగు తెన్నిలంగై శెత్తాయ్ ! తిఱల్ పోత్తి 
పొన్ఱ చ్చగడం ఉదైత్తాయ్ ! పుగళ్ పోత్తి 
కన్రు కుణిలా ఎరిన్దాయ్ ! కడల్ పోత్తి 
కున్రు కుడైయా ఎడుత్తాయ్ ! కుణమ్ పోత్తి 
వెన్ఱు పకై కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోత్తి 
ఎన్ఱేన్రు ఉన్ శేవగమే యేత్తి పఱై కొళ్వాన్ 
ఇన్ఱు యామ్ వందోమ్ ఇరంగేలో రెమ్బావాయ్ || 

అర్థము :-

పూర్వము బలి చక్రవర్తి దేవతల రాజ్యములను అపహరించగా వామనుడవై, మూడు అడుగులు వేసి భూమి, ఆకాశములను కొలిచి, మూడవ అడుగు కోసమని బలిచక్రవర్తి తలపై పాదాన్ని మోపి అతన్ని పాతాళములోనికి నెట్టేశావు. అట్టి నీ పాదములకు మంగళమగు గాక !

ఆనాడు సీతాదేవిని రావణుడు అపహరించగా లంకకు వెళ్లి రావణునితో బాటు లంకానగరాన్ని కూడా మట్టుబెట్టిన నీ బాహువులకు నేడు మంగళము అగు గాక !

అప్పుడెప్పుడో నీ బాల్యమందు నిన్ను చంపటానికి వచ్చి బండి చక్రములో ఆవహించి ఉన్న శకటాసురుని కీళ్లన్నీ ఊడేట్లా నీ కాలితో తాకి చంపావు ఎవరికీ తెలియకుండా. ఆ నీ కల్యాణ గుణములకు నేడు మంగళము అగు గాక !

అలాగే ఇంకో మారు నిన్ను చంపడానికి వచ్చిన ఇద్దరు రాక్షసులలో దూడ రూపములో ఉన్న వత్సాసురుని, మరియు వెలగ చెట్టు రూపములో దారికి అడ్డముగా నున్న కపిత్థాసురుని తన్ని చంపడానికి వంచిన నీ కాళ్ళకి నేడు మంగళమగు గాక ! 

ఒకపరి దేవేంద్రుడికి (తనకు పూజ చేయలేదని) నీపై, మరియు గోకులవాసులపై కోపము వచ్చి రాళ్ళ వర్షము కురిపించినప్పుడు, అందరినీ కాపాడుటకై గోవర్ధనగిరిని ఎత్తి గొడుగులా పట్టుకున్న నీ ఆశ్రితరక్షణ గుణసంపదకు మంగళమగు గాక !

శత్రువులను చీల్చి చెండాడే నీ చేతిలోని చక్రాయుధమునకు ఎప్పుడూ మంగళమగు గాక !

ఇలా నీ యొక్క ఎన్నెన్నో వీరగాధలను స్తుతించి నీ నుండి పఱై అనే బహుమానము తీసుకోడానికి మేమంతా ఈ రోజు ఇక్కడికి వచ్చాము. దయచేసి మేము కోరునది ఇచ్చి మమ్ములను ఉద్ధరించు ఓ స్వామీ ! 

       

6, జనవరి 2025, సోమవారం

తిరుప్పావై - పాశురము 23 - మారిమలై ముళై న్గిల్ - Tiruppavai- Pasuram 23


తిరుప్పావై 23వ పాశురములో గోదాదేవి శ్రీకృష్ణుని యొక్క హావభావాలు (వొళ్ళు విరుచుకొనుట, నడక మున్నగు వయ్యారములు, హుందాతనం) ఒక సింహముతో పోలుస్తూ ఆయనను కీర్తిస్తూ, ఆ రాజసము ఉట్టిపడే కదలికలను మరల వీక్షించు మహాభాగ్యము మాకందరికీ ప్రసాదించమని వేడుకుంటోంది. 






తిరుప్పావై - పాశురము 23 - మారిమలై


మారిమలై ముళై న్గిల్ మన్నిక్కిడన్దు ఉఱంగుమ్ 
శీరియ శింగమ్ అఱివిత్తు త్తివిదుత్తు
వేరిమయిర్ ప్పొంగ వెప్పాడుమ్ పేర్ఉందు దఱి  
మూరి నిమిర్ న్దు మురంగి ప్పుఱ  ప్పట్టు  
పోదరుమా పోలే, నీ పూవై ప్పూవణ్ణా! ఉన్ 
కోయిల్ నిన్ఱుమ్ ఇంగనే పోందరుళి కోప్పుడైయ 
శీరియ శింగాసనత్తు ఇరుందు, యామ్ వంద 
కారియం ఆరాయిందు అరుళే లో రెమ్బావాయ్ || 

అర్థము :-

పర్వతము యొక్క గుహలోపల వర్షాకాలములో హాయిగా, నిశ్చలంగా ముడుచుకు పడుకుని నిద్రపోతున్న (రాజసము ఉట్టిపడుతున్న) సింహము మేలుకున్నాక తన తీక్షణములైన చూపులను నలువైపులా ప్రసరింపజేసి చూస్తుంది. ఆ తరువాత తన జూలు, వెంట్రుకలు నిక్కబొడుచుకునేట్లా అటు ఇటు పొర్లుతుంది. పిమ్మట ఒళ్ళు దులుపుకుంటూ నెమ్మదిగా లేచి తన శరీరాన్ని సాగదీసుకుంటుంది. ఒళ్ళు విరుచుకుంటూ బిగ్గరగా గర్జిస్తుంది. అప్పుడు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ గుహలోంచి బయటకు వస్తుంది. అటువంటి రాజసము శ్రీకృష్ణుని కదలికలలో గోపికలకు కనబడుతూ ఉంటుంది. ఆ దృశ్యమునే మళ్లీమళ్లీ చూడాలని కాంక్షిస్తూ ఉంటారు. 

ఇప్పుడు ఆ సమయము, సందర్భము దొరికింది.  

ఓ స్వామీ! కృష్ణా ! నువ్వు కూడా ఆ సింహము బోలిన గాంభీర్యము, రాజసము చూపిస్తూ నీ పడక గదిలోంచి బయటకు రావాలి అని కోరుకుంటున్నారు. 

ఓ పూవణ్ణా ( పుష్పముల రంగు, ముఖ్యంగా అతసీ పుష్పము అనే) నీలి రంగు శరీరము కలవాడా! నువ్వు అలా ఆ సింహము లాగానే చేస్తూ నెమ్మదిగా అందమైన నడకలతో నీ గది నుండి బయటకి వచ్చి నీ రాజస సింహాసనమును జేరి దానిపై కూర్చుని శ్రద్ధతో మేము వచ్చిన కార్యము తిలకించి మమ్ములను అనుగ్రహించుము స్వామీ!

ఈ విధముగా శ్రీకృష్ణుని అర్థించి గోదాదేవి, తక్కినవారు ఆయనను గది నుండి బయటకు రప్పించి సింహాసనంపై కూర్చునేట్లా చేశారు.               

5, జనవరి 2025, ఆదివారం

తిరుప్పావై - పాశురము 22 - అంగణ్ మాణాలత్తర శర్ - Tiruppavai- Pasuram 22

 తిరుప్పావై 22వ పాశురములో గోదాదేవి, తక్కినవారు తమ తమ స్త్రీత్త్వ సహజమైన అభిమానమును వదలి శ్రీకృష్ణుని జేరవచ్చినామని , తమపై ఆయన కారుణ్య కటాక్షములను ప్రసారించి తమను ఉద్ధరించమని వేడుకుంటున్నారు. అలా వేడుకుంటూ ఆయన వైభవాన్ని, దివ్య తేజ్జస్సులను కూడ ప్రశంసించడము జరుగుతోంది.



 

తిరుప్పావై - 22వ పాశురము 


అంగణ్ మాజ్ఞా లత్తరశర్, అభిమాన 
బంగమాయ్ వందు, నిన్ పళ్ళిర్క్కట్టిర్ కీళే 
సంగమిరుప్పార్ పోల్, వందు, తలై ప్పెయ్ దోమ్ ,
కింగిణి వాయ్ చ్చెయ్ ద తామరై ప్పూ పోలే, 
శెన్గణ్ శిఱి చ్చిరిదే, యెమ్మేల్ విళియావో !
తింగళుమ్ ఆదిత్తియనుమ్ ఎళుం దార్ పోల్, 
అంగ నిరండున్ గొండు, ఎంగళ్ మేల్ నోక్కుదియేల్, 
ఎంగళ్ మేల్ జాపమ్ ఇళిం దు ఏలో రెమ్బావాయ్ || 


అర్థము :-  

ఈ అందమైన విశాలమైన భూమి అంతా తమదేనని విర్రవీగే రాజులందరూ కూడ నీకు లొంగిపోయి తమ తమ అభిమానమును విడిచి ఏ విధముగా నైతే నీ సేవ చేయుటకై సింహాసనము యొక్క కోళ్ళ దగ్గిర గుంపులుగా జేరి పడిగాపులు పడుతుంటారో అదే విధముగా మేము కూడ మా స్త్రీత్వ అభిమానములను విడిచి పెట్టి మాకు నీవే దిక్కని నిన్ను చేరుకొని తలలు వంచుకుని నీ కోసము ఎదురుచూస్తున్నాము. 

చిరు చిరు మువ్వలు నోరు తెరుచుకున్నట్లును, అప్పుడే వికసిస్తున్న ఎర్రని తామరపూవుల వలెనూ, ఉన్నటువంటి నీ నేత్రములను ఒక్కసారిగా తెరిచెయ్యకుండా, మెలిమెల్లిగా, నీ కన్నుల నుండి వెలువడే జ్యోతులను మేము ఓర్చుకోగలిగినట్లుగా, నింపాదిగా తెరిచి, నీ చూపులను మా వైపు ప్రసరింపజేయవా !

చంద్రుడు, సూర్యుడూ ఒక్కసారిగ ఉదయించిన తీరున, అలా లేచి నిలబడి, అక్కడి నుండే నీ రెండు నేత్రముల నుండి శీతలత్వము, తేజస్సు కల కిరణములను మాపై ప్రసరింప జేసినచో, మా మీది శాపములన్నీ తొలగిపోయి, మా జన్మలు తరిస్తాయి స్వామీ!                  

4, జనవరి 2025, శనివారం

తిరుప్పావై - పాశురము 21 - ఏత్త క్కళమ్గళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప - Tiruppavai- Pasuram 21

 తిరుప్పావై 21వ పాశురము ద్వారా గోదాదేవి శ్రీకృష్ణుని లేపుతూ అతని పశుసంపద, గుణసంపదలను పొగడము చేస్తోంది. 

నీళాదేవి, తక్కిన బాలికలందరూ కూడా ఈ మేలుకొలుపులు పాడుతున్నారు. ఆయన యొక్క వైభవము, ఔదార్యము, అర్త రక్షణా స్వభావము, మొదలగు గుణ సంపదలను కీర్తిస్తున్నారు. 



తిరుప్పావై - పాశురము 21


ఏత్త క్కళమ్గళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప 
మాత్తాదే పాల్ శొరియుమ్ వళ్ళల్ పెరుం పశుక్కల్ 
ఆత్తప్పడైత్తాన్ మగనే ! అఱివుఱాయ్ !
ఊత్తముడైయాయ్, పెరియాయ్, ఉలగినిల్ 
తోత్తమాయ్ నిన్ఱ శుడరే ! తుయిలెళాయ్ !
మాత్తార్ ఉనక్కు వలితు లైన్దు ఉన్ వాశర్కణ్ 
ఆత్తాతు వందు ఉన్నడి పడియుమా పోలే 
పోత్తి యామ్ వందోమ్, పుకళ్ న్దే లో రెమ్బావాయ్ || 




అర్థము :-


పొదుగుల క్రింద పెడుతున్న కుండలు ఇంకా పెడుతుండగానే నిండిపోతూ, ఆగకుండా ఉప్పొంగిపోయి పొర్లి పోయే విధముగా ఎడతెరిపిగా పాల ధారలు కారిపోతూండు నటువంటి అనేకములైన పశు సమూహములతో కూడిన సంపదలున్న, ఓ నందగోపుని ముద్దుల కొడుకైన శ్రీకృష్ణా 1 తెలివి తెచ్చుకో!

ఎంతో ఉత్తముడవై ఉండి (అంటే వేదాలలో, ఇతిహాసములలో పరమాత్మునిగా పేర్కొనబడిన వాడవై) , పరంబ్రహ్మ జ్యోతి స్వరూపుడవై, అంతకంతకూ ఎదిగిపోయి ముల్లోకాలనే కొలిచినవాడవై యుండి కూడ, మాకోసమని ఈ భువిలో మానవ మాత్రునిగా అవతరించావు. అట్టి మహానుభావా మేలుకో !

నిన్ను ఎదిరించలేక నీ బలము ముందు తమంతట తామే లొంగిపోయి వచ్చి నీ వాకిట పడిగాపులు పడుతూ ఉండే నీ శత్రు సమూహముల వలె, మేము కూడ నీ మహనీయమగు గుణసంపదల ముందు పరాజితులమై అహంకారాన్ని విడిచి పెట్టి నీ వాకిటికి వచ్చాము.
 
నిన్ను కీర్తించి పాడుతూ తరించుటకోసమని వచ్చిన మమ్ములను అనుగ్రహించు. ఓ కృష్ణా! ఇక మేలుకో!          

3, జనవరి 2025, శుక్రవారం

తిరుప్పావై - పాశురము 20 - ముప్పత్తు మూవరు అమరర్కు - Tiruppavai Pasuram 20


 తిరుప్పావై 20వ పాశురములో ఆండాళ్ శ్రీకృష్ణ పరమాత్మకు మేలుకొలుపు పాడుతూ అతని సుగుణములను, ఔదార్య గుణములను కీర్తించడం చేస్తోంది. అతనితో పాటు నీళాదేవిని కూడా ఇంకోమారు వేడుకోవడము జరుగుతోంది. నీళ, కృష్ణుడు ఒకరొకరితో ముడిపడి ఉంటారు. ఎవరో ఒకరు లేవనిదే రెండో వారు లేవరు. అందుకని నప్పిన్న (నీళ) ఎలాగూ మెలకువ తెచ్చుకుంది కనుక తను త్వరగా లేచి, శ్రీకృష్ణుడిని తయారుచేయాలని కోరుకుంటోంది.  అతని సేవ కోసమై ఒక విసనకర్ర, అద్దము ఇచ్చి, శ్రీకృష్ణుడిని తమకు వ్రతము చేయించడానికి వెంటనే పంపించమనీ వేడుకుంటోంది.  



తిరుప్పావై - పాశురము 20


ముప్పత్తుమూవరు అమరర్కు మున్ శెన్ఱు 
కప్పం తవిర్క్కుమ్ కలియే! తుయిలెళాయ్ !
శెప్పముడైయాయ్ తిఱలుడై యాయ్ శెత్తార్క్కు
వెప్పమ్ కొడుక్కుమ్ విమలా! తుయిలెళాయ్ !  
శెప్పన్న మెన్ములై శెవ్వాయ్ శిరుమరుంగుల్
నప్పిన్నై నంగాయ్! తిరువే తుయిలెళాయ్ !
ఉక్కముమ్ తట్టొళియుమ్ తందు ఉన్ మణాళనై 
ఇప్పోదే యెమ్మై నీరాట్టేలో రెమ్బావాయ్ || 

అర్థము :-

ముప్పైమూడు కోట్లమంది దేవతలకూ ఆపదలు కలగడానికి ముందుగానే వెళ్లి యుద్ధ భూమిలో వారికి ముందు నిలబడి, శత్రువుల నుండి వారికున్న భయము, ఆపదలను తొలగించే పరాక్రమశాలీ! కరుణతో నిండిన సున్నితమైన హృదయము కలవాడా (కృష్ణా)!  నిదుర లేచి రా !

ముందుగా హెచ్చరించకుండా, ఎవరికి తెలియకుండా అకస్మాత్తుగా దాడి చేసే శత్రువులను సైతం, వారు ఇంకా  రంగములోకి ప్రవేశించుటకు ముందుగానే వారిని ఎదుర్కొని, చీల్చి చెండాడే స్ఫూర్తి ఉన్నవాడా! శత్రువుల గుండెల్లో కంపనము పుట్టించువాడా ! నిదుర లే !

అమ్మా, బంగారు భరిణల వంటి వక్షోజ సంపద మరియు దొండపళ్ల వంటి ఎర్రని అధరములతో కూడిన సుందరాంగి నీళాదేవీ ! ఓ పరిపూర్ణురాలా ! లక్ష్మీదేవితో సమానురాలా ! లేచి రావమ్మా !

ఒక విసనకర్రను, కంచు అద్దమును (శ్రీకృష్ణునికి గాలి వీచడానికి మరియు చెమటలు తుడుచుకునేటప్పుడు ముఖము సరిదిద్దుకోవడం కోసమని ఒక అద్దము) మా చేతికి ఇచ్చి, నీ స్వామిని ఇప్పుడే మాతో పంపించుము తల్లీ! 

ఈ విధంగా వేడుకోగానే నీళాదేవి తలుపు తీస్తుంది. వారు అడిగిన విసనకర్రని, అద్దాన్ని ఇస్తుంది. 

ఆ తరువాత ఆ బాలికలందరితో బాటు తాను కూడ శ్రీకృష్ణుడిని లేపటానికి పూనుకుంటుంది. 
    

2, జనవరి 2025, గురువారం

తిరుప్పావై - పాశురము 19 - కుత్తు విళక్కెరియ - Tiruppavai - Paasuram 19


తిరుప్పావై 19వ పాశురము ద్వారా గోదాదేవి హాయిగా నిద్రపోతున్న నీళాకృష్ణులను నిద్రలేపుతూ, నీళాదేవికి తత్త్వముల సారము గురించి జ్ఞాపకము చెయ్యడం జరుగుతోంది. 

నీళాదేవి గొప్ప భక్తురాలు, తత్త్వజ్ఞాని అయితే గోదాదేవి కూడ ఏమియు తక్కువ కాదు. శ్రీకృష్ణుడు ఒక్కరి సొత్తు కాదు. అందరికి చెందినవాడని తెలియజేసింది. 

తిరుప్పావై - పాశురము 19


కుత్తు విళక్కెరియ కోట్టుక్కాల్ కట్టిల్ మేల్,
మెత్తెన్ర పంజశయనత్తిన్ మేలేఱి ,
కొత్తలర్ పూంగళల్ నప్పిన్నై కొంగై మేల్ 
వైత్తుక్కిడంద మలర్మార్ బా! వాయ్ తిఱవాయ్ ;
మైత్తడన్ కణ్ణినాయ్ ! నీ యున్ మణాళనై 
ఎత్తనై పోదుమ్ తుయిలెళ వోట్టాయ్ గాణ్ 
ఎత్తనై యేలుమ్ పిరివాత్త గిల్లాయాల్ 
తత్తువమందు తగవే లో రెమ్బావాయ్ || 

అర్థము :- 

చుట్టూ దేదీప్యమానమైన గుత్తిదీపాలు వెలుగుతుండగా, ఏనుగు దంతములచే చేయబడిన (ఇక్కడ కోడు + కాల్ = కోట్టుక్కాల్ అయినది. కోడు అంటే ఏనుగు కోరలు, కట్టి అంటే మంచము) గట్టివైన కాళ్ళు కలిగిన మంచము పై మెత్తయిన ఐదు సులక్షణములు (మృదుత్వము, చల్లదనము, సుగంధము, తెల్లదనము, ఎత్తు విశాలములు) గల శయ్య మీద కొత్తగా విచ్చుకున్న మృదువైన పువ్వులు తలలో ధరించిన (లేదా అంతటి మెత్తనైన వక్షోజములు కలిగిన) నీళాదేవి యొక్క వక్షస్థలము పై తల పెట్టుకుని పడుకున్న ఓ (లక్ష్మీదేవిని వక్షములో ధరించిన) స్వామీ! నోరు తెరచి కాస్తైనా మాటాడవా?

కాటుక పెట్టుకున్న కన్నులదానా ! నువ్వు నీ భర్తను ఎంతసేపని అలా నీ ప్రేమ పారవశ్యముల పాశములతో బంధించి లేవనీయకుండా ఉంచుకుంటావు? కొన్ని క్షణములకైననూ అతనిని విడిచి పెట్టలేవా ? 

ఏమ్మా! నువ్వు తత్త్వాలన్నీ ఎరిగిన దానివి కదా ! మరి ఏ తత్త్వమందైనా ఇలా చేయడం న్యాయమని ఉందా! నువ్వే చెప్పు తల్లీ!        

ఈ విధంగా తత్త్వజ్ఞానాన్ని నీళాదేవికి జ్ఞాపకము చేసింది గోదాదేవి. అప్పుడు నీళ మేలుకుంటుంది. తన పొరపాటును గుర్తించి, స్వామిని మేలుకొలుపుటలో వారికి సాయము చేస్తుంది.