తిరుప్పావై 30వ పాశురము గోదాదేవి తన గురించి చెప్పుకుంటున్నట్లుగా రచింపబడినది.
ఆమె ఆ వ్రతాన్ని ఏవిధముగా, ఎవరిద్వారా తెలుసుకుని చేసినదీ, తను చేసినట్లే అందరమూ చేసి ఆమె లాగ ఆ భగవంతుని కటాక్షము పొంది ఆయన సన్నిధికి చేరుకోవచ్చుననీ నొక్కి చెబుతోంది ఇందులోని పంక్తుల ద్వారా.
తిరుప్పావై - పాశురము 30
వఙ్గ క్కడల్ కడైంద మాధవనై కేశవనై
తింగళ్ తిరుముగత్తు చేయిళైయార్ శెన్ఱిరైంజి
అంగప్పఱై కొండ వార్తయ్ ఆణిపుదువై
ప్పైమ్ గమల తణ్ణీరియల్ పట్టర్ పిరాన్ కోదై శొన్న
శంగత్తమిళ్ మాలై ముప్పదుమ్ తప్పామే
ఇంగు ఇప్పరిశురై ప్పారీరిరండు మాల్వరైత్తోళ్
శెంగణ్ తిరుముగత్తు చ్చెల్వ త్తిరుమాలాల్
ఎంగుమ్ తిరువరుళ్ పెత్తు ఇంబురువర్ ఎమ్బావాయ్ ||
అర్థము :-
క్షీర సాగర మథనము చేసినప్పుడు అందులో నుండి ఆవిర్భవించిన లక్ష్మీదేవిని పొంది (ఆమెను సతిగా ధరించి) మాధవుడుగా అయి, అలాగే జటలతో కూడిన బ్రహ్మ, రుద్రుడు మొదలైన వారిని కూడ ధరించి కేశవుడుగా పేరొందిన ఆ నారాయణుడుని అలనాడు చంద్ర బింబము వంటి ముఖమండలముల తోనూ, దివ్యాభరణములతోను ప్రకాశించుచున్న గోపికలు చేరి ఏ విధముగా నైతే వ్రతమును చేసి తరించారో ఆ వార్తను (కథను) విని, ధరణిలో ముత్యము వంటి శ్రీవిల్లిపుత్తూరు గ్రామమునందు నివసిస్తున్న శీతలజల తామర పుష్పమాలికలు ధరించు బ్రహ్మణోత్తముడైన విష్ణుచిత్తుని ముద్దుల బిడ్డ గోదాదేవి అల్లిన ఈ సంఘ సాహిత్య తమిళ మాల లోని 30 పాశురములనూ ఆ శ్రీకృష్ణ పరమాత్మకే అర్పించి ధన్యురాలు అయినది.
ఈ తమిళ మాల అయిన తిరుప్పావై లోని ముప్ఫయి పాశురములనూ తన లాగే ఎవరైతే క్రమము తప్పకుండా అనుసంధిస్తారో (అంటే శ్రద్దా భక్తులతో పఠించి ఆయనను ఆరాధిస్తారో) వారు కూడ ఇక్కడే ఈ జన్మ లోనే (ఆ రెండు రెళ్ళ) ఆ నాలుగు భుజములు కలిగిన లక్ష్మీనారాయణుని కటాక్షమును పొంది ఆయన సన్నిధికి జేరుకుంటారు అని ఆండాళ్ ఆశీర్వదిస్తూ హామీ ఇచ్చినట్లుగా చెప్పబడినది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి