4, జనవరి 2025, శనివారం

తిరుప్పావై - పాశురము 21 - ఏత్త క్కళమ్గళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప

 తిరుప్పావై 21వ పాశురము ద్వారా గోదాదేవి శ్రీకృష్ణుని లేపుతూ అతని పశుసంపద, గుణసంపదలను పొగడము చేస్తోంది. నీళాదేవి, తక్కిన బాలికలందరూ కూడా ఈ మేలుకొలుపులు పాడుతున్నారు. ఆయన యొక్క వైభవము, ఔదార్యము, అర్త రక్షణా స్వభావము, మొదలగు గుణ సంపదలను కీర్తిస్తున్నారు. 



తిరుప్పావై - పాశురము 21


ఏత్త క్కళమ్గళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప 
మాత్తాదే పాల్ శొరియుమ్ వళ్ళల్ పెరుం పశుక్కల్ 
ఆత్తప్పడైత్తాన్ మగనే ! అఱివుఱాయ్ !
ఊత్తముడైయాయ్, పెరియాయ్, ఉలగినిల్ 
తోత్తమాయ్ నిన్ఱ శుడరే ! తుయిలెళాయ్ !
మాత్తార్ ఉనక్కు వలితు లైన్దు ఉన్ వాశర్కణ్ 
ఆత్తాతు వందు ఉన్నడి పడియుమా పోలే 
పోత్తి యామ్ వందోమ్, పుకళ్ న్దేలో రెమ్బావాయ్ || 


అర్థము :-

ఎత్తి పెట్టే కుండలు ఇంకా పెడుతుండగానే ఆగకుండా ఉప్పొంగిపోయి పొర్లి పోయే విధముగా ఎడతెరిపిగా పాల వర్షము కురిపించునటువంటి అనేకములైన పశు సమూహములతో కూడిన సంపదలున్న నందగోపుని ముద్దుల కొడుకైన శ్రీకృష్ణా 1 తెలివి తెచ్చుకో!

ఎంతో ఉత్తముడవై ఉండి (అంటే వేదాలలో, ఇతిహాసములలో పరమాత్మునిగా పేర్కొనబడిన వాడవై) , పరంబ్రహ్మ జ్యోతి స్వరూపుడవై, అంతకంతకూ ఎదిగిపోయి ముల్లోకాలనే కొలిచినవాడవై యుండి కూడ, మాకోసమని ఈ భువిలో మానవ మాత్రునిగా అవతరించావు. అట్టి మహానుభావా మేలుకో !

నిన్ను ఎదిరించలేక నీ బలము ముందు తమంతట తామే లొంగిపోయి వచ్చి నీ వాకిట పడిగాపులు పడుతూ ఉండే నీ శత్రులవలె మేము కూడ నీ మహనీయమగు గుణసంపదల ముందు పరాజితులమై అహంకారాన్ని విడిచి నీ వాకిటికి వచ్చాము నిన్ను కీర్తించి పాడుతూ తరించుటకోసమని. లేచి రా కృష్ణా!          

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి