21, డిసెంబర్ 2025, ఆదివారం

తిరుప్పావై - పాశురము 07 - "కీశు కీశెన్ఱు ఎంగు" - Tiruppavai - Paasuram 07


తిరుప్పావై ఏడవ పాశురము ద్వారా రెండో బాలికను లేపుతూ ఆమె ఇంటి చుట్టుపక్కల అవుతున్న చప్పుళ్లను వివరించడము జరిగింది. ఆ చప్పుళ్లకు మెలకువ తెచ్చుకుని రాక ఇంకా పడుకున్నావేమిటని లేపుతున్నారు. భరధ్వాజ పక్షులు, మంగళసూత్రాలు, గాజుల చప్పుళ్ళు, పెరుగు చిలుకుతున్న చప్పుళ్ళని ఇందులో చెప్పడము జరుగుతోంది. 
  

తిరుప్పావై - పాశురము 07 - "కీశు కీశెన్ఱు ఎంగు" 


కీశు కీశెన్ఱు ఎంగుం ఆనైచ్చాత్తన్ కలందుఁ
పేశిన పేచ్చరవం కేట్టిలైయో, పేయప్పెణ్ణే?
కాశుమ్ పిఱప్పుమ్ కల కల ప్పక్కే పేర్తు
వాశ నఱుంగుళల్ ఆయచ్ఛియర్, మత్తినాల్
ఓశైపడుత్త తయిరరవమ్ కేట్టిలైయో,
నాయక పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్తి 
కేశవనై ప్పాడవుమ్ నీ కేట్టే కిడత్తియో 
తేశముడైయాయ్! తిఱవేలో రెమ్బావాయ్ ||  

అర్థము:

తెల్లవారిందనే బెంగతో భరధ్వాజ పక్షుల జంటలు (ఆహారాన్వేషణకై తాము విడిపోవు సమయము వచ్చిందనే బెంగ) కిచకిచమని చేసే ధ్వనులు నీకు వినబడటము లేదా? ఓ పెద్దింటి పిల్లా! (వెఱ్ఱిదానా అని కూడా చెప్పుకోవచ్చును. ఎందుకంటే ఇంకా తెల్లారలేదని భ్రమలో ఉంది.)

గొల్ల వనితలు తమ మెడలోని మంగళసూత్రాలు ఒకదానితో ఒకటి తగుల్కుని చేసే చప్పుళ్లు, గాజుల ధ్వనులు చేస్తూనూ, కవ్వములతో పెరుగు చిలుకుతున్న ఆ పెద్ద పెద్ద ధ్వనులు కూడ నీకు వినబడటం లేదా? ఓ నాయకుని కూతురా, మా నాయకురాలవు కదే నువ్వు. మేము చెప్పిన వాణ్ణి కూడ విని తెల్లవారిందనటంలో ఇంకేం సందేహము లేదని తెలుసుకో. 

సమస్త బ్రహ్మాండ మంతటా వ్యాప్తి చెంది ఉన్న ఆ నారాయణ మూర్తిని, కేశవుని అందరమూ పాడుతుంటే నీకు వినిపిస్తోంది కదా. మరి ఆలస్యము చేయక, మత్తు వదలి తలుపు తీసి మాతో పాటు పద.  

ఈ విధముగా రెండో గోపికను లేపి బయలుదేరారు.                    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి