తిరుప్పావై వ్రతము చేయువారు రోజుకొక పాశురము చొప్పున మొత్తం 30 రోజులలో 30 పాశురములు చదువుతూ శ్రీకృష్ణుడు, శ్రీరంగనాథస్వామి రూపములలో ఆ శ్రీమన్నారాయణుని భక్తితో పూజిస్తూ, పొంగలి వండి ఆరగింపు పెడుతూ, పూజ చేసుకోవాలి.
ఆ పాశురాలనే నేను తెలుగు భాషలో అర్థములతో సహా రోజూ ఒక పోస్టు చొప్పున మొత్తము 30 పోస్టులలో తెలియజేస్తున్నాను.
ఒకటవ పాశురము - "మార్గళి త్తింగళ్"
మార్గళి త్తింగళ్ మదినిఁరైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళై యీర్ !
శీర్ మల్ గుమ్ ఆయ్ ప్పాడి శెల్వ చ్చిఱు మీర్ గాళ్!
కూర్వేల్ కొళున్దొళన్ నందగోపన్ కుమరన్
ఏఱార్ న్ద కణ్ణి యశోధై ఇళం శింగం
కార్మేని చెంగణ్ కదిర్ మదియంబోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱై తరువాన్
పారోర్ పుగళ్ పడిం దేలోర్ ఎమ్బావాయ్ ||
అర్థము:
మార్గళి మాసము నిండు వెన్నెల హృదయమంతా నింపుకున్న శుభదినములలో స్నానం చేయుదాము పదండి. ఇక్కడ స్నానము అంటే వ్రతము గావించుట కోసమై స్నానము చెయ్యడము. ఇలా వ్రతము చేసే మక్కువతో రాదలచిన వారందరూ పదండి స్నానము చేద్దాము.
ఓ సంపదలతో తులతూగు ఆయ్ ప్పాడి (నందుని ఊరు పేరు) లో నివసించు భాగ్యము పొందిన గోప బాలికలారా! పదండి శ్రీ కృష్ణుని ధ్యానము చేద్దాము.
ఈ విధముగా నిష్ఠతో వ్రతము చేసిన యెడల:
పదునైన బల్లెము ధరించి బల పరాక్రమము లతో తన ప్రజలను కాపాడుకునే నందగోపుని కుమారుడూ, అందమైన, విప్పారిన కన్నులు కలిగిన యశోదమ్మ యొక్క సింహ కిశోరుడైన వాడునూ, నల్లని వాడు, ఎర్రని తామరల వంటి కనులవాడునూ, తేజోవంతమైన కిరణముల ప్రసరింప జేయు మోము కలవాడునూ, అయినటువంటి శ్రీమన్నారాయణుడు, ప్రపంచమంతటా మన కీర్తి వ్యాపించే విధముగా, మనకు బహుమతులను అందజేయును.
పఱై ఇస్తాడు అంటే మామూలు అర్థము వాద్యము ఇస్తాడని. కాని గోదాదేవి చెప్పే పఱై మోక్షముతో సమానమైన బహుమానము ఇస్తాడని భావించాలి.
అలాగే స్నానము చేయడము అంటే భక్తిలో ములిగి పవిత్రులు అవడము అని తెలుసుకోవాలి.
భక్తితో ఆ యశోదమ్మ ముద్దుల కొడుకుని సేవించి జన్మ తరించుకోవడానికి, ముక్తిని పొందటానికి అందరూ పదండి అని ఆండాళ్ మాత మనకి చెబుతోంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి