7, జనవరి 2025, మంగళవారం

తిరుప్పావై - పాశురము 24 - అన్ఱి ఇవ్వులగం అళన్దాయ


 తిరుప్పావై 24వ పాశురము ద్వారా గోదాదేవి, నీళాదేవి, తదితరులంతా కలిసి శ్రీకృష్ణుని లీలలను, మహిమలను కీర్తించడం జరుగుతోంది. ఆనాడు ఆయన చేసిన ఘనకార్యముల మూలముగా ఆయన శరీరములోని అవయములన్నీ ఎంతో కందిపోయి బాధ పెట్టి ఉంటాయి కదా అని ఆ ఒక్కొక్క అంగములకూ, మరియు సంపూర్ణ దేహమునకూ అన్నివేళలా మంగళము అవుతుండు గాక అని మంగళాశాసనములు పలుకుతున్నారు. 

తిరుప్పావై - 24వ పాశురము 


 అన్ఱు ఇవ్వులగం అళన్దాయ్ ! అడి పోత్తి 
చ్చెన్ఱు అంగు తెన్నిలంగై శెత్తాయ్ ! తిఱల్ పోత్తి 
పొన్ఱ చ్చగడం ఉతైత్తాయ్ ! పుగళ్ పోత్తి 
కన్రు కుడిలా వెరిన్దాయ్ ! కడల్ పోత్తి 
కున్రు కుడైయా వెడుత్తాయ్ ! కుణమ్ పోత్తి 
వెన్ఱు పకై కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోత్తి 
ఎన్ఱేన్రు ఉన్ శేవగమే యేత్తి పఱై కొళ్వాన్ 
ఇన్ఱు యామ్ వందోమ్ ఇరంగే లో రెమ్బావాయ్ || 

అర్థము :-

పూర్వము బలి చక్రవర్తి దేవతల రాజ్యములను అపహరించగా వామనుడవై, మూడు అడుగులు వేసి భూమి, ఆకాశములను కొలిచి, మూడవ అడుగు కోసమని బలిచక్రవర్తి తలపై పాదాన్ని మోపి అతన్ని పాతాళములోనికి నెట్టేశావు. అట్టి నీ పాదములకు మంగళమగు గాక !

ఆనాడు సీతాదేవిని రావణుడు అపహరించగా లంకకు వెళ్లి రావణునితో బాటు లంకానగరాన్ని కూడా మట్టుబెట్టిన నీ బాహువులకు నేడు మంగళము అగు గాక !

అప్పుడెప్పుడో నీ బాల్యమందు నిన్ను చంపటానికి వచ్చి బండి చక్రములో ఆవహించి ఉన్న శకటాసురుని కీళ్లన్నీ ఊడేట్లా నీ కాలితో తాకి చంపావు ఎవరికీ తెలియకుండా. ఆ నీ కల్యాణ గుణములకు నేడు మంగళము అగు గాక !

అలాగే ఇంకో మారు నిన్ను చంపడానికి వచ్చిన ఇద్దరు రాక్షసులలో దూడ రూపములో ఉన్న వత్సాసురుని, వెలగ చెట్టు రూపములో దారికి అడ్డముగా నున్న కపిత్థాసురుని తన్ని చంపడానికి వంచిన నీ కాళ్ళకి నేడు మంగళమగు గాక ! 

ఒకపరి దేవేంద్రుడికి (తనకు పూజ చేయలేదని) నీపై, మరియు గోకులవాసులపై కోపము వచ్చి రాళ్ళ వర్షము కురిపించినప్పుడు, అందరినీ కాపాడుటకై గోవర్ధనగిరిని ఎత్తి గొడుగులా పట్టుకున్న నీ ఆశ్రితరక్షణ గుణసంపదకు మంగళమగు గాక !

శత్రువులను చీల్చి చెండాడే నీ చేతిలోని చక్రాయుధమునకు ఎప్పుడూ మంగళమగు గాక !

ఇలా నీ యొక్క ఎన్నెన్నో వీరగాధలను స్తుతించి నీ నుండి పఱై అనే బహుమానము తీసుకోడానికి మేమంతా ఈ రోజు ఇక్కడికి వచ్చాము. దయచేసి మేము కోరునది ఇచ్చి మమ్ములను ఉద్ధరించు ఓ స్వామీ ! 

       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి