తిరుప్పావై 22వ పాశురములో గోదాదేవి, తక్కినవారు తమ తమ స్త్రీత్త్వ సహజమైన అభిమానమును వదలి శ్రీకృష్ణుని జేరవచ్చినామని , తమపై ఆయన కారుణ్య కటాక్షములను ప్రసారించి తమను ఉద్ధరించమని వేడుకుంటున్నారు. అలా వేడుకుంటూ ఆయన వైభవాన్ని కూడ ప్రశంసించడము జరుగుతోంది.
తిరుప్పావై - 22వ పాశురము
అంగణ్ మాజ్ఞా లత్తరశర్, అభిమాన
బంగమాయ్ వందు, నిన్ పళ్ళిర్క్కట్టిర్ కీళే
శంగమిరుప్పార్ పోల్ వందు, తలై ప్పెయ్దోమ్,
కింగిణి వాయ్ చ్చెయ్ద తామరై ప్పూ పోలే
శెన్గణ్ శిరి చ్చిరిదే యెమ్మేల్ విళియావో !
తింగళుమ్ ఆదిత్తియనుమ్ ఎళుమ్దార్ పోల్
అంగ నిరండున్గొండు ఎంగళ్ మేల్ నోక్కుదియేల్
ఎంగళ్ మేల్ జాపమ్ ఇళందే లో రెమ్బావాయ్ ||
అర్థము :-
ఈ అందమైన విశాలమైన భూమి అంతా తమదేనని విర్రవీగే రాజులందరూ కూడ నీకు లొంగిపోయి తమ తమ అభిమానమును విడిచి ఏ విధముగా నైతే నీ సేవ చేయుటకై సింహాసనము యొక్క కోళ్ళ దగ్గిర గుంపులుగా జేరి పడిగాపులు పడుతుంటారో అదే విధముగా మేము కూడ మా స్త్రీత్వ అభిమానములను విడిచి పెట్టి మాకు నీవే దిక్కని నిన్ను చేరుకొని తలలు వంచుకుని నీ కోసము ఎదురుచూస్తున్నాము.
చిరు చిరు మువ్వలు నోరు తెరుచుకున్నట్లును, అప్పుడే వికసిస్తున్న ఎర్రని తామరపూవుల వలెనూ ఉన్నటువంటి నీ నేత్రములను ఒక్కసారిగా తెరిచెయ్యకుండా మెలిమెల్లిగా మేము ఓర్చుకోగలిగినట్లుగా నింపాదిగా తెరిచి నీ చూపులను మా వైపు ప్రసరింపజేయవా !
చంద్రుడు, సూర్యుడూ ఒక్కసారిగ ఉదయించిన తీరున నీ రెండు నేత్రముల నుండి శీతలత్వము, తేజస్సు కల కిరణములను మాపై ప్రసరింప జేసినచో మా మీది శాపాలన్నీ తొలగిపోయి మా జన్మలు తరిస్తాయి స్వామీ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి