తిరుప్పావై 27వ పాశురములో గోదాదేవి, తన తక్కిన స్నేహితురాళ్ళతో కలిసి ఈ తిరుప్పావై వ్రతమును ఆచరించిన తరువాత వ్రత ఫలితముగా అందరూ కలిసి శ్రీకృష్ణునితో బాటు కూర్చుంది తృప్తిగా విందు భోజనము చేయాలనే కోరికను తెలియబరుస్తోంది. అలా జరిగే ఆ విందుభోజనాల గురించి ఊళ్ళో వారంతా (లోకులందరూ కూడ) గొప్పగా చెప్పుకునేట్లా ఉండాలని అంటుంది.
తిరుప్పావై - పాశురము 27
కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా ! ఉన్దన్నై
ప్పాడి పఱై కొండు యామ్ పెరు శమ్మానమ్
నాడు పుగళుమ్ పరిశినాల్ నన్ఱాగ
చూడగమే, తోళ్ వళైయే, తోడే, శెవిఁ ప్పూవే,
పాడగమే, యెన్ఱు అనైయ పల్ కలనుమ్ యామణి వోమ్,
అడై యుడుప్పోమ్; అదన్ పిన్నే పాల్ శోరు
మూడ, నెయ్ పెయుతు ముదన్ కై వళివార
కూడి యిరుందు కుళిరిందు ఏలో రెమ్బావాయ్ ||
అర్థము :-
నీ ఉనికిని సహించలేని శత్రువుల నందరినీ జయించు కల్యాణ గుణములు, కీర్తి ప్రతిష్టలు కలిగిన ఓ గోవిందా ! నిన్ను స్తుతించి మేము పొందే పఱై అనే బహుమానము ఏవిధంగా ఉండాలో చెబుతున్నాము విను.
నీ చేత మేము పొందే బహుమానము చాలా పెద్దది, గొప్పదై ఉండి దాన్ని గురించి లోకులందరూ కూడా ప్రశంసించే విధముగా ఉండాలి.
చేతి కంకణములు, భుజములకు తొడుక్కునే కంకణములు, గాజులు, చెవులకి కర్ణాభరణములు, కర్ణ పుష్పములు, పాదాలకు తొడుక్కునే మువ్వలు, అందియలు (గజ్జెలు), ఇవే కాక ఇంకా మాకు తెలియని వస్తువులు, పలువిధములైన ఆభరణములు, ఇవన్నీ కూడ నువ్వు మాకు ధరింపజేయాలి.
పట్టు వస్త్రములు కూడ (ఆడై ఉడుప్పోమ్) ధరిస్తాము.
ఆ పిమ్మట నీతో కలసి కూర్చుండి క్షీరాన్నము విందు ఆరగించెదము. ఆ పాయసము ఎలా ఉండాలన్నది చెబుతా విను. అందులో బాగా నెయ్యి ఉండి పైకి తేలుతూ ఉండాలన్న మాట. అప్పుడు మేము ఆ పాయసము తింటుంటే నేతి ధారలు మోచేతి నుండి కారుతుండేలా ఉండాలన్న మాట. అటువంటి క్షీరాన్నము నీతో కలిసి ఆరగించాలి మేము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి