31, డిసెంబర్ 2024, మంగళవారం

తిరుప్పావై - పాశురము 17 - అంబరమే తణ్ణీరే శోరే

తిరుప్పావై 17వ పాశురములో గోదాదేవి శ్రీకృష్ణుని తల్లిదండ్రులను మరియు బలరామకృష్ణులను లేపడము వివరిస్తోంది. 



పదిమంది (ఇక్కడ పదిమంది అంటే చాలామంది కలిసి ఈ వ్రతాన్ని చేశారని మనం అనుకోవచ్చును) బాలికలనూ లేపి అందరూ స్నానం చేసి తయారయి నందగోపుని భవనానికి (కోవెలకు) చేరి అక్కడ కాపలాదారులతో తాళాలు తెరిపించుకుని లోనికి ప్రవేశించడము 16వ పాశురము వరకూ వివరించడం జరిగింది. 

ఇప్పుడు శ్రీకృష్ణుని లేపడానికి ముందు అతని తల్లిదండ్రులను, తక్కిన వారినీ వరుసగా లేపాలి. 




తిరుప్పావై- పాశురము - 17  


అంబరమే తణ్ణీరే శోఱే యఱం శెయ్యుమ్ 
ఎమ్బెరుమాన్! నందగోపాలా యెళున్దిరాయ్!
కొంబనార్కు యెల్లామ్ కొళుందే! కులవిళక్కే! 
ఎమ్బెరుమాట్టి! యశోదాయ్  అఱివుఱాయ్ ! 
అంబర మూడరత్తోన్గి యులగళన్ద,
ఉంబర్ కోమానే! ఉఱంగాదు యెళున్దిరాయ్ !
శెమ్బోర్ కదండిచ్చెల్వా ! బలదేవా !
ఉమ్బియుమ్ నీయుమ్ ఉఱంగేలో రెమ్బావాయ్ || 

అర్థము :-

బట్టలు, పానీయములు, భోజనము విరివిగా దానము చేసే మా అందరికీ ప్రభువైన నందగోపాలా (శ్రీకృష్ణుని తండ్రి) మెలకువ తెచ్చుకోండి.    

కొంబనార్ అంటే నీటి ప్రెబ్బలి మొక్క వంటి స్త్రీలు. (ఈ మొక్క విశేషత ఏమిటంటే నదులు, చెరువుల ఒడ్డున ఉంటూ పెద్ద అలలు కాని వేగమైన ప్రవాహము కాని వచ్చినప్పుడు ఒంగి పోయి అణగిమణిగి ఉంటూ మళ్ళీ మాములుగా లేచి నిలబడుతుంది.) శ్రేష్టమైన స్త్రీలు ఇటువంటి వారు అని ఈ మొక్కతో పోల్చడము జరిగింది. 

అటువంటి స్త్రీలలో మేటిది యశోదమ్మ. పరిస్థితులకూ భర్తకూ అనుగుణముగా ఉంటూ తన ధర్మాన్ని, కర్తవ్యాన్ని నిర్వహిస్తూ తన పరివారాన్ని రక్షించుకుంటూ ఉంటుంది. అలాగ కొంబనార్లు అందరిలోకి శ్రేష్ఠురాలైన, కులానికి దీపము అయిన, మా స్వామిని యశోదమ్మా ! తెలివి తెచ్చుకో!

ఆకాశములోకి పెరిగిపోయి మూడు అడుగులతో ప్రపంచాన్ని కొలిచిన రాజకుమారా! నిద్రపోకుండా ఇంక మెలకువ తెచ్చుకో.

ఎర్రని తామరము రంగు పోలిన బంగారు కడియాన్ని చేతికి ధరించిన బలరామా! నీవూ, నిే తమ్ముడితో పాటు లేవండి. అని ఈ 17వ పాశురము ద్వారా నందగోపుని, యశోదను, శ్రీకృష్ణుని, బలరాములను లేపే ప్రయత్నాలు చేసింది గోదాదేవి.    
    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి