తిరుప్పావై తొమ్మిదవ పాశురములో గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మ అనుభవములో (మానసికంగా) మునిగి తేలుతున్న ఒక గొప్ప గోపికను లేపుతోంది. ఆమె యొక్క వైభవాన్ని వర్ణిస్తూ ఆ తన్మయత్వము నుండి కోలుకుని త్వరగా బయటికి రమ్మంటోంది.
పాశురము
తూమణి మాడత్తు శుట్రుమ్ విళక్కెరియ
దూపమ్ కమల త్తుయిలనై మేణ్ కణ్ వళరుమ్
మామాన్ మగళే మణిక్కదవం తాళ్ తిఱవాయ్
మామీర్! అవళై ఎళుప్పీరో! ఉన్ మగళ్ తాన్
ఊమైయో ? అన్ఱి చ్చెవిడో? అనందలో
ఏమప్పెరుమ్ తుయిల్ మందిర పట్టాళో
మామాన్ మాధవన్ వైకుందన్ ఎన్ఱన్రు
నామమ్ పలవుమ్ నవిన్ద్రేలోర్ ఎంబావాయ్ ||
అర్థము :-
ఈ గోపబాలిక మామ కూతురు. అష్టైశ్వర్యములు మరియు శ్రీకృష్ణ కటాక్షము పొంది ఉన్నది. అందుచేత మాలిన్యము లేని శ్రేష్టమైన రత్నాలు పొదగబడిన మేడలో పట్టుపాన్పు మీద చుట్టూ దీపాలు ప్రకాశిస్తూండగా ధూపము, కమలముల సువాసనలు విరజిల్లుతుండగా శ్రీకృష్ణ అనుభవములో మేను మరచి నిద్రిస్తోంది. ఈ విధంగా ఆ గోపికను వర్ణించి సంభోదిస్తూ ఓ మామకూతురా ! తల్లీ, మీ ఇంటి కిటికీల లోంచి ధగ ధగ మెరుస్తూ ప్రసరించే ఆ ప్రకాశ కిరణాలను తట్టుకోలేక మా కళ్ళు నెప్పెడుతున్నాయి. తొందరగా వచ్చి మణులు పొదగబడిన తలుపు గడియలు తియ్యవమ్మా అంటున్నారు బయటి బాలికలు. కానీ తలుపు తెరవబడలేదు.
అప్పుడు ఇలా లాభం లేదని వాళ్లంతా అత్తని సంభోదిస్తూ అత్తా మీ కూతురిని లేపండమ్మా! మీ కూతురు ఏమైనా మూగదా, చెవిటిదా? ఎంత పిలిచినా లేవదేంటి ? ఏమైనా వెర్రెత్తిందా లేదా సోమరితనము ఆవహించిందా ? లేదా ఎవరైనా కాపలా కూర్చున్నారా కదిలితే తంతాను అని. లేదా మంత్రించేశారా ? ఎంతకీ లేవ దేమిటి?
ఇలా మాట్లాడుతుంటే అత్త భరించలేక మీరంతా కృష్ణుని పేరు తీసుకుంటూ ఎందుకు లేపడం లేదు అని అడిగింది బహుశా .
అప్పుడు బయట ఉన్నవాళ్లు మేము ఇంతసేపూ జపిస్తూనే ఉన్నాము కృష్ణుని నామములు. మాయలాడి, మాధవుడు (లక్ష్మిదేవిని హృదయంలో దాల్చినవాడు), వైకుంఠాధిపతి అని ఇంకా అనేక రకముల పేర్లతో జపిస్తూనే ఉన్నాము అని పలుకుతారు.
ఇంత గోల జరిగితే ఆ కన్య లేచినట్లుంది. అప్పుడు ఆమెను కూడా కలుపుకుని అక్కడి నుండి ఇంకో ఇంటికి బయలు దేరుతారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి