తిరుప్పావై 19వ పాశురము ద్వారా గోదాదేవి హాయిగా నిద్రపోతున్న నీళాకృష్ణులను నిద్రలేపుతూ, నీళాదేవికి తత్త్వముల సారము గురించి జ్ఞాపకము చెయ్యడం జరుగుతోంది.
నీళాదేవి గొప్ప భక్తురాలు, తత్త్వజ్ఞాని అయితే గోదాదేవి కూడ ఏమియు తక్కువ కాదు. శ్రీకృష్ణుడు ఒక్కరి సొత్తు కాదు. అందరికి చెందినవాడని తెలియజేసింది.
తిరుప్పావై - పాశురము 19
కుత్తు విళక్కెరియ కోట్టుక్కాల్ కట్టిల్ మేల్,
మెత్తెన్ర పంజశయనత్తిన్ మేలేఱి ,
కొత్తలర్ పూంగళల్ నప్పిన్నై కొంగై మేల్
వైత్తుక్కిడంద మలర్మార్ బా! వాయ్ తిఱవాయ్ ;
మైత్తడన్ కణ్ణినాయ్ ! నీ యున్ మణాళనై
ఎత్తనై పోదుమ్ తుయిలెళ వోట్టాయ్ గాణ్
ఎత్తనై యేలుమ్ పిరివాత్త గిల్లాయాల్
తత్తువమందు తగవే లో రెమ్బావాయ్ ||
అర్థము :-
చుట్టూ దేదీప్యమానమైన గుత్తిదీపాలు వెలుగుతుండగా, ఏనుగు దంతములచే చేయబడిన గట్టివైన కాళ్ళు కలిగిన మంచము పై మెత్తయిన ఐదు సులక్షణములు (మృదుత్వము, చల్లదనము, సుగంధము, తెల్లదనము, ఎత్తు విశాలములు) గల శయ్య మీద కొత్తగా విచ్చుకున్న మృదువైన పువ్వులు తలలో ధరించిన నీళాదేవి యొక్క వక్షస్థలము పై తల పెట్టుకుని పడుకున్న ఓ స్వామీ! నోరు తెరచి కాస్తైనా మాటాడవా?
కాటుక పెట్టుకున్న కన్నులదానా ! నువ్వు నీ భర్తను ఎంతసేపని అలా నీ ప్రేమ పారవశ్యముల పాశములతో బంధించి లేవనీయకుండా ఉంచుకుంటావు? కొన్ని క్షణములకైననూ అతనిని విడిచి పెట్టలేవా ?
ఏమ్మా! నువ్వు తత్త్వాలన్నీ ఎరిగిన దానివి కదా ! మరి ఏ తత్త్వమందైనా ఇలా చేయడం న్యాయమని ఉందా! నువ్వే చెప్పు తల్లీ!
ఈ విధంగా తత్త్వజ్ఞానాన్ని నీళాదేవికి జ్ఞాపకము చేసింది గోదాదేవి. అప్పుడు నీళ మేలుకుంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి