8, జనవరి 2025, బుధవారం

తిరుప్పావై పాశురము 25 ఒరుత్తి మగనాయ్ పిఱన్దు


తిరుప్పావై 25వ పాశురములో గోదాదేవి శ్రీకృష్ణునికి ఇద్దరు తల్లుల సౌభాగ్యము కలుగుట, మరియు అతను కంసుని వధించడము మున్నగు సాహస కార్యముల వర్ణన చేస్తూ అతనిని కీర్తించడము జరుగుతోంది. నీ కీర్తనలు చేసి పఱై పొందడానికి వచ్చామన్న సంగతి మరోసారి వక్కాణిస్తోంది. 

తిరుప్పావై - పాశురము 25


ఒరుత్తి మగనాయ్ పిఱన్దు, ఓరిరవిల్ 
ఒరుత్తి మగనాయ్  యొళిత్తు వళర,
తరిక్కిలా నాగిత్తాన్ తీంగు నినైంద 
కరుత్తై ప్పిళ్ళైపిత్తు కంజన్ వయిత్తిల్ 
నెరుప్పెన్న నిన్ఱ నెడుమాలే ! ఉన్నై 
ఆరుత్తిత్తు వన్దోమ్; పఱై తరుదియాగిల్,
తిరుత్తక్క శెల్వముమ్ శేవగముమ్ యాంపాడి 
వరుత్తముమ్ తీరున్దు మగిళిందే లో రెమ్బావాయ్ || 

అర్థము :-

ఒకరి కుమారుడవుగా పుట్టి, ఒక అర్థరాత్రిలో వేరింటికి చేరి అక్కడ వారి కుమారుడవుగా పెరిగావు అని కీర్తిస్తోంది గోదాదేవి. 

దేవకీదేవి శ్రీమన్నారాయణుని నువ్వు నాలుగు చేతులతో నీ దివ్యస్వరూపము, తేజస్సుతో నాకు కొడుకుగా పుట్టాలని ప్రార్థిస్తే సరే నని అలాగే ఆమె గర్భములోనికి ప్రవేశించి పుడతాడు ఆ భగవంతుడు. 

యశోదమ్మ కూడా భగవంతుణ్ణి వేడుకుంది ఆయన తనకు కొడుకుగా పుట్టి ఆయన లాలన, పాలనలు చేస్తూ ఆ సుఖాన్ని, సౌభాగ్యాన్ని అనుభవించేట్లా వరము ప్రసాదించమని. ఆమెకు కూడ తథాస్తు అని పలికాడు కనుక అక్కడ దేవకీ కోరిక తీర్చేశాడు కనుక ఆ రాత్రికి రాత్రే వసుదేవుని నెత్తిపై బుట్టలో యమునా నదిని దాటి యశోదమ్మ ఇంటికి జేరి ఆమె లాలన, పాలనలో పెరిగాడు. ఈ విధముగా ఇద్దరి కోరికలూ తీర్చి ఇద్దరికీ కుమారుడు అయ్యాడు. 

అలా నువ్వు యశోదమ్మ ఇంట్లో రహస్యముగా శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుతుంటే, నీ కోసమని గూఢచారులని పంపి వెతికిస్తున్న కంసుని రాక్షసులందరినీ చంపేస్తూ అతని ప్రయత్నాలన్నింటిని వృధా చేసి ఆ కంసుని పొట్టలో ఒక మండుతున్న నిప్పులాగ తయారయి అతన్ని క్షోభ పెట్టి సంహరించావు. 

ఓ కృష్ణా ! నువ్వు మాకు పఱై అన్న బహుమానాన్ని ఇస్తే ఇలాగే ఇంకా ఎన్నెన్నో అద్భుతమైన నీ లీలలను, వీరగాథలను లక్ష్మీదేవి కూడ విని ఆనందించే రీతిగా మేము గానమొనర్చుచూ ఇప్పటి వరకు పడ్డ వ్యథలన్నీ మరచిపోయి ధన్యులమౌతాము.        

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి