17, నవంబర్ 2018, శనివారం

Daily Puja - ఇంట్లో పూజ ప్రతిరోజూ ఏ విధముగా చేసుకోవాలి

మన ఇళ్లల్లో ప్రతిరోజు పూజ చేసుకోవడం అనేది సాధారణముగా  మనము మన పెద్దల దగ్గిర నుండి నేర్చుకుంటూ ఉంటాము. కాకపొతే మన పెద్దలు ఉన్నప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి మన పరిస్థితులు వేరు. 

ప్రస్తుత పరిస్థితులలో మనకి సమయం చాలా వ్యస్తంగా ఉండి పూజకి ఏ విధముగా సమయం కేటాయించుకోవాలో అర్ధం కాకుండా  సతమతమవుతూ  ఉంటు న్నాము. అటువంటి వారు అతి కొద్దీ సమయంలో తృప్తిగా ఎలా పూజ చేసుకోవాలి అన్నది  ఇక్కడ వివరించి చెప్పడానికి ప్రయత్నము చేస్తాను.   

నేను చెప్పే ఈ విధానాన్ని మీరు ఎలా కావాలనుకుంటే అల్లాగే మీకు అనుగుణముగా మార్చుకోవచ్చును. మీకు ఉన్న సమయము, సదుపాయాలని బట్టి, నేను విశదీకరించే సలహాలని బట్టి మీరు మీ విధానాన్ని రూపొందించుకో వచ్చును.

 
పూజ చేసే సందర్భంలో దేవునికి కేవలం పూజ కాకుండా ఇంకా కొన్నిసేవలవంటివి ముందూ, వెనకా  ఉంటాయి. ఎలాగైతే మనకి కొన్ని ముఖ్యమైన కాల్యకృత్యాలు, కలాపాలు ఉంటాయో అల్లాగే దేవునిచేత కూడ చేయిస్తాము. ఉదాహరణకి చేతులు, కాళ్ళు కడుక్కోవడం, స్నానం చెయ్యడం, ఇలాంటివి. 

ఇవి మీకు కుదిరితేనే చెయ్యాలి. తప్పనిసరి కాదు. నాకు ఇలాంటివి కొన్ని చెయ్యడము ఆనందముగా, తృప్తిగా ఉండటము వలన మీకు కూడ చెబుతున్నాను. 

పూజకు ముందు చేసే ఏర్పాటులు 

  1. ముందుగా మనము స్నానము చేసి శుభ్రమైన బట్టలు కట్టుకుందాము. పట్టు బట్టలు ఉంటే అవి విడిగా పెట్టుకుని రోజూ కట్టుకుని పూజ చెయ్యవచ్చును. నెలకొకసారి అవి డ్రై క్లినింగు చేయించుకోవచ్చును. 
  2. ఎలాగైతే మనం ఇల్లు శుభ్రము చేసుకుంటామో అదేవిధముగా భగవంతుని ఉంచే స్థలం శుభ్రం చేసుకోవాలి. తడి బట్టతో తుడిచి కూడ శుభ్రం చేసుకోవచ్చును. విగ్రహము, దేవుని   పటాలు కూడ అప్పుడప్పుడు శుభ్రము చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మన దేవుడు కళకళ లాడుతూ నవ్వుతూ ఉంటాడు. 
  3. దీపం కుందులు వారానికి ఒకసారి సబ్బుతో తోముకుంటే మంచిది. తక్కిన రోజుల్లో పాత వత్తులు తీసేసి, క్రొత్త వత్తులు పెట్టి దీపం వెలిగించుకోవాలి. 
  4. అలాగే పూజ చేసే పాత్రలు కూడా కడుక్కోవాలి. ఇవి ప్రతీ రోజు శుభ్రంగా నీళ్లతో కడిగేసుకుంటే చాలు. 
  5. Vim suddham అని ఒక లిక్విడ్ వస్తోంది ఈ మధ్య. దానితో అయినా, లేదా చింతపండుతో నైనా అప్పుడప్పుడు కడిగితే కుందులు, పాత్రలు మెరుస్తూ ఉంటాయి. మనస్సుకి హాయిగా ఉంటుంది అవి చూస్తే. ఎంత ఇంపుగా ఉంటాయో తెలుసా! అలా వాటికేసి తనివి తీరా చూస్తూ ఉండాలని ఉంటుంది.   
  6. దేవుడిని ఏదైనా మందిరము లాంటి దాన్లో పెట్టవచ్చును లేదా ఒక పీట మీద అయినా పెట్టవచ్చును. సాధారణముగా తూర్పు లేదా ఉత్తరము దిక్కులో పెట్టాలి. కుదరకపోతే ఎలాగైనా పెట్టుకుంటాము. 



పూజకు కావాల్సిన సామగ్రి 

  1. దేవుని విగ్రహాలు, బొమ్మలు వగైరా. 
  2. పూజకి చదివే స్తోత్రాలు, పుస్తకాలు, క్యాసెట్లు లాంటివి. 
  3. దీపం కుందులు (రెండు పెడితే మంచిది). 
  4. దీపం నూనె మరియు వత్తులు. 
  5. అగరవత్తులు, వాటికి స్టాండ్. అల్లాగే కర్పూరము - అది వెలిగించేందుకు ప్లేట్ కానీ స్పూన్ లాంటిది కానీ.
  6. ఒక పళ్ళెము మరియు చిన్నరాగి చెంబు కానీ స్టీల్ అయినా ఫర్వాలేదు. ఒక ఉద్ధరిణె (స్పూన్ లాంటిది). రెండు గిన్నెలు ఉంటే ఇంకా మంచిది. ఒకటి దేవునికి, ఇంకోటి మనం ఆచమనం వగైరా చేసుకోడానికి ఉంటాయి.  
  7. నైవేద్యం (పళ్ళు, కొబ్బరికాయ, పటికబెల్లం, పంచదార, బెల్లం, ఇటువంటి వాటిలో ఏవైనా పెట్టవచ్చును. అన్నం కానీ లేదా మరేదైనా వంటకం అప్పుడప్పుడైనా, లేదా రోజు వండి పెడితే అది మరి మంచిది.)
  8. పువ్వులతో పూజ చేస్తే పువ్వులు మరియు ఎప్పుడైనా కుంకుమ పసుపులతో పూజ చేస్తే అవి కూడా రెడీగా ఉంచుకోవాలి. 

పూజావిధానము 

  • కుందులలో వత్తులు పెట్టి, దీపం నూనె పోసి వెలిగించాలి. 
  • చెంబులో మంచి నీరు పట్టుకుని పళ్ళెము, చెంబు, ఉద్ధరిణెతో సహా దేవుని దగ్గర పెట్టుకోవాలి. రెండు గిన్నెలు ఉంటే రెండింట్లో నీళ్లు పెట్టుకోవచ్చును. 
  • దేవునికి కుడివైపు కూర్చుని పూజ చేయాలి. కుదరని పక్షంలో ఎదురుగానైనా కూర్చుని చేయవచ్చును. 
  • ముందుగా చెంబు లేదా పాత్ర లోని నీటిని ఉద్ధరిణితో తీసుకుని దేవునికి స్నానం చేయిస్తున్నట్లుగా చుట్టూ తిప్పి పళ్లెంలో పొయ్యాలి. అల్లా రెండు, మూడు సార్లు అయ్యాక మళ్ళీ కాసిని నీళ్లు తీసుకుని మూడు సార్లు ఆచమనం చేయించినట్లుగా దేవునికి చూపించి పళ్లెంలో వదలాలి. 
  • ఆ తరువాత శుక్లామ్బరధరం శ్లోకము చదివి, గురుస్తుతి చేసి నెత్తి మీద నీటి చుక్కలు బొటన వేలితో మూడు సార్లు జల్లుకుని, మూడు సార్లు అచ్యుతాయ నమః అనే మూడు నామాలు చదువుకుంటూ ఆచమనం చేసి పూజ మొదలు పెట్టాలి. ఆచమనం మనకోసం పెట్టుకున్న పాత్రలోంచి నీళ్లు తీసుకుని చెయ్యాలి.  
  • పూజలో మీరు ఏ శ్లోకాలు కావాలంటే అవి చదువుకుని అష్టోత్తరములు కూడా కావాలంటే చదువుకుని పూజ చేసుకోవచ్చును. నామాలు చదివేటప్పుడు పువ్వులు వేస్తూ కూడ పూజ చేసుకోవచ్చును. లేదా వట్టినే చదివేసుకోవచ్చును. 
  • ఇవన్నీ అయ్యాక దణ్ణం పెట్టుకుని లేచి నిలబడి అగరవత్తులు వెలిగించి దేవుళ్ళకి చుట్టూ తిప్పి వాసన చూపించి స్టాండ్ లో పెట్టాలి. 
  • అల్లాగే దీపాన్ని కుడి చేతితో దేవునికి చూపించాలి. 
  • ఆ పిమ్మట నైవేద్యం మీద కాసిని నీటి చుక్కలు వేసి దేవునికి ఆరగింపు పెట్టాలి. అంటే కుడి చేత్తో ఆ నైవేద్య పదార్థాన్ని దేవునికి చూపిస్తూ స్వాహా స్వాహా అని తినిపించినట్లుగా. 
  • నైవేద్యం అయ్యాక చేతులు మూతి కడిగినట్లుగా కాసిని నీళ్లు చూపించి పళ్లెంలో వదలాలి. అల్లాగే కాళ్ళకి చూపించి మళ్ళీ పళ్లెంలో వదలండి. మళ్ళీ కాస్త మంచి నీళ్లు తాగించినట్లుగా దేవునికి చూపించి పళ్లెంలో వదలాలి. 
  • ఇప్పుడు కర్పూరం వెలిగించి మంగళ హారతి చదవాలి. 
  • హారతి అయ్యాక కాసిని నీళ్లు కర్పూరం చుట్టూ త్రిప్పి పళ్లెంలో వదలండి. హారతిని కళ్ళకి అద్దుకోవాలి. 
  • అటు పిమ్మట ఆ పళ్ళెంలోని నీళ్ళని దేవుని పాత్రలోని నీళ్లలో కలిపేసి అదే తీర్థముగా తీసుకోవాలి. నైవేద్యం కూడా కళ్ళకి అద్దుకుని గ్రహించాలి. 

ఇది శాస్త్రోక్తం ప్రకారం సులభంగా చేసుకునే మార్గం. ఇదంతా చేయడానికి 10, 15 నిమిషాలు కంటె ఎక్కువ పట్టదు. దీన్ని ఇంకా మీకు కావాల్సిన విధంగా కూడ మార్చుకోవచ్చును. సమయం ఉంటే అరగంట, ఇంకా ఎక్కువ సేపు కూడా చెయ్యవచ్చును.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి