6, జనవరి 2025, సోమవారం

తిరుప్పావై - పాశురము 23 - మారిమలై శీరియ సింగమ్


తిరుప్పావై 23వ పాశురములో గోదాదేవి శ్రీకృష్ణుని యొక్క హావభావాలు (వొళ్ళు విరుచుకొనుట, నడక మున్నగు వయ్యారములు, హుందాతనం) ఒక సింహముతో పోలుస్తూ ఆయనను కీర్తిస్తూ, ఆ రాజస కదలికలను మరల వీక్షించు మహాభాగ్యము ప్రసాదించమని వేడుకుంటోంది. 

తిరుప్పావై - పాశురము 23 - మారిమలై


మారిమలై ముదంగిల్ మన్ని కిడరఁడు ఉఱంగుమ్ 
శీరియ సింగమ్ అరువిత్తుత్తి విదుత్తు
వేరిమయిర్ ప్పొంగవెప్పాదుమ్ పేరఉందదరి 
మూరి నిమిర్ ఉందు మురంగుప్పఱ పట్టు  
పోదరుమా పోలే, నీ పూవై ప్పూవణ్ణా! ఉన్ 
కోయిల్ నిన్ఱు ; ఇంగనే పోందరుళి కోప్పుడైయ 
శీరియ శింగాసనత్తు ఇరుందు, యామ్ వంద 
కారియం ఆరాయిందు అరుళే లో రెమ్బావాయ్ || 

అర్థము :-

పర్వతము యొక్క గుహలోపల వర్షాకాలములో హాయిగా, నిశ్చలంగా ముడుచుకు పడుకుని నిద్రపోతున్న రాజసము ఉట్టిపడుతున్న సింహము మేలుకున్నాక తన తీక్షణములైన చూపులను నలువైపులా ప్రసరింపజేసి చూస్తుంది. ఆ తరువాత తన జూలు, వెంట్రుకలు నిక్కబొడుచుకునేట్లా అటు ఇటు పొర్లుతుంది. పిమ్మట ఒళ్ళు దులుపుకుంటూ నెమ్మదిగా లేచి తన శరీరాన్ని సాగదీసుకుంటుంది. ఒళ్ళు విరుచుకుంటూ బిగ్గరగా గర్జిస్తుంది. అప్పుడు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ గుహలోంచి బయటకు వస్తుంది. 

ఓ స్వామీ! కృష్ణా ! నువ్వు కూడా అదే విధముగా చెయ్యి. 

ఓ పూవణ్ణా ( పుష్పముల రంగు, ముఖ్యంగా అతసీ పుష్పము అనే) నీలి రంగు శరీరము కలవాడా! నువ్వు అలా ఆ సింహము లాగానే చేస్తూ నెమ్మదిగా అందమైన నడకలతో నీ గది నుండి బయటకి వచ్చి నీ రాజస సింహాసనమును జేరి దానిపై కూర్చుని శ్రద్ధతో మేము వచ్చిన కార్యము తిలకించి మమ్ములను అనుగ్రహించుము స్వామీ!

ఈ విధముగా శ్రీకృష్ణుని అర్థించి గోదాదేవి, తక్కినవారు ఆయనను గది నుండి బయటకు రప్పించి సింహాసనంపై కూర్చునేట్లా చేశారు.               

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి