తిరుప్పావై నాలుగవ పాశురములో "ఆళి మళై కణ్ణా" అంటూ ముద్దుగా వానదేవుని (వరుణుని) వేడుకుంటోంది గోదాదేవి. మంచిగా వానలు కురిపించమని, అప్పుడు అందరమూ ఆ పవిత్రమైన నీటిలో స్నానం చేసి ధన్యులము అవుతామని.
ఏదైనా వ్రతము చెయ్యాలన్నా, లేదా రోజూ చేసుకునే పూజ కోసమైనా ముందుగా పవిత్రత ముఖ్యము. శరీరాన్ని, మనసుని పవిత్రం చేసుకోవాలి. మనస్సు పవిత్రతకు శరీర పవిత్రత ఒక నాంది లాంటిది. శరీరాన్ని శుభ్రము చేసుకుని, పవిత్రమైన (ఉతికి ఆరేసిన) బట్టలు ధరిస్తే మనస్సుకి ఆహ్లాదముగా ఉంటుంది. అప్పుడు మనస్సు కూడా పవిత్రతకు చోటు చేసుకుంటుంది.
ఇప్పుడు నాలుగవ పాశురము, దాని అర్థములు తెలియజేస్తున్నాను.
ఆళి మళై కణ్ణా ఒన్ఱు నీ క్కై కరవేల్,
ఆళి యుళ్ పుక్కు ముగన్దు కొడార్ తేఱి
ఊళి ముదల్వ నురువంబోల్ మెయ్ కఱుత్తు,
పాళి యందోళుడై పఱ్ప నాబన్ కై యిల్
ఆళి పోల్, మిన్ని వలమ్బురిపోల్ నిన్ర దిర్ న్దు,
తాళా దే శార్ఙ్గ ముదైత్త శర మళై పోల్,
వాళ వులకినిల్ నీ పెయ్ దిడాయ్, నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళ్ న్దేలో రెమ్బావాయ్ ||
అర్థము:
ఓ, వానదేవుడా, పర్జన్యుడా! నువ్వు దయచేసి ఒక పని చెయ్యి.
సముద్రములోకి చొచ్చుకు పోయి, నిండా మునిగి, తాగ గలిగి నన్నినీళ్లన్నీ తాగి, పైకి ఎగసి పోయి, భూమి అంతటా దద్దరిల్లు మాదిరి గర్జనలతో ఆకాశమంతటా వ్యాపించిపోయి, కటిక నీల మేఘాలు ధరించి, ఆ పద్మనాభుడి చేతిలోని సుదర్శన చక్రము వలె మెరుపులు మెరుస్తూ, ఆయన శంఖ ధ్వని వలె చప్పుళ్ళు చేస్తూ, ఆయన యొక్క శార్ఙ్గ ధనుస్సు నుండి ఎడతెరిపి లేకుండా వెలువడే బాణాల లాగ వర్షపు ధారలు ఈ లోకమంతటా కురిపించుము.
అప్పుడు మేము ఆ వర్షపు నీటిలో స్నానమాచరించి ధన్యులము అవుతాము సుమా.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి