9, జనవరి 2025, గురువారం

తిరుప్పావై - పాశురము 26 - మాలే మణివణ్ణా మార్గళి నీరాడువాన్


తిరుప్పావై లోని 26వ పాశురము  ద్వారా గోదాదేవి ఈ తిరుప్పావై వ్రతము చెయ్యడానికి కావలసిన తదితర వస్తువులను వివరించి చెప్తోంది. మేము ఈ వ్రతాన్ని సంతుష్టితో మంచిగా జరుపుకోడానికి నువ్వు ఇవన్నీ కూడ మాకు అందజెయ్యాలని శ్రీకృష్ణుని వేడుకుంటోంది. ఇవన్నీ కూడ నువ్వు సులభముగా ఇవ్వగలిగినవే అని అతని ఔదార్యమునూ, వైభవమునూ చాటి చెప్తోంది. 

తిరుప్పావై - పాశురము 26


మాలే ! మణివణ్ణా ! మార్గళి నీరాడువాన్; 
మేలైయార్ శెయ్ వనగళ్ వేండువన, కేట్టియేల్!
జ్ఞాలత్తై యెల్లామ్ నడుంగ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్ పాంజశన్నియమే 
పోల్వన శఙ్గ్అంగళ్, పోయ్ ప్పాడుడైయనవే
శాల ప్పెరుంపఱైయే, పల్లాండి శైప్పారే,
కోల విళక్కే, కొడియే, వితానమే 
ఆలి నిలైయాయ్ అరుళే లో రెమ్బావాయ్ || 

అర్థము :-

ఆశ్రితుల యందు వ్యామోహము, ప్రేమ కలిగిన వాడా! ఇంద్రనీల మణి వర్ణము వంటి దేహ కాంతి గలవాడా! 

మేము మార్గ శీర్ష స్నానము ఆచరించ తలచాము. అందుకోసమై మాకు కావాల్సిన పరికరాలు ఉన్నాయి. నువ్వు దయచేసి వినేటట్లయితే తెలియజేస్తాము. 

ఈ భూమండలాన్ని అంతా వణకింపజేసే ధ్వని కలిగిన పాల రంగు లాంటి స్వచ్ఛమైన తెల్లదనముతో ప్రకాశించే నీ పాంచజన్యమును పోలిన శంఖములు కావాలి. 

మేము ఈ వ్రతము మంచిగా శాస్త్రోక్తముగా చేసుకోవడానికి ఇవన్నీ కూడ కావాలి.  

చాలా పెద్దదైన పఱై వాద్యములు కావాలి. పల్లాండు పాడేవారు కావాలి. మంగళకరమైన దీపములు కావాలి. ఒక గరుడ ధ్వజమూ, చాందినీలు కావాలి. 

ఇవన్నీ కూడా లోకాలన్నిటినీ పొట్టలో పెట్టుకుని అవలీలగా ఒక  వటపత్రముపై ఎంతో అద్భుతంగా పడుకున్న నీవంటి మహనీయునికి అందుబాటులో నున్నవే ! కాబట్టి అనుగ్రహింపుము ఓ స్వామీ !         

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి