14, సెప్టెంబర్ 2026, సోమవారం

Madhuraashtakam Lyrics - మధురాష్టకం



"మధురాష్టకం" అనబడే ఎనిమిది శ్లోకాల సంపుటి (శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణ గానము చేస్తూ) శుద్ధ అద్వైతాచార్యులైన శ్రీ వల్లభాచార్య స్వామివారిచే రచించబడినది. ఈయన గొప్ప కృష్ణ భక్తులు. పుష్టిమార్గ సంస్థాపకులు. కృష్ణభక్తిని ఒక నూతన భావముతో మలిచి శ్రీనాథరూపము సృష్టించి శ్రీనాథ భక్తి మార్గము స్థాపించిరి. అదియే పుష్టిమార్గమని పేరు పొందెను. 
 

ఈయన ఇప్పటి ఛత్తీష్ గఢ్ లోని చంపారణ్యము లో ఒక తెలుగింట జన్మించిరి. వారణాసిలో చదువు, అధ్యాపక వృత్తి, పుష్టిమార్గ ప్రచారము జరిపెను. కాని కృష్ణ భక్తులై ఆయన జన్మభూమితో  అవినాభావ సంబంధము పెట్టుకుని, ఏడాదిలో నాలుగు నెలలు ఆ ప్రాతాలలోనే గడుపుట వలన, బ్రజ భూమి (కృష్ణ జన్మభూమి) వాస్తవ్యులుగా పరిగణింపబడుతారు. ఈయన భక్తి కాలమందు నివసించెను. ( నివాస కాలము: 1479 నుండి 1531వరకు).



మధురాష్ఠక శ్లోకములు అర్థములతో సహా:



అధరం మధురం వదనం మధురం

నయనం మధురం హసితం మధురం | 

హృదయం మధురం గమనం మధురం

మధురాధిపతేరఖిలం మధురం || (1)

అర్థము:

పెదవులు తీపి, ముఖమూ తీపి, కన్నులు తీపి, మందహాసమూ తీపి, హృదయమూ తియ్యనైనది, నడకా తియ్యనైనది, మధురాధిపతి అయిన కృష్ణుని సర్వస్వమూ మధురమైనదే.




వచనం మధురం చరితం మధురం

వసనం మధురం వలితం మధురం | 

చలితం మధురం భ్రమితం మధురం

మధురాధిపతేరఖిలం మధురం || (2)

అర్థము:

పలుకు మధురము, నడవడి (చరిత్ర) మధురము. నిలకడ (నివాసము) మధురమైనది, బట్టలు మధురమైనవి. కదలికా ఇంపైనదే, తిరుగుడూ మధురమైనదే. మధురాధిపతి సర్వస్వమూ ఇంపైనదే.   




వేణు-ర్మధురో రేణు-ర్మధురః

పాణి-ర్మధురః పాదౌ మధురౌ | 

నృత్యం మధురం సఖ్యం మధురం

మధురాధిపతేరఖిలం మధురం || (3)

అర్థము:

అతని వేణువూ తియ్యనిది, చెలరేగే ధూళీ ఇంపైనదే. అరచేతులూ ఇంపైనవి, పాదాలూ ఇంపైనవి. నృత్యమూ ఇంపుగా ఉంటుంది, చెలిమీ తియ్యనైనది. మధురాధిపతి సర్వస్వమూ  తీపిని అందించేవే.




గీతం మధురం పీతం మధురం

భుక్తం మధురం సుప్తం మధురం | 

రూపం మధురం తిలకం మధురం

మధురాధిపతేరఖిలం మధురం || (4)

అర్థము:

అతని గీతము మధురం, వస్త్రం మధురం. తినే పదార్థమూ, తినే తీరూ, పడుకున్న తీరూ అన్నీ ఇంపుగానే ఉంటాయి. అతని రూపము తియ్యగా ఉంటుంది, దిద్దుకున్న తిలకమూ అందముగా, ఇంపుగా ఉంటుంది. మధురాధిపతి యొక్క సర్వస్వము ఎంతో బాగుంటాయి.  




కరణం మధురం తరణం మధురం

హరణం మధురం స్మరణం మధురం | 

వమితం మధురం శమితం మధురం

మధురాధిపతేరఖిలం మధురం || (5)

అర్థము:

చేతలు మధురమైనవి, ఈతలు మధురమైనవి. దోచుకోవడమూ ఇంపు, స్మరించుకోవడము ఇంపు. ఆతని మాటలూ తియ్యగా ఉంటాయి, శాంతమూ మధురంగా ఉంటుంది. మధురాధిపతి యొక్క సర్వస్వమూ బాగుంటాయి.




గుంజా మధురా మాలా మధురా

యమునా మధురా వీచీ మధురా |  

సలిలం మధురం కమలం మధురం

మధురాధిపతేరఖిలం మధురం || (6)

అర్థము:

గుంజా అంటే గురివింద గింజ. అది ఎంత అద్భుతంగా ఉంటుందో తెసులుసు కదా. కృష్ణుడు ధరించిన ఆ గింజలూ బాగున్నాయి, ఆటను ధరించిన మాలా బాగుంది. గురివింద గింజల మాల, తులసిమాల కూడ ఆయన వంటిపై ఎంతో అందంగా మధురంగా ఉంటాయి.
అతను విహరించే యమునా నదీ సుమధురం, అందులో నుండి వీచే తరంగాలూ మధురంగా ఉంటాయి.
ఆ నదిలోని నీరూ తియ్యగా ఉంటాయి, కమలంలో మధురంగా ఉంటాయి.
అల్లాగ మధురాధిపతి అయినా శ్రీకృష్ణుని సర్వస్వము మధురంగా, ఇంపుగా ఉంటాయి.




గోపీ మధురా లీలా మధురా

యుక్తం మధురం ముక్తం మధురం | 

దృష్టం మధురం శిష్టం మధురం

మధురాధిపతేరఖిలం మధురం || (7)

అర్థము:

అతని చుట్టూ ఉన్న గోపికలూ మధురంగా ఉంటారు, వారితో సలిపే లీలలూ అద్భుతంగా ఉంటాయి. అతని కలయికగా తియ్యగా ఉంటుంది, అతని ద్వారా పొందే మోక్షము (ముక్తి) కూడా ఎంతో హాయిగా ఉంటుంది.
అతను చూపించే దివ్యదర్శనం (లేదా అతని రూపము) అపురూపంగా ఉంటుంది, అతని శిష్ట వచనములు కూడా ఎంతో హాయిని కలిగిస్తాయి.
మధురాధిపతి యొక్క సర్వస్వమూ తీపిని, తృప్తిని కలిగించేవే.




గోపా మధురా గావో మధురా

యష్టి ర్మధురా సృష్టి ర్మధురా | 

దలితం మధురం ఫలితం మధురం

మధురాధిపతేరఖిలం మధురం || (8)

అర్థము:

గోపబాలురూ బాగుంటారు, వారి ఆవుల మందలూ బాగుంటాయి. వారి చేతుల్లో ఉన్న బెత్తాలు (కర్రలు) చూడటానికి నున్నగా బాగుంటాయి, అలాగే ఆ చుట్టూతా ఉన్న సృష్టి ( ప్రకృతి దృశ్యాలు) ఏంటో మధురంగా ఉంటాయి.
అతని ద్వారా చేయబడే దండనలు (రాక్షస సంహారము) బాగుంటాయి, అతను ప్రసాదించే ఫలితాలూ మధురంగా ఉంటాయి. 
ఆ కృష్ణపరమాత్మ (మధురాధిపతి) యొక్క సర్వస్వము, సకల విభవాలు, చేష్టలూ కూడా ఎంతో మధురమైనవే. 


ఇతి శ్రీ వల్లభాచార్య విరచిత మధురాష్టకం సంపూర్ణమ్ || 

ఓం నమో శ్రీకృష్ణాయ నమః | 
ఓం నమో నారాయణాయ నమః || 

4, ఏప్రిల్ 2026, శనివారం

శ్రీరామ అష్టోత్తర శతనామావళి - 108 Names of Sri Rama


 శ్రీరామ అష్టోత్తర శతనామావళి అంటే శ్రీరాముని యొక్క 108 నామాల వరుస, లేదా గొలుసు, మఱియు మాల అని అర్థము. అష్టోత్తరము అంటే ఆ తరువాత ఇంకో ఎనిమిది అని అర్థము. ఇక్కడ వంద నామాలు (శత) మఱియు ఇంకో ఎనిమిది నామాలు అని అర్థము. 

శ్రీ రాముని పూజ చేయువారు ముందుగా స్తోత్రములు చదివి, ఆ తరువాత 108 నామములతో స్తుతించవచ్చును. (వీలు కుదిరితే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు సమర్పిస్తూ ఈ నామ పారాయణ చేసుకోవచ్చును.) 

ఇప్పుడు శ్రీ రామ అష్టోత్తర శతనామావళి లోని 108 పేర్లు, అవసరం అనిపించిన వాటికి అర్థములతో సహా తెలియజేస్తున్నాను.  

ఓం శ్రీరామాయ నమః 
ఓం రామభద్రాయ నమః 
ఓం రామచంద్రాయ నమః 
ఓం శాశ్వతాయ నమః 
ఓం రాజీవలోచనాయ నమః (నీలి కలువ వంటి కనులున్న వాడు)
ఓం శ్రీమతే నమః 
ఓం రాజేంద్రాయ నమః 
ఓం రఘుపుంగవాయ నమః (రఘు కుల శ్రేష్ఠుడు)
ఓం జానకీవల్లభాయ నమః 
ఓం జైత్రాయ నమః (10) (గెలుపు తెచ్చువాడు)

ఓం జితామిత్రాయ నమః (మిత్రుల గెలుచుకున్నవాడు)
ఓం జనార్దనాయ నమః 
ఓం విశ్వామిత్రప్రియాయ నమః 
ఓం దాంతాయ నమః (తన ఇంద్రియములను, మనస్సును అదుపులో ఉంచుకున్నవాడు)
ఓం శరణత్రాణ తత్పరాయ నమః (శరణు వేడేవారికి రక్షణ ఇవ్వడంలో మగ్నుడు) 
ఓం వాలిప్రమథనాయ నమః (వాలిని దండించి, చంపినవాడు)
ఓం వాగ్మినే నమః (గొప్ప మాటకారి, వాక్కుతో ఆకర్షించు వాడు)
ఓం సత్యవాచే నమః 
ఓం సత్యవిక్రమాయ నమః 
ఓం సత్యవ్రతాయ నమః (20)

ఓం వ్రతధరాయ నమః
ఓం సదా హనుమదాశ్రితాయ నమః 
ఓం కౌసలేయాయ నమః 
ఓం ఖరధ్వంసినే నమః (ఖరుడు అనే రాక్షసుని చంపినవాడు)
ఓం విరాధవధపండితాయ నమః (విరాధుడు అనే రాక్షసుడు సీతను అపహరిస్తూంటే వధించిన ప్రజ్ఞాశాలి)
ఓం విభీషణ పరిత్రాత్రే నమః (విభీషణుని కాపాడిన వాడు)
ఓం హరకోదండ ఖండనాయ నమః (శివధనుస్సును విరిచినవాడు)
ఓం సప్తసాల ప్రభేత్రే నమః (ఏడు సాల వృక్షములను కూల్చినవాడు)
ఓం దశగ్రీవ శిరోహరాయ నమః (రావణుని తలలు నరికినవాడు)
ఓం జామదగ్న్య మహాదర్ప దళనాయ నమః (30) 
(శివ ధనుస్సును విరిచాడనే కోపముతో జమదగ్ని పుత్రుడైన పరశురాముడు తన విష్ణుధనుస్సును ఎక్కుపెట్టి నీ ప్రతాపము చూపించమనగా రాముడు అవలీలగా ఎక్కుపెట్టి ఎవరి మీద ప్రయోగించను అని అడుగుతాడు)

ఓం తాటకాంతకాయ నమః 
ఓం వేదాంతసారాయ నమః 
ఓం వేదాత్మనే నమః 
ఓం భవరోగ భేషజాయ నమః (జీవుల రోగములను పోగొట్టువాడు)
ఓం దూషణ త్రిశిరోహంత్రే నమః (దూషణుడు, త్రిశిరుడు అను రాక్షసుల హతమార్చిన వాడు)
ఓం త్రిమూర్తయే నమః 
ఓం త్రిగుణాత్మకాయ నమః 
ఓం త్రివిక్రమాయ నమః 
ఓం త్రిలోకాత్మనే నమః 
ఓం పుణ్యచారిత్ర కీర్తనాయ నమః (40)

ఓం త్రిలోక రక్షకాయ నమః 
ఓం ధన్వినే నమః 
ఓం దండకారణ్య కర్తనాయ నమః 
ఓం అహల్యాశాప శమనాయ నమః 
ఓం పితృభక్తాయ నమః 
ఓం వరప్రదాయ నమః 
ఓం జితేంద్రియాయ నమః 
ఓం జితక్రోధాయ నమః 
ఓం జితామిత్రాయ నమః 
ఓం జగద్గురవే నమః (50)

ఓం ఋక్షవానర సంఘాతినే నమః (ఋక్షులు అంటే జాంబవంతుడు మున్నగువారు. వానరులతో పాటు వారిని కూడ తనతో కలుపుకున్నవాడు))
ఓం చిత్రకూట సమాశ్రయాయ నమః 
ఓం జయంతత్రాణ వరదాయ నమః (జయంతుని తన అస్త్రము నుండి రక్షించిన వాడు)
ఓం సుమిత్రాపుత్ర సేవితాయ నమః 
ఓం సర్వదేవాధిదేవాయ నమః
ఓం మృతవానర జీవనాయ నమః 
ఓం మాయామారీచ హంత్రే నమః 
ఓం మహాదేవాయ నమః 
ఓం మహాభుజాయ నమః 
ఓం సర్వదేవస్తుతాయ నమః (60)

ఓం సౌమ్యాయ నమః 
ఓం బ్రహ్మణ్యాయ నమః 
ఓం మునిసంస్తుతాయ నమః
ఓం మహాయోగినే నమః 
ఓం మహోదరాయ నమః 
ఓం సుగ్రీవేప్సిత రాజ్యదాయ నమః (సుగ్రీవుడు కోరుకున్న రాజ్యాన్ని ఇచ్చినవాడు)
ఓం సర్వపుణ్యాదిక ఫలాయ నమః 
ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః (తలుచుకోగానే అన్ని పాపములను పోగెట్టేవాడు)
ఓం ఆదిపురుషాయ నమః 
ఓం పరమపురుషాయ నమః (70)

ఓం మహాపురుషాయ నమః 
ఓం పుణ్య్ఓదయాయ నమః (పుణ్యమే ఉదయించినదా అన్నట్లుగా, పుణ్యము తెచ్చేవాడు)
ఓం దయాసారాయ నమః 
ఓం పురాణ పురుషోత్తమాయ నమః 
ఓం స్మితవక్త్రాయ నమః (నవ్వు ముఖము కలవాడు)
ఓం మితభాషినే నమః (కావాల్సినంతే మాట్లాడు వాడు)
ఓం పూర్వభాషినే నమః (ముందుగా కుశల ప్రశ్నలు వేయువాడు)
ఓం రాఘవాయ నమః 
ఓం అనంతగుణ గంభీరాయ నమః 
ఓం ధీరోదాత్త గుణోత్తమాయ నమః (80)

ఓం మాయామానుష చారిత్రాయ నమః 
ఓం మహాదేవాది పూజితాయ నమః 
ఓం సేతుకృతే నమః (సముద్రముపై సేతువు కట్టినవాడు)
ఓం జితవారాశియే నమః (సముద్రుని జయించినవాడు)
ఓం సర్వతీర్థమయాయ నమః (అతనే అన్నితీర్థములు)
ఓం హరయే నమః 
ఓం శ్యామాంగాయ నమః 
ఓం సుందరాయ నమః 
ఓం శూరాయ నమః 
ఓం పీతవాససే నమః (90)

ఓం ధనుర్ధరాయ నమః 
ఓం సర్వయజ్ఞాధిపాయ నమః 
ఓం యజ్వినే నమః 
ఓం జరామరణ వర్జితాయ నమః
ఓం విభీషణ ప్రతిష్ఠాత్రే నమః 
ఓం సర్వావగుణ వర్జితాయ నమః 
ఓం పరమాత్మనే నమః 
ఓం పరబ్రహ్మణే నమః 
ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః 
ఓం పరంజ్యోతిషే నమః (100)

ఓం పరంధామ్నే నమః 
ఓం పరాకాశాయ నమః 
ఓం పరాత్పరాయ నమః 
ఓం పరేశాయ నమః (ఈశులందరికన్నా అధికమైనవాడు) 
ఓం పారగాయ నమః (కీర్తించబడే వాడు)
ఓం పారాయ నమః (కీర్తన తానె అయినవాడు)
ఓం సర్వదేవాత్మకాయ నమః 
ఓం పరాయ నమః (108)                

28, జనవరి 2026, బుధవారం

ఆశీర్వాదాలు, దీవెనలు - ఆశీర్వచన శ్లోకములు - Blessing Mantras in Telugu



శీఘ్రమేవ పుత్ర ప్రాప్తిరస్తు

ఆశీర్వచనములు లేదా ఆశీర్వాదాలు, దీవెనలు అనేవి అనాది కాలము నుండి మన సంప్రదాయములలో ఒక ప్రముఖ స్థానం   చేసుకున్నాయి. తల్లితండ్రులు కాని, పెద్దలు కాని  తమ తమ బిడ్డల మంచిని కోరుకుంటూ ప్రతి   రోజూ ఎదో ఒక ఆశీర్వచన పదాన్ని వాడుతూ ఉంటారు.

 కుంటుంబ సభ్యులకే కాక చుట్టుపక్కల వారికి కూడ ఇవి వాడుతుంటారు. ఇంతే కాదు. అన్ని శుభకార్యాలలో పురోహితులు వీటిని ఆయా కుటుంబ   సభ్యులను దీవించడానికి వాడుతుంటారు.

 

మచ్చుకి ఈ దీవెనలని గమనించండి:

1). పిల్లలు "హాచ్" మని తుమ్మగానే అమ్మ నాన్నలు కాని, తాత నాన్నమ్మలు కాని వెంటనే "చిరంజీవీ భవ" అనో "చిరంజీవ" అనో అనేస్తారు ఒక్క క్షణము కూడా ఆగకుండా. 

2). అలాగే అన్నము తింటున్నప్పుడు డెక్కు పట్టుకుంటే (అంటే ఎక్కిళ్ళు పట్టుకుంటే) తలమీద మెల్లిగా కొడుతూ "వాతాపి జీర్ణం" అంటారు. తిన్న తిండి కక్కెయ్యకుండా అరగటము కోసమని అలా చేస్తారు. ఇది కూడ ఒక ఆశీర్వాదము లాంటిదే. 

3). అలాగే ఎవరైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు పెద్దలు "క్షేమంగా వెళ్ళి లాభంగా రా" అని దీవిస్తారు. 

ఇప్పుడు నేను పైన చెప్పినవి కాకుండా ఇంకొన్ని ముఖ్యమైన, బాగా చలామణిలో ఉన్న ఆశీర్వచనములను, వాటి అర్థములతో సహా తెలియజేస్తున్నాను.

నిత్యమూ వాడుకలో ఉన్న ఆశీర్వచన పదములు 

  1. చిరంజీవీ భవ: రోజూ పిల్లలను, లేదా మనకంటే చిన్నవారిని దీవించుకోడానికి మన తల్లితండ్రులు, పెద్దలు దీన్ని వాడుతుంటారు. ఇంటికి ఎవరైనా వచ్చినా లేదా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు పెద్దలకు నమస్కరిస్తే వారు చిరంజీవి భవ అని అంటారు.
  2. సుఖీభవ: ఇది కూడ చిరంజీవీభవ లాగానే పెద్దలు చిన్నవారిని దీవించడానికి పలుకుతూ ఉంటారు. 
  3. ఆయుష్మాన్ భవ: దీర్గాయుస్సు కలిగి ఉందువు గాక, లేదా చిరకాలము జీవించెదవు గాక అనే అర్థములో ఈ ఆశీర్వచనాన్ని వాడుతారు. 
  4. విజయీభవ: విజయాన్ని పొందుతావు అని దీవించడానికి ఈ ఆశీర్వాదాన్ని వాడుతారు. విజయము అంటే గెలుపు అని కాని, సాధించగలగడం కాని కావచ్చును. ఏదైనా పని మొదలు పెడుతూ పెద్దల ఆశీర్వాదము పొందటానికి ఇది వాడుకుంటున్నాము. పరీక్షలలో ఉత్తీర్ణత పొందటానికి, ఇంటర్వ్యూలో నెగ్గటానికి, ఉద్యోగములో ప్రవేశించే రోజు కాని, వ్యాపారములో గెలుపుకు కాని ఈ ఆశీర్వాదము వాడుతాము.  
పైన పేర్కొన్నవన్నీ సాధారణముగా ఆడ, మగ అందరికీ వాడే ఆశీర్వాదములు.

ఇప్పుడు స్త్రీలకు మాత్రము వాడే ఆశీర్వాదాలని చూద్దాము. 

స్త్రీలకు వాడే ఆశీర్వాదములు 

  • సౌభాగ్యవతీ భవ: సౌభాగ్యము, మంగళకరము అయిన జీవనము గడిపెదవు గాక అని దీవించడము జరుగుతోంది దీని ద్వారా. పెళ్లీడు కొచ్చిన అమ్మాయిని కాని, పెళ్లి అయిపోయిన వారిని కాని వారి పెద్దలు దీవిస్తారు ఈ విధముగా.
  • శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు: ఈ ఆశీర్వాదాన్ని ముఖ్యముగా తల్లితండ్రుల కంటే పెద్దలు ఎంతో ముద్దుగా తమ మనుమరాలిని, మేనకోడలుని దీవించడానికి ఉపయోగిస్తారు. అంతే కాకుండా పెళ్లి సందర్భములో దీన్ని ఎక్కువగా పురోహితులు వాడటం జరుగుతూ ఉంటుంది. అటువంటి సందర్భములో ఇది పెళ్లికొడుకుకి, పెళ్ళికూతురికి కూడ వర్తిస్తుంది. ఇద్దరినీ వారి వారి పురోహితులు ఆశీర్వదిస్తారు, మరియు పెళ్లి పీటల మీద కూడా ఆశీర్వదిస్తారు.
  • పుత్రవతీ భవ: పెళ్ళి అయిన స్త్రీలను ఆశీర్వదించే సమయములో ఆమెకు పుత్రుడు కలగాలని ఆశీర్వదిస్తారు. ఇది పురోహితుడు కానీ, ఆమె తల్లి కానీ, అత్తగారు కాని, ఇంకా పెద్ద స్త్రీలు కానీ ఉపయోగిస్తారు.
  • శీఘ్రమేవ పుత్ర ప్రాప్తిరస్తు: ఈ ఆశీర్వచనం కూడ పుత్రవతీ భవ లాంటిదే. కాకపొతే కాస్త తొందరగా పిల్లలను కంటావు గాక అని ఆశీర్వదించడము జరుగుతోంది. దీన్ని స్త్రీలు, పురుషులు కూడ వాడుతారు. కొత్తగా పెళ్లి అయిన దంపతులకు ఇది తప్పనిసరిగా వాడుతారు. పుత్రవతి అన్న పదము కొడుకు పుట్టాలన్నా, కూతురు పుట్టాలని అయినా ఆశీర్వదిస్తున్నట్లుగా మనము భావించుకోవాలి.  
  • సుమంగళీభవః: స్త్రీలను ఆశీర్వదించే సమయములో "సౌభాగ్యవతీ భవ, సుమంగళీ భవ" అని ఆశీర్వదించడము చాలా మంచి అలవాటు. అంటే వారు భర్త, పిల్లలతో బాటుగా సుఖముగా ఉండాలని కోరుకుంటున్నాము అన్నమాట.   


వివాహములందు పురోహితులు పలికే ఆశీర్వచనము 

ఈ ఆశీర్వాదము మంచి పండితులైన పురోహితులు వాడే వారు. మరి ఇప్పుడు ఇలా ఆశీర్వదిస్తున్నారో, లేదో తెలియదు.

రోచనో రోచమానః, శోభనో శోభమానః, కళ్యాణః | 
శతమానమ్ భవతి, శతాయుః, పురుషః శతేంద్రియః, ఆయుష్యే-వేంద్రియే ప్రతితిష్టతిః || 

అర్థము:

మంచి పేరు, ప్రతిష్టలతో వెలిగిపోతూ, దివ్య తేజస్సుతోను, ఉన్నతమైన కల్యాణ గుణములతోను ఉందురు గాక! 

నూరేళ్ళ దీర్ఘాయుస్సుతో ఉందురు గాక, పురుషునికి నిండు నూరేళ్ళ జీవితము కూడ  (శత+ఇంద్రియ) అన్ని  ఇంద్రియములు ఆరోగ్యముతో పని చేస్తూ,  నిండు నూరేళ్లు చక్కగా జీవించెదరు గాక!  
     

17, జనవరి 2026, శనివారం

సంకటనాశక గణేశ స్తోత్రము - Sankat Naashak Ganesha of Narada Puran

ప్రణమ్య శిరసా దేవమ్ గౌరీపుత్రం వినాయకమ్ | 
భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే || 

సంకట నాశన గణేశ స్తోత్రము నారద పురాణము లోనిది. తన శాప విమోచనము కొరకై విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ ఈ స్తోత్రమును నారద మహాముని గాత్రము చేసి, దీని మహిమను లోకులకు తెలియజేసెను. నారద మహర్షికి విష్ణువు మరియు పార్వతి ద్వారా శాపములు కలిగెను. శాప విమోచనము కొరకై విష్ణువు ఆజ్ఞ మేరకు బహుశా (ఇప్పటి బద్రీనాథ్ లోని) అలకనందా నదిలో స్నానము చేసి ఈ సంకటనాశక గణేశ స్తోత్రము ద్వారా విఘ్నేశ్వరుని కీర్తించెను. ఇంకొక చోట కూడా నారదుడు స్నానమొనర్చినట్లు చెప్పబడినది. అది పశ్చిమ గుజరాత్ లో సరస్వతీ నది సముద్రములో కలిసే చోట ఉందని చెప్పబడే నారాయణ సరస్సు. ఈ రెండింట్లో ఎక్కడైనా నారదుడు ఈ స్తోత్రాన్ని పారాయణ చేసి ఉండవచ్చును.

మనకు సందర్భము కంటే స్తోత్రము ముఖ్యము ఇక్కడ.



ఈ సంకటనాశన స్తోత్రాన్ని ముఖ్యముగా ప్రతి మాసము కృష్ణ పక్ష చవితి అంటే సంకష్టహర చతుర్థి నాడు పారాయణము చేయుట శ్రేష్ఠమని భావిస్తారు. ఆ రోజున విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజ చేయడము, సూర్యోదయము నుండి సూర్యాస్తము వరకు ఉపవాసముండి, చంద్రోదయమైనాక విఘ్నేశ్వరుని ముఖ్యపూజ చేసి, అష్టోత్తరనామాలు, ఈ స్తోత్ర పారాయణము చేస్తారు. ఆ తరువాత నైవేద్యము సమర్పించిన పిమ్మట భోజనము చేస్తారు. 

ఇప్పుడు స్తోత్రాన్ని అర్థములతో సహా వివరిస్తున్నాను.

సంకటనాశక గణేశ స్తోత్రము 


ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ 
భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే || (1)

అర్థము:
శిరస్సు వంచి ప్రణామము చేస్తున్నాను ఓ గౌరీ పుత్రుడా, వినాయకా! సదా భక్తుల మదిలో నిలయము చేయు నిన్ను ఎల్లవేళలా స్మరిస్తూ ఉంటాను, దీర్ఘఆయుస్సు, అర్థ కామ మోక్షముల పొందుటకై.
 

ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్
తృతీయం కృష్ణ పింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ || (2)

అర్థము: 

1) మొదటిది వక్రతుండము (మెలితిరిగిన తొండము) ఉన్నవాడు. అంటే సందర్భానికి అనుగుణముగా తనను మలచు కోవడము ఎరిగినవాడు.

2) రెండవది ఒకే దంతము కలిగినవాడు. ఇది సమయస్ఫూర్థి, మరియు తెలివి సూచకము. 
(ఒక కథనం ప్రకారము వేదవ్యాసుడు మహాభారతము వినిపిస్తుండగా విఘ్నేశ్వరుడు అతి వేగముతో రాస్తున్నప్పుడు కలము విరిగిపోతే తన దంతము విరగకొట్టుకుని దాన్నే కలము/కుంచెగా అమర్చుకున్నాడు, రాయడము ఆగకుండా ఉండుటకని.)

3) మూడవది నల్లటి, ఎఱ్ఱని (బంగారు గోధుమవర్ణపు)  కన్నులు కలవాడు. ఇది తీక్ష్ణ దృష్టి, చురుకుదనమునకు ప్రతీక.

4) నాలుగవది ఏనుగు ముఖము కలవాడు. విశాల స్వభావము, బుద్ధిమత, తెలివితేటలకు ప్రతీక.  


లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ 
సప్తమం విఘ్నరాజం ధూమ్రవర్ణం తథాష్టమమ్ || (3)

అర్థము:

5) ఐదోది లంబోదరుడు. విశ్వమంతా తనలో ఇమిడ్చుకో గలవాడు. అమిత గుణ సంపన్నుడు.
 
6) ఆరవదేమో వికటుడు. భీకరము, గంభీరమైన వాడు.

7) ఏడవది విఘ్నరాజు. విఘ్నములకు రాజు అంటే విఘ్నములను, కష్టములను, ఆపదలను పొందకుండా తన భక్తులను కాపాడుకునేవాడు. 

8) ఎనిమిది ఏమో ధూమ్రవర్ణుడు. ధూమ్రము అంటే పొగ. పొగ వంటి రంగు అనగా బూడిద వర్ణములో ఉంటాడు అని భావము. అహంకారాన్ని, పొగరుని అణచడానికి ఈ వర్ణములో నాలుగు చేతులతో అగుపిస్తూ ఏలుతూ ఉంటాడు.
 

నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకమ్ 
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ || (4)

అర్థము: 

9) తొమ్మిది ఫాలచంద్రుడు. వినాయకుని ముఖము చంద్రుని వలె వెలిగిపోతూ ఉంటుంది అని ఒక అర్థము, చంద్రవంకను ధరించేవాడని ఒక అర్థము. అతని ముఖ దేదీప్యమానతను, ఉన్నతత్త్వమును సూచించే నామము ఇది.
  
10) పది అయితేనేమో వినాయకుడు. వినాయకుడు అన్నా విఘ్నములకు నాయకుడు అనే అర్థమే వస్తుంది. అంటే కాక అతనే నాయకుడు, అతనికి వేరే నాయకులెవ్వరూ లేరు అని అర్థము. ఇది అతని స్వామిత్వమును, ఉన్నతస్థాయిని సూచిస్తోంది.
 
11) పదునొకండవది గణపతి. గణపతి అనగా గణములన్నింటికీ ఇతను ప్రభువు అని. అందరినీ తన అదుపులో ఉంచుకుని భక్తులకు అండదండగా ఉంటూ కాపాడుతూ ఉంటాడు.
 
12) పన్నెండేమో గజాననుడు. ఏనుగు ముఖము కలిగిన వాడు. అంతులేని జ్ఞానముతో వెలుగొందువాడు. ధైర్యసాహసములు కలవాడు. బలముతో, యుక్తితో భక్తులను కాపాడేవాడు. 


ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః 
నచ విఘ్న భయం తస్య సర్వసిధ్ధి కారకం ప్రభో || (5)

అర్థము:

ఈ పన్నెండు నామములను ఎవరైతే ముప్పొద్దులూ చదువుతారో అట్టివారికి విఘ్నములు కాని భయములు కాని కలుగకుండు. వారికి అన్ని సిద్ధులు సమకూరును.

విద్యార్థీ లభతే విద్యాం దనార్థీ లభతే ధనం 
పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిమ్ || (6)  

అర్థము:

విద్యను ఆశించేవారికి విద్యలు, ధనము ఆశించువారికి ధన ప్రాప్తి కలుగును.
పుత్రులను ఆశించువారికి పుత్రప్రాప్తి (అంటే సంతాన ప్రాప్తి), మోక్షము కోరుకునే వారికి మోక్షము లభించును.

జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్ మాసై ఫలం లభేత్ 
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః || (7)

అర్థము:

ఆరు మాసముల పాటు కనుక ఈ స్తోత్ర పారాయణము చేసినచో అన్ని ఫలములు కలుగును. ఒక సంవత్సర పర్యంతము పఠించిన వారికి అన్ని సిద్ధులు కలుగుతాయి. ఇందులో ఏమాత్రము సందేహము వలదు.

అష్ఠభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ 
తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః || (8) 

అర్థము:

ఎనిమిది మంది బ్రాహ్మణోత్తములకు ఈ స్తోత్రమును తమ చేతులతో వ్రాసి పంచిపెట్టిన యెడల వారికి సకల విద్యలతో బాటు అన్ని ఫలితములు దక్కును.

22, డిసెంబర్ 2025, సోమవారం

తిరుప్పావై - పాశురము 08 - "కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు" - Tiruppavai - Paasuram 08


తిరుప్పావై ఎనిమిదవ పాశురములో గోదాదేవి, తదితరులు ఇంకో బాలికను లేపుతూ, తెల్లవారిన సూచనలు వర్ణిస్తూ, ఏమంటున్నారంటే "మేము నీకు కూడ ఈ వ్రత ఫలితము తక్కాలని ఎంచి, ఒక్కళ్ళమే వెళ్లిపోకుండా నిన్ను కూడ పిలుచుకు పోదామని ఆగి ఉన్నాము" అని అంటున్నారు. 

అంతే కాకుండ శ్రీకృష్ణుని వీరగాథలు, అతని ఆత్మీయతను తెలియజేయడము కూడ జరుగుతోంది.    


తిరుప్పావై - పాశురము 08 - "కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు" 

 

కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు, ఎఱుమై శిఱువీడు
మేయ్ వాన్ పరందన గాణ్, మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్
పోవాన్- పోకిన్ఱారై పోగామల్ కాత్తు, ఉన్నై 
కూవువాన్ వందు నిన్రోమ్, కోదు కలముడైయ,
పావాయ్! ఎళున్దిరాయ్! పాడి పఱై కొండు 
మావాయ్ పిళన్దానై మల్లరై మాట్టియ 
దేవాది దేవనై, చెన్ఱు నామ్ శేవిత్తాల్
ఆవావెన్ఱు ఆరాయ్ న్దు అరుళేలో రెమ్బావాయ్ || 

అర్థము:

తెల్లవారుతున్న సూచనగా తూర్పు దిశన ఆకాశపు టంచులలో వెలుగు రేఖలు పొడుచుకు వస్తున్నాయి. అది చూసి గేదలు మేత మేయటాని కని నలుదిశల బయలు దేరాయి. 

మనతో ఉన్న తక్కిన గోపికలు అందరూ త్వరత్వరగా శ్రీకృష్ణుని వద్దకు పోదామని వెళ్లిపోతుంటే వాళ్ళని ఆపి, నిన్ను కూడ తీసుకుని, అందరమూ కలిసి పోదామని వచ్చాము. 

కాబట్టి ఓ పిల్లా! లేచి రా. ఆయనను కీర్తించి పఱై అనే బహుమతిని పొందుదాము. 

ఎవరైతే (బకాసురుని) నోరు చీల్చి చంపాడో, మల్లయుద్ధములో ఇద్దరు మహా మల్లులను (కంసుని సభలో) హతమార్చెనో, ఆ దేవాధి దేవుడైన శ్రీకృష్ణుని చేరి మనము దర్శించుకుందాము. అప్పుడు ఆయన అయ్యో! ఇంత శ్రమపడి మీరొచ్చారా! నేనే మీ దగ్గరకు వచ్చేవాడిని గదా! అని బోళ్ళు ఆప్యాయతతో, జాలితో మనల్ని పలుకరించి కటాక్షించును. 

కాబట్టి వెంటనే లేచి వచ్చి మాతో బాటు పద.