7, ఫిబ్రవరి 2025, శుక్రవారం

శివ పంచాక్షరీ స్తోత్రములు

శివ పంచాక్షరీ స్తోత్రము అంటే శివ నామ జపము లోని ఐదు అక్షరములతో అల్లిన ఐదు స్తోత్రములతో తయారు చేయబడిన సంపుటి. 




"ఓం నమశ్శివాయ" లోని 'ఓం' కాకుండా ఇంకో ఐదు అక్షరములు ఉన్నాయి కదా! ఆ అక్షరములు ఎవి అంటే న, మ, శి, వ, య. 

ఈ ఐదు అక్షరాలతో మొదలు పెడుతూ, ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క శ్లోకము చొప్పున 5 శ్లోకాలు/స్తోత్రాలు ఉన్నాయి. వీటినే శివ పంచాక్షరీ స్తోత్రము అంటారు. 

శివ పరమాత్మను స్మరిస్తూ ఈ ఐదు స్తోత్రాలు చదివి, వాటితో పాటు ఇంకో ముగింపు శ్లోకము కూడ చదువుకుని ఆయనకు పార్వతీదేవితో సహా నమస్కరించు కోవాలి. 

ముందుగా నేను ఆ శ్లోకాలను అర్థములతో సహా వివరిస్తున్నాను. ఆ తరువాత ఈ ఐదు అక్షరముల వెనుక దాగిన అసలు రహస్యము తెలియజేస్తాను.  


శివ పంచాక్షరీ స్తోత్రములు 


నాగేంద్ర హారాయ త్రిలోచనాయ 
భస్మాన్గ రాగాయ మహేశ్వరాయ | 
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ 
తస్మై నకారాయ నమశ్శివాయ || ( 1 )  

అర్థము :-

సర్పముల రాజైన వాసుకిని హారముగా ధరించినవాడును, మూడు నేత్రములు కలిగి ముక్కంటి అయినవాడును, భస్మమును (అంటే బూడిదను) వంటి నిండా పూసుకోవడం పట్ల మక్కువ కలిగిన వాడును, దైవాలలో కెల్ల గొప్పవాడైన మహేశ్వరుడు అయినవాడు, నిత్యుడు అంటే ఆది, అంతములు లేనివాడును, శుద్ధుడు అనగా ఎటువంటి దోషములు, మచ్చలు లేని పరమ పావనుడు, దిక్కులనే తన వస్త్రములుగా దాల్చినవాడును, అయినటువంటి నకారుడవైన ఓ శివా, నీకు నమస్సులు సమర్పిస్తూ నిన్నే శరణు వేడుతున్నాను. 


మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ 
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ 
తస్మై మకారాయ నమశ్శివాయ || ( 2 )

అర్థము :- 

మందాకినీ నదీజలము తో నూరబడిన చందనము నుదుట దిద్దుకున్నవాడు, నందీశ్వరుడు మొదలగు ప్రమథ గణముల నాయకుడు అయి ఉండి మహేశ్వరునిగా కొలువబడు వాడును, మందారము ముఖ్య పుష్పముగా ఉండే అనేకములైన పుష్పముల జేత కన్నుల విందుగా పూజింపబడుతున్న ఓ మకారుడవైన శివ పరమాత్మా, నీకు నమస్సులు సమర్పిస్తూ నిన్నే శరణు వేడుతున్నాను.  


శివాయ గౌరీ వదనార వింద
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ 
శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ 
తస్మై శికారాయ నమశ్శివాయ || ( 3 )

అర్థము :-

సచ్చిదానంద శివా, గౌరీ మాత ముఖానికి అరవింద పుష్పములా ప్రసన్నతను కలిగించువాడా ! సూర్యుని వంటి తేజస్సు కలిగి దక్ష యఙ్ఞమును ధ్వంసము గావించిన ప్రచండ మూర్తీ ! విషమును సేవించుటచే (నల్లని) నీలంగా మారిపోయిన కంఠము కలవాడా! ఎద్దు చిహ్నము కలిగిన జెండా దాల్చినవాడా!  నీకు నమస్సులు సమర్పిస్తూ నిన్నే శరణు వేడుతున్నాను.    


వశిష్ట కుంభోధ్భవ గౌతమాది  
మునీంద్ర దేవార్చిత శేఖరాయ 
చంద్రార్క వైశ్వానర లోచనాయ 
తస్మై వకారాయ నమశ్శివాయ || ( 4 )

అర్థము :-

వశిష్ఠుడు, అగస్త్యుడు ( ఈ మహర్షి కుంభము నుండి జన్మించుట వలన కుంభోద్భవుడు అని కూడ పేరు పొందెను), గౌతముడు మొదలగు మునిశ్రేష్టుల చేత, మరియు దేవతలందరి చేతను పూజింపబడు ఓ సర్వ శ్రేష్టుడా! చంద్రుని శిఖలో ధరించి, వైశ్వానరుని నేత్రములు కలిగినవాడవు (అగ్ని వలె ఉజ్జ్వలంగా ప్రకాశించు ఆత్మజ్యోతి నేత్రములు ఉన్నవాడు) అయిన ఓ శివపరమాత్మా ! వకారుడవైన నిన్ను నమస్కరిస్తూ శరణు వేడుతున్నాను.     


యక్షస్వరూపాయ జటాధరాయ 
పినాక హస్తాయ సనాతనాయ 
సుదివ్య దేహాయ దిగంబరాయ 
తస్మై యకారాయ నమశ్శివాయ || ( 5 )

అర్థము :-

యక్షుని స్వరూపము కలిగి ఉండి, జటలను దాల్చి, చేతిలో పినాకమును పట్టుకుని, అత్యంత సనాతనుడవు, మిక్కిలి దివ్యమైన దేహము పొంది, నాలుగు దిక్కులనే నీ దుస్తులుగా ధరించిన ఓ యకారుడవైన శివపరమాత్మా ! నీకు నమస్కరిస్తూ నిన్నే శరణు వేడుతున్నాను.   


ముగింపు శ్లోకము (ఫలశ్రుతి)

ఓం పంచాక్షర మిదమ్ పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ 
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే || 

అర్థము :-

ఎవరైతే పుణ్య ప్రదమైన ఈ పంచాక్షరీ స్తోత్రములను శివుని సన్నిధిలో చదువుతారో వారు ఆ పరమాత్ముడైన శివుని ప్రేమకు పాత్రులయి శివ లోకాన్ని పొందుతారు గాక!  

ఓం నమో శివాయ నమః!
ఓం నమో శ్రీ పార్వతీ మాతాయై నమః!
ఓం నమో శ్రీ పార్వతీ, పరమేశ్వరాయ నమః ||  

నమశ్శివాయ ఐదు అక్షరముల మహిమ        


శివ మంత్రములో ఐదు అక్షరాలు ఉన్నాయి కదా! అవి "న", "మ", "శి", "వ", "య" అనునవి.  
ఇందులోని ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క పంచతత్త్వమును సూచించుచున్నది. 

"న" అన్న అక్షరము భూ తత్త్వము 
"మ" అన్న అక్షరము జలతత్త్వము 
"శి " అన్న అక్షరము అగ్నితత్త్వము 
"వ " అన్న అక్షరము వాయుతత్త్వము 
"య" అన్న అక్షరము ఆకాశతత్త్వము (శూన్యత)   

ఈ పంచ తత్త్వములు కలిసి ప్రకృతిని, సృష్టిని, పరమాత్మని సంభోదిస్తున్నవి. ఈ సమస్త సృష్టి , సమస్త ప్రపంచము, అన్ని లోకములు, సమస్త విశ్వమూ పరమాత్మ మయము అని బోధించుచున్నది ఈ శివనామ స్మరణ ద్వారా. 

అంతటా పరమాత్మ నిండి ఉన్నాడు. అన్నీ పరమాత్మ లోనే ఇమిడి ఉన్నాయి అని సూచించడం జరుగుతోంది. 

అంతే కాకుండా ఈ శివనామము లోని అక్షరములు మన శరీరములోని చక్రములను కూడా సూచించుచున్నవి. శివనామ స్మరణ ద్వారా మనలోని ప్రాణ చక్రములు జాగృతము చేసుకోవడము జరుగుతోంది.              

"న" అక్షరము మూలాధార చక్రము జాగృతము చేస్తుంది. ఇది బొడ్డు కింది పొత్తి కడుపు క్రింది భాగములో ఉండి  స్పందనని జాగృతము చేస్తూ మనలోని భావోద్వేగములను, స్పందనలను నియంత్రము చేస్తుంది. భూ తత్త్వము మొదట్లో నిద్రావస్థలో ఉండి జాగృతము అవుతుంది. అప్పుడు మొలకలు, సృష్టి జరుగుతాయి. ప్రేమ, కోపము, భయము, నిద్ర ఇటువంటివి అదుపులో పెట్టుకోవాలంటే ఈ "న" అక్షరము ఉచ్చారణ చేసి ఈ చక్రమును అదుపులోకి తీసుకోవచ్చును. దీని ద్వారా మనస్సు, ఇంద్రియములు అదుపులో ఉండి పనులు సక్రమముగా చేసుకుంటాము.  

"మ" అక్షరము స్వాధిష్ఠాన చక్రమును జాగృతము చేస్తుంది. ఇది బొడ్డు దగ్గిర ఉంటుంది. మన జీర్ణ ప్రక్రియను, కిడ్నీలను అదుపులో ఉంచుతుంది. నీటి సరఫరా, ద్రవములు, రసాలను ఉత్పత్తి చేసే గ్రంథులను నియంత్రణలో ఉంచుకుంటుంది. "మ" అక్షర ఉచ్ఛారణతో జీర్ణ కోశ సమస్యలను సరి చేసుకోవడము జరుగుతుంది. జననేంద్రియములు కూడా అదుపులో సవ్యంగా ఉంటాయి. 


"శి" అన్న అక్షరము అనాహత చక్రమును పైకి లేపుతుంది. ఈ చక్రము మన హృదయములో ఉంటుంది.  ఇది అగ్ని సూచకము. ఈ చక్రము జాగృతము అయితే శక్తి నలువైపులా వ్యాపింపబడుతుంది. మన శరీరములోని గుండె, ఊపిరి తిత్తులు, కాళ్ళు చేతులు సరైన మోతాదులో రక్త ప్రసరణమును, శక్తిని పొంది మంచిగా పని చేస్తాయి. హృదయాన్ని బల పరిచి, మన ఆరోగ్యం బలపడుతుంది. మనలోని ఆత్మ విశ్వాసము పెరిగి అన్ని పనులూ విజయవంతంగా చేసుకుంటాము.  

"వ" అక్షరము వాయువుతో సంబంధము కలిగినది. ఇది విశుద్ధ చక్రాన్ని సూచించుచున్నది. దీని బిందువు గొంతుకలో ఉండి మన భావాలను మాటల ద్వారా వ్యక్త పరిచేందుకు సహకరిస్తూ మంచి నేర్పరితనముతో మాటలాడే శక్తిని ప్రసాదిస్తుంది. మన ఆలోచనలని భావాల ద్వారానూ, మాటలు, సౌజ్ఞలు, రాతల ద్వారానూ వ్యక్త పరిచేందుకు ఈ విశుద్ధ చక్రము జాగృతము చేసుకోవడము చాలా అవసరము. ఇతరుల మాటలు వినుటకు, నలుగురిలో హుందాగా మాట్లాడటానికి సాయము చేస్తూ ఆత్మవిశ్వాసము, ధైర్యము పెంపొందిస్తుంది. 

"య" అక్షరము ఆకాశమును సూచిస్తూ సహస్రార చక్ర ద్యోతకము అవుతోంది. ఇది మన శిరస్సు అగ్రభాగములో ఉండి ఆకాశము వైపు వెలువరుతూ ఉంటుంది. ఈ చక్రము దైవత్వము, ఆత్మలకు చిహ్నము. దీన్ని లేవదీసినచో మనలో జ్ఞానాన్ని, తేజస్సును నింపుతూ ఉంటుంది. విశ్వము, పరమాత్మలతో మన చేతనా శక్తిని కలుపుతూ సాంసారిక మోహాలు, మాయల నుండి మనని తప్పించి దైవ జ్ఞానాన్ని, తెలివితేటలని కలుగజేస్తుంది. 

ఓం నమశ్శివాయ !   

   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి