తిరుప్పావై 20వ పాశురములో ఆండాళ్ శ్రీకృష్ణ పరమాత్మకు మేలుకొలుపు పాడుతూ అతని సుగుణములను, ఔదార్యమును కీర్తించడం చేస్తూ, నీళాదేవిని కూడా ఇంకోమారు త్వరగా తను లేచి, శ్రీకృష్ణుడిని తయారు చేయమంటోంది. విసనకర్ర, అద్దాలతో శ్రీకృష్ణుడిని తమకు స్నానాలు చేయించడానికి వెంటనే పంపించమనీ వేడుకుంటోంది.
తిరుప్పావై - పాశురము 20
ముప్పత్తుమూవరు అమరర్కు మున్ శెన్ఱు
కప్పం తవిర్క్కుమ్ కలియే! తుయిలెళాయ్ !
శెప్పముడైయాయ్ తిఱలుడై యాయ్ శెత్తార్క్కు
వెప్పమ్ కొడుక్కుమ్ విమలా! తుయిలెళాయ్ !
శెప్పన్న మెన్ములై శెవ్వాయ్ శిరుమరుంగుల్
నప్పిన్నై నంగాయ్! తిరువే తుయిలెళాయ్ !
ఉక్కముమ్ తట్టొళియుమ్ తందు ఉన్ మణాళనై
ఇప్పోదే యెమ్మై నీరాట్టేలో రెమ్బావాయ్ ||
అర్థము :-
ముప్పైమూడు కోట్లమంది దేవతలకూ ఆపదలు కలగడానికి ముందుగానే వెళ్లి యుద్ధ భూమిలో వారికి ముందు నిలబడి, శత్రువుల నుండి వారికున్న భయము, ఆపదలను తొలగించే పరాక్రమశాలీ! కరుణతో నిండిన సున్నితమైన హృదయము కలవాడా! నిదుర లేచి రా !
ముందుగా హెచ్చరించకుండా, తెలియకుండా అకస్మాత్తుగా దాడి చేసే వారిని సైతం వారు ఇంకా రంగములోకి ప్రవేశించుటకు ముందే వారిని ఎదిరించి, చీల్చి చెండాడే స్ఫూర్తి ఉన్నవాడా! శత్రువుల గుండెల్లో కంపనము పుట్టించువాడా ! నిదుర లే !
బంగారు భరిణల వంటి వక్షోజ సంపద మరియు దొండపళ్ల వంటి ఎర్రని అధరములతో కూడిన ఓ సుందరాంగి నీళాదేవీ ! పరిపూర్ణురాలా ! లక్ష్మీదేవితో సమానురాలా ! లేచి రావమ్మా !
ఒక విసనకర్రను, కంచు అద్దమును (శ్రీకృష్ణునికి గాలి వీచడానికి మరియు చెమటలు తుడుచుకునేటప్పుడు ముఖము సరిదిద్దుకోవడం కోసము) మా చేతికి ఇచ్చి, నీ స్వామిని ఇప్పుడే మాతో పంపించుము తల్లీ!
ఈ విధంగా వేడుకోగానే నీళాదేవి తలుపు తీస్తుంది. వారు అడిగిన విసనకర్రని, అద్దాన్ని ఇస్తుంది.
ఆ తరువాత ఆ బాలికలందరితో బాటు తాను కూడ శ్రీకృష్ణుడిని లేపటానికి పూనుకుంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి