తిరుప్పావై - పాశురము 2 - "వైయత్తు వాఙవీర్గాళ్"
ఈ రెండవ పాశురములో గోదాదేవి తిరుప్పావై వ్రతాన్ని చెయ్యడానికి నియమాలని చెబుతోంది.
వ్రతము చేసేటప్పుడు మనము శుచిగా, నిష్కల్మషముగా ఉండాలి. భోగములను పక్కకి నెట్టెయ్యాలి. మితముగా భోజనము, మితముగా నిద్ర పాటించాలి. ఆడంబరములగు బట్టలు కానీ, ఆభరణములు కానీ, అలంకరణ సామాగ్రులను కాని వాడకూడదు. అవన్నీ ఆ భగవంతునికే పరిమితము చెయ్యాలి.
ఇప్పుడు పాశురము తెలియజేస్తున్నాను.
వైయత్తు వాఙవీర్ గాళ్ ! నాముమ్ నమ్బావైక్కు
శెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో, పార్కడలుళ్
పైయత్తు యిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోమ్, పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి
మైయెట్టుళుదోం మలరిట్టు నా ముడియోమ్
శెయ్యోదన శెయ్యోమ్ తీక్కుఱళై శెన్రోదోమ్
అయ్యముమ్ పిచ్చెయుమ్ ఆందనైయుమ్ కై కాట్టి
ఉయ్యుమాఱెణ్ణి యుగన్దే లో రెమ్బావాయ్ ||
అర్థము:
ఓ, భూమిపై(దుఃఖములు, సంఘర్షణలతో నిండి ఉన్న ఈ ప్రపంచములో పుట్టినప్పటికీ) సుఖాలు అనుభవిస్తున్నగోపికా మణులారా! మనము ఇప్పుడు చేయబోయే ఈ వ్రతము ఎలా ఆచరించాలో వినండి, చెబుతున్నాను.
పాలకడలి యందు శయనించే ఆ పరమాత్ముడిని కీర్తించాలి. భోగ పదార్థములైన నెయ్యి, పాలు తాగకుందుము.
తెల్లవారు ఝామునే స్నానము చేద్దాము.
కాటుక పెట్టుకోము. పువ్వులు, దండలు ధరించము.
చెయ్యకూడని పనులు చెయ్యము. పెద్దలు చెప్పిన విధముగా మంచిగా మసలుకుందాము. తీక్కురళ్ అంటే తిరువళ్ళువరు చెప్పిన పధ్ధతి ప్రకారము అని కూడా అర్థము. అంటే సత్య, ధర్మ నిష్ఠలతో నడచుకొనుట.
పెద్దవారలను గౌరవిస్తూ, భిక్షులకు చేతనైనంత, తగినంత సాయము చేస్తూ గడుపుదాము.
ఇలా శాశ్వతమగు ఆత్మ సుఖాన్ని, మోక్షాన్ని అందించే ఈ వ్రతమును ఆచరించుదము.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి