22, డిసెంబర్ 2025, సోమవారం

తిరుప్పావై - పాశురము 08 - "కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు" - Tiruppavai - Paasuram 08


తిరుప్పావై ఎనిమిదవ పాశురములో గోదాదేవి, తదితరులు ఇంకో బాలికను లేపుతూ, తెల్లవారిన సూచనలు వర్ణిస్తూ, ఏమంటున్నారంటే "మేము నీకు కూడ ఈ వ్రత ఫలితము తక్కాలని ఎంచి, ఒక్కళ్ళమే వెళ్లిపోకుండా నిన్ను కూడ పిలుచుకు పోదామని ఆగి ఉన్నాము" అని అంటున్నారు. 

అంతే కాకుండ శ్రీకృష్ణుని వీరగాథలు, అతని ఆత్మీయతను తెలియజేయడము కూడ జరుగుతోంది.    


తిరుప్పావై - పాశురము 08 - "కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు" 

 

కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు, ఎఱుమై శిఱువీడు
మేయ్ వాన్ పరందన గాణ్, మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్
పోవాన్- పోకిన్ఱారై పోగామల్ కాత్తు, ఉన్నై 
కూవువాన్ వందు నిన్రోమ్, కోదు కలముడైయ,
పావాయ్! ఎళున్దిరాయ్! పాడి పఱై కొండు 
మావాయ్ పిళన్దానై మల్లరై మాట్టియ 
దేవాది దేవనై, చెన్ఱు నామ్ శేవిత్తాల్
ఆవావెన్ఱు ఆరాయ్ న్దు అరుళేలో రెమ్బావాయ్ || 

అర్థము:

తెల్లవారుతున్న సూచనగా తూర్పు దిశన ఆకాశపు టంచులలో వెలుగు రేఖలు పొడుచుకు వస్తున్నాయి. అది చూసి గేదలు మేత మేయటాని కని నలుదిశల బయలు దేరాయి. 

మనతో ఉన్న తక్కిన గోపికలు అందరూ త్వరత్వరగా శ్రీకృష్ణుని వద్దకు పోదామని వెళ్లిపోతుంటే వాళ్ళని ఆపి, నిన్ను కూడ తీసుకుని, అందరమూ కలిసి పోదామని వచ్చాము. 

కాబట్టి ఓ పిల్లా! లేచి రా. ఆయనను కీర్తించి పఱై అనే బహుమతిని పొందుదాము. 

ఎవరైతే (బకాసురుని) నోరు చీల్చి చంపాడో, మల్లయుద్ధములో ఇద్దరు మహా మల్లులను (కంసుని సభలో) హతమార్చెనో, ఆ దేవాధి దేవుడైన శ్రీకృష్ణుని చేరి మనము దర్శించుకుందాము. అప్పుడు ఆయన అయ్యో! ఇంత శ్రమపడి మీరొచ్చారా! నేనే మీ దగ్గరకు వచ్చేవాడిని గదా! అని బోళ్ళు ఆప్యాయతతో, జాలితో మనల్ని పలుకరించి కటాక్షించును. 

కాబట్టి వెంటనే లేచి వచ్చి మాతో బాటు పద.              

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి