"కర్కటే పూర్వ ఫల్గుణ్యామ్ " అన్న శ్లోకము ఆండాళ్ యొక్క తిరునక్షత్రము గురించి తెలియజేస్తూ శ్రీమాన్ వేదాంత దేశికులవారు (ఈయన వైష్ణవ ఆచార్యులలో ప్రముఖులు) అల్లిక చేసిన స్తోత్రము. ఈ శ్లోకాన్ని రోజూ పూజా సమయంలో వైష్ణవ భక్తులు చదువుకోవచ్చును.
ఆండాళ్ శ్రీవిల్లిపుత్తూరులో దేవాలయము అర్చకులైన విష్ణుచిత్తుల వారికి తులసీ వనములో ఒక తులసి మొక్క దగ్గిర దొరికినది. ఆవిడ భూదేవి పుత్రిక అనీ, స్వయంగా భూదేవి అవతారమేనని అందరి నమ్మకము.
లక్ష్మీదేవియే మరల విష్ణువును వివాహమాడి తరించాలనీ, అలాగే తన తోటివారికి (తన భక్తులని మనము అనుకోవచ్చును) ఆయనను పొందే మార్గము చూపించాలనీ తనే గోదామాత గా ఉద్భవించిందనీ కూడ కొంతమంది భక్తుల నమ్మకము.
ఇప్పుడు ఈ శ్లోకము దాని అర్థము ఇస్తున్నాను.
గోదాదేవి తిరునక్షత్ర తనియ
వేదాంత దేశికుల వారి కృతి : శ్లోకము -
కర్కటే పూర్వ ఫల్గుణ్యామ్ తులసీ కాన నోద్భవామ్
పాండ్యే విశ్వంభరామ్ గోదామ్ వందే శ్రీరంగ నాయకీమ్ ||
అర్థము :-
కర్కట రాశి పూర్వఫల్గుణీ నక్షత్ర సమయము వేళ శ్రీ గోదాదేవి ఒక తులసీ వనములో మొక్క వద్ద ( ఆమె తండ్రి విష్ణుచిత్తుల వారు గోతులు తవ్వి గట్లు కడుతున్న సమయములో) ఉద్భవించినది.
ఆమె వెలిసిన ఆ ప్రదేశము శ్రీవిల్లిపుత్తూర్ గ్రామ దేవాలయ ప్రాంగణము. అది పాండ్య దేశము లోనిది. ఆమె లోకాన్ని ఉద్దరించడానికి పుటిన దేవేరి (విశ్వంభర) గోదాదేవి (గోతులు తీస్తుండగా పుట్టినది). అటువంటి పరమ పావని శ్రీ రంగనాయకిని నేను శరణు వేడుతున్నాను.
శ్రీరంగము లోని శ్రీరంగనాథ స్వామిని ఆమె పరిణయమాడినది కనుక ఆమె శ్రీరంగనాయకిగా వెలిసినది.
ఈ శ్లోకము ప్రతిరోజు పూజ మొదట్లో మాతాపితలను, గురువులను స్మరించిన పిమ్మట చదువుకోవచ్చును. లేదా పూజ ఆఖరి సమయంలో తిరుప్పావై తనియలు, తిరుప్పావై లోని సమర్పణ పాశురాలు 29, 30 చదివేశాక అయినా చదువవచ్చును.
ఈ స్తోత్రము చదవగానే నీళా తుంగస్తన శ్లోకాన్ని కూడ చదువుతుంటారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి