1, జనవరి 2025, బుధవారం

తిరుప్పావై - పాశురము 18 - ఉన్డు మదగళిత్త నోడాద


తిరుప్పావై 18వ పాశురము లో గోదాదేవి నప్పిన్న పిరాట్టి (నీళాదేవి)ని నిద్రలేపడము తెలియజేస్తోంది.

నీళాదేవి నందగోపుని మేనకోడలు (చెల్లెలి కూతురు).  

నందగోపుడు, యశోదలు లేచారు కాని శ్రీకృష్ణుడు ఇంకా లేవలేదు. అతను నీళాదేవి యొక్క భక్తి మరియు ప్రేమ అనే పాశముల ద్వారా బంధింపబడి ఉంటాడు కనుక ముందుగా నీళాదేవిని లేపడమే సరైన ఉపాయమని తలచి, గోదాదేవి తక్కిన బాలికలతో సహా నీళాదేవిని కీర్తించి లేపటానికి  ప్రయత్నము చేయడము మొదలు పెడతారు.



 

తిరుప్పావై - పాశురము 18


ఉన్డు మదగళిత్త నోడాద తోళ్ వలియన్ 
నందగోపాలన్ మరుమగళే, నప్పిన్నాయ్!
కన్దమ్ కమదుమ్ కుళలీ! కడై తిఱవాయ్; 
వందు ఎంగుమ్ కోళి యనైత్తనకాణ్, మాదవి 
ప్పందల్ మేల్, పల్ కాల్ కుయిలినంగళ్ కూవినకాణ్, 
పన్దార్ విరలి! ఉన్ మైత్తునన్ పేర్ పాడ 
శెన్దామరై క్కైయాల్ శీరార్ వళైయొళిప్ప 
వందు తిఱవాయ్ మగిళిందు ఏలో రెమ్బావాయ్ || 

అర్థము :-

మదించినటువంటి అనేకములైన గజములతో యుద్హమొనర్చిననూ ఓడకుండునటువంటి భుజబలములు కలిగిన వాడును, మదజలములు స్రవించే అనేక గజముల సమూహములు కలవాడునూ అయినట్టి నందగోపాలుని కోడలా! నప్పిన్నా! సుగంధముల పరిమళములతో సువాసనలు వెదజల్లు కుంతలములు (వెంట్రుకలు) కలదానా! తలుపు గడియ తెరువుమా!

అన్నివైపుల నుండి కోళ్లు వచ్చి అరుస్తున్నాయి (తెల్లవారిందని సూచనగా). 

మాధవీలత పందిరిపై నుండి గుంపులు గుంపులుగా కూర్చున్న కోకిలలు అదేపనిగా కూస్తున్నాయి. అవి కూడ తెల్లవారిన దనటానికి సూచనలే. లేచి చూడు. 

బంతుల వంటి వేళ్ళు కలదానా! నీ మేనత్త కొడుకైన శ్రీకృష్ణుని కీర్తించుటకై మేమంతా వచ్చాము. ఎఱ్ఱ తామరలవంటి అందమైన, మృదువైన నీ చేతులకున్న దివ్యంగా ప్రకాశిస్తున్న గాజులు గట్టిగా ధ్వని చేయుచుండగా ముదముతో వచ్చి తలుపులు తీయుమా! మేము అడుగుతున్నాము అని కాకుండా నీ అంతట నువ్వే నీ బావను కీర్తిస్తున్నామనే సంతోషంతో వచ్చి తీస్తున్నట్లుగా తియ్యవలెను.  

ఈ విధంగా నీళాదేవిని పొగడుతూ, బతిమాలుతూ లేపడం జరిగింది.  
                

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి