11, జనవరి 2025, శనివారం

తిరుప్పావై తనియలు - గోదాదేవి స్తోత్రాలు అర్థములతో సహా


తిరుప్పావై తనియలు అనేవి ధనుర్మాసములో గోదాదేవికి నమస్కరిస్తూ చదివే స్తోత్రాలు. వీటిని తిరుప్పావై పాశురములు చదివేముందు, మరల ఇంకోసారి చదివేశాక పఠిస్తారు. 

తనియ అంటే విడిగా ఉండేది. ఈ పదము తమిళ వ్యాకరణము లోనిది. "తని" మరియు "యాన్" అన్న రెండు పాదముల కలయిక. "తని' అంటే ప్రత్యేకమైనది. అంటే ఇది ముఖ్య గ్రంథము లేదా కృతులలోనిది కాకుండా విడిగా సృష్టించబడినది. 

దీనిని గ్రంథ కర్త అయినా రాసి ఉండవచ్చు లేదా తరువాతి వారు ఎవరైనా జత పరచి ఉండవచ్చును. 

గ్రంథకర్త సృష్టించి ఉంటే అది భగవంతునికి కానీ, లేదా తన గురువులకు కాని సంబంధించినది ఉంటుంది. 

వేరెవరైనా రాసి ఉంటే అది ఆ గ్రంథకర్తకి కృతజ్ఞతతో కానీ, లేదా భక్తి గౌరవములతో గాని సృష్టించినది అవుతుంది. 

సాధారణముగా ఈ తనియల ద్వారా ఇవి ఎవరికైతే అర్పిస్తున్నామో వారి జీవన సంబంధీ మరియు విశేష యోగ్యతల గురించి చర్చించడము, పొగడటము జరుగుతుంది. 

ఇప్పుడు తిరుప్పావై తనియల జోలికి వద్దాము. వీటిలో శ్రీకృష్ణుని మరియు గోదాదేవి చర్చలు జరిగాయి. 

మొదటి తనియ "నీళాతుంగస్తన" అన్నది పరాశర భట్టర్ వారు రచించారు. ఇది సంస్కృత భాషలో ఉంది. 

రెండవ, మూడవ తనియలు ఉయ్యకొండార్ స్వామి అన్నవారు రచించారు.  ఇవి రెండూ కూడ తమిళ భాషలో ఉన్నాయి.


తిరుప్పావై తనియలు

ఒకటవ తనియ 


నీళాతుంగస్తన గిరి తటీ సుప్త ముద్బోధ్య కృష్ణమ్ 
పారార్థ్యం స్వమ్ శృతి శత శిరః సిద్ధ మధ్యాపయన్తీ 
స్వోచ్చిష్టాయాం స్రజి నిగళితం యా బలాకృత్య భుంక్తే 
గోదా తస్యై నమ ఇదమిదమ్ భూయ ఏవాస్తు భూయః || 

అర్థము :-

నీళాదేవి యొక్క వక్షోజముల చెంత హాయిగా పడుకున్న శ్రీకృష్ణుని ఉద్దేశిస్తూ గోదాదేవి తన యొక్క పరతంత్రతను (అంటే తాను భవసాగరాన్ని ఈదటానికై అతని మీద ఆధారపడి ఉండుటను) వేదములు, తదితర శ్రుతుల నుండి వందల ప్రమాణములు వల్లెవేస్తూ నిర్ధారించి చెప్పి, తను స్వయముగా తన చేతులతో అల్లిన పూలమాలలతో ఆ కృష్ణుని బంధించి అనుభవించింది. అటువంటి గోదాదేవికి నేను పదే పదే నమస్కరిస్తున్నాను. 

రెండవ తనియ 


అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగర్కు 
పన్ను తిరుప్పావై పల్ పదియ మిన్నిశైయాల్ 
పాడికొడుత్తాళ్ ఆర్పామాలై పూమాలై 
శూడి కొడుత్తాలై శొల్లు || 

అర్థము :-

అన్నవయల్ అంటే (అణ్ణం + వయల్) హంసలు, మరియు పంట పొలాలు ఇవి పుష్కలంగా ఉన్న పుదువై (శ్రీవిల్లిపుత్తూర్) గ్రామంలో జన్మించిన గోదాదేవి (ఆమె దేవునితో కలిశాక ఆండాళ్ గా పేరు పొందింది) తను పదజాలములతో అల్లిన తిరుప్పావై పాశురాలను ఎంతో శ్రావ్యంగా పాడుతూ శ్రీకృష్ణునికి సమర్పించినది. అంతేకాక పుష్పాలతో మాలలు కట్టి తను ముందుగా ధరించి మంచిగా ఉన్నాయో లేదో పరీక్షించి ఆ తరువాత శ్రీకృష్ణునికి సమర్పించింది.    

మూడవ తనియ 


శూడి కొడుత్త శుడర్ కొడియే తొల్ పావై 
పాడి యరుళ వల్ల పల్వలై యాయ్ నాడినీ 
వేంగడవర్ కెన్న విది ఎన్ర ముమ్మాట్రం 
నాంగడవా వణ్ణ మే నల్గు || 

అర్థము :- 

ఆ విధముగా తను ధరించిన పుష్పమాలను అందించిన వారిలో ఆమెయే మొదటిది. అంతకు ముందు, తరువాత జరుగలేదు. 

కీర్తనలు పాడి ఆ దేవుని వరించిన ఓ దేవీ ! వెంకటేశ్వర స్వామి ( ఇక్కడ శ్రీ కృష్ణుడు వెంకటేశ్వర స్వామి ఒక్కరే అని భావించుకోవాలి) సన్నిధి నువ్వు ఏ విధముగా జేరుకున్నావో అదే విధంగా మమ్మల్ని కూడ ఆ స్వామి సన్నిధికి జేర్చుము తల్లీ !


ఈ మూడు తనియలూ కూడ తిరుప్పావై చదివేటప్పుడు తప్పనిసరిగా చదువుతూంటారు. 

ఏవిధముగా నైతే విష్ణు పూజ చేసే ముందు లక్ష్మీదేవిని కీర్తిస్తామో అల్లాగే తిరుప్పావై వ్రతము చేయునపుడు ముందుగా గోదాదేవిని స్తుతించి అప్పుడు పాశురములు చదివి, శ్రీ రంగనాథస్వామిని గోదాదేవులను పూజించాలి.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి