15, జనవరి 2025, బుధవారం

గోదాస్తుతి - కర్కటే పూర్వ ఫల్గుణ్యామ్ - Goda Stuti


"కర్కటే పూర్వ ఫల్గుణ్యామ్ " అన్న శ్లోకము ఆండాళ్ యొక్క తిరునక్షత్రము గురించి తెలియజేస్తూ శ్రీమాన్ వేదాంత దేశికులవారు (ఈయన వైష్ణవ ఆచార్యులలో ప్రముఖులు) అల్లిక చేసిన స్తోత్రము. ఈ శ్లోకాన్ని రోజూ పూజా సమయంలో వైష్ణవ భక్తులు చదువుకోవచ్చును. 

ఆండాళ్ శ్రీవిల్లిపుత్తూరులో దేవాలయము అర్చకులైన విష్ణుచిత్తుల వారికి తులసీ వనములో ఒక తులసి మొక్క దగ్గిర దొరికినది. ఆవిడ భూదేవి పుత్రిక అనీ, స్వయంగా భూదేవి అవతారమేనని అందరి నమ్మకము.  

లక్ష్మీదేవియే మరల విష్ణువును వివాహమాడి తరించాలనీ, అలాగే తన తోటివారికి  (తన భక్తులని మనము అనుకోవచ్చును) ఆయనను పొందే మార్గము చూపించాలనీ తనే గోదామాత గా ఉద్భవించిందనీ కూడ కొంతమంది భక్తుల నమ్మకము. 

ఇప్పుడు ఈ శ్లోకము దాని అర్థము ఇస్తున్నాను.     

గోదాదేవి తిరునక్షత్ర తనియ 


వేదాంత దేశికుల వారి కృతి : శ్లోకము -

కర్కటే పూర్వ ఫల్గుణ్యామ్ తులసీ కాన నోద్భవామ్ 
పాండ్యే విశ్వంభరామ్ గోదామ్ వందే శ్రీరంగ నాయకీమ్ ||   

అర్థము :-

కర్కట రాశి పూర్వఫల్గుణీ నక్షత్ర సమయము వేళ శ్రీ గోదాదేవి ఒక తులసీ వనములో మొక్క వద్ద ( ఆమె తండ్రి విష్ణుచిత్తుల వారు గోతులు తవ్వి గట్లు కడుతున్న సమయములో)  ఉద్భవించినది. 

ఆమె వెలిసిన ఆ ప్రదేశము శ్రీవిల్లిపుత్తూర్ గ్రామ దేవాలయ ప్రాంగణము. అది పాండ్య దేశము లోనిది. ఆమె లోకాన్ని ఉద్దరించడానికి పుటిన దేవేరి (విశ్వంభర) గోదాదేవి (గోతులు తీస్తుండగా పుట్టినది). అటువంటి పరమ పావని శ్రీ రంగనాయకిని నేను శరణు వేడుతున్నాను. 

శ్రీరంగము లోని శ్రీరంగనాథ స్వామిని ఆమె పరిణయమాడినది కనుక ఆమె శ్రీరంగనాయకిగా వెలిసినది.  

ఈ శ్లోకము ప్రతిరోజు పూజ మొదట్లో మాతాపితలను, గురువులను స్మరించిన పిమ్మట చదువుకోవచ్చును. లేదా పూజ ఆఖరి సమయంలో తిరుప్పావై తనియలు, తిరుప్పావై లోని సమర్పణ పాశురాలు 29, 30 చదివేశాక అయినా చదువవచ్చును. 

ఈ స్తోత్రము చదవగానే నీళా తుంగస్తన శ్లోకాన్ని కూడ చదువుతుంటారు.         

13, జనవరి 2025, సోమవారం

తిరుప్పావై - పాశురము 30 - వఙ్గ క్కడల్ కడైంద మాధవనై


 తిరుప్పావై 30వ పాశురము గోదాదేవి తన గురించి చెప్పుకుంటున్నట్లుగా రచింపబడినది. 

ఆమె ఆ వ్రతాన్ని ఏవిధముగా, ఎవరిద్వారా తెలుసుకుని చేసినదీ, తను చేసినట్లే అందరమూ చేసి ఆమె లాగ ఆ భగవంతుని కటాక్షము పొంది ఆయన సన్నిధికి చేరుకోవచ్చుననీ నొక్కి చెబుతోంది ఇందులోని పంక్తుల ద్వారా. 

తిరుప్పావై - పాశురము 30


వఙ్గ క్కడల్ కడైంద మాధవనై కేశవనై 
తింగళ్ తిరుముగత్తు చేయిళైయార్ శెన్ఱిరైంజి
అంగప్పఱై కొండ వార్తయ్ ఆణిపుదువై
ప్పైమ్ గమల తణ్ణీరియల్ పట్టర్ పిరాన్ కోదై శొన్న 
శంగత్తమిళ్ మాలై ముప్పదుమ్ తప్పామే 
ఇంగు ఇప్పరిశురై ప్పారీరిరండు మాల్వరైత్తోళ్ 
శెంగణ్ తిరుముగత్తు చ్చెల్వ త్తిరుమాలాల్ 
ఎంగుమ్ తిరువరుళ్ పెత్తు ఇంబురువర్ ఎమ్బావాయ్ ||  

అర్థము :-

క్షీర సాగర మథనము చేసినప్పుడు అందులో నుండి ఆవిర్భవించిన లక్ష్మీదేవిని పొంది (ఆమెను సతిగా ధరించి) మాధవుడుగా అయి,  అలాగే జటలతో కూడిన బ్రహ్మ, రుద్రుడు మొదలైన వారిని కూడ ధరించి కేశవుడుగా పేరొందిన ఆ నారాయణుడుని అలనాడు చంద్ర బింబము వంటి ముఖమండలముల తోనూ, దివ్యాభరణములతోను ప్రకాశించుచున్న గోపికలు చేరి ఏ విధముగా నైతే వ్రతమును చేసి తరించారో ఆ వార్తను (కథను) విని, ధరణిలో ముత్యము వంటి శ్రీవిల్లిపుత్తూరు గ్రామమునందు నివసిస్తున్న శీతలజల తామర పుష్పమాలికలు ధరించు బ్రహ్మణోత్తముడైన విష్ణుచిత్తుని ముద్దుల బిడ్డ గోదాదేవి అల్లిన ఈ సంఘ సాహిత్య తమిళ మాల లోని 30 పాశురములనూ ఆ శ్రీకృష్ణ పరమాత్మకే అర్పించి ధన్యురాలు అయినది. 

ఈ తమిళ మాల అయిన తిరుప్పావై లోని ముప్ఫయి పాశురములనూ తన లాగే ఎవరైతే క్రమము తప్పకుండా అనుసంధిస్తారో (అంటే శ్రద్దా భక్తులతో పఠించి ఆయనను ఆరాధిస్తారో) వారు కూడ ఇక్కడే ఈ జన్మ లోనే (ఆ రెండు రెళ్ళ) ఆ నాలుగు భుజములు కలిగిన లక్ష్మీనారాయణుని   కటాక్షమును పొంది ఆయన సన్నిధికి జేరుకుంటారు అని ఆండాళ్ ఆశీర్వదిస్తూ హామీ ఇచ్చినట్లుగా చెప్పబడినది.             

12, జనవరి 2025, ఆదివారం

తిరుప్పావై - పాశురము 29 - శిత్తుమ్ శిఱుకాలే వందు

 


తిరుప్పావై 29వ పాశురము శ్రీకృష్ణుని పట్ల సమర్పణా భావనముతో అల్లబడినది. వేకువజామునే వచ్చి ఆ స్వామిని లేపినందుకు గాను గోదాదేవి తన క్షమాపణలు చెప్పుకుంటూ తననూ, తన తోటివారినీ కూడ ఆయన రక్షించి తీరాలని పదే పదే మొర పెట్టుకోవడము జరిగింది ఈ పాశురము ద్వారా. 

అంతే కాకుండా మేము ఎల్లప్పటికీ నీతో పాటు ఉండి జన్మ జన్మలకీ నీకు సేవలు చేస్తూ ఆనందించేట్లా అనుగ్రహించమని కూడా ఆయనను వేడుకుంటోంది. 

   

తిరుప్పావై - పాశురము 29 - శిత్తుం శిఱుకాలే 


శిత్తుమ్ శిఱుకాలే వందు ఉన్నయ్ శేవిత్తు, ఉన్ 
పొత్తామరై యడియే పోత్తుమ్ పొరుళ్ కేళాయ్ 
పెత్తైమ్మేయిత్తుణ్ణుమ్ కులత్తిల్ పిఱన్దు, నీ 
కుత్తేవల్ ఎంగళై కొళ్ళామల్ పోగాదు ;
ఇత్తై పఱై కొళ్వాన్ అన్రుకాణ్; కోవిందా !
ఎత్తైక్కుమ్ ఏళేళు పిరవిక్కుమ్ ఉందన్నోడు 
ఉత్తో మేయావోమ్, ఉనక్కే నామాళ్చెయ్ వోమ్ 
మత్తైనం కామంగళ్ మాత్తేలో రెమ్బావాయ్ ||  

అర్థము :-

మిక్కిలి వేకువ ఝామునే లేచి వచ్చి నిన్ను సేవించి, నీ మంగళకరములైన పాదారవిందములకు మంగళాశాసనములు పాడుటయే మాకు ఆనందకరమైనది. 

ఓ శ్రీకృష్ణా ! నువ్వు శ్రేష్ఠుడవైనప్పటికీ, పశువులను మేపుకొనే అజ్ఞానులమైన మా గొల్ల కులము నందు పుట్టి మా జాతినీ, మా జన్మలనూ ధన్యము చేశావు. అందుచేత నువ్వు మమ్ములను తరింపజేయక తప్పదు.  

మేము అదేదో చిన్న పఱై అనే వాద్యానికోసము రాలేదు గోవిందా !

మేము ఎప్పటికీ, ఏడేడు జన్మలకీ నీతోనే ఉంటూ, నీతోనే మసలుచూ, నీకు సేవ చేయటం కోసమని వచ్చాము. మాకు ఇంక వేరే కోరికలు ఏవీ లేవు కృష్ణా !

కావున దయచేసి మమ్మల్ని ఆదుకుని ఉద్ధరించుము స్వామీ !                   

11, జనవరి 2025, శనివారం

తిరుప్పావై తనియలు - గోదాదేవి స్తోత్రాలు అర్థములతో సహా


తిరుప్పావై తనియలు అనేవి ధనుర్మాసములో గోదాదేవికి నమస్కరిస్తూ చదివే స్తోత్రాలు. వీటిని తిరుప్పావై పాశురములు చదివేముందు, మరల ఇంకోసారి చదివేశాక పఠిస్తారు. 

తనియ అంటే విడిగా ఉండేది. ఈ పదము తమిళ వ్యాకరణము లోనిది. "తని" మరియు "యాన్" అన్న రెండు పాదముల కలయిక. "తని' అంటే ప్రత్యేకమైనది. అంటే ఇది ముఖ్య గ్రంథము లేదా కృతులలోనిది కాకుండా విడిగా సృష్టించబడినది. 

దీనిని గ్రంథ కర్త అయినా రాసి ఉండవచ్చు లేదా తరువాతి వారు ఎవరైనా జత పరచి ఉండవచ్చును. 

గ్రంథకర్త సృష్టించి ఉంటే అది భగవంతునికి కానీ, లేదా తన గురువులకు కాని సంబంధించినది ఉంటుంది. 

వేరెవరైనా రాసి ఉంటే అది ఆ గ్రంథకర్తకి కృతజ్ఞతతో కానీ, లేదా భక్తి గౌరవములతో గాని సృష్టించినది అవుతుంది. 

సాధారణముగా ఈ తనియల ద్వారా ఇవి ఎవరికైతే అర్పిస్తున్నామో వారి జీవన సంబంధీ మరియు విశేష యోగ్యతల గురించి చర్చించడము, పొగడటము జరుగుతుంది. 

ఇప్పుడు తిరుప్పావై తనియల జోలికి వద్దాము. వీటిలో శ్రీకృష్ణుని మరియు గోదాదేవి చర్చలు జరిగాయి. 

మొదటి తనియ "నీళాతుంగస్తన" అన్నది పరాశర భట్టర్ వారు రచించారు. ఇది సంస్కృత భాషలో ఉంది. 

రెండవ, మూడవ తనియలు ఉయ్యకొండార్ స్వామి అన్నవారు రచించారు.  ఇవి రెండూ కూడ తమిళ భాషలో ఉన్నాయి.


తిరుప్పావై తనియలు

ఒకటవ తనియ 


నీళాతుంగస్తన గిరి తటీ సుప్త ముద్బోధ్య కృష్ణమ్ 
పారార్థ్యం స్వమ్ శృతి శత శిరః సిద్ధ మధ్యాపయన్తీ 
స్వోచ్చిష్టాయాం స్రజి నిగళితం యా బలాకృత్య భుంక్తే 
గోదా తస్యై నమ ఇదమిదమ్ భూయ ఏవాస్తు భూయః || 

అర్థము :-

నీళాదేవి యొక్క వక్షోజముల చెంత హాయిగా పడుకున్న శ్రీకృష్ణుని ఉద్దేశిస్తూ గోదాదేవి తన యొక్క పరతంత్రతను (అంటే తాను భవసాగరాన్ని ఈదటానికై అతని మీద ఆధారపడి ఉండుటను) వేదములు, తదితర శ్రుతుల నుండి వందల ప్రమాణములు వల్లెవేస్తూ నిర్ధారించి చెప్పి, తను స్వయముగా తన చేతులతో అల్లిన పూలమాలలతో ఆ కృష్ణుని బంధించి అనుభవించింది. అటువంటి గోదాదేవికి నేను పదే పదే నమస్కరిస్తున్నాను. 

రెండవ తనియ 


అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగర్కు 
పన్ను తిరుప్పావై పల్ పదియ మిన్నిశైయాల్ 
పాడికొడుత్తాళ్ ఆర్పామాలై పూమాలై 
శూడి కొడుత్తాలై శొల్లు || 

అర్థము :-

అన్నవయల్ అంటే (అణ్ణం + వయల్) హంసలు, మరియు పంట పొలాలు ఇవి పుష్కలంగా ఉన్న పుదువై (శ్రీవిల్లిపుత్తూర్) గ్రామంలో జన్మించిన గోదాదేవి (ఆమె దేవునితో కలిశాక ఆండాళ్ గా పేరు పొందింది) తను పదజాలములతో అల్లిన తిరుప్పావై పాశురాలను ఎంతో శ్రావ్యంగా పాడుతూ శ్రీకృష్ణునికి సమర్పించినది. అంతేకాక పుష్పాలతో మాలలు కట్టి తను ముందుగా ధరించి మంచిగా ఉన్నాయో లేదో పరీక్షించి ఆ తరువాత శ్రీకృష్ణునికి సమర్పించింది.    

మూడవ తనియ 


శూడి కొడుత్త శుడర్ కొడియే తొల్ పావై 
పాడి యరుళ వల్ల పల్వలై యాయ్ నాడినీ 
వేంగడవర్ కెన్న విది ఎన్ర ముమ్మాట్రం 
నాంగడవా వణ్ణ మే నల్గు || 

అర్థము :- 

ఆ విధముగా తను ధరించిన పుష్పమాలను అందించిన వారిలో ఆమెయే మొదటిది. అంతకు ముందు, తరువాత జరుగలేదు. 

కీర్తనలు పాడి ఆ దేవుని వరించిన ఓ దేవీ ! వెంకటేశ్వర స్వామి ( ఇక్కడ శ్రీ కృష్ణుడు వెంకటేశ్వర స్వామి ఒక్కరే అని భావించుకోవాలి) సన్నిధి నువ్వు ఏ విధముగా జేరుకున్నావో అదే విధంగా మమ్మల్ని కూడ ఆ స్వామి సన్నిధికి జేర్చుము తల్లీ !


ఈ మూడు తనియలూ కూడ తిరుప్పావై చదివేటప్పుడు తప్పనిసరిగా చదువుతూంటారు. 

ఏవిధముగా నైతే విష్ణు పూజ చేసే ముందు లక్ష్మీదేవిని కీర్తిస్తామో అల్లాగే తిరుప్పావై వ్రతము చేయునపుడు ముందుగా గోదాదేవిని స్తుతించి అప్పుడు పాశురములు చదివి, శ్రీ రంగనాథస్వామిని గోదాదేవులను పూజించాలి.   

తిరుప్పావై - పాశురము 28 - కఱవైగళ్ పిన్ శెన్ఱు


తిరుప్పావై 28వ పాశురములో గోదాదేవి తన అజ్ఞానతను (అంటే మన అందరి అజ్ఞానాన్ని) ఒప్పుకుంటూ, మేము బుద్ధి లేక అనేకమైన పిచ్చి పిచ్చి పనులు చెయ్యడం, మాట్లాడడము చేశాము. అందుకని నువ్వు కోపగించుకోక మమ్ములను క్షమించి, మాకు మేము అర్థించే పఱై అన్న బహుమానాన్ని ఇవ్వాలి. మాకు అన్ని కష్టాలు, దుఃఖాల నుండి విముక్తిని ప్రసాదించి, నీ సన్నిధికి జేర్చుకోవాలి అని వేడుకుంటోంది. 

తిరుప్పావై - 28వ పాశురము 


కఱవైగళ్ పిన్ శెన్ఱు కానమ్ శేరుందు ఉణ్బోమ్ 
అఱి వొన్రుమ్ ఇల్లాద ఆయ్ కులత్తు ఉన్దన్నై 
ప్పిఱవి పెరుందనై పుణ్ణియమ్ యాముడై యోమ్;
కుఱై ఒన్ఱు ఇల్లాద కోవిందా! ఉందన్నోడు 
ఉఱవేల్ నమక్కింగు ఒక్క ఒడియాదు;
అఱియాద పిళ్ళైగళోమ్; అన్బి నాల్ ఉన్దన్నై 
చ్చిఱుపేర్ అత్తనవుమ్ శీరి యరుళాదే 
ఇఱైవా ! నీ తారాయ్ పఱై ఏలో రెమ్బావాయ్ || 

అర్థము :-

పశువుల వెంటబడి అడవులకు పోతుంటాము. పిసరంత కూడ జ్ఞానము లేని గొల్లవారము. అటువంటి గొల్ల కులములో నువ్వు జన్మించుట వలన మా జన్మలు ధన్యమైనవి. 

నీ మూలాన మాకు ఎటువంటి కొరతలూ, ఇక్కట్లూ లేకుండా హాయిగా ఉన్నాము. 

ఇంక మన ఈ సంబంధము తెగగొట్టు కోవాలన్నా తెగేది కాదు. (ఈ జన్మ అంతా మన సంబంధము ఇంతే, ఇలాగే ఉంటుంది).   

అజ్ఞానులము. తెలివి, చదువు లేని మూర్ఖులము. అంతస్తుల తేడా తెలియని వారము. 

అందువలన నిన్ను మాలో ఒకడిగానే భావిస్తూ, ఎంతో ముద్దుగా చిన్న చిన్న పేర్లతో పిలిచేవాళ్ళము.           

కాబట్టి నువ్వు తప్పు పట్టుకుని మాపై కోపగించుకోక, ఓ స్వామీ! మాకు పఱై ప్రసాదించు. 

నీ సన్నిధిలోకి చేర్చుకుని మోక్షాన్ని ప్రసాదించు, తండ్రీ !    

10, జనవరి 2025, శుక్రవారం

తిరుప్పావై పాశురము 27 - కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా


 తిరుప్పావై 27వ పాశురములో గోదాదేవి, తన తక్కిన స్నేహితురాళ్ళతో కలిసి ఈ తిరుప్పావై వ్రతమును ఆచరించిన తరువాత వ్రత ఫలితముగా అందరూ కలిసి శ్రీకృష్ణునితో బాటు కూర్చుంది తృప్తిగా విందు భోజనము చేయాలనే కోరికను తెలియబరుస్తోంది. అలా జరిగే ఆ విందుభోజనాల గురించి ఊళ్ళో వారంతా (లోకులందరూ కూడ) గొప్పగా చెప్పుకునేట్లా ఉండాలని అంటుంది. 

తిరుప్పావై - పాశురము 27


కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా ! ఉన్దన్నై 
ప్పాడి పఱై కొండు యామ్ పెరు శమ్మానమ్
నాడు పుగళుమ్ పరిశినాల్ నన్ఱాగ 
చూడగమే, తోళ్ వళైయే, తోడే, శెవిఁ ప్పూవే, 
పాడగమే, యెన్ఱు అనైయ పల్ కలనుమ్ యామణి వోమ్, 
అడై యుడుప్పోమ్; అదన్ పిన్నే పాల్ శోరు 
మూడ, నెయ్ పెయుతు ముదన్ కై వళివార 
కూడి యిరుందు కుళిరిందు ఏలో రెమ్బావాయ్ || 

అర్థము :-

నీ ఉనికిని సహించలేని శత్రువుల నందరినీ జయించు కల్యాణ గుణములు, కీర్తి ప్రతిష్టలు కలిగిన ఓ గోవిందా ! నిన్ను స్తుతించి మేము పొందే పఱై అనే బహుమానము ఏవిధంగా ఉండాలో చెబుతున్నాము విను. 

నీ చేత మేము పొందే బహుమానము చాలా పెద్దది, గొప్పదై ఉండి దాన్ని గురించి లోకులందరూ కూడా ప్రశంసించే విధముగా ఉండాలి. 

చేతి కంకణములు, భుజములకు తొడుక్కునే కంకణములు, గాజులు, చెవులకి కర్ణాభరణములు, కర్ణ పుష్పములు, పాదాలకు తొడుక్కునే మువ్వలు, అందియలు (గజ్జెలు), ఇవే కాక ఇంకా మాకు తెలియని వస్తువులు, పలువిధములైన ఆభరణములు, ఇవన్నీ కూడ నువ్వు మాకు ధరింపజేయాలి. 

పట్టు వస్త్రములు కూడ (ఆడై ఉడుప్పోమ్) ధరిస్తాము.       

ఆ పిమ్మట నీతో కలసి కూర్చుండి క్షీరాన్నము విందు ఆరగించెదము. ఆ పాయసము ఎలా ఉండాలన్నది చెబుతా విను. అందులో బాగా నెయ్యి ఉండి పైకి తేలుతూ ఉండాలన్న మాట. అప్పుడు మేము ఆ పాయసము తింటుంటే నేతి ధారలు మోచేతి నుండి కారుతుండేలా ఉండాలన్న మాట. అటువంటి క్షీరాన్నము నీతో కలిసి ఆరగించాలి మేము. 

9, జనవరి 2025, గురువారం

తిరుప్పావై - పాశురము 26 - మాలే మణివణ్ణా మార్గళి నీరాడువాన్


తిరుప్పావై లోని 26వ పాశురము  ద్వారా గోదాదేవి ఈ తిరుప్పావై వ్రతము చెయ్యడానికి కావలసిన తదితర వస్తువులను వివరించి చెప్తోంది. మేము ఈ వ్రతాన్ని సంతుష్టితో మంచిగా జరుపుకోడానికి నువ్వు ఇవన్నీ కూడ మాకు అందజెయ్యాలని శ్రీకృష్ణుని వేడుకుంటోంది. ఇవన్నీ కూడ నువ్వు సులభముగా ఇవ్వగలిగినవే అని అతని ఔదార్యమునూ, వైభవమునూ చాటి చెప్తోంది. 

తిరుప్పావై - పాశురము 26


మాలే ! మణివణ్ణా ! మార్గళి నీరాడువాన్; 
మేలైయార్ శెయ్ వనగళ్ వేండువన, కేట్టియేల్!
జ్ఞాలత్తై యెల్లామ్ నడుంగ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్ పాంజశన్నియమే 
పోల్వన శఙ్గ్అంగళ్, పోయ్ ప్పాడుడైయనవే
శాల ప్పెరుంపఱైయే, పల్లాండి శైప్పారే,
కోల విళక్కే, కొడియే, వితానమే 
ఆలి నిలైయాయ్ అరుళే లో రెమ్బావాయ్ || 

అర్థము :-

ఆశ్రితుల యందు వ్యామోహము, ప్రేమ కలిగిన వాడా! ఇంద్రనీల మణి వర్ణము వంటి దేహ కాంతి గలవాడా! 

మేము మార్గ శీర్ష స్నానము ఆచరించ తలచాము. అందుకోసమై మాకు కావాల్సిన పరికరాలు ఉన్నాయి. నువ్వు దయచేసి వినేటట్లయితే తెలియజేస్తాము. 

ఈ భూమండలాన్ని అంతా వణకింపజేసే ధ్వని కలిగిన పాల రంగు లాంటి స్వచ్ఛమైన తెల్లదనముతో ప్రకాశించే నీ పాంచజన్యమును పోలిన శంఖములు కావాలి. 

మేము ఈ వ్రతము మంచిగా శాస్త్రోక్తముగా చేసుకోవడానికి ఇవన్నీ కూడ కావాలి.  

చాలా పెద్దదైన పఱై వాద్యములు కావాలి. పల్లాండు పాడేవారు కావాలి. మంగళకరమైన దీపములు కావాలి. ఒక గరుడ ధ్వజమూ, చాందినీలు కావాలి. 

ఇవన్నీ కూడా లోకాలన్నిటినీ పొట్టలో పెట్టుకుని అవలీలగా ఒక  వటపత్రముపై ఎంతో అద్భుతంగా పడుకున్న నీవంటి మహనీయునికి అందుబాటులో నున్నవే ! కాబట్టి అనుగ్రహింపుము ఓ స్వామీ !         

8, జనవరి 2025, బుధవారం

తిరుప్పావై పాశురము 25 ఒరుత్తి మగనాయ్ పిఱన్దు


తిరుప్పావై 25వ పాశురములో గోదాదేవి శ్రీకృష్ణునికి ఇద్దరు తల్లుల సౌభాగ్యము కలుగుట, మరియు అతను కంసుని వధించడము మున్నగు సాహస కార్యముల వర్ణన చేస్తూ అతనిని కీర్తించడము జరుగుతోంది. నీ కీర్తనలు చేసి పఱై పొందడానికి వచ్చామన్న సంగతి మరోసారి వక్కాణిస్తోంది. 

తిరుప్పావై - పాశురము 25


ఒరుత్తి మగనాయ్ పిఱన్దు, ఓరిరవిల్ 
ఒరుత్తి మగనాయ్  యొళిత్తు వళర,
తరిక్కిలా నాగిత్తాన్ తీంగు నినైంద 
కరుత్తై ప్పిళ్ళైపిత్తు కంజన్ వయిత్తిల్ 
నెరుప్పెన్న నిన్ఱ నెడుమాలే ! ఉన్నై 
ఆరుత్తిత్తు వన్దోమ్; పఱై తరుదియాగిల్,
తిరుత్తక్క శెల్వముమ్ శేవగముమ్ యాంపాడి 
వరుత్తముమ్ తీరున్దు మగిళిందే లో రెమ్బావాయ్ || 

అర్థము :-

ఒకరి కుమారుడవుగా పుట్టి, ఒక అర్థరాత్రిలో వేరింటికి చేరి అక్కడ వారి కుమారుడవుగా పెరిగావు అని కీర్తిస్తోంది గోదాదేవి. 

దేవకీదేవి శ్రీమన్నారాయణుని నువ్వు నాలుగు చేతులతో నీ దివ్యస్వరూపము, తేజస్సుతో నాకు కొడుకుగా పుట్టాలని ప్రార్థిస్తే సరే నని అలాగే ఆమె గర్భములోనికి ప్రవేశించి పుడతాడు ఆ భగవంతుడు. 

యశోదమ్మ కూడా భగవంతుణ్ణి వేడుకుంది ఆయన తనకు కొడుకుగా పుట్టి ఆయన లాలన, పాలనలు చేస్తూ ఆ సుఖాన్ని, సౌభాగ్యాన్ని అనుభవించేట్లా వరము ప్రసాదించమని. ఆమెకు కూడ తథాస్తు అని పలికాడు కనుక అక్కడ దేవకీ కోరిక తీర్చేశాడు కనుక ఆ రాత్రికి రాత్రే వసుదేవుని నెత్తిపై బుట్టలో యమునా నదిని దాటి యశోదమ్మ ఇంటికి జేరి ఆమె లాలన, పాలనలో పెరిగాడు. ఈ విధముగా ఇద్దరి కోరికలూ తీర్చి ఇద్దరికీ కుమారుడు అయ్యాడు. 

అలా నువ్వు యశోదమ్మ ఇంట్లో రహస్యముగా శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుతుంటే, నీ కోసమని గూఢచారులని పంపి వెతికిస్తున్న కంసుని రాక్షసులందరినీ చంపేస్తూ అతని ప్రయత్నాలన్నింటిని వృధా చేసి ఆ కంసుని పొట్టలో ఒక మండుతున్న నిప్పులాగ తయారయి అతన్ని క్షోభ పెట్టి సంహరించావు. 

ఓ కృష్ణా ! నువ్వు మాకు పఱై అన్న బహుమానాన్ని ఇస్తే ఇలాగే ఇంకా ఎన్నెన్నో అద్భుతమైన నీ లీలలను, వీరగాథలను లక్ష్మీదేవి కూడ విని ఆనందించే రీతిగా మేము గానమొనర్చుచూ ఇప్పటి వరకు పడ్డ వ్యథలన్నీ మరచిపోయి ధన్యులమౌతాము.        

7, జనవరి 2025, మంగళవారం

తిరుప్పావై - పాశురము 24 - అన్ఱి ఇవ్వులగం అళన్దాయ


 తిరుప్పావై 24వ పాశురము ద్వారా గోదాదేవి, నీళాదేవి, తదితరులంతా కలిసి శ్రీకృష్ణుని లీలలను, మహిమలను కీర్తించడం జరుగుతోంది. ఆనాడు ఆయన చేసిన ఘనకార్యముల మూలముగా ఆయన శరీరములోని అవయములన్నీ ఎంతో కందిపోయి బాధ పెట్టి ఉంటాయి కదా అని ఆ ఒక్కొక్క అంగములకూ, మరియు సంపూర్ణ దేహమునకూ అన్నివేళలా మంగళము అవుతుండు గాక అని మంగళాశాసనములు పలుకుతున్నారు. 

తిరుప్పావై - 24వ పాశురము 


 అన్ఱు ఇవ్వులగం అళన్దాయ్ ! అడి పోత్తి 
చ్చెన్ఱు అంగు తెన్నిలంగై శెత్తాయ్ ! తిఱల్ పోత్తి 
పొన్ఱ చ్చగడం ఉతైత్తాయ్ ! పుగళ్ పోత్తి 
కన్రు కుడిలా వెరిన్దాయ్ ! కడల్ పోత్తి 
కున్రు కుడైయా వెడుత్తాయ్ ! కుణమ్ పోత్తి 
వెన్ఱు పకై కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోత్తి 
ఎన్ఱేన్రు ఉన్ శేవగమే యేత్తి పఱై కొళ్వాన్ 
ఇన్ఱు యామ్ వందోమ్ ఇరంగే లో రెమ్బావాయ్ || 

అర్థము :-

పూర్వము బలి చక్రవర్తి దేవతల రాజ్యములను అపహరించగా వామనుడవై, మూడు అడుగులు వేసి భూమి, ఆకాశములను కొలిచి, మూడవ అడుగు కోసమని బలిచక్రవర్తి తలపై పాదాన్ని మోపి అతన్ని పాతాళములోనికి నెట్టేశావు. అట్టి నీ పాదములకు మంగళమగు గాక !

ఆనాడు సీతాదేవిని రావణుడు అపహరించగా లంకకు వెళ్లి రావణునితో బాటు లంకానగరాన్ని కూడా మట్టుబెట్టిన నీ బాహువులకు నేడు మంగళము అగు గాక !

అప్పుడెప్పుడో నీ బాల్యమందు నిన్ను చంపటానికి వచ్చి బండి చక్రములో ఆవహించి ఉన్న శకటాసురుని కీళ్లన్నీ ఊడేట్లా నీ కాలితో తాకి చంపావు ఎవరికీ తెలియకుండా. ఆ నీ కల్యాణ గుణములకు నేడు మంగళము అగు గాక !

అలాగే ఇంకో మారు నిన్ను చంపడానికి వచ్చిన ఇద్దరు రాక్షసులలో దూడ రూపములో ఉన్న వత్సాసురుని, వెలగ చెట్టు రూపములో దారికి అడ్డముగా నున్న కపిత్థాసురుని తన్ని చంపడానికి వంచిన నీ కాళ్ళకి నేడు మంగళమగు గాక ! 

ఒకపరి దేవేంద్రుడికి (తనకు పూజ చేయలేదని) నీపై, మరియు గోకులవాసులపై కోపము వచ్చి రాళ్ళ వర్షము కురిపించినప్పుడు, అందరినీ కాపాడుటకై గోవర్ధనగిరిని ఎత్తి గొడుగులా పట్టుకున్న నీ ఆశ్రితరక్షణ గుణసంపదకు మంగళమగు గాక !

శత్రువులను చీల్చి చెండాడే నీ చేతిలోని చక్రాయుధమునకు ఎప్పుడూ మంగళమగు గాక !

ఇలా నీ యొక్క ఎన్నెన్నో వీరగాధలను స్తుతించి నీ నుండి పఱై అనే బహుమానము తీసుకోడానికి మేమంతా ఈ రోజు ఇక్కడికి వచ్చాము. దయచేసి మేము కోరునది ఇచ్చి మమ్ములను ఉద్ధరించు ఓ స్వామీ ! 

       

6, జనవరి 2025, సోమవారం

తిరుప్పావై - పాశురము 23 - మారిమలై శీరియ సింగమ్


తిరుప్పావై 23వ పాశురములో గోదాదేవి శ్రీకృష్ణుని యొక్క హావభావాలు (వొళ్ళు విరుచుకొనుట, నడక మున్నగు వయ్యారములు, హుందాతనం) ఒక సింహముతో పోలుస్తూ ఆయనను కీర్తిస్తూ, ఆ రాజస కదలికలను మరల వీక్షించు మహాభాగ్యము ప్రసాదించమని వేడుకుంటోంది. 

తిరుప్పావై - పాశురము 23 - మారిమలై


మారిమలై ముదంగిల్ మన్ని కిడరఁడు ఉఱంగుమ్ 
శీరియ సింగమ్ అరువిత్తుత్తి విదుత్తు
వేరిమయిర్ ప్పొంగవెప్పాదుమ్ పేరఉందదరి 
మూరి నిమిర్ ఉందు మురంగుప్పఱ పట్టు  
పోదరుమా పోలే, నీ పూవై ప్పూవణ్ణా! ఉన్ 
కోయిల్ నిన్ఱు ; ఇంగనే పోందరుళి కోప్పుడైయ 
శీరియ శింగాసనత్తు ఇరుందు, యామ్ వంద 
కారియం ఆరాయిందు అరుళే లో రెమ్బావాయ్ || 

అర్థము :-

పర్వతము యొక్క గుహలోపల వర్షాకాలములో హాయిగా, నిశ్చలంగా ముడుచుకు పడుకుని నిద్రపోతున్న రాజసము ఉట్టిపడుతున్న సింహము మేలుకున్నాక తన తీక్షణములైన చూపులను నలువైపులా ప్రసరింపజేసి చూస్తుంది. ఆ తరువాత తన జూలు, వెంట్రుకలు నిక్కబొడుచుకునేట్లా అటు ఇటు పొర్లుతుంది. పిమ్మట ఒళ్ళు దులుపుకుంటూ నెమ్మదిగా లేచి తన శరీరాన్ని సాగదీసుకుంటుంది. ఒళ్ళు విరుచుకుంటూ బిగ్గరగా గర్జిస్తుంది. అప్పుడు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ గుహలోంచి బయటకు వస్తుంది. 

ఓ స్వామీ! కృష్ణా ! నువ్వు కూడా అదే విధముగా చెయ్యి. 

ఓ పూవణ్ణా ( పుష్పముల రంగు, ముఖ్యంగా అతసీ పుష్పము అనే) నీలి రంగు శరీరము కలవాడా! నువ్వు అలా ఆ సింహము లాగానే చేస్తూ నెమ్మదిగా అందమైన నడకలతో నీ గది నుండి బయటకి వచ్చి నీ రాజస సింహాసనమును జేరి దానిపై కూర్చుని శ్రద్ధతో మేము వచ్చిన కార్యము తిలకించి మమ్ములను అనుగ్రహించుము స్వామీ!

ఈ విధముగా శ్రీకృష్ణుని అర్థించి గోదాదేవి, తక్కినవారు ఆయనను గది నుండి బయటకు రప్పించి సింహాసనంపై కూర్చునేట్లా చేశారు.               

5, జనవరి 2025, ఆదివారం

తిరుప్పావై - పాశురము 22 - అంగణ్ మాణాలత్తర శర్

 తిరుప్పావై 22వ పాశురములో గోదాదేవి, తక్కినవారు తమ తమ స్త్రీత్త్వ సహజమైన అభిమానమును వదలి శ్రీకృష్ణుని జేరవచ్చినామని , తమపై ఆయన కారుణ్య కటాక్షములను ప్రసారించి తమను ఉద్ధరించమని వేడుకుంటున్నారు. అలా వేడుకుంటూ ఆయన వైభవాన్ని కూడ ప్రశంసించడము జరుగుతోంది.



 

తిరుప్పావై - 22వ పాశురము 


అంగణ్ మాజ్ఞా లత్తరశర్, అభిమాన 
బంగమాయ్ వందు, నిన్ పళ్ళిర్క్కట్టిర్ కీళే 
శంగమిరుప్పార్ పోల్ వందు, తలై ప్పెయ్దోమ్,
కింగిణి వాయ్ చ్చెయ్ద తామరై ప్పూ పోలే 
శెన్గణ్ శిరి చ్చిరిదే యెమ్మేల్ విళియావో !
తింగళుమ్ ఆదిత్తియనుమ్ ఎళుమ్దార్ పోల్ 
అంగ నిరండున్గొండు ఎంగళ్ మేల్ నోక్కుదియేల్ 
ఎంగళ్ మేల్ జాపమ్ ఇళందే లో రెమ్బావాయ్ || 


అర్థము :-  

ఈ అందమైన విశాలమైన భూమి అంతా తమదేనని విర్రవీగే రాజులందరూ కూడ నీకు లొంగిపోయి తమ తమ అభిమానమును విడిచి ఏ విధముగా నైతే నీ సేవ చేయుటకై సింహాసనము యొక్క కోళ్ళ దగ్గిర గుంపులుగా జేరి పడిగాపులు పడుతుంటారో అదే విధముగా మేము కూడ మా స్త్రీత్వ అభిమానములను విడిచి పెట్టి మాకు నీవే దిక్కని నిన్ను చేరుకొని తలలు వంచుకుని నీ కోసము ఎదురుచూస్తున్నాము. 

చిరు చిరు మువ్వలు నోరు తెరుచుకున్నట్లును, అప్పుడే వికసిస్తున్న ఎర్రని తామరపూవుల వలెనూ ఉన్నటువంటి నీ నేత్రములను ఒక్కసారిగా తెరిచెయ్యకుండా మెలిమెల్లిగా మేము ఓర్చుకోగలిగినట్లుగా నింపాదిగా తెరిచి నీ చూపులను మా వైపు ప్రసరింపజేయవా !

చంద్రుడు, సూర్యుడూ ఒక్కసారిగ ఉదయించిన తీరున నీ రెండు నేత్రముల నుండి శీతలత్వము, తేజస్సు కల కిరణములను మాపై ప్రసరింప జేసినచో మా మీది శాపాలన్నీ తొలగిపోయి మా జన్మలు తరిస్తాయి స్వామీ!                  

4, జనవరి 2025, శనివారం

తిరుప్పావై - పాశురము 21 - ఏత్త క్కళమ్గళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప

 తిరుప్పావై 21వ పాశురము ద్వారా గోదాదేవి శ్రీకృష్ణుని లేపుతూ అతని పశుసంపద, గుణసంపదలను పొగడము చేస్తోంది. నీళాదేవి, తక్కిన బాలికలందరూ కూడా ఈ మేలుకొలుపులు పాడుతున్నారు. ఆయన యొక్క వైభవము, ఔదార్యము, అర్త రక్షణా స్వభావము, మొదలగు గుణ సంపదలను కీర్తిస్తున్నారు. 



తిరుప్పావై - పాశురము 21


ఏత్త క్కళమ్గళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప 
మాత్తాదే పాల్ శొరియుమ్ వళ్ళల్ పెరుం పశుక్కల్ 
ఆత్తప్పడైత్తాన్ మగనే ! అఱివుఱాయ్ !
ఊత్తముడైయాయ్, పెరియాయ్, ఉలగినిల్ 
తోత్తమాయ్ నిన్ఱ శుడరే ! తుయిలెళాయ్ !
మాత్తార్ ఉనక్కు వలితు లైన్దు ఉన్ వాశర్కణ్ 
ఆత్తాతు వందు ఉన్నడి పడియుమా పోలే 
పోత్తి యామ్ వందోమ్, పుకళ్ న్దేలో రెమ్బావాయ్ || 


అర్థము :-

ఎత్తి పెట్టే కుండలు ఇంకా పెడుతుండగానే ఆగకుండా ఉప్పొంగిపోయి పొర్లి పోయే విధముగా ఎడతెరిపిగా పాల వర్షము కురిపించునటువంటి అనేకములైన పశు సమూహములతో కూడిన సంపదలున్న నందగోపుని ముద్దుల కొడుకైన శ్రీకృష్ణా 1 తెలివి తెచ్చుకో!

ఎంతో ఉత్తముడవై ఉండి (అంటే వేదాలలో, ఇతిహాసములలో పరమాత్మునిగా పేర్కొనబడిన వాడవై) , పరంబ్రహ్మ జ్యోతి స్వరూపుడవై, అంతకంతకూ ఎదిగిపోయి ముల్లోకాలనే కొలిచినవాడవై యుండి కూడ, మాకోసమని ఈ భువిలో మానవ మాత్రునిగా అవతరించావు. అట్టి మహానుభావా మేలుకో !

నిన్ను ఎదిరించలేక నీ బలము ముందు తమంతట తామే లొంగిపోయి వచ్చి నీ వాకిట పడిగాపులు పడుతూ ఉండే నీ శత్రులవలె మేము కూడ నీ మహనీయమగు గుణసంపదల ముందు పరాజితులమై అహంకారాన్ని విడిచి నీ వాకిటికి వచ్చాము నిన్ను కీర్తించి పాడుతూ తరించుటకోసమని. లేచి రా కృష్ణా!          

3, జనవరి 2025, శుక్రవారం

తిరుప్పావై - పాశురము 20 - ముప్పత్తు మూవరు అమరర్కు


 తిరుప్పావై 20వ పాశురములో ఆండాళ్ శ్రీకృష్ణ పరమాత్మకు మేలుకొలుపు పాడుతూ అతని సుగుణములను, ఔదార్యమును కీర్తించడం చేస్తూ, నీళాదేవిని కూడా ఇంకోమారు త్వరగా తను లేచి, శ్రీకృష్ణుడిని తయారు చేయమంటోంది.  విసనకర్ర, అద్దాలతో శ్రీకృష్ణుడిని తమకు స్నానాలు చేయించడానికి వెంటనే పంపించమనీ వేడుకుంటోంది.  

తిరుప్పావై - పాశురము 20


ముప్పత్తుమూవరు అమరర్కు మున్ శెన్ఱు 
కప్పం తవిర్క్కుమ్ కలియే! తుయిలెళాయ్ !
శెప్పముడైయాయ్ తిఱలుడై యాయ్ శెత్తార్క్కు
వెప్పమ్ కొడుక్కుమ్ విమలా! తుయిలెళాయ్ !  
శెప్పన్న మెన్ములై శెవ్వాయ్ శిరుమరుంగుల్
నప్పిన్నై నంగాయ్! తిరువే తుయిలెళాయ్ !
ఉక్కముమ్ తట్టొళియుమ్ తందు ఉన్ మణాళనై 
ఇప్పోదే యెమ్మై నీరాట్టేలో రెమ్బావాయ్ || 

అర్థము :-

ముప్పైమూడు కోట్లమంది దేవతలకూ ఆపదలు కలగడానికి ముందుగానే వెళ్లి యుద్ధ భూమిలో వారికి ముందు నిలబడి, శత్రువుల నుండి వారికున్న భయము, ఆపదలను తొలగించే పరాక్రమశాలీ! కరుణతో నిండిన సున్నితమైన హృదయము కలవాడా!  నిదుర లేచి రా !

ముందుగా హెచ్చరించకుండా, తెలియకుండా అకస్మాత్తుగా దాడి చేసే వారిని సైతం వారు ఇంకా  రంగములోకి ప్రవేశించుటకు ముందే వారిని ఎదిరించి, చీల్చి చెండాడే స్ఫూర్తి ఉన్నవాడా! శత్రువుల గుండెల్లో కంపనము పుట్టించువాడా ! నిదుర లే !

బంగారు భరిణల వంటి వక్షోజ సంపద మరియు దొండపళ్ల వంటి ఎర్రని అధరములతో కూడిన ఓ సుందరాంగి నీళాదేవీ ! పరిపూర్ణురాలా ! లక్ష్మీదేవితో సమానురాలా ! లేచి రావమ్మా !

ఒక విసనకర్రను, కంచు అద్దమును (శ్రీకృష్ణునికి గాలి వీచడానికి మరియు చెమటలు తుడుచుకునేటప్పుడు ముఖము సరిదిద్దుకోవడం కోసము) మా చేతికి ఇచ్చి, నీ స్వామిని ఇప్పుడే మాతో పంపించుము తల్లీ! 

ఈ విధంగా వేడుకోగానే నీళాదేవి తలుపు తీస్తుంది. వారు అడిగిన విసనకర్రని, అద్దాన్ని ఇస్తుంది. 

ఆ తరువాత ఆ బాలికలందరితో బాటు తాను కూడ శ్రీకృష్ణుడిని లేపటానికి పూనుకుంటుంది. 
    

2, జనవరి 2025, గురువారం

తిరుప్పావై - పాశురము 19 - కుత్తు విళక్కెరియ


తిరుప్పావై 19వ పాశురము ద్వారా గోదాదేవి హాయిగా నిద్రపోతున్న నీళాకృష్ణులను నిద్రలేపుతూ, నీళాదేవికి తత్త్వముల సారము గురించి జ్ఞాపకము చెయ్యడం జరుగుతోంది. 

నీళాదేవి గొప్ప భక్తురాలు, తత్త్వజ్ఞాని అయితే గోదాదేవి కూడ ఏమియు తక్కువ కాదు. శ్రీకృష్ణుడు ఒక్కరి సొత్తు కాదు. అందరికి చెందినవాడని తెలియజేసింది. 

తిరుప్పావై - పాశురము 19


కుత్తు విళక్కెరియ కోట్టుక్కాల్ కట్టిల్ మేల్,
మెత్తెన్ర పంజశయనత్తిన్ మేలేఱి ,
కొత్తలర్ పూంగళల్ నప్పిన్నై కొంగై మేల్ 
వైత్తుక్కిడంద మలర్మార్ బా! వాయ్ తిఱవాయ్ ;
మైత్తడన్ కణ్ణినాయ్ ! నీ యున్ మణాళనై 
ఎత్తనై పోదుమ్ తుయిలెళ వోట్టాయ్ గాణ్ 
ఎత్తనై యేలుమ్ పిరివాత్త గిల్లాయాల్ 
తత్తువమందు తగవే లో రెమ్బావాయ్ || 

అర్థము :- 

చుట్టూ దేదీప్యమానమైన గుత్తిదీపాలు వెలుగుతుండగా, ఏనుగు దంతములచే చేయబడిన  గట్టివైన కాళ్ళు కలిగిన మంచము పై మెత్తయిన ఐదు సులక్షణములు (మృదుత్వము, చల్లదనము, సుగంధము, తెల్లదనము, ఎత్తు విశాలములు) గల శయ్య మీద కొత్తగా విచ్చుకున్న మృదువైన పువ్వులు తలలో ధరించిన నీళాదేవి యొక్క వక్షస్థలము పై తల పెట్టుకుని పడుకున్న ఓ స్వామీ! నోరు తెరచి కాస్తైనా మాటాడవా?

కాటుక పెట్టుకున్న కన్నులదానా ! నువ్వు నీ భర్తను ఎంతసేపని అలా నీ ప్రేమ పారవశ్యముల పాశములతో బంధించి లేవనీయకుండా ఉంచుకుంటావు? కొన్ని క్షణములకైననూ అతనిని విడిచి పెట్టలేవా ? 

ఏమ్మా! నువ్వు తత్త్వాలన్నీ ఎరిగిన దానివి కదా ! మరి ఏ తత్త్వమందైనా ఇలా చేయడం న్యాయమని ఉందా! నువ్వే చెప్పు తల్లీ!        

ఈ విధంగా తత్త్వజ్ఞానాన్ని నీళాదేవికి జ్ఞాపకము చేసింది గోదాదేవి. అప్పుడు నీళ మేలుకుంటుంది. 

1, జనవరి 2025, బుధవారం

తిరుప్పావై - పాశురము 18 - ఉన్డు మదగళిత్త నోడాద


తిరుప్పావై 18వ పాశురము లో గోదాదేవి నప్పిన్న పిరాట్టి (నీళాదేవి)ని నిద్రలేపడము తెలియజేస్తోంది.

నీళాదేవి నందగోపుని మేనకోడలు (చెల్లెలి కూతురు).  

నందగోపుడు, యశోదలు లేచారు కాని శ్రీకృష్ణుడు ఇంకా లేవలేదు. అతను నీళాదేవి యొక్క భక్తి మరియు ప్రేమ అనే పాశముల ద్వారా బంధింపబడి ఉంటాడు కనుక ముందుగా నీళాదేవిని లేపడమే సరైన ఉపాయమని తలచి, గోదాదేవి తక్కిన బాలికలతో సహా నీళాదేవిని కీర్తించి లేపటానికి  ప్రయత్నము చేయడము మొదలు పెడతారు.



 

తిరుప్పావై - పాశురము 18


ఉన్డు మదగళిత్త నోడాద తోళ్ వలియన్ 
నందగోపాలన్ మరుమగళే, నప్పిన్నాయ్!
కన్దమ్ కమదుమ్ కుళలీ! కడై తిఱవాయ్; 
వందు ఎంగుమ్ కోళి యనైత్తనకాణ్, మాదవి 
ప్పందల్ మేల్, పల్ కాల్ కుయిలినంగళ్ కూవినకాణ్, 
పన్దార్ విరలి! ఉన్ మైత్తునన్ పేర్ పాడ 
శెన్దామరై క్కైయాల్ శీరార్ వళైయొళిప్ప 
వందు తిఱవాయ్ మగిళిందు ఏలో రెమ్బావాయ్ || 

అర్థము :-

మదించినటువంటి అనేకములైన గజములతో యుద్హమొనర్చిననూ ఓడకుండునటువంటి భుజబలములు కలిగిన వాడును, మదజలములు స్రవించే అనేక గజముల సమూహములు కలవాడునూ అయినట్టి నందగోపాలుని కోడలా! నప్పిన్నా! సుగంధముల పరిమళములతో సువాసనలు వెదజల్లు కుంతలములు (వెంట్రుకలు) కలదానా! తలుపు గడియ తెరువుమా!

అన్నివైపుల నుండి కోళ్లు వచ్చి అరుస్తున్నాయి (తెల్లవారిందని సూచనగా). 

మాధవీలత పందిరిపై నుండి గుంపులు గుంపులుగా కూర్చున్న కోకిలలు అదేపనిగా కూస్తున్నాయి. అవి కూడ తెల్లవారిన దనటానికి సూచనలే. లేచి చూడు. 

బంతుల వంటి వేళ్ళు కలదానా! నీ మేనత్త కొడుకైన శ్రీకృష్ణుని కీర్తించుటకై మేమంతా వచ్చాము. ఎఱ్ఱ తామరలవంటి అందమైన, మృదువైన నీ చేతులకున్న దివ్యంగా ప్రకాశిస్తున్న గాజులు గట్టిగా ధ్వని చేయుచుండగా ముదముతో వచ్చి తలుపులు తీయుమా! మేము అడుగుతున్నాము అని కాకుండా నీ అంతట నువ్వే నీ బావను కీర్తిస్తున్నామనే సంతోషంతో వచ్చి తీస్తున్నట్లుగా తియ్యవలెను.  

ఈ విధంగా నీళాదేవిని పొగడుతూ, బతిమాలుతూ లేపడం జరిగింది.