"శ్రీ వెంకటేశ్వర ప్రపత్తి" సుప్రభాతం లోని మూడవ అధ్యాయము.
సాధారణముగా మనము ప్రతిరోజూ పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్తోత్రము మాత్రమే చదివి పూజ చేసుకుంటూ ఉంటాము.
మొత్తం సుప్రభాతం చదవాలంటే 20 నిమిషాల కంటే ఎక్కువ సమయం పడుతుంది.
ఎందుకంటే అందులో 4 అధ్యాయాలు ఉన్నాయి కనుక.
మొదటి అధ్యాయం వేంకటేశ్వరుని మేలుకొలుపు (సుప్రభాత శ్లోకాలు), రెండవది స్తోత్రము, మూడవది వెంకటేశ్వర ప్రపత్తి (అంటే శరణాగతి శ్లోకాలు), నాలుగవది మంగళాశాసనము.
ఇప్పుడు నేను ప్రపత్తి శ్లోకాలు వాటి అర్థాలతో సహా వివరిస్తున్నాను. ఈ స్తోత్రాల ద్వారా మనము భగవంతుని సన్నిధి కోరుతూ శరణు వేడుకుంటున్నాము.
మొదటి శ్లోకములో ముందుగా అమ్మని (అంటే పద్మావతి/లక్ష్మీదేవి) శరణు వేడుకుని ఆ పిమ్మట వేంకటేశ్వరునితో సహా వేడుకుంటున్నాము.
వెంకటేశ్వర ప్రపత్తి
ఈశానామ్ జగదోస్య వేంకటపతేర్ విష్ణో పరాం ప్రేయసీమ్
తద్ వక్షస్థల నిత్యవాస రసికామ్ తక్షాన్తి సంవర్ధినీమ్
పద్మాలంకృత పాణి పల్లవ యుగాం పద్మాసనస్థామ్ శ్రియమ్
వాత్సల్యాది గుణోజ్జ్వలామ్ భగవతీమ్ వన్డే జగన్మాతరమ్ || (1)
అర్థము :-
ఈ సమస్త విశ్వానికీ ప్రభువైన వేంకటేశ్వరస్వామి అని పిలువబడే విష్ణుమూర్తి యొక్క ప్రియురాలివై ఆయన వక్షస్థలములో ఎల్లప్పుడూ నివాసముంటూ, అతని పొందును అనుభవిస్తూ, ఆయన తేజస్సును, కీర్తిని ప్రకాశింపజేస్తూ, పద్మముల చేత అలంకరింపబడిన చేతులు, పాదములతో పద్మాసనంలో (పద్మములో) కూర్చున్న తల్లీ, భక్తుల పట్ల వాత్సల్యము, అనురాగము, వంటి సహృదయ గుణములు కలిగిన ఓ భగవతీ, లోకాల తల్లీ, నీకు దాసోహములు.
శ్రీమన్! కృపాజలనిధే, కృత సర్వలోక
సర్వజ్ఞ! భక్త నతవత్సల, సర్వశేషిన్
స్వామిన్! సుశీల సులభాశ్రిత పారిజాత
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || (2)
అర్థము :-
స్వామీ, ఓ దయాసాగరమా! సమస్త లోకముల సృష్టికర్తా! సమస్తము (భక్తుల మనస్సు) ఎరిగిన దేవా! భక్తులందు ప్రేమాభిమానములు కల స్వామీ, అంతటా నిండి ఉన్న స్వామీ, సద్గుణములు కలవారికి సులభంగా లభ్యమయ్యే పారిజాత వృక్షము వంటి శ్రీవెంకటేశ్వరుని పాదపద్మములనే శరణు వేడుతున్నాను.
ఆ నూపురార్చిత సుజాత సుగంధి పుష్ప
సౌరభ్య సౌరభకరౌ సమ సన్నివేశౌ
సౌమ్యో సదానుభవనేపి నవాను భావ్యౌ
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || (3)
అర్థము :-
నూపురములతో సహా (లేదా శిరస్సు మొదలు కాలి ఉంగరముల దాకా) పుష్పములతో, సుగంధ ద్రవ్యములతో అర్చింపబడుతూ, భక్తులచే సదా అనుభవింపబడుతూ ఉన్నప్పటికీ, తనివి తీరక ఎప్పటికప్పుడే కొత్తగా అనిపించి అనుభవింపబడే శ్రీ వేంకటేశ్వరుని పాదములను శరణు వేడుతున్నాను.
సద్యో వికాసి సముదిత్వర సాంద్రరాగ
సౌరభ్య నిర్భర సరోరుహ సామ్యవార్తామ్
సమ్యక్షు సాహస పదేషు విలేఖయంతౌ
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || (4)
అర్థము :-
ఆ పాదములు ఎవైతే తామర కలువల కంటే ఎక్కువ అందమైన అరుణ కాంతులతో నా మనస్సుని ఉర్రూతలూగిస్తూ నన్ను వశపరచుకుని తనవైపుకు తొందరగా రమ్మని లాగుతున్నాయో (బహుశా నేను ఇలా ఆయన పాదపద్మములను తామరలతో పోల్చడం సాహస కార్యము అవుతుందేమో ఎందుకంటే ఆయన పాదాల ముందు అవేమీ లెఖ్ఖలోకి రావు) అటువంటి శ్రీ వేంకటేశ్వరుని పాదముల నేను శరణు వేడుతున్నాను.
రేఖామయధ్వజ సుధాకల శాతపత్ర
వజ్రామ్ కుశామ్బురుహ కల్పక శంఖ చక్రై హ్
భవ్యైర్అలంకృత తలౌ పరతత్త్వ చిహ్నైహ్
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || (5)
అర్థము :-
ఏ పాదాల అరికాళ్ళు అందమైన రేఖలతో ధ్వజము, అమృతకలశము, ఛత్రము, వజ్రము, అంకుశము, పద్మము, కల్పకవృక్షము, శంఖః చక్రములు, మొదలైన దివ్యమైన చిహ్నములతో అలంకరింపబడి ఉన్నాయో ఆ శ్రీ వేంకటేశ్వరుని పాదముల నేను శరణు వేడుతున్నాను.
తామ్రోదర ద్యుతి పరాజిత పద్మ రాగౌ
బాహ్యైర్ మహోభి రభూత మహేంద్రనీలౌ
ఉద్యన్నఖాంశుభి రుదస్త శశాంక భాసౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || (6)
అర్థము :-
ఎవరి ఉదరము తామ్ర వర్ణము (రాగి బిందెల రంగు)తో ఉజ్జ్వలముగా ప్రకాశిస్తూ పద్మముల మరియు కెంపుల కాంతిని ఓటమిపాలు చేస్తున్నాయో, ఎవరి భుజముల కాంతి అతి దివ్య తేజస్సుతో మెరుస్తూ ఇంద్ర నీలమణుల కాంతిని కూడ మాపు చేస్తున్నాయో, ఎవరి కాలి గోళ్ళ వెలుగు చంద్రుని వెలుగును కూడ కించ పరుస్తున్నాయో శ్రీ వేంకటేశ్వరుని పాదముల నేను శరణు వేడుతున్నాను.
సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం
సంవాహనేపి సపది క్లమ మాధధానౌ
కాంతావ వాఙ్గ్మానస గోచర సౌకుమారయౌ
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || (7)
అర్థము :-
ఎంతో ప్రేమ, ఆదుర్దాలతో లక్ష్మీదేవి తన మృదువైన చేతులతో ఆ పాదములను పిసుకుతున్నప్పటికీ అలసట, చంచలత్వము (భక్తులకి ఇంకా ఎంతో చెయ్యాలి అనే తపన) తీరని ఆ పాదముల అందచందాలు స్త్రీల పాదాల కన్నా ఆకర్షణీయత కలిగి మాటలతో కాని ఊహలలో కానీ వర్ణించడానికి సాటి దొరకని ఆ దివ్యమైన శ్రీ వేంకటేశ్వరుని పాదముల నేను శరణు వేడుతున్నాను.
లక్ష్మీ మహీ తదనురూప నిజానుభావ
నీళాది దివ్యమహిషీ కరపల్లవా నామ్
ఆరుణ్య సంక్రమణతః కిల సాంద్ర రాగౌ
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || (8)
అర్థము :-
లక్ష్మీదేవి, భూదేవి, వారితో సమానంగా నీళాదేవి మొదలగు అనేక దివ్య మాతలు తమ మృదువైన చేతులతో మీ పాదముల తాకుతున్నప్పటికీ మీ పాదములు వారి చేతులయొక్క ఎరుపు రంగంతా ఎక్కిపోయిందా అన్నట్లుగా కందిపోయిన శ్రీ వేంకటేశ్వరుని పాదముల నేను శరణు వేడుతున్నాను.
నిత్యా నమద్విధి శివాది కిరీట కోటి
ప్రత్యుప్త దీప్త నవరత్న మహ ప్రరోహైహ్
నీరాజనా విధి ముదార ముపాద ధానౌ
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || (9)
అర్థము :-
నిత్యమూ నమస్సులు సమర్పించుకునే బ్రహ్మ, శివుడు మొదలైన ప్రముఖుల కిరీటములలో పొదగబడిన మరియు ఉజ్జ్వలంగా ప్రకాశించే మేలిమి నవరత్నముల కిరణముల కాంతి నీరాజనం పట్టుతున్నదా అన్నట్లు ఉండే ఆ శ్రీ వేంకటేశ్వరుని పాదముల నే శరణు వేడుతున్నాను.
"విష్ణో పదే పరమ" ఇత్యుదిత ప్రశంసౌ
యౌ "మధ్వ ఉత్స" ఇతి భోగ్య తయా ప్యుపాత్తౌ
భూయస్తధేతి తవ పాణి తలౌ ప్రతిష్ఠౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || (10)
అర్థము :-
"విష్ణో పదే పరమ " (విష్ణు మూర్తి పాదములే పరం బ్రహ్మ) అని వేదములలో ప్రశంసించబడాయి. అలాగే మధ్వ ఉత్స (తేనెల జల్లు లాంటి మధురమైనవి ) అని అనుభవముల ద్వారా ప్రతిపాదించ బడినవి. అదే వాస్తవము అని మరల మీ చేతి సంజ్ఞ ద్వారా కూడ తెలియజేయబడుతున్నవి. (అభయముద్రలో ఒక చేయి పాదముల వైపు చూపిస్తూ ఉంటుంది). అటువంటి శ్రీ వేంకటేశ్వరుని పాదముల నేను శరణు వేడుతున్నాను.
పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ
యౌ దర్శితౌ స్వచరణౌ శరణం ప్రజేతి
భూయోపి మహ్య మిహతౌ కరదర్శి తౌ తే
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || (11)
అర్థము :-
అర్జుని వంటి పరాక్రమ వీరునికి నీవు స్వయంగా సారధివై నీ పాదముల శరణు కోరమని తెలియజేశావు భగవద్గిత ద్వారా. అదే మళ్లీ ఇప్పుడు నీ చేతి సంజ్ఞ ద్వారా కూడ చూపిస్తూ తెలియజేస్తున్నావు. అటువంటి నీ పాదములనే నేను శరణు వేడుతున్నాను.
మన్మూర్ధ్ని కాళీయ ఫణే వికటాటవీషు
శ్రీ వేంకటాద్రి శిఖరే శిరసి శ్రుతీనాం
చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || (12)
అర్థము :-
నా శిరము పై , కాళీయుని పడగపై, భయంకరమైన అడవి యందు, వేంకటాచల శిఖరముపై, వేదాల సారమైన ఉపనిషత్తులందును, మనస్సులో వేరే ఆలోచనలు లేక నిన్నే స్మరించువారియందును, అంతటా సమాన భావమును కలిగి ఉంటావు. అటువంటి నీ పాదములనే నేను శరణు వేడుతున్నాను.
అమ్లాన హృష్య దవనీతల కీర్ణపుష్పౌ
శ్రీ వేంకటాద్రి శిఖరాభరణాయమానౌ
ఆనందితాఖిల మనో నయనౌ తవైతౌ
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || (13)
అర్థము :-
ఏ పాదముల చెంత చుట్టూ వెదజల్లబడిన పుష్పముల తాజాతనము సమసిపోకుండా, ఎండిపోకుండా, అప్పుడే జల్లిన వాటివలె ఉంటాయో, ఏ పాదములు వెంకటాచల శిఖరానికి ఆభరణముల వంటివో, వేటి దర్శన భాగ్యము మనస్సుకి తనివితీరని ఆనందాన్ని కలిగిస్తాయో ఆ శ్రీవేంకటేశ్వరుని పాదములనే నేను శరణు వేడుతున్నాను.
ప్రాయహ్ ప్రపన్న జనతా ప్రథమావ గాహ్యౌ
మాతుఃహ్ స్తనా వివ శిశో రమృతాయమానౌ
ప్రాప్తౌ పరస్పర తులా మతులాంతరౌతే
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || (14)
అర్థము :-
నిన్ను దర్శించుకునే వారు ముందుగా నీ పాదముల దర్శనమే కోరుకుంటారు. ఏ విధంగా అయితే తల్లి పొందు చంటి బిడ్డలకు అమృతాన్ని అందిస్తుందో అలాగే నీ పాదముల పొందు భక్తులకు ఎనలేని తృప్తిని ఇస్తాయి. ఈ రెండు ఒకదానికి ఒకటి ఉపమానముగా చెప్పుకోవచ్చును. రెండిటిలో ఏదీ తక్కువైనది కాదు. అటువంటి శ్రీవేంకటేశ్వరుని పాదములనే నేను శరణు వేడుతున్నాను.
సత్త్వోత్తరై స్సతత సేవ్య పదాంబుజేన
సంసార తారక దయార్ద్ర దృగంచలేన
సౌమ్యోపయంత్రు మునినా మమ దర్శితౌతే
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || (15)
అర్థము :-
మీ పాదములు నాకు శ్రీ మనవాళ మహాముని ద్వారా చూపించబడినవి ( ఏ మహానుభావుని భావుని పాదములను పుణ్యపురుషులందరూ సేవిస్తుంటారో, మరియు ఎవరి చల్లని, దయతో కూడిన చూపులు అందరికీ సంసార సాగరమునుండి ముక్తిని పొందే మార్గాన్ని చూపిస్తాయో ఆ మహాపురుషుడు నాకు మీ పాదములను చూపించారు). కాబట్టి నేను అటువంటి శ్రీవేంకటేశ్వరుని పాదములనే శరణు వేడుతున్నాను.
శ్రీశ శ్రియా ఘటికయా త్వదుపాయ భావే
ప్రాప్యే త్వయి స్వయ ముపేతయా స్ఫురంత్యా
నిత్యాశ్రితాయ నిరవద్య గుణాయ తుభ్యమ్
స్యాం కింకరో వృషగిరీశ న జాతుమహ్యమ్ || (16)
అర్థము :-
ఓ శ్రీ వెంకటేశ్వరా ! ముక్తికి మార్గము మీరు ఉపాయము అయితే అటువంటి ఉపాయాన్ని లక్ష్మీదేవి మాకు అందిస్తుంది (అందుకే ముందుగా లక్ష్మిని పూజించి విష్ణువుని పూజిస్తుంటాము). అలాగే మీ సాన్నిధ్యాన్ని మేము పొందితే అదికూడా లక్ష్మీదేవి అందిస్తోంది. ఎందుకంటే ఆవిడ మీ దగ్గిరే ఉంటుంది ఎల్లవేళలా. అందుకని మేము కూడా ఎల్లవేళలా మీ శరణులోనే ఉండాలని కోరుకుంటున్నాను. అంతకంటే ఎవరినీ మేము ఎరగము. మీకే సమర్పించుకుంటున్నాను మీ దాసునిగా నన్ను నేను.
ఓం ఇతిః శ్రీవేంకటేశ్వర ప్రపత్తి సంపూర్ణమ్ ||
ఓం నమో శ్రీ పద్మావతీ శ్రీనివాసాయ నమః ||