తిరుప్పావై అనేది ఒక వ్రతము పేరు. తిరు అంటే "శ్రీ" అని అర్థము. అలాగే పావై అంటే "వ్రతము" అని అర్థము.
పూర్వము రేపల్లె లో కరువు, మరియు వ్యాధులు సంభవించి ప్రజలందరూ అల్లల్లాడిపోతుంటే వారి రక్షణ కోసము, వానలు పడి మరల పంటలు పండి అందరూ ఆరోగ్య సంపదలతో ఆనందంగా ఉండటం కోసమని శ్రీకృష్ణ పరమాత్మ సలహా ననుసరించి పెళ్లికాని గోపబాలికలు ఒక వ్రతము చేస్తారు. అప్పుడు ఆ ఊరు మళ్ళీ సస్యశ్యామలంగా అవుతుంది.
గోదాదేవి అని ఒక వైష్ణవ భక్తురాలు ఈ వ్రతము గురించి తండ్రిద్వారా విని తను కూడ ఈ వ్రతాన్ని చేసి శ్రీకృష్ణుని సాన్నిధ్యము జేరాలని అనుకుంటుంది. ఆ పరమాత్మను పెళ్లి చేసుకోవడమే కాక మిగతా ప్రజలందరికీ మార్గదర్శకంగా ఉండటం కోసమని ఆమె 30 పాశురములను (అంటే స్తోత్రాలవంటివి) తయారుచేసి ఆ వ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలో, దాని ఉద్దేశము మరియు ఫలితములు ఏంటో తెలియజేసింది. ఈ 30 పాశురముల కూర్పే తిరుప్పావై అని ప్రసిద్హి చెందింది.
తిరుప్పావై వ్రతము చేయు విధానము
ఈ వ్రతాన్నిగోదాదేవి తమిళ మాసము మార్గళి అంటే మన ధనుర్మాసములో చేసింది. అంటే ధనుర్రాశి మొదటి దినము నుండి మళ్ళీ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజు దాకా అన్నమాట. ఈ నెల మనకి సాధారణముగా డిసెంబర్ 16 నుండి జనవరి 14 దాకా అవుతుంది. లీప్ ఇయర్ ఉన్నప్పుడు కాస్త ఒక రోజు తేడా ఉండవచ్చును. ఈ సమయంలో రోజుకి ఒక పాశురము చొప్పున మొత్తం 30 రోజుల్లో 30 పాశురాలు చదివి పూజ చేసుకోవాలి.
రోజూ పూజ చేసుకునే వారు పూజ ఆఖరులో ఇవి చదివి చేసుకోవచ్చును. నేను అలాగే మొత్తం రోజూ చేసే పూజలో అన్నీ అయ్యాక ఆఖరున ఈ క్రింద చెప్పిన విధంగా చదువుకుని అప్పుడు ఆరగింపు పెడుతుంటాను. ఎందుకంటే ఇందులో సమర్పణ శ్లోకాలు, స్తోత్రాలు ఉన్నాయి కనుక.
తిరుప్పావై పాశురము చదివే ముందు మూడు తనియలు ఉంటాయి. అవి నీళా తుంగస్తన ... , అన్నవయల్ పుదువై ... , మరియు శూడి కొడుత్త శుదర్కుడియే అన్నవి.
పైన పేర్కొన్న మూడు తనియలు ఇక్కడ క్లిక్ చేసి చదువగలరు.
అల్లాగే పాశురము చదివాక ఇంకో రెండు సమర్పణ శ్లోకాలు (తిరుప్పావై లోని 29, 30 పాశురాలు) చదివి ఆ తరువాత కర్కటే పూర్వ ఫల్గున్యాం అన్న శ్లోకము, మరల నీళా తుంగ ... అన్న శ్లోకము చదవాలి. అప్పుడు దేవునికి ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తాము. ఆ తరువాత రోజూలాగే మంగళహారతి ఇస్తాము.
తిరుప్పావై ముఖ్యాంశాలు
పూర్వం గోకులంలో గోపికలు కృష్ణుడితో కూడి చేసిన ఈ వ్రతాన్ని గురించి విన్న గోదాదేవి తను ఆ వ్రతం ద్వారా కృష్ణుని వివాహమాడాలనే కోరికను తీర్చుకోడానికి పూనుకుని తనతో బాటు మిగతా కన్యలకు కూడ మంచి జరగాలనుకుంటూ తిరుప్పావై వ్రతాన్ని మొదలెట్టింది.
ముందుగా ఊరిలో అందరికీ ఈ వ్రతము గురించి, అది ఏ విధంగా చెయ్యాలి అనే దాన్ని గురించి మొదటి 5 పాశురాల ద్వారా తెలియజేస్తుంది.
తెల్లవారక ముందే లేచి స్నానం చెయ్యాలి, శుభ్రమైన వస్త్రాలు దాల్చాలి, ఆడంబరంగా అలంకరించు కోకుండా సాదాగా ఉండాలనీ, గోల చెయ్యకూడదని, వీలైనంత మౌనంగా ఉండి, కృష్ణుని ధ్యానిస్తూ ఆయన కీర్తనలు పాడాలని తెలియజేస్తుంది.
6వ పాశురము నుండి 15వ పాశురాలలో గోపికలని లేపడం చేస్తుంది. ఒక్కొక్క పాశురంలో ఒక్కొక్క గోపిక విశేషతని చెబుతూ ఒక్కొక్కదాన్ని లేపుతుంది. అలా లేపుతున్నప్పుడు చుట్టుపక్కల దృశ్యాలన్నిటిని వర్ణిస్తూ లేపడం చేసింది. పక్షుల కిలకిలలు, గుడి గంటల చప్పుళ్ళు, ఆవుల మందల విహరణలు, వాటి మెడలో గంటలు, మువ్వల చప్పుళ్ళు, ఇలా ప్రకృతిని అంతా అందంగా వర్ణించి చెప్పింది.
16వ పాశురంలో ద్వారపాలకులను లేపి, 17వ పాశురములో నందుని, యశోదను, బలరామ కృష్ణులను లేపుతుంది. కానీ కృష్ణుడు ఇంకా నిద్రలోనే ఉంటాడు. అందుకని ముందుగా నీళాదేవిని లేపితే అప్పుడు కానీ కృష్ణుడు లేవడని ఎరిగి 18 నుండి 20 వరకు, మూడు పాశురాలలో నీళాదేవిని లేపుతుంది.
21వ పాశురం నుండి 25 దాకా శ్రీకృష్ణ లీలలు, ఆయన గొప్పతనాన్ని పేర్కొంటుంది. ఆ తరువాత 26, 27 పాశురాలలో తన కోరికలు తెలియజేస్తుంది. 28వ శ్లోకంలో తమ అజ్ఞానాన్ని తెలియజేస్తూ, 29వ శ్లోకంలో తెల్లవారకుండానే వచ్చి లేపినందుకు క్షమాపణ వేడుకుని తన కోరిక తీర్చమని వేడుకుంటుంది. ఈ పాశురము సమర్పణా భావాన్ని నువ్వే దిక్కు అన్న సత్యాన్ని సూచిస్తోంది.
ఆఖరి పాశురము గోదాదేవి ఈ 30 పాశురాల కర్త అనీ దీన్ని ఎవరైతే పూర్తిగా సమర్పణా భావంతో పఠిస్తారో వారికి ముక్తి లభిస్తుంది అని తెలియజేయడం జరిగింది.
తిరుప్పావైలోని ఒక్కొక్క పాశురము నేను తెలుగు లిపిలో రాసి వాటి అర్థములతో సహా ముందు ముందు పోస్టులలో ఒకటొకటే మొదలు పెడుతున్నాను.
ప్రస్తుతము 9వ పాశురము 25వ తారీఖున మొదలు పెట్టి ఆ తర్వాతి రోజు నుండీ రోజూ ఒక్కొక్క పాశురము చొప్పున పబ్లిష్ చేస్తున్నాను. మొదటి ఎనిమిది పాశురములు నింపాదిగా సంక్రాతి అయిపోయాక ఎప్పుడైనా రాసి పబ్లిష్ చేస్తాను.
For Tiruppavai Paasurams in English with full meanings, you can find all of them (30 pasurams) on my Lifestyle Tips Blog at this link
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి