తిరుప్పావై పదకొండవ పాశురములో సంపదలతో తులతూగే పరాక్రమవంతులైన కుటుంబములో జన్మించి ఎటువంటి భయము, చీకు చింతలు తెలియని అమాయకత్వముతో ఆదమరిచి నిద్రపోతున్న ఇంకో బాలికను లేపుతున్నారు.
తిరుప్పావై పాశురము- 11
కత్తు క్కఱవై కణంగళ్ పలగరందు
శెత్తార్ తిర లళియ శ్శెన్ఱు శెరుచ్చెయ్యుమ్
కుట్రమొన్రుమ్ ఇల్లాద కోవలర్దమ్ పార్కొడియే !
పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్ !
శుత్తత్తు త్తోళిమార్ ఎల్లారుమ్ వన్దు, నిన్
ముత్తమ్ పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్ పాడ,
శిత్తాదే పేశాదే శెల్వ పెండాట్టి, నీ
ఎత్తుక్కుఱమ్గుమ్ పొరుళే లో రెమ్బావాయ్ ||
అర్థము :-
బలిష్ఠమైన యవ్వనంలో ఉన్న అనేక ఆవుల, గేదెల మందల పాలను ఎడతెరిపిగా పిదుక గల సామర్థ్యం కలవారునూ, యుద్ధములకేగి శత్రు సమూహములను ఎదిరించి ధైర్యంగా యుద్ధాలు చెయ్యగలిగిన వారునూ, ఏవిధమైన దోషాలు లేని గొప్ప కులములో జన్మించి, ఎటువంటి చీకు
చింత లేక హాయిగా ఎదమరిచి నిద్రపోయే బంగారు మొలకా, పుట్టలో నుండే విప్పారిన పాము పడగ లాంటి విశాల జఘన ప్రాంతము, అడవిలోని నెమలి లాగ అందమైన కేశములు గలదానా !
మేము నిన్ను ఇన్ని విధాలుగా లేపినా లేవకపోతే చుట్టుపక్కల నున్నవారందరూ కూడ వచ్చి నీ గుమ్మం ముందు నిలబడి నీలమేఘ శ్యాముడైన శ్రీకృష్ణుని యొక్క గానము చెయ్యడము మొదలెట్టారు మాతో బాటుగా. అయినప్పటికీ కొంచెమైనను ఉలుకు, పలుకులు లేకుండా శయనించి ఉండే ఓ భాగ్యవంతురాలా! ఇలా ఇంతగా మొద్దు నిద్రపోవడం లోని అర్థమేమిటో మాకు కాస్త అర్థమయ్యేలా తెలియ జెప్పెదవా?
చాలు, చాలు! లేచి రావమ్మా తల్లీ అని ఆ కన్యకను కూడ లేపి తమలో జేర్చుకుని బయలు దేరారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి