24, అక్టోబర్ 2024, గురువారం

శ్రీ వెంకటేశ్వర స్తోత్రము - Venkateswara Stotram Lyrics in Telugu


 "శ్రీ వెంకటేశ్వర స్తోత్రము" వెంకటేశ్వర స్వామి సుప్రభాతం లోని రెండవ అధ్యాయము. 

మనమంతా సాధారణముగా రోజూ పూజ చేసుకునే సమయంలో స్తోత్రాలనే చదువుతూ ఉంటాము. ఎందుకంటే మన దగ్గిర ఎక్కువ సమయము ఉండదు అన్నీ పారాయణము చేసుకునేందుకు. ఆఫీసుకి తదితర పనులకీ టైం ప్రకారం హాజరు అవుతుండాలి. అలాంటప్పుడు ఈ వెంకటేశ్వర స్తోత్రము, విష్ణువు-లక్ష్మీ స్తోత్రాలు, కృష్ణాష్టకం, శివపార్వతుల స్తోత్రాలు ఇలాంటివే ఏవో రెండు, మూడు చదువుకుని పూజ ముగించుకుంటాము. 

ఇంతే కాదు. వేంకటేశ్వరస్వామిని పూజిస్తే విష్ణువు, రాముడు, కృష్ణుడు, మొదలైన అందరినీ పూజించిన ఫలితం దక్కుతుంది. ఎందుకంటే వెంకటేశ్వర సుప్రభాతం లోని అన్ని భాగాలలో కూడ విష్ణువు యొక్క కొన్ని అవతారములను కనీసము తలుచుకోవడం జరుగుతోంది. 

పై కారణాల వల్ల వెంకటేశ్వర స్తోత్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది మన పూజలలో. 

ఇప్పుడు నేను ఈ వెంకటేశ్వర స్తోత్రము లోని ఒక్కొక్క శ్లోకాన్ని అర్థములతో తెలియజేస్తున్నాను. 

శ్రీ వెంకటేశ్వర స్తోత్రము 


కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణితా తులనీలతనో
కమలాయత లోచన లోకపతే విజయీభవ వేంకట శైలపతే || (1)

అర్థము :-

శ్రీవేంకటేశ్వరుని మనము కుంకుమతో అర్చన చేస్తూ ఉంటాము. అటువంటప్పుడు కుంకుమని ఆయన వక్షస్థలము పై జల్లుతుంటాము. ఆ కుంకుమ ఎరుపు రంగు ఆయన వక్షోజమంతా అంటుకుని ఎల్లప్పుడూ ఆయన వక్షము ఎర్రగానే కనిపిస్తూ ఉంటుంది. అలా ఎర్రని వక్షము కలిగి నీలి రంగు దేహంతో ప్రకాశించు వెంకటేశ్వరుని కనులు కూడ కమలదళముల వలే బాగా విశాలంగా ఉంటాయి. అటువంటి లోకాలకు ప్రభువైన ఓ వెంకటేశ్వరా ! నీకు సదా విజయమగు గాక! వెంకట శైలపతి అంటే వెంకటాచలము పై వెలసిన ప్రభువు. 


సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళిమణే 
శరణాగత వత్సల సారనిధే పరిపాలయమాం వృష శైలపతే || (2)

అర్థము :-

చతుర్ముఖుడైన బ్రహ్మ, షణ్ముఖుడైన కార్తికేయుడు, పంచముఖులైన శివుడు, ఆంజనేయుడు వంటి ప్రముఖులైన దేవతలందరిలోకి కిరీటము వంటి ఓ స్వామీ, శరణు జొచ్చిన వారి పట్ల అత్యంత వాత్సల్యము చూపించే ఓ దయాసాగరా! నన్ను కాపాడుమా ఓ వృష శిఖర అధిపతియైన వెంకటేశ్వరా!
 

అతివేలతయా తవ దుర్విషయి రనువేల కృతై రపరాధ శతైహ్ 
భరితం త్వరితం వృషశైల పతే పరయా కృపయా పరిపాహి హరే || (3)

అర్థము :-

ఓ స్వామీ ! నేను అనేక చెడుపనులు, అపరాధములు, వందలకొద్దీ చేసి భయంతో వణికి పోతూ మీ దగ్గరకి వేగంతో వచ్చాను. దయచేసి నన్ను క్షమించి కాపాడండి స్వామీ.
   

అధివెంకటశైల ముదారమతే జనతాభిమతాధిక దానరతాత్ 
పరదేవతయా గదితా న్నిగమై కమలా దయితా న్నపరం కలయే || (4)

అర్థము :-

ఓ ఉదారస్వభావము గల వెంకటేశ్వర స్వామీ, ఎప్పుడూ కూడ భక్తులకు అడిగిన దానికంటే ఎక్కువగా వరాలు ఇస్తుంటావు నీవు. దేవతలు, తదితరులు అందరినీ సమానంగా చూస్తూంటావు. కమలా అంటే లక్ష్మీదేవి. ఇక్కడ సందర్భములో మనము పద్మావతీదేవి అని కూడ  చెప్పుకోవచ్చును. పద్మావతి భూదేవి అవతారము కూడా అని అంటారు. అందుకే వేంకటేశ్వరునికి రెండువైపులా శ్రీదేవి, భూదేవులు ఉంటారు. అంటువంటి శ్రీదేవిని దయిత (భార్య)గా పొందిన నీ కంటే నాకు దిక్కెవ్వరు స్వామీ ! 
  

కలవేణురవా వశ గోపవధూ శతకోటి వ్రతాస్మర కోటి సమాత్ 
ప్రతిపల్లవికాభి మతాత్ సుఖదాత్ వసుదేవ సుతా న్నపరం కలయే || (5)

అర్థము :-

ఇక్కడ వెంకటేశుని శ్రీకృష్ణునిగా భావిస్తూ విన్నవించుకుంటున్నాము. నీ మురళి నుండి వెలువడే అమృతధ్వనులతో  మేను మరిచిన గోపికలకు వారి వారికి నచ్చిన విధంగా సుఖాన్ని ఇచ్చావు. అలాంటి సుఖము వందకోట్ల వ్రతాలు చేస్తే వచ్చేది లేదా కొన్ని కోట్ల సార్లు జపము చేస్తే వచ్చేది. అటువంటి వసుదేవుని పుత్రుడా, నీ కన్న నాకు వేరే దిక్కెవ్వరున్నారు?
 

అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధరః ధీరమతే 
రఘునాయక రామ రమేశ విభో వరదోభవ దేవ దయా జలధే || (6)

అర్థము :-

సుగుణముల నెలవైన రాముడివిగా , దశరథుని పుత్రునిగా పేరు పొందిన వాడివి. జగత్తులో ఏకైక ధనుర్ధరుడివి, ధైర్య, స్థైర్యవంతుడివి. ఓ రఘుకుల శ్రేష్ఠుడా రామా ! ఓ ప్రీతికరమైన ఆనందాన్ని ఇచ్చే దేవా, కరుణించి వరములు ప్రసాదించు దేవా!

 
అవనీతనయా కమనీయకరం రజనీకర చారు ముఖాంబురుహమ్    
రజనీచర రాజ తమోమిహిరం మహనీయమహం రఘురామ మయే || (7)

అర్థము :-

భూదేవి పుత్రిక సీతమ్మ నీ అందమైన చేతులను పట్టుకోగా నీ ముఖపద్మం చంద్రుని వలె వెలిగిపోతూ ఉంటే, రాత్రిపూట తిరుగుతూ చీకటిని పారద్రోలుతూ ఉండే రాజా ! నాకు ఆశ్రయాన్ని ఇవ్వు ఓ రఘుకుల రామా!
     

సుముఖం, సుహృదం, సులభం, సుఖదం, స్వనుజం చ సుఖాయ మమోఘ శరమ్ 
అపహాయ రఘుద్వహ మన్యమహం న కథంచ  న కంచన జాతు భజే || (8)

అర్థము :-

అందమైన ముఖము, మంచి హృదయము కలిగి సులభముగా పొందదగిన వాడివి నువ్వు. సుఖాన్ని ఇచ్చేవాడివి . నీ సోదరుల అమోఘమైన బాణములతో మమ్మల్ని కాపాడుతూ సుఖాన్ని ప్రసాదిస్తూ ఉంటావు. అందుచేత నేను ఎల్లప్పుడూ నిన్ను తప్ప వేరెవ్వరినీ ఒక్క సారైనా, ఒక్క క్షణం కోసం కూడ భజించను. నువ్వే నాకు దిక్కు. 
  

వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి 
హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ || (9) (రెండు సార్లు)

అర్థము :-

వెంకటేశా! నువ్వు లేనిచో నేను అనాథను అయిపోతాను. ఎల్లప్పుడూ నిన్నే స్మరిస్తూ ఉంటాను. ఓ హరీ (నా లోని దోషాలనీ, పాపాలనీ హరించే స్వామీ) ! వెంకటేశ్వరా ! కాపాడు, కాపాడు! ప్రియమైన వెంకటేశ్వరా ! నీ ఆశ్రయము ప్రసాదించు, ప్రసాదించు.
   

అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామేశ్చయా గత్య సేవామ్ కరోమి 
సత్కృత్ సేవయా నిత్యసేవా ఫలంత్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ || (10) 

అర్థము :-

నేను మీ పాదపద్మముల నుండి చాలా దూరములో ఉండిపోయి ఇప్పుడు దాసోహములు సమర్పిస్తూ మీ దగ్గరికి వచ్చేశాను మీ సేవ చేయడానికి. దయచేసి నిత్యమూ మంచిగా మీ సేవ చేసుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించు, ప్రసాదించు ఓ వెంకటేశ్వర స్వామీ !


అజ్ఞానినా మయాదోషా నశేషాన్ విహితాన్ హరే
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే || (2 సార్లు చదవాలి) 

అర్థము :-

నేను అజ్ఞానుడనై చేసిన తప్పులన్నీ కూడా నా అజ్ఞానం వల్లనే చేశానని ఎరిగి దయచేసి నన్ను క్షమించు, క్షమించు ఓ శేషశైల శిఖరానికి మణి అయిన స్వామీ !

ఇక్కడితో వెంకటేశ్వర స్తోత్రము సమాప్తము. 
ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః !
ఓం నమో శ్రీ పద్మావతీ శ్రీనివాసాయ నమః !!

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి