20, డిసెంబర్ 2024, శుక్రవారం

శ్రీ వెంకటేశ్వర మంగళాశాసనము - Sri Venkateswara Mangala Haarati Slokas

శ్రీ వెంకటేశ్వర మంగళాశాసనము అనేది తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి కి ప్రతిదినము చదివే సుప్రభాత సేవలోని ఆఖరి భాగము. మొత్తము నాలుగు విభాగములలో ఇది ఆఖరి భాగము అన్నమాట. ఇవన్నీ కూడా ప్రతివాది భయంకరం అన్నంగరాచార్య అనే శ్రీ వైష్ణవ భక్తుని కృతులు. 


భగవంతుని పూజ చేసి ధూప, దీప, నైవేద్యము మొదలైన సేవలన్నీ సమర్పించుకున్నాక ఆయనకి కర్పూర హారతి పట్టి, దీపాలు చూపిస్తూ మంగళహారతులు చదవడం చేయాలి. ఆయన ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ చుట్టూ తిప్పే దీపాలు, చదివే కీర్తనలనే మంగళహారతులు అంటాము. ఆయన క్షేమంగా ఉంటేనే మనకి అన్ని ఇస్తూ మనల్ని ఆయన క్షేమంగా చూసుకోగలుగుతారు. 


ఇప్పుడు శ్రీ వేంకటేశ్వరుని మంగళహారతి శ్లోకాలు తెలియజేస్తున్నాను. 


శ్రీ వెంకటేశ్వర మంగళాశాసనము


శ్రీయః కాంతాయ కల్యాణనిధయే నిధయేర్థినాం 
శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ || 

అర్థము :-

లక్ష్మీదేవి సతిగా కలిగి అన్ని కల్యాణ గుణములకు, సంపదలకు నిధివై, నిన్ను కోరుకునేవారికి కూడా నీ పొందే ఒక నిధి వంటిది అయిన ఓ వెంకటాచల నిలయా , శ్రీనివాసా నీకు అంతా మంచే జరుగు గాక! 
 

లక్ష్మీ సవిభ్ర మాలోక సుభ్రూ విభ్రమ చక్షుషే 
చక్షుషే సర్వలోకానామ్ వెంకటేశాయ మంగళమ్ || 

అర్థము :-

లక్ష్మీదేవి అదేపనిగా ఆశ్చర్యము, అచ్చెరువులతో చూసే లాంటి అతి సుందరమైన, విస్మయమైన కనులు ఉన్న నీ యొక్క అందమైన కళ్ళకి అంతా మంగళమే జరుగు గాక!


శ్రీవేంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే 
మంగళానామ్ నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ || 

అర్థము :-

వెంకటాద్రి శిఖరానికి అగ్రభాగంలో ఒక మంగళకర ఆభరణము లాంటి నీ పాదములకు, మరియు మంగళకరమైన నీ నివాసమునకు కూడా అంతా మంగళమే ఔ గాక!
  

సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసామ్ 
సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళమ్ || 

అర్థము :-

అన్ని అవయవముల పొందికతో కూడిన సౌందర్య సంపద ద్వారా సకల ప్రాణులను సర్వదా ఆకర్షించుకుంటూ ఉండునట్టి నీ సౌందర్య సంపదకు ఎల్లా వేళలా మంగళమే అవుతుండు గాక!


నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే 
సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళమ్ || 

అర్థము :-

నిత్యుడవు (అంటే ఎల్లప్పుడూ ఉండే వాడవు, జననమరణములు లేనివాడవు), ఎటువంటి లోటు కాని, మచ్చలు, దోషములు కాని లేనివాడవు, సత్ చిత్ ఆనంద స్వరూపుడవు అయి ఉండి, అందరి ఆత్మలలో నివసించే శ్రీ వెంకటేశ్వరా, నీకు ఎల్లవేళలా మంగళమే అవుతుండు గాక! 
  

స్వతః సర్వ విదే సర్వ శక్తయే సర్వ శేషినే 
సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళమ్ ||

అర్థము :-

స్వతహాగానే (అంటే ఇంక ఎవరి ప్రమేయము లేకుండా, ఎంటువంటి శిక్షణ, ఉపదేశముల అవసరం లేకుండానే) నీవు సకలము ఎరిగినవాడవు. అలాగే శక్తిమంతుడవు, అంతటా ఎల్లప్పుడూ ఉండేవాడవు (ఎంటువంటి ఖాళీ కానీ, సందు కానీ లేకుండా), సులభంగా అందరికీ లభ్దమయ్యేవాడివి, మంచి స్వభావము కలవాడివి (జాలి, దయ, దాన గుణాలు కలవాడు) అంటువంటి శ్రీ వెంకటేశ్వరా నీకు సదా మంచే జరుగుతుండు గాక!
  

పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే 
ప్రయుంజే పరతత్త్వాయ వెంకటేశాయ మంగళమ్ || 

అర్థము :-

నీవే స్వయముగా బ్రహ్మవు. కోరికలన్నింటికీ అతీతుడవు (అంటే సహజంగానే పూర్తిగా తృప్తుడు). నువ్వే సకల ఆత్మలకు పరమాత్మవై ఉండి, అన్నితత్త్వములను, అన్ని ప్రాణులను అధిగమించిన వాడవు. అటువంటి ఓ వెంకటేశ్వరా నీకు సదా మంగళమే ఔ గాక!  


ఆకాల తత్త్వ మశ్రాంత మాత్మనా మనుపశ్యతాం  
అతృప్తామృత రూపాయ వెంకటేశాయ మంగళమ్ || 

అర్థము :-

భూత భవిష్యత్ వర్తమానము లందు (అంటే ఏ కాలమందు కూడా), వేదాల ద్వారా కానీ, క్రతువుల ద్వారా కానీ, ఆత్మశోధన ద్వారా కానీ, నిన్ను కాని, నీ మహిమల గాని పూర్తిగా తెలుసుకోగల పురుషులు లేరు. అంతటి మహనీయుడవైన ఓ వెంకటేశా, నీకు సదా మంగళమే జరుగు గాక!  


ప్రాయః స్వచరణౌ పుంసాం శరణ్యత్యేన పాణినా 
కృపయా దిశతే శ్రీమద్ వెంకటేశాయ మంగళమ్ || 

అర్థము :-

బహుశా నీ పాదములే బాధలు, కష్టాల నుండి విముక్తిని అందజేస్తాయి అన్నరహస్యాన్ని మాకు చెప్పటం కోసమేమో కరుణతో నీ కుడి చేత్తో నీ పాదాలను మాకు చూపిస్తూ ఉంటావు. అట్టి నీ పాదములకు ఎల్లవేళలా మంగళమే జరుగు గాక!
 

దయామృత తరంగిణ్యా స్తరంగైరివ శీతలైహ్
అపాంగై స్సించతే విశ్వమ్ వెంకటేశాయ మంగళమ్ || 

అర్థము :-

నీ దయ అనే అమృత ధారల అలలతో నిండిన చల్లటి శీతల జలములు (ఆకాశగంగ జలపాతము) మా శరీరములను, సమస్త జీవరాశిని తడిపి పావనము చేస్తున్నాయి. అటువంటి శ్రీ వేంకటేశ్వరునికి ఎల్లవేళలా మంగళమే ఔ గాక!

    
స్రగ్ భూషామ్బర హేతినామ్ సుషమావహ మూర్తయే 
సర్వార్తి శమనాయాస్తు వెంకటేశాయ మంగళమ్ ||  

అర్థము :-

అందమైన బంగారు వన్నెల దుస్తులు, ఆభరణములతో ఉండే నీ దివ్యకాంతి అన్ని దిశలా వెదజల్లుతూ ఆర్తులందరికీ ఉపశమనము, మనోల్లాసము కలిగించే వెంకటేశ్వరా నువ్వు ఎల్లవేళలా మంగళకరముగా ఉండాలి. 
   

శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే
రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళమ్ || 

అర్థము :-

శ్రీ వైకుంఠము నుండి విరక్తి పుట్టి ఇక్కడ పుష్కరిణీ తీరంలో వెలిసి లక్ష్మీదేవితో కూడి విలసిల్లే వెంకటేశ్వరా నీకు, లక్ష్మీదేవికి సదా మంగళమే జరుగు గాక!


శ్రీమత్ సుందరజామాతృ మునిమానస వాసినే 
సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ || 

అర్థము :-

సుందరజామాతృ ముని అని ఒక శ్రీ వైష్ణవభక్తుని బిరుదు. ఆయన్ని మనవాళమాముని అని పేర్కొంటారు అన్ని గ్రంథాలలో. ఆయన గొప్ప భక్తుడు. అటువంటి గొప్పభక్తుని మనస్సులో ఎల్లప్పుడూ నివసించే వెంకటేశ్వరా! నువ్వు ఆయన మనస్సులో ఉంటూ కూడ అన్నిలోకాలలోను ఉన్నావు. అట్టి నీకు సదా మంగళమే జరుగు గాక!
  

మంగళా శాసన పరైర్మదాచార్య పురోగమైహ్ 
సర్వైశ్చ పూర్వై రాచార్యై సత్కృతాయాస్తు మంగళమ్ ||   

అర్థము :-

నా ఆచార్యులతో మొదలు పెట్టి వారి ముందటి ఆచార్యులను తలుచుకుంటూ, అందరికంటే మొట్టమొదటి ఆచార్యుని వరకూ ఉన్న అందరికీ సదా, ఎల్లవేళలా మంగళమే జరుగుతుండు గాక! 


సుప్రభాతములోని మొదటి భాగాలు చదవడానికి ఈ క్రింది లింకులపై క్లిక్ చేయగలరు. 

1) శ్రీ వేంకటేశ్వర సుప్రభాతము 

2) శ్రీ వెంకటేశ్వర స్తోత్రము 

3) శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి