తిరుప్పావై 14వ పాశురములో ఆండాళ్ తోటి బాలికలతో ఇంకొక బాలికను లేపుతున్నారు. ఈ కన్య వారందరితో గొప్పగా నేనే అందరికన్నా ముందుగా లేచి వచ్చి మిమ్మల్నందరినీ లేపుతానని ముందటి రోజునే గొప్పలు పోయిందిట.
తిరుప్పావై - పాశురము 14
ఉంగళ్ పుళైక్కడై తోట్టత్తు వావియుళ్
శెన్ఙళు నీర్వాయ్ నెగిలిన్దు ఆంబల్వాయ్ కూమ్బిన కాణ్,
శెంగళ్ ప్పొడి కూరై వెణ్బల్ తవత్తవర్,
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోకిన్ఱార్ ;
ఎంగళై మున్నమ్ ఎళుప్పువాన్ వాయ్ పేశుమ్
నంగా యెళున్దిరాయ్ ! నాణాదాయ్ ! నావుడైయాయ్ !
శంగొడు శక్కర మేన్దుమ్ తడ క్కైయన్
పన్గయ క్కణ్ణానై పాడేలోర్ ఎమ్బావాయ్ ||
అర్థము :-
ఓ శ్రేష్ఠురాలా ! మీ ఇంటి వెనుక పెరటి తోటలో ఉన్న దిగుడు బావిలో ఉన్న ఎర్రటి తామరలు చిరునవ్వులు విసురుతున్నట్లుగా వికసించుకుంటున్నాయి. నల్లకలువలేమో ముడుచుకుంటున్నాయి.
ఎర్రని కాషాయ వస్త్రధారులైన తెల్లటి దంతములు కల్గిన వైరాగ్యవంతులైన సన్యాసులూ, మునులూ తమ తమ గుళ్లకు శంఖము ఊది పూజలు చేయడాని కోసము వెళుతున్నారు.
ఏదో గొప్పగా మేము లేవకముందే వచ్చి మమ్మల్ని లేపుతానని ప్రగల్భాలు పలికావు కదా! చాలు చాలులే! ఇప్పుడైనా లే ఇంక. మాయలాడి మాటకారీ ! కొంచెము కూడ సిగ్గు లేదా? లెమ్ము, లెమ్ము!
శంఖము, చక్రాయుధము, మొదలైన ఆయుధాలను ధరించిన వాడునూ, ఆజానుబాహుడునూ అయి, కలువరేకుల కనులు కల్గిన శ్రీకృష్ణుని గానము చేద్దాము అని ఆ బాలికను కూడ తమలో కలుపుకుని ఇంకో గుమ్మము వైపు వెడతారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి