తిరుప్పావై 16వ పాశురము లో ద్వారపాలకులను వేడుకోవడము జరుగుతోంది.
6 నుండి 15 పాశురముల వరకూ మొత్తం పది మంది బాలికలను లేపి తమతో కలుపుకుని తిరుప్పావై వ్రతమాచరించడానికి బయలుదేరింది ఆండాళ్. చెరువులో చక్కగా స్నానాలు చేసి శుభ్రమైన దుస్తులు దాల్చి శ్రీకృష్ణ భవనానికి బయలు దేరారు. అక్కడ ద్వారపాలకులను లేపి, తలుపులు తీయుంచుకుని లోపలకు ప్రవేశించాలి.
తిరుప్పావై - పాశురము 16
నాయకనాయ్ నిన్ర నందగోపను డైయ
క్కోయిల్ కాప్పానే ! కొడితోన్ఱుమ్ తోరణ
వాశల్ కాప్పానే ! మణిక్కదవమ్ తాళ్ తిఱవాయ్;
ఆయర్ శిరుమియ రోముక్కు - అఱైపరై
మాయన్ మణివణ్ణన్ నెన్నెలే వాయ్ నెఱుందాన్,
తూయోమాయ్ వన్దోమ్ తుయిలెళ ప్పాడువాన్
వాయాల్ మున్నం మున్నమ్ మాత్తాదే యమ్మా, నీ
నేశనిలై క్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్ ||
అర్థము :-
మనకందరికీ నాయకుడై నెలకొన్న నందగోపుని భవన ద్వారపాలకులారా ! గరుడధ్వజము ఎగురుతూ కనబడే ఆ ధ్వజస్తంభ వాకిట కాపలా ఉండే ఓ రెండవ ద్వారపాలకా ! మీరంతా దయచేసి మణులు పొదగబడిన తలుపుల తాళాలు తీసి మమ్ములను లోనికి వెళ్లనివ్వండి. మేము చిన్ని పిల్లలం కదా! ఎటువంటి భయము, అనుమానము పెట్టుకోకండి. మేము చేయదలచిన నోముకు కావాల్సిన పఱై అనే దానిని మాకు ఇస్తానని ఆ ఎనలేని మహిమల మాయావి, మాణిక్యవర్ణుడు అయిన శ్రీకృష్ణుడు నిన్నటి రోజునే మాతో చెప్పాడు. దానికోసమే మేము నిద్రపోకుండా మెళకువతో ఉండి పెందరాళే బయలుదేరాము మేలుకొలుపులు పాడుదామని. కావున మీరు ముందుగానే నోటితో కుదరదు అని చెప్పక ఈ ప్రేమ అనే బలమైన మాయా పాశముల ద్వారా బంధింపబడిన ద్వారాలను తెరవండి.
ఈ విధముగా ద్వారపాలకులను వేడుకుని, ఒప్పించి ద్వారములను తెరిపించుకుని లోనికి ప్రవేశించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి