25, ఫిబ్రవరి 2025, మంగళవారం

శివ పూజా స్తోత్రములు - లింగాష్టకము - Lord Shiva Worship

"బ్రహ్మ మురారి సురార్చిత లింగమ్"  అని ఒక అష్టకము (అంటే ఎనిమిది కీర్తనలు) పరమ పావనుడైన శివపరమాత్మను కీర్తిస్తూ ఆయన భక్తుడు, పరమ పూజ్యులు అయిన ఆది శంకరాచార్యుల వారు మనకు అందించారు. 


ఆ కీర్తించిన స్తోత్రములే లింగాష్టకము. ఈ అష్టకములో రావణాసురుడి గర్వభంగము, దక్ష ప్రజాపతి యజ్ఞ ధ్వంస మగుట లాంటి ఘటనలను కూడా పేర్కొంటూ శివుని కీర్తన చెయ్యడం జరిగింది. 

రావణుడు కైలాసము పెకిలించి తన లంకకు పట్టుకుపోదామని పెకిలిస్తూంటే శివుడు తన కాలితో పర్వతాన్ని గట్టిగా నొక్కుతే దాని కింద రావణుడి చేతులు ఇఱుక్కుపోయి, నిస్సహాయుడై శివతాండవ కీర్తన చేసి, చేతులను పొందటమే కాక శివలింగాన్ని కూడ పొందుతాడు. 

అలాగే దక్షుడు యజ్ఞము చేస్తూ శివుని పిలువక పార్వతిని మాత్రమే పిలుస్తాడు. ఆమె ఎదురుగా శివుణ్ణి అవమానిస్తుంటే పార్వతి అగ్నిలో దూకి దేహము చాలించింది. అప్పుడు కోపముతో శివుని నంది ఆ యజ్ఞ స్థలాన్ని ధ్వంసము చేసింది.    

ఆ లింగాష్టకమునే నేను ఇక్కడ అర్థములతో సహా పొందుపరచటానికి ప్రయత్నిస్తున్నాను.

 

లింగాష్టకము 


బ్రహ్మమురారి సురార్చిత లింగం 
నిర్మల భాసిత శోభిత లింగం 
జన్మజ దుఃఖ వినాశక లింగం 
తత్ ప్రణమామి సదాశివ లింగమ్ || (1)

అర్థము :-

బ్రహ్మదేవుడు, మురారి (విష్ణుమూర్తి), మరియు దేవతల చేత అర్చింపబడునట్టిదియు, నిర్మల జ్యోతులను వెదజల్లుతూ సదా ప్రకాశించుచుండు నట్టిదియు, పుట్టుకతో వచ్చిన దుఃఖములను సైతము నశింపజేయు నట్టిదియు అయినటువంటి ఆ సదాశివ లింగమునకు నా నమస్సులు సమర్పిస్తున్నాను.   


దేవముని ప్రవరార్చిత లింగం 
కామదహన కరుణాకర లింగం 
రావణ దర్ప వినాశక లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్ || (2)

అర్థము :-

దేవతలు, మునులు, బ్రాహ్మణులు, పండితులు (ప్రవరులు అంటే బ్రాహ్మణులు, పండితులు, శ్రేష్ఠులు అనే అర్థములు వస్తాయి) వీరందరిచే పూజింపబడునదియు; కామాన్ని, కోరికలను దహించునట్టిదియు, కరుణ, దయలకు ప్రతీకము అయినట్టిదియు; రావణుని గర్వమును నశించజేసినట్టిదియు నైన ఆ సదాశివ లింగమునకు నా ప్రణామములు సమర్పిస్తున్నాను.  


సర్వ సుగంధి సులేపిత లింగం 
బుద్ధి వివర్ధన కారణ లింగం 
సిద్ధ సురాసుర వందిత లింగం 
తత్ ప్రణమామి సదాశివ లింగమ్ || (3)

అర్థము :-

సకల సుగంధములతో మంచిగా అలకబడినదియు, బుద్ధి వికాసము పెరుగుదలకు కారణమైనట్టిదియు, సిద్ధులు, సురులు (దేవతలు), రాక్షసులు (అసురులు) అందరిచేత నమస్కరింప బడునట్టిదియు అయినటువంటి ఆ సదాశివ లింగమునకు నా ప్రణామములు సమర్పిస్తున్నాను.  


కనక మహామణి భూషిత లింగం 
ఫణిపరివేష్టిత శోభిత లింగం 
దక్షసు యజ్ఞ వినాశన లింగం 
తత్ ప్రణమామి సదాశివ లింగమ్ || (4)

అర్థము :-

బంగారము, మణులతో అలంకరింపబడినదియు, సర్పరాజైన వాసుకి (ఫణి అంటే పడగ కలిగినది, పాము. ఫణిపరివేష్టిత అంటే చుట్టూ పాముతో అల్లుకోబడినది) దాని చుట్టూ అల్లుకోవడము వలన అందముగా ప్రకాశిస్తున్నట్టిదియు, దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞమును ధ్వంసము చేసినట్టిదియు అయినటువంటి ఆ సదాశివ లింగమునకు నేను నమస్కరిస్తున్నాను. 


కుంకుమ చందన లేపిత లింగం 
పంకజ హార సుశోభిత లింగం 
సంచిత పాప వినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్ || (5)

అర్థము :- 

కుంకుమ మరియు చందనము చక్కగా పూయబడినదియు, కమలములు, తామర పుష్పముల హారములతో చక్కగా అలంకరింపబడి, ఎంతో మనోహరముగా ప్రకాశిస్తున్నట్టిదియు, జన్మ జన్మల నుండి కూడగట్టుకున్న పాపములను అన్నింటినీ పోగొట్టునట్టిదియు అయిన ఆ సదాశివ లింగమునకు నేను నమస్కరిస్తున్నాను.  


దేవ గణార్చిత సేవిత లింగం 
భావైర్ భక్తి భిరేవచ లింగం 
దినకర కోటి ప్రభాకర లింగం 
తత్ ప్రణమామి సదాశివ లింగమ్ || (6)

అర్థము :-

దేవతల చేతను, సకల గణముల చేతను నిరంతరమూ అర్చింపబడుతూ, సేవింపబడుతూ ఉండి, భక్తి భావనలను, శ్రద్ధను ఉత్పన్నము చేయునట్టిదియు, కోటి సూర్యుల తేజస్సుతో ప్రజ్జ్వలముగా ప్రకాశించునట్టిదియు అయిన ఆ సదాశివ లింగమునకు నేను ప్రణామములు సమర్పిస్తున్నాను.  


అష్టదళో పరివేష్టిత లింగం 
సర్వ సముద్భవ కారణ లింగం 
అష్టదరిద్ర వినాశన లింగం 
తత్ ప్రణమామి సదాశివ లింగమ్ || (7)

అర్థము :-

అష్టదళో పరివేష్టిత అంటే అష్ట దిక్పాలకులు చుట్టూ సేవిస్తున్నారు అని ఒక అర్థము చెప్పుకోవచ్చును, లేదా అష్టదళములు (ఎనిమిది రేకులు) ఉన్న పుష్పాలతో అలంకరింపబడినది ఆ లింగము అని అనవచ్చును. అంతేకాక సకల సృష్టికి కారణభూతమైనదియు, అష్టదరిద్రములను నశింపజేయునట్టిదియు అయిన ఆ సదాశివ లింగమునకు నేను ప్రణామములు సమర్పించుకుంటున్నాను.
 
అష్టదరిద్రములు ఈ ప్రకరమైనవి:

అన్న దరిద్రత, వస్త్ర దరిద్రత, ఇల్లు/నివాసం లేకపోవుట, సంతానము లేకపోవుట, మిత్రులు లేదా బంధువులు లేకపోవుట,  భూమి దరిద్రత, సంపత్తి దరిద్రత, విద్య లేకపోవుట.
లింగపూజ చేస్తే ఈ దరిద్రాలనుండి విముక్తి లభిస్తుందని చెప్పబడుతోంది.  


సురగురు సురవర పూజిత లింగం 
సురవన పుష్ప సదార్చిత లింగం 
పరమపదం పరమాత్మక లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్ || (8)  

అర్థము :-

దేవతల గురువులు, దేవతల్లో శ్రేష్ఠులు, ఎల్లవేళలా పూజిస్తూ ఉండే లింగము, దేవలోకపు ఉద్యానవనము (తోట) లోని పుష్పములతో ఎడతెరిపి లేకుండా అర్చన చేయబడుతూ ఉండునట్టిదియు, పరమపదము అయినదియు, పరమాత్మ అయినదియు అయినటువంటి ఆ సదాశివ లింగమునకు నేను ఎల్లవేళలా ప్రణామములు సమర్పించుకుంటూ ఉంటాను. 


ఫలశ్రుతి 

లింగాష్టక మిదం పుణ్యం; యహ్ పఠేత్ శివ సన్నిధౌ 
శివలోక మవాప్నోతి, శివేన సహమోదతే ||| 

అర్థము :-

ఈ లింగాష్టకము పుణ్యప్రదమైనది. అంటే పుణ్యము కలిగించునది. దీనిని ఎవరయితే శివుని సన్నిధిలో పఠిస్తారో వారికి శివలోకము లభిస్తుంది. శివుని జేరి ఆనందాన్ని అనుభవిస్తారు. 

ఓమ్ తత్ సత్ 
ఇది నిజము    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి