శ్రీ మహాలక్ష్మీ అష్టకమ్:
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే || (1)
అర్థము:
వందనములు అమ్మా మహాశక్తి స్వరూపిణీ మహామాయా! శ్రీపీఠములో నివసిస్తూ దేవతలందరిచే పూజింపబడు తల్లీ! శంఖము, చక్రము, గద మున్నగు ఆయుధములతో వెలసిన దేవీ, నీకు నా ప్రణామములు. (మహాలక్ష్మి శ్రీ పీఠము కోలాపురము నందు ఆమె సదా ఎల్లవేళలా వెలసి ఉంటుంది. ఇంకొక మహాలక్ష్మీ పీఠము కర్ణాటకలో కూడ ఉచిల యందు ఉంది).
నమస్తే గురుడారూఢే కోలాసుర భయంకరి
సర్వపాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే || (2)
అర్థము:
ఒక అడవిపంది ఆకారములో ఉన్న కోలాసురుడు అనే రాక్షసుడు దేవతల మీది కోపముతో ప్రజలందరినీ హింసించుచుండగా, అంతా కలిసి లక్ష్మీదేవిని ప్రార్ధిస్తారు. ఆమె గరుడ వాహనము ఎక్కి ఆ రాక్షసుని చంపి అతని కోరిక ప్రకారము ఆ ఊరికి కోలాపురం అని పేరు పెట్టి, అక్కడే తను అంబాబాయి పేరుతొ వెలిసింది. అదే మహారాష్ట్ర లోని ఇప్పటి కోల్హాపూర్ నగరము.
ఆ విధముగా కోలాసురునికి భయము కలిగించి, అతన్ని లొంగదీసుకుని, భక్తులందరి పాపములను తొలగిస్తూ వెలసిన మహాలక్ష్మికి నా వందనములు.
సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ఠ భయంకరి
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే || (3)
అర్థము:
సకల విద్యలు, సకల వరములకు నెలవుగా ఉంటూ, దుష్ఠులకు భయాన్ని కలిగిస్తూ, భక్తుల దుఃఖములన్నిటినీ పోగొడుతూ ఉండే ఓ మహాలక్ష్మీ, నీకు నా ప్రణామములు.
సిద్ధిబుధ్ధి ప్రదే దేవి భుక్తిముక్తి ప్రదాయిని
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే || (4)
అర్థము:
సకల సిద్ధులను, బుధ్ధిని ప్రసాదించుచు; భుక్తిని, ముక్తిని ప్రసాదిస్తూ, మంత్ర మూర్తివి అయిన ఓ దేవీ, మహాలక్ష్మీ, నీకివే నా ప్రణామములు.
ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి
యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే || (5)
అర్థము:
ఆది, అంతములు లేనిదానివి, నీవు ఆదిశక్తివి. ఓ మహేశ్వరీ, యోగజ్ఞానివై యోగము నుండి ఆవిర్భవించిన తల్లీ, ఓ మహాలక్ష్మీ నీకు నా వందనములు.
స్థూలసూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే
మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే || (6)
అర్థము:
నీవు సూక్ష్మ రూపము లోను, మహా రూపము లోను గోచరమవుతూ, భీకరము గాను, మహాశక్తివంతము గాను ఉన్నదానివి, విశాలమైన ఉదరము కలిగిన దానివి. (సమస్త విశ్వము ఆమెలోనే ఇమిడి ఉంటుంది). పాపములన్నిటినీ రూపుమాపే ఓ మహాలక్ష్మీ, నీకు వందనములు.
పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి
పరమేశ్వరి జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే || (7)
అర్థము:
పద్మాసనములో ఉండే దేవీ, ఓ పరబ్రహ్మ స్వరూపిణీ, ఓ పరమేశ్వరీ, సమస్త లోకాలకు తల్లీ, మహాలక్ష్మీ, నీకు నా వందనములు.
శ్వేతాంబర ధరే దేవి నానాలంకార భూషితే
జగత్ స్థితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే || (8)
అర్థము:
తెల్లని వస్త్రముల ధరించుచు, అనేక విధములైన అలంకారములతో శోభిల్లే తల్లీ, జగత్తునందు నివసించే ఓ జగన్మాత (మనలను అనుగ్రహిస్తూ, రక్షిస్తూ ఉండటానికై మన లోకములోనే ఉంటోంది ఆమె), మహాలక్ష్మీ నీకివే నా వందనములు.
శ్రీ మహాలక్ష్మీ దేవి కోలాపురం కోవెలలో సజీవముగా ఉంటుందని చెప్పుకుంటారు.
ఫలశ్రుతి
మహాలక్ష్మ్యష్టకమ్ స్తోత్రమ్ యః పఠేత్ భక్తిమాన్నరః
సర్వసిధ్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||
అర్థము:
ఈ మహాలక్ష్మీ అష్టకాన్ని భక్తితో చదివిన వారికి అన్ని సిద్ధులు కలుగుతాయి. రాజ్యాలు లభిస్తాయి. రాజ్యము అంటే మంచి ఉన్నత స్థాయి, కీర్తి ప్రతిష్టలు అని భావించుకోవాలి.
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్య సమన్వితః ||
ఒక సారి (ఒక పొద్దు) ప్రతి రోజూ చదివితే మహా పాపములు కూడ నశిస్తాయి. రెండు పొద్దులూ (ఉదయము, సాయంత్రము) చదివిన వారికి పాపాలు తొలగడమే కాక ధనధాన్యములు కూడ లభిస్తాయి.
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్
మహాలక్ష్మీర్ భవేన్నిత్యం ప్రసన్నా, వరదా, శుభా ||
అర్థము:
మూడు పూటలా (అంటే మధ్యాన్నము కూడ) చదివిన యెడల శత్రువులు అందరూ నశిస్తారు. నిత్యమూ మహాలక్ష్మిని పొందుతారు. ఆమె ప్రసన్నతను, వరములను పొందుతూ క్షేమంగా సుఖంగా ఉంటారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి