22, డిసెంబర్ 2025, సోమవారం

తిరుప్పావై - పాశురము 08 - "కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు" - Tiruppavai - Paasuram 08


తిరుప్పావై ఎనిమిదవ పాశురములో గోదాదేవి, తదితరులు ఇంకో బాలికను లేపుతూ, తెల్లవారిన సూచనలు వర్ణిస్తూ, ఏమంటున్నారంటే "మేము నీకు కూడ ఈ వ్రత ఫలితము తక్కాలని ఎంచి, ఒక్కళ్ళమే వెళ్లిపోకుండా నిన్ను కూడ పిలుచుకు పోదామని ఆగి ఉన్నాము" అని అంటున్నారు. 

అంతే కాకుండ శ్రీకృష్ణుని వీరగాథలు, అతని ఆత్మీయతను తెలియజేయడము కూడ జరుగుతోంది.    


తిరుప్పావై - పాశురము 08 - "కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు" 

 

కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు, ఎఱుమై శిఱువీడు
మేయ్ వాన్ పరందన గాణ్, మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్
పోవాన్- పోకిన్ఱారై పోగామల్ కాత్తు, ఉన్నై 
కూవువాన్ వందు నిన్రోమ్, కోదు కలముడైయ,
పావాయ్! ఎళున్దిరాయ్! పాడి పఱై కొండు 
మావాయ్ పిళన్దానై మల్లరై మాట్టియ 
దేవాది దేవనై, చెన్ఱు నామ్ శేవిత్తాల్
ఆవావెన్ఱు ఆరాయ్ న్దు అరుళేలో రెమ్బావాయ్ || 

అర్థము:

తెల్లవారుతున్న సూచనగా తూర్పు దిశన ఆకాశపు టంచులలో వెలుగు రేఖలు పొడుచుకు వస్తున్నాయి. అది చూసి గేదలు మేత మేయటాని కని నలుదిశల బయలు దేరాయి. 

మనతో ఉన్న తక్కిన గోపికలు అందరూ త్వరత్వరగా శ్రీకృష్ణుని వద్దకు పోదామని వెళ్లిపోతుంటే వాళ్ళని ఆపి, నిన్ను కూడ తీసుకుని, అందరమూ కలిసి పోదామని వచ్చాము. 

కాబట్టి ఓ పిల్లా! లేచి రా. ఆయనను కీర్తించి పఱై అనే బహుమతిని పొందుదాము. 

ఎవరైతే (బకాసురుని) నోరు చీల్చి చంపాడో, మల్లయుద్ధములో ఇద్దరు మహా మల్లులను (కంసుని సభలో) హతమార్చెనో, ఆ దేవాధి దేవుడైన శ్రీకృష్ణుని చేరి మనము దర్శించుకుందాము. అప్పుడు ఆయన అయ్యో! ఇంత శ్రమపడి మీరొచ్చారా! నేనే మీ దగ్గరకు వచ్చేవాడిని గదా! అని బోళ్ళు ఆప్యాయతతో, జాలితో మనల్ని పలుకరించి కటాక్షించును. 

కాబట్టి వెంటనే లేచి వచ్చి మాతో బాటు పద.              

21, డిసెంబర్ 2025, ఆదివారం

తిరుప్పావై - పాశురము 07 - "కీశు కీశెన్ఱు ఎంగు" - Tiruppavai - Paasuram 07


తిరుప్పావై ఏడవ పాశురము ద్వారా రెండో బాలికను లేపుతూ ఆమె ఇంటి చుట్టుపక్కల అవుతున్న చప్పుళ్లను వివరించడము జరిగింది. ఆ చప్పుళ్లకు మెలకువ తెచ్చుకుని రాక ఇంకా పడుకున్నావేమిటని లేపుతున్నారు. భరధ్వాజ పక్షులు, మంగళసూత్రాలు, గాజుల చప్పుళ్ళు, పెరుగు చిలుకుతున్న చప్పుళ్ళని ఇందులో చెప్పడము జరుగుతోంది. 
  

తిరుప్పావై - పాశురము 07 - "కీశు కీశెన్ఱు ఎంగు" 


కీశు కీశెన్ఱు ఎంగుం ఆనైచ్చాత్తన్ కలందుఁ
పేశిన పేచ్చరవం కేట్టిలైయో, పేయప్పెణ్ణే?
కాశుమ్ పిఱప్పుమ్ కల కల ప్పక్కే పేర్తు
వాశ నఱుంగుళల్ ఆయచ్ఛియర్, మత్తినాల్
ఓశైపడుత్త తయిరరవమ్ కేట్టిలైయో,
నాయక పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్తి 
కేశవనై ప్పాడవుమ్ నీ కేట్టే కిడత్తియో 
తేశముడైయాయ్! తిఱవేలో రెమ్బావాయ్ ||  

అర్థము:

తెల్లవారిందనే బెంగతో భరధ్వాజ పక్షుల జంటలు (ఆహారాన్వేషణకై తాము విడిపోవు సమయము వచ్చిందనే బెంగ) కిచకిచమని చేసే ధ్వనులు నీకు వినబడటము లేదా? ఓ పెద్దింటి పిల్లా! (వెఱ్ఱిదానా అని కూడా చెప్పుకోవచ్చును. ఎందుకంటే ఇంకా తెల్లారలేదని భ్రమలో ఉంది.)

గొల్ల వనితలు తమ మెడలోని మంగళసూత్రాలు ఒకదానితో ఒకటి తగుల్కుని చేసే చప్పుళ్లు, గాజుల ధ్వనులు చేస్తూనూ, కవ్వములతో పెరుగు చిలుకుతున్న ఆ పెద్ద పెద్ద ధ్వనులు కూడ నీకు వినబడటం లేదా? ఓ నాయకుని కూతురా, మా నాయకురాలవు కదే నువ్వు. మేము చెప్పిన వాణ్ణి కూడ విని తెల్లవారిందనటంలో ఇంకేం సందేహము లేదని తెలుసుకో. 

సమస్త బ్రహ్మాండ మంతటా వ్యాప్తి చెంది ఉన్న ఆ నారాయణ మూర్తిని, కేశవుని అందరమూ పాడుతుంటే నీకు వినిపిస్తోంది కదా. మరి ఆలస్యము చేయక, మత్తు వదలి తలుపు తీసి మాతో పాటు పద.  

ఈ విధముగా రెండో గోపికను లేపి బయలుదేరారు.                    

20, డిసెంబర్ 2025, శనివారం

తిరుప్పావై - పాశురము - 06 - "పుళ్ళుమ్ శిలంబిన కాణ్" - Tiruppavai - Paasuram 06

తిరుప్పావై ఆరవ పాశురము తెల్లవారిన సమయము ఏ విధముగా ఉందో తెలియజేస్తోంది. 

మొదటి ఐదు పాశురములలో గోదాదేవి తిరుప్పావై వ్రతము యొక్క నియమాలను, ఫలితములను తెలియ జెప్పింది. ఆ పిమ్మట 6 నుండి 15 పాశురముల వరకు ఒక్కొక్క దానిలోను ఒక్కొక్క గోపికను లేపుకుంటూ వస్తుంది. ఆ విధముగా మొత్తం 10 మందిని లేపి తనతో బాటు స్నానము చేసి వ్రతము ఆరంభిస్తుంది.

 

ప్రతీ బాలికకి తెల్లవారినదను సూచనలు తెలియజేస్తూ లేపుతోంది. ఇప్పుడు ఆరవ పాశురములో ఏం చెప్పి లేపుతోందో చూద్దాము.  

 తిరుప్పావై - పాశురము - 06 - "పుళ్ళుమ్ శిలంబిన కాణ్" 

పుళ్ళుమ్ శిలంబిన కాణ్, పుళ్లఱైయన్ కోయిలిల్ 
వెళ్లై విళి శంగిన్ పేరఱవుమ్ కేట్టిలైయో ?
పిళ్ళాయ్! ఎళున్దిరాయ్, పేయ్ ములై నంజుండు 
కళ్ళ చ్చగడం కలక్కజియ క్కాలోచ్చి 
వెళ్ళ త్తరవిల్ తుయిల్ మఱంద విత్తినై 
ఉళ్ళత్తు క్కొండు మునివర్ గళుమ్, యోగిగళుమ్ 
మెళ్ళవెళుందు అఱి ఎన్ఱ పేరరవుమ్ 
ఉళ్ళం పుగుందు కుళిరిన్దేలో రెమ్బావాయ్ || 

అర్థము: 

పక్షులు కిలకిలారవములతో అంతటా ఎగురుతున్నాయి. పక్షుల రాజగు గరుత్మంతుని ప్రభువు గుడిలో స్వఛ్చముగా ఆహ్వానములు పలుకుతూ గట్టిగా ధ్వని చేయబడుతున్న శంఖారావము నీకు వినబడుట లేదా?

ఓ పిల్లా, లేచి రావమ్మా! పూతన యొక్క విశాల, విషపూరిత స్తనముల నుండి జుర్రుకుంటూ ఆమె రక్తమునంతా పీల్చేసి, మరియు మాయల మారి శకట రూపములో నున్న శకటాసురుని కీళ్లూడిపోయేలా తన కాలితో తన్ని చంపిన వాడును, పాలకడలిలో ఆదిశేషునిపై యోగనిద్రలో పరుండి ఉన్నవాడునూ అయినా ఆ శ్రీమన్నారాయణునికి శ్రమ కలుగకుండ తమ మనస్సులలోనే మెల్లగా "హరి హరి" అని ధ్యానించుకుంటూ వెళ్తున్న లోకములోని మునులు, యోగులూ చేస్తున్న ధ్యానమంతా కూడ ఒక చిరుగాలి రూపములో మా మనస్సులకు తగిలి మాకు వెలువ వచ్చింది.  

ఈ విధముగా మేలుకుని మేమంతా కూడ వ్రతము కోసమని బయలు దేరాము. అలా మేము చిరుగాలి ధ్వనికే లేచి వచ్చాము. మరి మేమంతా పిలుస్తున్నా రాకపోతే ఎలా? త్వరగా లేచి బయలు దేరుము. 

గోదాదేవి పదిమంది గోపికలను లేపుతూ 10 పాశురాలు అల్లింది. కాని తను ముందుగానే ఇంకో ఒకరిద్దరితో కలిసి బయలు దేరింది అని మనము తెలుసుకోవాలి.              

19, డిసెంబర్ 2025, శుక్రవారం

తిరుప్పావై - పాశురము 05 - "మాయనై మన్ను" - Tiruppavai - Paasuram 05


తిరుప్పావై ఐదవ పాశురము కూడ ఈ వ్రతము చేయుట వల్ల కలిగే ఫలితాన్నే తెలియజేస్తూ, కృష్ణపరమాత్మ మహిమలను విశదీకరిస్తూ, గోదాదేవి మరొకసారి గోపికలందరికీ ప్రోత్సాహన కలిగించడము జరుగుతోంది.

కష్టమైన పని చెయ్యాలంటే అందరికి బద్ధకమే. తెల్లవారు ఝామునే లేచి నదిలో స్నానము చేసి, కొన్ని కఠినమైన నియమాలతో వ్రతము చేద్దామని గోదాదేవి అంటోంది కదా. మరి అలా చేయడం వల్ల మన కష్టమే కనిపిస్తుంది కాని దాని వల్ల ప్రయోజనము ఏముంటుంది అని సందేహాలు ఉంటాయి. ఆ సందేహాల్ని తీర్చడం కోసం ఆమె ఏమి చెబుతూ వాళ్ళని పురమాయిస్తోందో చూద్దాము. 


తిరుప్పావై - పాశురము 05 - "మాయనై మన్నువడమదురై మైన్దనై"

మాయనై మన్ను వడమదురై మైందనై
త్తూయ పెఱునీర్ యమునై త్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోన్ఱుమ్ మణివిళక్కై
తాయై కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై;
తూయోమాయ్ వందు నామ్ తూమలర్ తూ విత్తొళుదు 
వాయినాల్ ప్పాడి మనత్తినాల్ శిందిక్క 
పోయ పిళై యుమ్ పుగు తరువాన్ ఇన్ఱుఅనవుమ్
తీయినిల్ తూశాగుమ్ శెప్పే లో రెమ్బావాయ్ || 

అర్థము:

మాయావి అంటే మాయలు చేసి మన హృదయములను ఆకట్టుకునేవాడు. అటువంటి ఆశ్చర్యకరములైన మాయలు కలిగినవాడు, ఉత్తర మథుర నివాసి అగు శ్రీకృష్ణ పరమాత్మ, నిర్మలము, పవిత్రము అయిన యమునా తీరమందలి గొల్ల కులమందు మనకై ఆవిర్భవించెను.

గొల్లకులమంతటికీ ఒక రత్న దీపము వంటి యశోదమ్మ గర్భమును పవిత్రము, దేదీప్యమానము గావించెను. అతను దామోదరుడు. పద్మము నాభి యందు కలవాడు. ప్రపంచమంతా తన ఉదరములో ధరించినవాడు. 

అటువంటి ఆ పరమాత్మను నిదుర వదలి, ఎటువంటి సందేహములు, భ్రమలు లేకుండ మన హృదయమనే పద్మమును సమర్పించి, నోటితో కీర్తిస్తూ, మనస్సుతో ధ్యానించుదాము. 

అప్పుడు మనకు ఇప్పటి వరకునూ ఉన్న, మరియు ఇకముందు రాబోయే పాపాలన్నీ కూడ మంటల్లో పడిన దూది పింజలలాగా తత్క్షణమే కాలిపోయి, మన వ్రతము నిరాటంకముగా
కొనసాగును. 

కాబట్టి అందరూ లేచి రండి. భగవన్నామ కీర్తన చేసుకుంటూ వ్రతాన్ని మొదలు పెడుదాము.  

           

18, డిసెంబర్ 2025, గురువారం

తిరుప్పావై - పాశురము - 04 - ఆళి మళై కణ్ణా - Tiruppavai - Paasuram 04


తిరుప్పావై నాలుగవ పాశురములో "ఆళి మళై కణ్ణా" అంటూ ముద్దుగా వానదేవుని (వరుణుని) వేడుకుంటోంది గోదాదేవి. మంచిగా వానలు కురిపించమని, అప్పుడు అందరమూ ఆ పవిత్రమైన నీటిలో స్నానం చేసి ధన్యులము అవుతామని. 

ఏదైనా వ్రతము చెయ్యాలన్నా, లేదా రోజూ చేసుకునే పూజ కోసమైనా ముందుగా పవిత్రత ముఖ్యము. శరీరాన్ని, మనసుని పవిత్రం చేసుకోవాలి. మనస్సు పవిత్రతకు శరీర పవిత్రత ఒక నాంది లాంటిది. శరీరాన్ని శుభ్రము చేసుకుని, పవిత్రమైన (ఉతికి ఆరేసిన) బట్టలు ధరిస్తే మనస్సుకి ఆహ్లాదముగా ఉంటుంది. అప్పుడు మనస్సు కూడా పవిత్రతకు చోటు చేసుకుంటుంది. 

ఇప్పుడు నాలుగవ పాశురము, దాని అర్థములు తెలియజేస్తున్నాను.  


ఆళి మళై కణ్ణా ఒన్ఱు నీ క్కై కరవేల్,
ఆళి యుళ్ పుక్కు ముగన్దు కొడార్ తేఱి 
ఊళి ముదల్వ నురువంబోల్ మెయ్ కఱుత్తు, 
పాళి యందోళుడై పఱ్ప నాబన్ కై యిల్ 
ఆళి పోల్, మిన్ని వలమ్బురిపోల్ నిన్ర దిర్ న్దు, 
తాళా దే శార్ఙ్గ ముదైత్త శర మళై పోల్, 
వాళ వులకినిల్ నీ పెయ్ దిడాయ్, నాంగళుమ్ 
మార్గళి నీరాడ మగిళ్ న్దేలో రెమ్బావాయ్ || 

అర్థము:

ఓ, వానదేవుడా, పర్జన్యుడా! నువ్వు దయచేసి ఒక పని చెయ్యి. 

సముద్రములోకి చొచ్చుకు పోయి, నిండా మునిగి, తాగ గలిగి నన్నినీళ్లన్నీ తాగి, పైకి ఎగసి పోయి, భూమి అంతటా దద్దరిల్లు మాదిరి గర్జనలతో ఆకాశమంతటా వ్యాపించిపోయి, కటిక నీల మేఘాలు ధరించి, ఆ పద్మనాభుడి చేతిలోని సుదర్శన చక్రము వలె మెరుపులు మెరుస్తూ, ఆయన శంఖ ధ్వని వలె చప్పుళ్ళు చేస్తూ, ఆయన యొక్క శార్ఙ్గ ధనుస్సు నుండి ఎడతెరిపి లేకుండా వెలువడే బాణాల లాగ వర్షపు ధారలు ఈ లోకమంతటా కురిపించుము. 

అప్పుడు మేము ఆ వర్షపు నీటిలో స్నానమాచరించి ధన్యులము అవుతాము సుమా.                


17, డిసెంబర్ 2025, బుధవారం

తిరుప్పావై - పాశురము 03 - "ఓంగి ఉలగళంద" - Tiruppavai - Paasuram 03


"ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి"

తిరుప్పావై మూడవ పాశురములో గోదాదేవి ఈ తిరుప్పావై వ్రతము ఆచరిస్తే కలిగే లాభము, ఫలితములను వివరిస్తోంది. ప్రపంచమంతటా కూడా వర్షములు పడి పంటచేలతోను, పశు సంపదతోను, ఐశ్వర్యముతోను అందరూ సుఖంగా ఉంటారని చెబుతోంది. 




తిరుప్పావై - పాశురము 03   

ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి
నాంగళ్ నమ్బావైక్కు శాత్తి నీరాడినాల్
తీంగిన్రి నాడెల్లామ్ తింగళ్ ముమ్మారి పెయిదు 
ఓంగు పెరుం శెన్నెల్ ఊడు కయలుగళ 
పూంగు వళై ప్పోదిల్ ప్పొఱివణ్ణు కణ్ పడుప్ప 
త్తెంగా దే పుక్కిరందు శీత్తములై పత్తి 
వాంగ క్కుడం నిరైక్కుమ్ వళ్ళల్ పెరుం పశుక్కళ్ 
నీంగాద శెల్వమ్ నిరైందే లో రెమ్బావాయ్ ||    

అర్థము:

పెద్దగా పెరిగి ప్రపంచాన్ని కొలిచిన ఆ ఉత్తముడైన పరమాత్మను పొగడుతూ కీర్తించి, మనము దృఢమైన భక్తి విశ్వాసములతో ఈ వ్రతాన్ని పాటిస్తే:

ఈ ప్రపంచమంతటా కూడ ఎటువంటి ఇబ్బంది కలుగని విధముగా నెలకు మూడు వర్షములు కురియును. పంట చేలు ఏపుగా పెరిగి నాట్యము చేస్తాయి. 

ఆ చేల మధ్యలందునూ, నీటి కాలువ లందునూ చేపలు ఎగిరెగిరి గంతులు వేస్తూండును. తుమ్మెదలు అందామైన రెక్కలతో అంతటా విహరిస్తూ తేనెలు తాగి మత్తులో మునుగుతూంటాయి. 

బాగా బలిష్టమైన పశువులు పెద్ద పెద్ద బిందెల నిండా పాలు నింపేస్తూంటాయి. 

ఈ విధంగా అంతటా సుభిక్షం, ఐశ్వర్యములతో మునిగి తేలుతుంటారు అంతా. 

కాబట్టి పదండి ఈ వ్రతము చేద్దాము.       
        

16, డిసెంబర్ 2025, మంగళవారం

తిరుప్పావై - పాశురము 02 - వైయత్తు వాఙవీర్ గాళ్- Tiruppavai - Paasuram 02


తిరుప్పావై - పాశురము 2 - "వైయత్తు వాఙవీర్గాళ్"

ఈ రెండవ పాశురములో గోదాదేవి తిరుప్పావై వ్రతాన్ని చెయ్యడానికి నియమాలని చెబుతోంది. 

వ్రతము చేసేటప్పుడు మనము శుచిగా, నిష్కల్మషముగా ఉండాలి. భోగములను పక్కకి నెట్టెయ్యాలి. మితముగా భోజనము, మితముగా నిద్ర పాటించాలి. ఆడంబరములగు బట్టలు కానీ, ఆభరణములు కానీ, అలంకరణ సామాగ్రులను కాని వాడకూడదు. అవన్నీ ఆ భగవంతునికే పరిమితము చెయ్యాలి. 


ఇప్పుడు పాశురము తెలియజేస్తున్నాను.  


వైయత్తు వాఙవీర్ గాళ్ ! నాముమ్ నమ్బావైక్కు 
శెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో, పార్కడలుళ్ 
పైయత్తు యిన్ఱ పరమనడి పాడి 
నెయ్యుణ్ణోమ్, పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి 
మైయెట్టుళుదోం మలరిట్టు నా ముడియోమ్ 
శెయ్యోదన శెయ్యోమ్ తీక్కుఱళై శెన్రోదోమ్
అయ్యముమ్ పిచ్చెయుమ్ ఆందనైయుమ్ కై కాట్టి 
ఉయ్యుమాఱెణ్ణి యుగన్దే లో రెమ్బావాయ్ || 

అర్థము:

ఓ, భూమిపై(దుఃఖములు, సంఘర్షణలతో నిండి ఉన్న ఈ ప్రపంచములో పుట్టినప్పటికీ) సుఖాలు అనుభవిస్తున్నగోపికా మణులారా! మనము ఇప్పుడు చేయబోయే ఈ వ్రతము ఎలా ఆచరించాలో వినండి, చెబుతున్నాను. 

పాలకడలి యందు శయనించే ఆ పరమాత్ముడిని కీర్తించాలి. భోగ పదార్థములైన నెయ్యి, పాలు తాగకుందుము.

తెల్లవారు ఝామునే స్నానము చేద్దాము. 

కాటుక పెట్టుకోము. పువ్వులు, దండలు ధరించము. 

చెయ్యకూడని పనులు చెయ్యము. పెద్దలు చెప్పిన విధముగా మంచిగా మసలుకుందాము. తీక్కురళ్ అంటే తిరువళ్ళువరు చెప్పిన పధ్ధతి ప్రకారము అని కూడా అర్థము. అంటే సత్య, ధర్మ నిష్ఠలతో నడచుకొనుట. 

పెద్దవారలను గౌరవిస్తూ, భిక్షులకు చేతనైనంత, తగినంత సాయము చేస్తూ గడుపుదాము.

ఇలా శాశ్వతమగు ఆత్మ సుఖాన్ని, మోక్షాన్ని అందించే ఈ వ్రతమును ఆచరించుదము.               

  

15, డిసెంబర్ 2025, సోమవారం

తిరుప్పావై - పాశురము 01 - మార్గళి త్తింగళ్- Tiruppavai - Paasuram 01


తిరుప్పావై వ్రతము చేయువారు రోజుకొక పాశురము చొప్పున మొత్తం 30 రోజులలో 30 పాశురములు చదువుతూ శ్రీకృష్ణుడు, శ్రీరంగనాథస్వామి రూపములలో ఆ శ్రీమన్నారాయణుని భక్తితో పూజిస్తూ, పొంగలి వండి ఆరగింపు పెడుతూ, పూజ చేసుకోవాలి. 

ఆ పాశురాలనే నేను తెలుగు భాషలో అర్థములతో సహా రోజూ ఒక పోస్టు చొప్పున మొత్తము 30 పోస్టులలో తెలియజేస్తున్నాను.


 

ఒకటవ పాశురము - "మార్గళి త్తింగళ్" 

మార్గళి త్తింగళ్ మదినిఁరైంద నన్నాళాల్  
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళై యీర్ !
శీర్ మల్ గుమ్ ఆయ్ ప్పాడి శెల్వ చ్చిఱు మీర్ గాళ్!
కూర్వేల్ కొళున్దొళన్ నందగోపన్ కుమరన్
ఏఱార్ న్ద కణ్ణి యశోధై ఇళం శింగం  
కార్మేని చెంగణ్ కదిర్ మదియంబోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱై తరువాన్ 
పారోర్ పుగళ్ పడిం దేలోర్ ఎమ్బావాయ్ || 

అర్థము:

మార్గళి మాసము నిండు వెన్నెల హృదయమంతా నింపుకున్న శుభదినములలో స్నానం చేయుదాము పదండి. ఇక్కడ స్నానము అంటే వ్రతము గావించుట కోసమై స్నానము చెయ్యడము. ఇలా వ్రతము చేసే మక్కువతో రాదలచిన వారందరూ పదండి స్నానము చేద్దాము. 

ఓ సంపదలతో తులతూగు ఆయ్ ప్పాడి (నందుని ఊరు పేరు) లో నివసించు భాగ్యము పొందిన గోప బాలికలారా! పదండి శ్రీ కృష్ణుని ధ్యానము చేద్దాము. 

ఈ విధముగా నిష్ఠతో వ్రతము చేసిన యెడల:

పదునైన బల్లెము ధరించి బల పరాక్రమము లతో తన ప్రజలను కాపాడుకునే నందగోపుని కుమారుడూ, అందమైన, విప్పారిన కన్నులు కలిగిన యశోదమ్మ యొక్క సింహ కిశోరుడైన వాడునూ, నల్లని వాడు, ఎర్రని తామరల వంటి కనులవాడునూ, తేజోవంతమైన కిరణముల ప్రసరింప జేయు మోము కలవాడునూ, అయినటువంటి శ్రీమన్నారాయణుడు, ప్రపంచమంతటా మన కీర్తి వ్యాపించే విధముగా, మనకు బహుమతులను అందజేయును. 

పఱై ఇస్తాడు అంటే మామూలు అర్థము వాద్యము ఇస్తాడని. కాని గోదాదేవి చెప్పే పఱై మోక్షముతో సమానమైన బహుమానము ఇస్తాడని భావించాలి. 

అలాగే స్నానము చేయడము అంటే భక్తిలో ములిగి పవిత్రులు అవడము అని తెలుసుకోవాలి. 

భక్తితో ఆ యశోదమ్మ ముద్దుల కొడుకుని సేవించి జన్మ తరించుకోవడానికి, ముక్తిని పొందటానికి అందరూ పదండి అని ఆండాళ్ మాత మనకి చెబుతోంది.             
   

10, డిసెంబర్ 2025, బుధవారం

అష్టలక్ష్మీ పూజా శ్లోకములు - Goddess Lakshmi Puja Hymns


అష్టలక్ష్మీ పూజ అంటే లక్ష్మీదేవిని ఎనిమిది రూపాలలో కొలుచుట. 

శ్రీమహావిష్ణువు లాగానే లక్ష్మీదేవి కూడ ఎన్నో అవతారాలు దాల్చింది అని పురాణాలు చెప్తాయి. ఆ అవతారములలో ముఖ్యమైన కొన్ని రూపాలని మనము ఎదో ఒక సందర్భములో తలుచుకుంటూనే ఉంటాము. 

ఆ రూపాలని స్మరించుకుంటూ పూజించుకోవడానికి వీలుగా ఈ అష్టలక్ష్మీ స్తుతిని మన పెద్దలు సృష్టించారు. 

వారిలో ఒకరు శ్రీదత్త పీఠాధీశ్వరులైన శ్రీ సచ్చిదానంద యతివరులు.  

ఆ పూజా శ్లోకాలనే నేను ఇక్కడ అర్థములతో సహా తెలియబరచు చున్నాను.   




రథమధ్యా మశ్వపూర్వామ్ గజనాథ ప్రభోదినీమ్
సామ్రాజ్య దాయినీం దేవీమ్ గజలక్ష్మీమ్ నమామ్యహమ్ || (1)

అర్థము:

రథము నందు గుర్రములు, ఏనుగులు ముందుగా ఉండి రాజఠీవిని ఎలాగైతే ఒలికిస్తాయో, అలాగే మాలోని ఉన్నతత్వమును పైకి లేపి సామ్రాజ్యత్వాన్ని  ప్రసాదించు దేవీ, ఓ గజలక్ష్మీ, నీకు నా వందనములు.

  
ధనమగ్ని ర్ధనం వాయుః ధనం భూతాని పంచచ 
ప్రభూతైశ్వర్య సంధాత్రీమ్ ధనలక్ష్మీమ్ నమామ్యహమ్ || (2)

అర్థము:
ధనమే అగ్ని, ధనమే వాయువు, ధనమే పంచభూతములుగా అన్నింటినీ సమన్వయ పరుస్తూ,  మాకు సకల సంపదలను కూడగట్టుచుండు ఓ ధనలక్ష్మీ, నీకు నా వందనములు.  


పృథ్వీగర్భ సముద్రిన్న నానావ్రీహి స్వరూపిణీం
పశుసంపత్ స్వరూపాంచ ధాన్యలక్ష్మీమ్ నమామ్యహమ్ || (3)

అర్థము:
భూ గర్భములో, సముద్రములో, సకల ధాన్యముల స్వరూపములు, పశుసంపదల స్వరూపములు, అన్నీ నీవై ఉండే ఓ ధాన్యలక్ష్మీ, నీకివే నా వందనములు.   


నమాత్సర్యం, నచ క్రోధో, నభీతి ర్నచ భేదధీహ్  
యద్ భక్తానాం వినీతానాం ధైర్యలక్ష్మీమ్ నమామ్యహమ్ || (4)

అర్థము:

ఈర్ష్యాసూయలు, కోపము, పిరికితనము, భేదభావముల వంటి లోపములను తొలగిస్తూ, సజ్జనులైన భక్తులకు ధైర్యము నొసగు ఓ ధైర్యలక్ష్మీ, నీకు నా వందనములు.    


పుత్ర పౌత్ర స్వరూపేణ పశుభృత్యాత్మనా స్వయం 
సంభవంతీంచ సంతానలక్ష్మీమ్ దేవీమ్ నమామ్యహమ్ || (5)

అర్థము:

పుత్రులు, పౌత్రులు (కొడుకు కూతుళ్లు, మనుమళ్ళు మనవరాళ్లు) ద్వారా సంతాన రూపములో ఉంటూ, పశువులు మొదలగు అన్ని జీవులలోను నీవే నెలవై ఉంటూండే ఓ సంతానలక్ష్మీ, నీకు నా వందనములు.    


నానావిజ్ఞాన సంధాత్రీమ్ బుధ్ధిశుద్ధి ప్రదాయినీం 
అమృతత్వ ప్రదాత్రీమ్ చ విద్యాలక్ష్మీమ్ నమామ్యహమ్ || (6)

అర్థము:

సకల విద్యలను పెంపొందింప జేస్తూ, బుధ్ధి పవిత్రతలను ఒసగుచూ, అమృతత్వమును ప్రసాదించు ఓ విద్యాలక్ష్మీ, నీకు నా వందనములు. 


నిత్యసౌభాగ్య సౌశీల్యం వరలక్ష్మీ దదాతియా 
ప్రసన్నాం స్త్రైణ సులభామ్ ఆదిలక్ష్మీమ్ నమామ్యహమ్ || (7)

అర్థము:

నిత్య సౌభాగ్యాన్ని, మాంగళ్యాన్ని, సుశీలత్వమును, వరలక్ష్మివిగా ప్రసాదిస్తూ మాపై కరుణ జూపుము. స్త్రీలకు అందుబాటులో ఉంటూ ఆదుకునే ఓ ఆదిలక్ష్మీ, నీకు మా వందనములు.    


సర్వశక్తి స్వరూపామ్ చ సర్వసిధ్ధి ప్రదాయినీం 
సర్వేశ్వరీం శ్రీ విజయలక్ష్మీమ్ దేవీమ్ నమామ్యహమ్ || (8)

అర్థము:

అన్ని శక్తులూ నీవే అయి ఉండి, సకల సిధ్ధులూ, కౌశలములను ప్రసాదించు ఓ సర్వేశ్వరీ, విజయలక్ష్మీ, నీకు మా వందనములు.  


అష్ఠలక్ష్మీ సమాహార స్వరూపామ్ తాం హరిప్రియాం 
మోక్షలక్ష్మీమ్ మహాలక్ష్మీమ్ సర్వలక్ష్మీమ్ నమామ్యహమ్ || (9)

అర్థము:

అష్టలక్ష్ముల సమన్వయత గా ఉండే నీవు హరిప్రియవు (శ్రీహరి కి ప్రియురాలవు), మోక్షమును ప్రసాదించు దానవు. నీవు సర్వలక్ష్మివి, మహాలక్ష్మివి. ఓ సర్వలక్ష్మీ నీకు మా వందనములు.  


దారిద్య దుఖః హరణం సమృధ్ధి రపి సంపదాం 
సచ్చిదానంద పూర్ణత్వం అష్టలక్ష్మీ స్తుతేర్ భవత్ || (10)

అర్థము:
 
ఈ అష్టలక్ష్మీ స్తుతి చేసినవారికి దరిద్రత, దుఃఖములు తొలగిపోయి, అన్ని సంపదలు కలుగుతాయి. అట్టివారు సచ్చిదానంద పరిపూర్ణులు అవుతారు. సత్ అంటే నిజము, చిత్ అంటే జ్ఞానము. సచ్చిదానందము అంటే వారి భ్రమలు, సందేహములు తీరిపోయి, జ్ఞానవంతులై, సత్ప్రవర్తనతో నడుచుకుంటూ, సుఖఃసంతోషములతో ఆనందమయ జీవితము పొందుతారు.   


ఇతి శ్రీ గణపతి సచ్చిదానంద యతివర విరచిత అష్ఠ లక్ష్మీ స్తుతి సంపూర్ణమ్ ||   

ఈ అష్టలక్ష్మీ స్తుతిని శ్రీదత్త పీఠాధీశ్వరులైన శ్రీ సచ్చిదానంద యతివరులు ప్రస్తుతించారు.               

 

5, డిసెంబర్ 2025, శుక్రవారం

శ్రీ లక్ష్మీ అష్టకమ్ - Lakshmi Worship With 8 Hymns



శ్రీ మహాలక్ష్మీ అష్టకమ్:  

నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే || (1)

నమస్తే గురుడారూఢే కోలాసుర భయంకరి 
సర్వపాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే || (2)

అర్థము:
ఒక అడవిపంది ఆకారములో ఉన్న రాక్షసుడు దేవతల మీది కోపముతో ప్రజలందరినీ హింసించుచుండగా, అంతా కలిసి లక్ష్మీదేవిని ప్రార్ధిస్తారు. ఆమె ఆ రాక్షసుని చంపి అతని కోరిక ప్రకారము ఆ ఊరికి కోలాపురం అని పేరు పెట్టి, అక్కడే తను అంబాబాయి పేరుతొ వెలిసింది. అదే మహారాష్ట్ర లోని ఇప్పటి కోల్హాపూర్ నగరము. అట్టి మహాలక్ష్మికి నా వందనములు.     

సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ఠ భయంకరి 
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే || (3)

సిద్ధిబుధ్ధి ప్రదే దేవి భుక్తిముక్తి ప్రదాయిని 
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే || (4)

ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి 
యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే || (5)

స్థూలసూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే 
మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే || (6)

పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి 
పరమేశ్వరి జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే || (7)

శ్వేతాంబర ధరే దేవి నానాలంకార భూషితే 
జగత్ స్థితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే || (8)

ఫలశ్రుతి 


మహాలక్ష్మ్యష్టకమ్ స్తోత్రమ్ యః పఠేత్ భక్తిమాన్నరః 
సర్వసిధ్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా || 

ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ 
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్య సమన్వితః ||

త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్  
మహాలక్ష్మీర్ భవేన్నిత్యం ప్రసన్నా, వరదా, శుభా ||