3, ఆగస్టు 2024, శనివారం

శ్రీ లక్ష్మీ స్తుతి - స్తోత్రాలు / Lakshmi Puja Lyrics in Telugu


రోజూ పూజ చేసేటప్పుడు ముందుగా తల్లితండ్రులని, గురువులని తలుచుకుంటూ పూజ మొదలెడుతాము. పూజలో ముందుగా 24 కేశవ నామాలు చదివి,  ఆ తరువాత వినాయకుడుని స్మరించి, పిమ్మట లక్ష్మీదేవిని పూజించి, అప్పుడు విష్ణు స్తోత్రాలు, మిగతా పూజ చేసుకోవాలి. 

విఘ్నేశ్వరుని స్తోత్రాలు ఇంతకు ముందు పోస్టులో తెలియజేశాను. 




కేశవనామాలు ఇంకో పోస్ట్ లో వివరించడం జరిగింది. 

ఇప్పుడు ఈ పోస్టులో లక్ష్మీదేవి స్తోత్రాలు కొన్ని ఇస్తున్నాను. ఇవి చదువుకుని మిగతా పూజ చేసేసుకోవచ్చును. ఈ స్తోత్రాలకి అర్ధాలు కూడ తెలియజేస్తున్నాను.  


శ్రీ లక్ష్మీ స్తుతి స్తోత్రాలు 


వందే పద్మకరాం, ప్రసన్న వదనాం, సౌభాగ్యదాం, భాగ్యదాం, 
హస్తాభ్యాం అభయ ప్రదాం, మణి గణైర్, నానా విధైర్ భూషితామ్, 
భక్తా భిష్ట ఫల ప్రదాం, హరిహర బ్రహ్మాదిభి స్సేవితాం, 
పార్శ్వే పంకజ, శంఖ, పద్మ, నిధిభి ర్యుక్తాం,  సదా శక్తిభి: ॥

అర్థము:

ఓ అమ్మా, లక్ష్మీ మాతా! పద్మములను పోలిన చేతులు కలిగి (పద్మము చేత్తో పట్టుకుని), ప్రసన్నమైన ముఖము కలిగి, సౌభాగ్యాన్ని, భాగ్యాన్ని ప్రసాదిస్తూ, చేతులతో అభయాన్ని కూడా అందిస్తూ, నానావిధములైన మణుల, ఆభరణములతో అలంకరింపబడిన దానివై, భక్తుల కోరికలన్నీ తీరుస్తూ, విష్ణువు, శివుడు, బ్రహ్మల చేత పూజింపబడుతూ, నీ నాల్గు పక్కల నాలుగు చేతులలో కమలము, శంఖము, పద్మము, ఐశ్వర్య సంపద ధరించి,  ఎల్ల వేళలా శక్తి దాల్చిన నీకు నా పాదాభివందనములు సమర్పించు చున్నాను .   
 

సరసిజ నయనే, సరోజ హస్తే, ధవళతరాంశుక గంధమాల్య శోభే, 
భగవతి, హరివల్లభే, మనోజ్ఞే, త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్ ||

అర్థము:

ఓ తల్లీ, కమలముల వంటి కనులు, హస్తములు కలిగి, తెల్లని పుష్పమాలికల దండలు ధరించిన అమ్మా! ఓ భగవతీ, శ్రీహరి ప్రియసఖీ, సర్వము ఎఱిగిన తల్లీ, ముల్లోకముల లోని ప్రాణులందరినీ ఎల్లవేళలా రక్షిస్తూ ఉండు మాతా!
  

లక్ష్మీం, క్షీర సముద్రరాజ తనయాం, శ్రీరంగ ధామేశ్వరీం, 
దాసీ భూత సమస్త దేవ వనితాం, లోకైక దీపాంకురాం, 
శ్రీమన్ మందకటాక్ష, లభ్ద ,విభవ బ్రహ్మేంద్ర గంగా ధరాం, 
త్వాం, త్రైలోక్య కుటుంబినీం, సరసిజాం, వందే ముకుంద ప్రియాం  ॥ 

అర్థము:

ఓ లక్ష్మీమాత! పాల సముద్రారాజ తనయీ , శ్రీరంగక్షేత్ర ఈశ్వరీ , సమస్త భూత గణములు, దాసదాసులు, దేవ వనితలకూ,  సమస్త లోకాలకు వెలుగుని ప్రసాదించే ఏకైక జ్యోతివి నీవు. నీ చల్లని కృపా కటాక్షములచే బ్రహ్మ, ఇంద్రుడు, గంగాధరుడైన శివుడు వైభవాన్ని పొందుచున్నారు. ఓ మాతా, ముల్లోక నివాసినివైన నీకు, పద్మము నుండి వెలసిన నీకు, ఇవే నా నమస్సులు ఓ ముకుందుని ప్రియసఖీ!
 

మాతర్ నమామి, కమలే, కమలాయతాక్షి , 
శ్రీ విష్ణు హృత్కమల వాసిని, విశ్వమాత, 
క్షీరోదజే, కమల కోమల గర్భ, గౌరి, 
లక్ష్మీ ప్రసీద, సతతం, నమతాం శరణ్యే  ॥

అర్థము:

తల్లీ నీకు వందనములు! ఓ కమలమా! కమలములు పోలిన కనులున్న మాతా!  మహావిష్ణువు హృదయము నందు నివసించే, సమస్త విశ్వానికి తల్లీ! పాలకడలి నుండి పుట్టిన, కోమలములైన కమలముల గర్భమందుండే ఓ గౌరీమాతా , ఓ లక్ష్మీదేవీ, ఎల్లవేళలా రక్షింపుము తల్లీ, నిన్నే శరణు వేడుచున్నాను.  

For lyrics in English along with their meanings, please click Here

4, జులై 2024, గురువారం

వరలక్ష్మీ వ్రతము - Varalakshmi Vratam Celebration


వరలక్ష్మీ వ్రతము ప్రతి ఏడాది శ్రావణ మాసంలో రెండవ శుక్రవారము రోజున జరుపుకుంటారు. 

వరలక్ష్మి అంటే వరముల నొసగే లక్ష్మీదేవి. భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి వరముల నొసగే తల్లి ఆమె.

సాధారణముగా ప్రతీ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం మన అలవాటు. శుక్రవారం ఆ తల్లికి ప్రియమైన రోజు అని ఒక నమ్మకము. మరి శ్రావణ మాసం అంటే లక్ష్మిదేవికి ఇంకా చాలా ఇష్టమైన దన్నమాట. 

అందుకే శ్రావణ మాసంలో ఇంకా చాలా భక్తి శ్రద్ధలతో అందరూ పూజిస్తున్నారు. 

ఆడ, మగ అందరమూ శుక్రవారాల్లో ఆమెను చాలా ఇష్టంగా పూజిస్తున్నాము. కానీ శుక్రవారం నాడు ప్రత్యేకంగా స్త్రీలు లక్ష్మీదేవిని చాల శ్రద్ధతో వ్రతంలాగా జరుపుకుంటుంటారు. 

శ్రావణ మాసం మాత్రం చాల ప్రత్యేకంగా తల్లులు, కూతుళ్ళూ కూడ ప్రతీ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటే వారికి అన్ని సుఖాలు, సౌభాగ్యాలు లభిస్తాయని ప్రతీతి. 

శ్రావణ మాసంలో 4 కాని 5 కాని శుక్రవారాలుంటాయి. వాటిలో రెండవ శుక్రవారం నాడు ఈ వ్రతం తప్పకుండా అతి ప్రాధాన్యంతో జరుపుకుంటే మొత్తం వారి కుటుంబం సుఖ, సంతోషాలతో ఉండడమే కాకుండా వారు కోరిన కోర్కెలన్నీ ఆ తల్లి తీరుస్తుందని పెద్ద నమ్మకంతో ఉంటారు. అందుకే వరలక్ష్మి వ్రతానికి అంత ప్రాధాన్యత ఇస్తారు.     

వరలక్ష్మీ వ్రతము చేయు విధానము 

సాధారణంగా ఈ వ్రతాన్ని స్త్రీలంతా సాయంత్రము జరుపుకుంటుంటారు. ఎందుకంటే పగలంతా కూడ పనులతో, ఇంకా ఆఫీసు కెళ్లే వారైతే ఆఫీస్ పనిలో మునిగి ఉంటారు. కాబట్టి పొద్దున్నే పూజ చేసుకుంటూ కూర్చుంటే గడవదు. అందుకని సాయంత్రం చేసుకుంటారు. అంతే కాని ఈ వ్రతాన్ని సాయంత్రమే చెయ్యాలని ఏం రూలు లేదు. పొద్దుట కూడ తాపీగా కూర్చుని చక్కగా చేసుకోవచ్చును. 

ఇది కాక సాయంత్రం పూట దీపాలు వెలిగించే వేళ లక్ష్మిదేవి ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఎవరెవరు దీపాలు వెలిగించుకుని ఆమెను తలుచుకుంటారో వారి వారి ఇంటికెళ్లి వాళ్ళని ఆశీర్వదిస్తుందని మనందరి నమ్మకం. 

ఇప్పుడు వరలక్ష్మి పూజకి తయారీలు 

  • పూజకి ముందు రోజుగా చుట్టుపక్కల వారిని బొట్టు పెట్టి పూజ,పేరంటాలకు ఆహ్వానిస్తారు. అంతే కాక శెనగలు నీళ్లలో నానబెట్టి ఉంచుకుంటారు. ఆ శెనగలని కూడా నైవేద్యంతో పాటు లక్ష్మీదేవికి పెట్టి అందరికీ పూజానంతరం ప్రసాదంగా పంచి పెడతారు. 
  • పూజ రోజున పొద్దుటే తలంటు స్నానము చేసి శుభ్రమైన బట్టలు కట్టుకుని తయారు కావాలి. 
  • ఇల్లు శుభ్రం చేసుకుని పెట్టుకుని స్నానం చేస్తే మంచిది. 
  • పూజామందిరం లేదా పూజ చేసుకునే స్థలం కూడా శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. 
  • ఇంటి గడపలకి పసుపు రాసి, కుంకం బొట్లు పెట్టుకుని, అప్పుడు తోరణాలు, మామిడాకులు కట్టుకోవాలి. 
  • అలాగే పూజాస్థలంలో దేవుణ్ణి పెట్టే చోట కూడ కాస్త తడిబట్టతో తుడిచి పసుపు, కుంకం పెట్టుకోవచ్చును. అలా శుభ్రమైన స్థలంలో దేవుణ్ణి పెట్టుకుని పూజించుకోవాలి. 
  • స్త్రీలు కూడా పాదాలకి పసుపు రాసుకుని, శుభ్రంగా బొట్టు పెట్టుకుని, గాజులు ధరించి, తలలో పువ్వులు పెట్టుకుని పూజ చేసుకోవాలి. 
  • దేవునికి అలంకరణగా మామిడాకులు, పూల దండలు కట్టుకోవచ్చును. 
  • విగ్రహమైతే కాస్త స్నానం చేయించి లక్ష్మీదేవికి పసుపు రాసి, బొట్టు పెట్టి, మిగతా దేవుళ్ళకి కూడా బొట్టు పెట్టి పూజించుకోవాలి.    

పూజా విధానము 

  • సాయంత్రం పూట పూజ చేసే మాటైతే లైట్లు వేసుకుని అప్పుడు పూజ చేసుకోవాలి. లైట్లు వేసే ముందు వీధి తలుపు తెరిచి ఉంచి లైట్ వెయ్యాలి. కనీసం కొన్ని నిముషాలు అలా తెరిచి పెట్టుకోవాలి. 
  • కాస్త మంచిగా తృప్తిగా పూజ చేసుకోవాలంటే అప్పుడు పసుపు ముద్దతో ఒక లక్ష్మీవిగ్రహం లాగా, ఏదో కాస్త ఎలావచ్చినా ఫర్వాలేదు. ఆవిడ ఆ మూర్తిలో ఉందనే భావన పెట్టుకుంటే చాలు. ఆ మూర్తిని కూడా విగ్రహం, లేదా ఫొటోతో పాటు, పూజ చేసుకుంటామన్నమాట. అది ఎక్కువ తృప్తిని, సంతోషాన్ని ఇస్తుంది. 
  •  దీపాలు వెలిగించి, లక్ష్మీదేవికి ఆహ్వానముగా చేతి మీద కొన్ని నీటిబొట్లు అర్ఘ్యం ఇవ్వాలి. ఆ తర్వాత పాదాలకి నీటి బొట్లు కాళ్ళు కడిగినట్లుగా వెయ్యాలి. 
  • మూడు సార్లు దేవికి ఆచమనం ఇవ్వాలి. 
  • ఇప్పుడు పూజ మొదలెట్టాలి. 
  • కొన్ని స్త్రోత్రాలు చదివి, అష్టోత్తర శతనామ స్తోత్రం చదవాలి. 
  • అష్టోత్తరంలో ముందుగా దేవి కీర్తన, ప్రపత్తి ఉంటుంది "భగవన్నారాయణాభి మతానురూప ..." అని. ఆ తర్వాత పార్వతి పరమేశ్వరుని లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం చెప్పమని అడిగినట్లుగా ఉంటుంది. స్తోత్ర మహిమ శివుడు వివరిస్తాడు. ఆ తర్వాత శతనామ స్తోత్రం మొదలవుతుంది. ఆఖరిని స్త్రోత్రం చదివితే పొందే లాభాలు ఉంటాయి. 
  • పూజలో మనం మాటిమాటికి పసుపు, కుంకుమ, పూలు జల్లుతూ ఉండచ్చును. 
  • శతనామ స్తోత్రం కాకుండా శతనామావళి కూడా చదువుతూ ఇవ్వన్నీ జల్లుతూ పూజ చేసుకోవచ్చును ప్రతీ నామం తర్వాత. 
  • మీ ఓపికని బట్టి ఎంతైనా, సహస్రనామాలు చదువుతూ కూడా పూజించుకోవచ్చును. 
  • పూజ అయ్యాక అగరవత్తులు ధూపం చూపించి, అటుపిమ్మట దీపం చూపించాలి. 
  • అప్పుడు మూడు సార్లు ఆచమనం ఇచ్చి నైవేద్యం సమర్పించాలి. 
  • నైవేద్యం పెట్టేటప్పుడు అన్నింటి మీద కాసిని నీటిబొట్లు జల్లి అప్పుడు సమర్పించాలి. పాయసము, పులిహార లాంటి తినుబండారాలు, పళ్ళు, నానబెట్టిన శెనగలు, అన్ని కూడ ఆరగింపు పెట్టాక ఏవైనా లోపాలుంటే క్షమించమని వేడుకోవచ్చును. 
  • ఆ తర్వాత చేతులు, మూతి కడిగినట్లుగా నీటి బొట్లు సమర్పించి, మళ్లీ మూడు సార్లు ఆచమనం ఇవ్వాలి. 
  • ఇప్పుడు కర్పూర హారతి, దీపము తిప్పుతూ మంగళ హారతి ఇస్తూ, మంగళహారతులు పాడాలి. వచ్చిన ముత్తైదువులు కూడా హారతి పట్టుకోవచ్చును. చదవడం కూడా చెయ్యచ్చును. 
  • ఇప్పుడు పూజ పూర్తి అయ్యింది. ప్రసాదం గ్రహించి, అందరికి పంచిపెట్టాలి.
  • ముత్తైదువులందరికీ శెనగల వాయనం పంచిపెట్టాలి. శెనగలతో పాటు, ఏదైనా పండు, తమలపాకులు, పసుపు కుంకుమలు కూడా పంచిపెట్టాలి. 
  • ఈ విధంగా ముత్తైదువల ఆశీర్వాదాలు, లక్ష్మిదేవి దీవెనలు పొందడం జరుగుతుంది.     
ఈ వరలక్ష్మీవ్రతం నిశ్చలమైన మనస్సుతో భక్తిగా ఆచరించిన వారి కుటుంబానికంతటికీ సుఖ సౌఖ్యాలు కలుగుతాయని ప్రతీతి. 

29, జూన్ 2024, శనివారం

వినాయక చవితి - పాలవెల్లి తయారీ మరియు ఉండ్రాళ్ళు | Ganesh Chauth With Palavelli & Undrallu

వినాయక చవితి పూజ, ఉండ్రాళ్ళు 

వినాయక చవితి ప్రతి ఏడాది భాద్రపద శుద్ధ చవితి నాడు జరుపుకుంటారు. ఇది హిందువుల ముఖ్య పండుగలలో ముఖ్యమైనది. ప్రతి ఏడాదీ శ్రద్ధతో వినాయకుడుని ఈ పండుగ రోజున పూజిస్తే ఆ ఏడాది అంతా ఎటువంటి విఘ్నాలు, బాధలూ లేకుండా సుఖంగా ఉంటారని నమ్మకం. 

ఈ రోజున శుచి శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు ధరించి విఘ్నేశ్వర ప్రతిమని స్థాపించి భక్తి శ్రద్ధలతో పూజించాలి. 

ప్రతీ ఏటా కొత్త విగ్రహాన్ని తెచ్చుకుని పూజించటం పరిపాటి. ఆలా చెయ్యలేని వారు ఇంట్లో ఉన్న విగ్రహంతోనే చేసుకోవచ్చును. ప్రతిమకి ఔపచారిక స్నానం చేయించి పసుపు రాసిన పీట మీద ఉంచి, నుదుట బొట్టు పెట్టి ఏదైనా వస్త్రం ధరింపజేసి చేసుకుంటే తృప్తిగా ఉంటుంది. పీట లేకపోతే ఒక ఆకు మీద పెట్టి చేసుకోవచ్చును. రక రకాల పువ్వులతో, ఆకులతో పూజిస్తాము. వీటినే పత్రి అని అంటారు. ఈ పత్రి పండుగ రోజు ఉదయం కానీ, ముందు రోజు సాయంత్రమే కానీ అమ్ముతుంటారు. అవి తాజాగా ఉన్నవి చూసి తెచ్చుకుని పూజ చేసుకోవాలి. పళ్ళు, ఉండ్రాళ్ళు, ఇంకా ఏవైనా నైవేద్యం సమర్పించి చేసుకోవాలి. 

వినాయక చవితి పూజ చేసే విధానము   

  • వినాయక ప్రతిమని శుభ్రమైన స్థలంలో అమర్చుకుని పూజ సరుకులన్నీ దగ్గిర పెట్టుకుని పూజ మొదలెట్టాలి. నైవేద్యానికి ఉండ్రాళ్ళు తయారు చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. 
  • ముందుగా విఘ్నేశ్వరునికి ఆర్గ్యం ఇవ్వాలి. ఆయన చేతి దగ్గిర నీటి చుక్కలు వదలాలి. 
  • తరువాత పాద్యం సమర్పించాలి. అంటే పాదాల దగ్గిర నీటి చుక్కలు వదలాలి. 
  • ఇప్పుడు స్నానం చేయించాలి. ప్రతిమ చుట్టూ ఉద్ధరిణితో (చెంచాతో) నీళ్లు తిప్పి వదలాలి. 
  • ఏదైనా చిన్న వస్త్రం లాంటిది ఉంటె ఆయనకి చుట్టాలి. లేదా దూది పల్చగా చేసి వంటి మీద పెట్టచ్చు. నుదుటికి బొట్టు పెట్టాలి. 
  • ఇప్పుడు వినాయకునికి ఆచమనం ఇచ్చి పూజ మొదలు పెట్టుకోవాలి. ఉద్ధరిణితో నీళ్లు మూడు సార్లు తీసి ఆయన నోటికి చూపించాలి.
  • ఆహ్వానం పలుకుతూ రెండు పువ్వులు సమర్పించాలి. 
  • ఇంకో సారి అర్ఘ్య, పాద్యములు సమర్పించి ఆచమనం ఇచ్చి పుష్పాలు జల్లి, జంధ్యం తొడిగించాలి. దూదితోనే పొడవుగా చేసి ఆయన భుజం మీద నుండి పొట్ట మీదకి పడేలా వెయ్యాలి. 
  • ఒకటి రెండు స్తోత్రాలు చదివి, 108 నామాలతో పూజించాలి. ప్రతి నామానికి ఒక పుష్పం కానీ పత్రం కానీ సమర్పిస్తూ చెయ్యాలి. 
  • పసుపు, బియ్యం కలిపిన అక్షింతలు, కుంకుమ కూడా జల్లుతూ పూజ చేసుకోవాలి. 
  • ఇదంతా అయ్యాక నైవేద్యం ఆరగింపు పెట్టాలి. ఉండ్రాళ్ళు, పళ్ళు పళ్ళాలలో ఉంచి కాస్త నీళ్లు జల్లి అప్పుడు ఆయనకి తినిపించాలి. 
  • నైవేద్యం అయ్యాక చేతులు, నోరు, పాదాలు కడిగించాలి. అంటే ఉద్ధరిణి తో నోటికి, చేతులకి, పాదాలకి నీళ్లు చూపించి వదలాలి. 
  • మళ్ళీ ఆచమనం ఇచ్చి మంగళ హారతి పట్టాలి. 
  • వెంటనే కథ కూడా చదువుకోవచ్చును. ప్రసాదం తిని చదువుకోవచ్చును. లేదా కథ విడిగా సాయంత్రమైనా చదువుకోవచ్చును. 
  • కథ చెప్పుకోకుండా చంద్రుణ్ణి చూడకూడదు అంటారు. ఒకవేళ మధ్యాన్నం నాలిగింటే చంద్రుడు కనిపించినా కనిపించవచ్చు. అందుచేత త్వరగానే చదువుకుంటే మంచిది. 
  • కథ చదువుకోడాలు, చెప్పుకోడాలు అయ్యాక పూజ చేసిన అక్షింతలని తీసుకుని అందరూ తలపైన జల్లుకోవాలి. అప్పుడు చంద్రుణ్ణి చూసినా ఫర్వాలేదు. 
వినాయక పూజ మరియు కథ ఉన్న పుస్తకాలు అన్ని చోట్ల దొరుకుతాయి. అవి ముందుగా తెప్పించుకు పెట్టుకోవడం మంచిది. నేను కూడ వీలైనంత వరకు నా బ్లాగులలో రాయడానికి ప్రయత్నిస్తాను. 

వినాయక చవితికి పాలవెల్లి 

వినాయక చవితి రోజున పాలవెల్లి కూడా కట్టుకుని పూజ చేసుకోవడం ఆచారము. ఎలాగైతే ఇంటి గుమ్మానికి మామిడాకులు, తోరణాలు కట్టి అలంకరిస్తామో అలాగే వినాయక పూజా స్థానాన్ని కూడా  అలంకరించుకుంటాము.

ఈ పాలవెల్లి చేయడానికి వెదురు బద్దలు, గట్టి దారము, వేలాడదీయడానికి పురికోసు త్రాడు కావాలి. అంతేకాక అలంకరించడానికి పువ్వులు, మామిడాకులు, మొక్కజొన్న పొత్తులు, వగైరా కావాలి.    
 

పాలవెల్లి తయారుచేయు విధానము 

  • పాలవెల్లి అనేది వెదురు బద్దలతో తయారుచేస్తారు. 
  • సన్నగా చీల్చిన వెదురు బద్దలు కనీసం 18 అంగుళాల పొడవు ఉన్నవి ఎనిమిది కావాలి.
  • నాలుగు బద్దలు నిలువుగా, నాలుగు అడ్డంగా రెండేసి అంగుళాల దూరంలో పేర్చి వాటిని గట్టిగా ఉండే పురికోసు దారంతో కట్టుకోవాలి.  
  • అలా తయారు చేసుకున్న పాలవెల్లికి అంతటా తడిపిన పసుపు రాసి వినాయక ప్రతిమ పైన కాస్త ఎత్తుగా ఉండేలా వేలాడదీయాలి. 
  • అప్పుడు దానికి అన్నివైపులా మధ్యలోను కూడా మామిడాకులు అగరవత్తుల పుల్లలతో గుచ్చి అలంకరించుకోవాలి. కావాలంటే పువ్వులు కూడా కట్టచ్చును. 
  • తరువాత నాలుగు రకాల పళ్ళు మొక్కజొన్న పొత్తులు నాల్గు మూలల కట్టి వేలాడదీయాలి.
  • వినాయక ప్రతిమకు అడ్డం రాకుండా ఉండేట్లాను, పూజకి అడ్డం పడకుండా ఉండేలా దారాలతో కట్టి అవన్నీ వేలాడ దీయాలి. 
  • అలా తయారైన పాలవెల్లిని, కాస్త లావుగా ఉండే దారంతో పైన ఏదైనా కొక్కానికి, లేదా కిటికీ కింద పూజ చేసుకునే మాటైతే కిటికీ గొళ్లానికైనా కట్టుకోవచ్చును. 

మార్కెట్లో రెడీగా తయారు చేసిన పాలవెల్లులు అమ్ముతుంటారు. అవైనా కొనుక్కుని అలంకరించుకుని పూజ చేసుకోవచ్చును. 

ఉండ్రాళ్ళు తయారుచేసే విధానము 

ఉండ్రాళ్ళు వినాయకునికి అతి ప్రియమైన వంటకము. వినాయకుని గణాలకు అధిపతి చేసిన రోజున దేవతలందరికీ విందు భోజనానికి వెళ్లి కడుపునిండా ఉండ్రాళ్ళు తింటాడు వినాయకుడు. ఆ తర్వాత ఇంటికొచ్చి తల్లితండ్రులకి వంగి పాదాభివందనము చేయబోతే పొట్ట పగిలి ఉండ్రాలన్నీ దొర్లిపోయాయని చెప్తారు. 

అందుకనే ఈ రోజున ఉండ్రాళ్ళు వండి ఆరగింపు పెడతారు. 

ఉండ్రాళ్ళు చెయ్యడానికి కావాల్సిన వస్తువులు:
  • బియ్యం రవ్వ 
  • కొబ్బరి కోరు 
  • కాస్త సెనగపప్పు 
  • కాసిని పాలు, నెయ్యి, ఉప్పు 
 ముందుగా రవ్వ, సెనగపప్పు కలిపి కుక్కర్లో అన్నం వండుక్కున్నట్లుగా ఉడక పెట్టుకోవాలి. అలా ఉడికిన ముద్దా కాస్త పొడిగా ఉండి ఉండలు చెయ్యడానికి వీలుగా ఉండాలి. 

ఇప్పుడు అందులో కొబ్బరి కోరు, ఉప్పు, నెయ్యి, కొన్ని చుక్కల పాలు కలిపి ఉండలు చేసి పెట్టుకోవాలి. 

ఇడ్లీలు వండుకునే పాత్రలో ఒకటే ఇడ్లీ అర పెట్టి అన్ని ఉండలు అందులో చక్కగా ఉడికేట్లా పేర్చి మూత పెట్టి ఆవిరిలో ఎలాగైతే ఇడ్లి వండుతామో అలాగే వండాలి. 

ఇడ్లీ పాత్ర ఉపయోగించని వారు మామూలు గిన్నె లోనే నాలుగో వంతు నీళ్లు పోసి ఆ పాత్రకి ఒక తెల్లటి బట్ట కట్టి దాని పైన ఈ ఉండ్రాళ్ళ ఉండలు పేర్చి, పై నుండి కాస్త ఎత్తుగా, లోతుగా ఉండే మూత పెట్టి, ఆవిరిలో ఉడికేట్లా చేసుకోవాలి.   

బియ్యం రవ్వ, సెనగపప్పు ముందే చాలా వరకు ఉడికాయి కనుక ఈ ఉండలు ఐదు నిమిషాల్లోనే ఉడికిపోవచ్చును. మంచిగా ఉడికిన  ఉండలు కాస్త విచ్చుకుని పెద్దవిగా అవుతాయి. దాన్నిబట్టి అవి ఉడికినట్లుగా భావించవచ్చును. 

అప్పుడు దింపేసి అన్ని ఉండ్రాళ్ళు ఒక పాత్రలోకైనా, పళ్లెంలోకైనా తీసి పెట్టుకోవాలి. పూజ పూర్తి అయ్యాక ఆ ఉండ్రాళ్ళు వినాయకునికి నైవేద్యం పెట్టి, అప్పుడు ప్రసాదం తినవచ్చును. 

తినేటప్పుడు కావాలంటే ఇంకా నెయ్యి రాసుకుని, ఏదైనా ఊరగాయ, చట్నీతో, లేదా బెల్లంతో తినవచ్చును.  

27, జూన్ 2024, గురువారం

విఘ్నేశ్వర స్తుతి స్తోత్రాలు - Ganesh Puja Hymns


వినాయక చవితి పూజ మొదలు పెట్టునప్పుడు కానీ బుధవారం వినాయకుడి పూజ చేయునప్పుడు కాని, అటువంటప్పుడు ఈ క్రింద చెప్పబడిన శ్లోకాలు, స్తోత్రాలు చదువుకుని పూజించుకోవచ్చును.

ప్రతీ శ్లోకానికీ అర్ధము ఇవ్వబడింది. ఆ తరువాత ఇంగ్లీష్ భాషలో కూడ శ్లోకాలు, అర్ధములు ఇవ్వడం జరుగుతోంది క్రింది భాగంలో. 

ముందుగా తెలుగులో ఒక్కొక్క శ్లోకము రాసి వాటికి అర్థము చెబుతున్నాను. 

  
శ్రీ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః |  
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా || (1)



మెలితిరిగిన తొండము, మహా దేహము కలిగి, కోటి సూర్యుల తో సమమైన తేజస్సు కలిగి ఉండే ఓ విఘ్నేశ్వరా, అన్ని పనుల లోను అన్ని సమయముల లోను ఆటంకములు, అవాంతరములు తొలగించు దేవా. 

ఇక్కడ వక్రతుండ అనే పదానికి మనం ఇంకో అర్థం కూడ చెప్పుకోవచ్చును. 
వక్ర అంటే వక్ర స్వభావము , తుండము అంటే తెంపి వేయడం . విఘ్నేశ్వరుడు చెడ్డ స్వభావములని పోగొట్టి మనని కాపాడుతుంటాడు మనం ఆయనని పూజిస్తూ ఉంటె. అంతే కాదు.  చెడు శక్తుల నుండి రక్షిస్తూ ఉంటాడు. అందుకని ఆయనని రోజూ పూజించుకోవాలి. 
  

శుక్లాంబర ధరమ్ విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ |
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే || (2)

తెల్లని వస్త్రములు ధరించి, అంతటా వ్యాపించి, చంద్ర కాంతి తో వెలుగొందుచు, నాలుగు భుజములతో కూడి ప్రసన్నమైన ముఖము కలిగిన ఓ దేవా, అన్ని విఘ్నములను తొలగించు స్వామీ! 


తొండము నేకదంతము తోరపు బొజ్జయు వామహస్తమున్ 
మెండుగ మ్రోయు గజ్జెలు మెల్లని చూపులు మందహాసమున్ | 
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై 
యుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్ || (3) 

భావార్ధము:
విఘ్నేశ్వరుడు తొండము, ఒక దంతము, విశాలమైన బొజ్జ,ఎడమ చేతిలో బాగుగా చప్పుడు చేసే గజ్జెలు పట్టుకుని, ఒక కొండ చిన్న గుజ్జు రూపములో ఉన్నట్లుగా మనకు దర్శనమిస్తూ ఉంటాడు. అతను చదువులన్నింటికీ అది దేవత. అటువంటి పార్వతీ పుత్రుడు మఱియును గణములన్నింటికీ అధిపతి అయిన ఓ గణేశ్వరా నీకు మ్రొక్కుచున్నాను స్వామీ, దయ చేసి నాకు విఘ్నములు, ఆపదలు లేకుండా కాపాడు తండ్రీ.


గజవక్త్రం, సురశ్రేష్ఠం, కర్ణచామర భూషితమ్ | 
పాశాంకుశధరం, దేవం, వందేహం గణనాయకమ్ || (4)

ఏనుగు ముఖము కలిగి, దేవతలందరికీ శ్రేష్ఠుడవై, చామరముల వంటి చెవులు కలిగి, పాశము అంకుశము ధరించి, ఉండే ఓ దేవా, నీకు అభివందనములు గణ నాయకా! 


అగజానన పద్మార్కమ్, గజాననం, అహర్నిశమ్ | 
అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే || (5)

తల్లి గౌరీ మాత  ముఖపద్మము నుండి వెలుగొందే కిరణములతో ప్రకాశించు వదనము కలిగి, రాత్రిబవళ్ళు భక్తులను కటాక్షిస్తూ ఉండే ఏకదంతుడవైన విఘ్నేశ్వరుని శరణు వేడుచున్నాను. 
  

విఘ్నేశ్వరాయ, వరదాయ, సురప్రియాయ, 
లంబోదరాయ, సకలాయ, జగత్ జితాయ,
నాగాననాయ, శ్రుతియజ్ఞ విభూషితాయ,
గౌరీసుతాయ, గణ నాథ, నమో నమస్తే|| (6)

విఘ్నేశ్వరా, వరము లొసగే స్వామీ, దేవతలకు ప్రియుడా, పొడవైన ఉదరము కలవాడా, అన్ని శ్రేష్టతలు కలిగిన వాడా, జగత్తుని గెలిచినా వాడా, నాగము లాంటి తొండముతో ఉన్న వదనము కలిగి, వేదములు, శాస్త్రములు, యజ్ఞములతో అలంకరింపబడిన గౌరీ సుతా, ఓ గణ నాథా! నీకివే నా వందనములు. 

24, మే 2024, శుక్రవారం

హనుమాన్ చాలీసా - Hanuman Chalisa

 

హనుమాన్ చాలీసాఅంటే హనుమంతుని స్తుతి చేస్తూ అల్లబడిన 40 దోహాలు. దోహా అంటే రెండు వరుసల అల్లికలు (స్తోత్రములు లేదా పద్యములు).  

ఈ హనుమాన్ చాలీసా ని మహాకవి తులసీదాసు అవధీ భాషలో రచించెను. 

శ్రీ సీతారాములకు అత్యంత ప్రియ భక్తుడు హనుమంతుడు. అతను శ్రీరామునికి ఎంతో ప్రేమతో, నిస్వార్ధముగా సేవ చేసి తరించెను. ఎప్పుడూ చిరంజీవిగా ఉండేట్లా వరము పొందాడు.  


శ్రీ సీతారాముల కటాక్షము లభించాలంటే ముందుగా ఆంజనేయ స్వామిని స్తుతించి ప్రసన్నము చేసుకోవాలి. 


ఈ చాలీసా ని ముఖ్యంగా ప్రతి మంగళవారము భక్తులందరూ అంత్యత ప్రియంగా చదువుతుంటారు. అన్ని రోజులూ చదివితే ఇంకా మంచిది. 


ఇప్పుడు ఈ హనుమాన్ చాలీసా ని విశదీకరిస్తున్నాను. ప్రతీ పదాన్ని కూడ ఏ విధంగా పలకాలో ఆ విధంగానే రాసి మీకు సులువుగా చదువుకునెట్లా తెలియజేస్తున్నాను.  

హనుమాన్ చాలీసాకి ముందు వెనుక కూడ చదవాల్సిన కొన్ని స్తుతులు ఉన్నాయి. 

ముందు చదవాల్సిన స్తుతులు :


శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం, ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం, భజే వాయుపుత్రం భజే వాలగాత్రం, భజేహం పవిత్రం, భజే రుద్రరూపం, భజే బ్రహ్మతేజం|| 

ఓం నమో శ్రీ ఆంజనేయ స్వామినే నమః 
ఓం నమో శ్రీ సీతారామాయ నమః
 
ఆపదామహర్తారం దాతారం సర్వసంపదాం 
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాహ్యమం|| 

అసాధ్య సాధక స్వామిన్, అసాధ్యం తవ కింవదా? 
రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో || 


అతులిత బలధామం స్వర్ణ శైలాభ దేహుం 
దనుజవన కృశానుం  జ్ఞానినామగ్రగణ్యం 
సకల గుణ నిధానామ్ వానరాణాం అధీశం 
రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి|| 

గోష్పదీ కృత వారాశిం మశకీ కృత రాక్షసం 
రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం|| 

యత్రయత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్ 
భాష్పవారి పరిపూర్ణ లోచనమ్ మారుతిం నమత రాక్షసాంతకమ్|| 


ఓం శ్రీ గురుచరణ సరోజరజ నిజ మను ముకుర సిధారు 
వరణౌ రఘువర విమల యశు జో దాయకు ఫల చారు | 
బుధ్ధి హీనతను జానికౌ సుమిరౌ పవన కుమారు 
బల బుధ్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికారు ||  

హనుమాన్ చాలీసా - Hanuman Chalisa     


జయ హనుమాను, జ్ఞాన గుణ సాగరు, 
జయ కపీసు, తిహు లోక ఉజాగరు ||  
రామదూత, అతులిత బలధామ, 
అంజని పుత్ర, పవనసుత నామ || 
మహావీర, విక్రమ, బజరంగీ, 
కుమతి నివారు, సుమతి కే సంగీ || 
కంచన వరణ, విరాజు సురేశ, 
కానన కుండలు, కుంచితు కేశా || 
హాతు వజ్ర, ఔరు ధ్వజా విరాజై, 
కాంధే మూంజ జనేవూ సాజై || 
శంకర సువను, కేసరి నందను, 
తేజ ప్రతాపు, మహా జగు వందను || 
విద్యా వాన్, గుణీ అతి చాతురు, 
రామ కాజు కరిబేకో ఆతురు || 
ప్రభు చరిత్ర సునీబేకో రసియా, 
రామలఖను సీతా మను బసియా || 
సూక్ష్మ రూప ధరి సియహి దిఖావా, 
వికట రూప ధరి లంక జరావా || 
భీమ రూప ధరి అసుర సహారే ,
రామచంద్ర కే కాజు సవారే ||   
లాయి సజీవను లఖను జియాయే,
శ్రీ రఘు బీరు హరఖి ఉర లాగే || 
రఘుపతి కీన్హీ బహుత్ బడాయి,
కహా భరత సమ తుము ప్రియ భాయి || 
సహస వదను తుమరో యశు గావై,
అసు కహి శ్రీపతి కంఠు లగావై || 
సనకాదిక బ్రహ్మాది మునీశా,
నారద శారద సహితు అహీశా || 
యమ కుబేరు దిక్పాలు జహాతే,
కవి కోవిదు కహ్ సకై కహా తే ||  
తుమ ఉపకారు సుగ్రీవహి కీన్హా,
రామ మిలాయి రాజ పద్ దీన్హా || 
తుమరో మంత్రు విభీషను మానా,
లంకేశు భయే సబు జగు జానా ||
యుగ సహస్ర యోజను పరు భాను,
లీల్యో తాహి మధుర ఫల జాను || 
ప్రభు ముద్రికా మేలి ముఖ మాయి,
జలధి లాంఘి గయె అచరజు నాహి || 
దుర్గమ కాజు జగతుకె జేతే,
సుగమ అనుగ్రహు తుమరే తేతే || 
రామ ద్వారే తుమ రఖవారే,
హోతు న ఆజ్ఞా బిను పైఠారే ||
సబ సుఖ లహై తుమారీ శరణా,
తుమ రక్షకు కాహూకో డరనా || 
ఆపను తేజు సంహారో ఆపై,
తీనో లోకు హాంకతే కాంపై || 
భూత పిశాచ నికటు నహి ఆవై,
మహావీరు జబ నాము సునావై || 
నాశై రోగు హరై సబ పీడా,  
జపతు నిరంతరు హనుమతు బీరా || 
సంకట సే హనుమాను ఛుడావై,
మను క్రమ వచను జో లావై || 
సబ పర రాము తపస్వీ రాజా,
తినకే కామ సకల తుమ్ సాజా || 
ఔర్ మనోరథ జో కోయి లావై,
తాసు అమిత జీవన ఫల పావై || 
చారోమ్ జుగ ప్రతాప తుమారా,
హై ప్రసిద్హ జగత ఉజియారా || 
సాధు సంత కే తుమ రఖవారే,
అసుర నికందను, రామ దులారే || 
అష్ట సిధ్ధి నవనిధి కే దాతా,
అస వర దినిహు జానకీ మాతా || 
రామ రసాయను తుమరే పాసా,
సాదర తుము రఘుపతి కే దాసా || 
తుమరే భజను రాము కో భావై,
జనమ జనమ కే దుఖ బిసరావై || 
అంతః కాలు రఘుబర పుర జాయి,
జహాఁ జన్మ హరిభక్త కహాయి || 
ఔర్ దేవతా చిత్త న ధరయి,
హనుమత సేఇ సర్వ సుఖ కరయి || 
సంకట కటై, మిటై సబ పీడా,
జో సుమిరై హనుమతు బల బీరా || 
జయ్ జయ్  జయ్ హనుమాను గోసాయి,
కృపా కరహు గురు దేవ్ కినాయి || 
యహ శత బారు పాఠు కరు జోయి,
ఛూటహి బంది మహా సుఖ హోయి || 
జో యహ పఢీ హనుమాను చాలీసా,
హోఇ సిధ్ధి, సాఖీ గౌరీశా || 
తులసీదాస సదా హరి చేరా,
కీజై నాథ్ హ్రిదయ మహు డేరా || 

వెనుక చదవాల్సిన  స్తుతి 


ఓం పవన తనయు, సంకట హరను, మంగళ మూరతి రూపు, 
రామలఖను సీతా సహితు హ్రిదయ బసహు సుర భూపు ||

ఓం నమో శ్రీ ఆంజనేయ స్వామినే నమః | 
ఓం నమో శ్రీ సీతారామాయ నమః ||