27, జూన్ 2024, గురువారం

విఘ్నేశ్వర స్తుతి స్తోత్రాలు - Ganesh Puja Hymns


వినాయక చవితి పూజ మొదలు పెట్టునప్పుడు కానీ బుధవారం వినాయకుడి పూజ చేయునప్పుడు కాని, అటువంటప్పుడు ఈ క్రింద చెప్పబడిన శ్లోకాలు, స్తోత్రాలు చదువుకుని పూజించుకోవచ్చును.

ప్రతీ శ్లోకానికీ అర్ధము ఇవ్వబడింది. ఆ తరువాత ఇంగ్లీష్ భాషలో కూడ శ్లోకాలు, అర్ధములు ఇవ్వడం జరుగుతోంది క్రింది భాగంలో. 

ముందుగా తెలుగులో ఒక్కొక్క శ్లోకము రాసి వాటికి అర్థము చెబుతున్నాను. 

  
శ్రీ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః |  
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా || (1)



మెలితిరిగిన తొండము, మహా దేహము కలిగి, కోటి సూర్యుల తో సమమైన తేజస్సు కలిగి ఉండే ఓ విఘ్నేశ్వరా, అన్ని పనుల లోను అన్ని సమయముల లోను ఆటంకములు, అవాంతరములు తొలగించు దేవా. 

ఇక్కడ వక్రతుండ అనే పదానికి మనం ఇంకో అర్థం కూడ చెప్పుకోవచ్చును. 
వక్ర అంటే వక్ర స్వభావము , తుండము అంటే తెంపి వేయడం . విఘ్నేశ్వరుడు చెడ్డ స్వభావములని పోగొట్టి మనని కాపాడుతుంటాడు మనం ఆయనని పూజిస్తూ ఉంటె. అంతే కాదు.  చెడు శక్తుల నుండి రక్షిస్తూ ఉంటాడు. అందుకని ఆయనని రోజూ పూజించుకోవాలి. 
  

శుక్లాంబర ధరమ్ విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ |
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే || (2)

తెల్లని వస్త్రములు ధరించి, అంతటా వ్యాపించి, చంద్ర కాంతి తో వెలుగొందుచు, నాలుగు భుజములతో కూడి ప్రసన్నమైన ముఖము కలిగిన ఓ దేవా, అన్ని విఘ్నములను తొలగించు స్వామీ! 


తొండము నేకదంతము తోరపు బొజ్జయు వామహస్తమున్ 
మెండుగ మ్రోయు గజ్జెలు మెల్లని చూపులు మందహాసమున్ | 
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై 
యుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్ || (3) 

భావార్ధము:
విఘ్నేశ్వరుడు తొండము, ఒక దంతము, విశాలమైన బొజ్జ,ఎడమ చేతిలో బాగుగా చప్పుడు చేసే గజ్జెలు పట్టుకుని, ఒక కొండ చిన్న గుజ్జు రూపములో ఉన్నట్లుగా మనకు దర్శనమిస్తూ ఉంటాడు. అతను చదువులన్నింటికీ అది దేవత. అటువంటి పార్వతీ పుత్రుడు మఱియును గణములన్నింటికీ అధిపతి అయిన ఓ గణేశ్వరా నీకు మ్రొక్కుచున్నాను స్వామీ, దయ చేసి నాకు విఘ్నములు, ఆపదలు లేకుండా కాపాడు తండ్రీ.


గజవక్త్రం, సురశ్రేష్ఠం, కర్ణచామర భూషితమ్ | 
పాశాంకుశధరం, దేవం, వందేహం గణనాయకమ్ || (4)

ఏనుగు ముఖము కలిగి, దేవతలందరికీ శ్రేష్ఠుడవై, చామరముల వంటి చెవులు కలిగి, పాశము అంకుశము ధరించి, ఉండే ఓ దేవా, నీకు అభివందనములు గణ నాయకా! 


అగజానన పద్మార్కమ్, గజాననం, అహర్నిశమ్ | 
అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే || (5)

తల్లి గౌరీ మాత  ముఖపద్మము నుండి వెలుగొందే కిరణములతో ప్రకాశించు వదనము కలిగి, రాత్రిబవళ్ళు భక్తులను కటాక్షిస్తూ ఉండే ఏకదంతుడవైన విఘ్నేశ్వరుని శరణు వేడుచున్నాను. 
  

విఘ్నేశ్వరాయ, వరదాయ, సురప్రియాయ, 
లంబోదరాయ, సకలాయ, జగత్ జితాయ,
నాగాననాయ, శ్రుతియజ్ఞ విభూషితాయ,
గౌరీసుతాయ, గణ నాథ, నమో నమస్తే|| (6)

విఘ్నేశ్వరా, వరము లొసగే స్వామీ, దేవతలకు ప్రియుడా, పొడవైన ఉదరము కలవాడా, అన్ని శ్రేష్టతలు కలిగిన వాడా, జగత్తుని గెలిచినా వాడా, నాగము లాంటి తొండముతో ఉన్న వదనము కలిగి, వేదములు, శాస్త్రములు, యజ్ఞములతో అలంకరింపబడిన గౌరీ సుతా, ఓ గణ నాథా! నీకివే నా వందనములు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి