పూజ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పూజ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, సెప్టెంబర్ 2024, గురువారం

కృష్ణాష్టకము - Worship of Sri Krishna With 8 Hymns


కృష్ణాష్టకం అంటే శ్రీ కృష్ణుని స్తుతి చేస్తూ చదివే ఎనిమిది శ్లోకాలు అన్నమాట. ఈ శ్లోకాలు కృష్ణుని యొక్క జీవితం లోని కొన్ని సంగతులను, అద్భుత కృత్యాలను తెలుపుతూ కీర్తించే కీర్తనల వంటివి. 

శ్రీకృష్ణ పరమాత్మ మొత్తం లోకానికంతటికీ గురువు. మనందరి మంచికోసము ఆయన అవతారమెత్తి రాక్షసులని చంపి, దుష్టులను దండించి, మన మేలు కోరుతూ భగవద్ గీత ద్వారా మనకి జ్ఞానాన్ని ప్రసాదించారు. చావు, పుట్టుకలంటే ఏమిటి, మనిషి పుట్టుక ఉద్దేశ్యం ఏమిటి, మనిషి ఏ విధంగా ఈ సంసార సాగరాన్ని దాటాలి, మొదలైన విషయాలన్నింటిని గీతోపదేశము ద్వారా తెలియజేశారు. అంతేకాక ఎవరైతే పూర్తిగా నన్ను నమ్ముకుని నా శరణు కోరుతారో వారికి తప్పకుండా విజయము, మోక్షము ప్రసాదిస్తాను అని మహాభారతంలో అర్జునికి చెపుతూ మనకి తెలియజేసెను . 

అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని కీర్తిస్తూ మనము ఈ కృష్ణాష్టకాన్ని ప్రతి రోజూ పూజ సమయంలో చదువుకోవచ్చును. 


కృష్ణాష్టకము 

వసుదేవసుతం దేవం కంసచాణూర మర్దనం 
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ || (1)

తాత్పర్యము :-

వసుదేవుని కొడుకు, దేవకీదేవికి అత్యంత ఆనందాన్ని కలిగించే ఓ దేవా! కంసచాణూరులను చంపి లోకాన్ని రక్షించిన ఓ జగద్గురువైన కృష్ణా, నీకు దాసోహములు. 


అతసీపుష్ప సంకాశమ్ హార నూపుర శోభితమ్ 
రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ || (2)

తాత్పర్యము :-

అతసీపుష్పము అంటే అవిసె పువ్వు. ఆ పూలు నీలం రంగులో కానీ, లేత నీలం రంగులో కానీ ఉంటాయి. అటువంటి శరీరచ్చాయ (వంటి రంగు) కలిగిన కృష్ణుడు కంఠంలో హారము, కాళ్ళకి గజ్జెలతో వెలిగిపోతూ, చేతులకి రత్న కంకణములు కూడా ధరించి ఉండే ఓ జగద్గురువైన కృష్ణా, నీకు దాసోహములు. 


కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననమ్ 
విలసత్ కుండల ధరమ్  కృష్ణం వందే జగద్గురుమ్ || (3)

తాత్పర్యము :-

మెలితిరిగిన ముంగురుల జుట్టు కలిగి, పూర్ణ చంద్రుని బోలిన ముఖము కలిగి, విలాసకరమైన కుండలములు (చెవులకి వేలాడే ఆభరణములు) ధరించిన ఓ కృష్ణా ! జగద్గురువైన నీకు దాసోహములు.   


మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ 
బర్హి పించ్ఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ || (4)

తాత్పర్యము :-

మందార పుష్పముల గంధము యొక్క సువాసనలు మరియు అందమైన చిరునవ్వులను  వెదజల్లుతూ, నాలుగు భుజములు కలిగి, నెమలిపింఛాన్ని తలకొప్పు లో ధరించిన ఓ కృష్ణా , జగద్గురువైన నీకు దాసోహములు.    


ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షమ్ నీలజీమూత సన్నిభమ్ 
యాదవానామ్ శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ || (5)

తాత్పర్యము :-

విశాలంగా వికసించిన పద్మముల రేకుల వంటి కన్నులను కలిగి, నీలి మేఘముల లాంటి ప్రకాశము కలిగి (నీల జీమూతము అంటే నీలి మేఘమయినా కావచ్చును లేదా నీలిరంగులో ఉండే ఇంద్రుడైనా కావచ్చును), యాదవులందరికీ శిరోరత్నమైన ఓ కృష్ణా , జగద్గురువైన నీకు దాసోహములు.  



రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం 
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ (6)

తాత్పర్యము :-

రుక్మిణీదేవితో కేళి సలుపుతూ పట్టుబట్టలు దాల్చి మంచి అందంతో ప్రకాశిస్తూ ఎనలేని తులసీగంధముల సువాసనలు వెదజల్లే ఓ జగద్గురువైన కృష్ణా ! నీకు దాసోహములు.  


గోపికానాం కుఛ ద్వంద్వ కుంకుమాంకిత వక్షసం 
శ్రీ నికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ (7)

తాత్పర్యము :-

గోపికాస్త్రీలు వెదజల్లిన కుంకుమలతో శోభిల్లే కుచ ద్వందముల వక్షము కలిగి , శ్రీ లక్ష్మీదేవి, భూదేవులతో (మహా +ఇక్ష్వాసం= మహా భూమండలము లేదా భూదేవి ) కూడిన ఓ కృష్ణా జగద్గురువైన నీకు దాసోహములు. 


శ్రీ వత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం 
శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ (8)

తాత్పర్యము :-

శ్రీవత్స చిహ్నము కలిగి నీ విశాల వక్షస్థలము (మహా ఉర + అస్కమ్ = నీ యొక్క పెద్ద విశాలమైన ఉరము లేదా వక్షం అనైనా అనవచ్చును ) వనమాలలతో (అనేక విధములైన పూలు, ఆకులతో తయారైన మాలలు) అలంకరింపబడి, శంఖము చక్రములతో శోభిల్లెడి ఓ జగద్గురువైన కృష్ణా ! నీకు దాసోహములు. 
 

కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ య: ప:టేత్ 
కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥ (9)

తాత్పర్యము :- 

ఈ కృష్ణాష్టకము పుణ్యప్రదమైనది . దీనిని ఎవరైతే ప్రాతః కాలంలో చదువుతారో అటువంటి వారికి కోటి జన్మములలో చేసిన పాపములు కూడ ఇది స్మరించినంత మాత్రంలోనే తొలగిపోతాయి/నశించి పోతాయి).  

3, ఆగస్టు 2024, శనివారం

శ్రీ లక్ష్మీ స్తుతి - స్తోత్రాలు / Lakshmi Puja Lyrics in Telugu


రోజూ పూజ చేసేటప్పుడు ముందుగా తల్లితండ్రులని, గురువులని తలుచుకుంటూ పూజ మొదలెడుతాము. పూజలో ముందుగా 24 కేశవ నామాలు చదివి,  ఆ తరువాత వినాయకుడుని స్మరించి, పిమ్మట లక్ష్మీదేవిని పూజించి, అప్పుడు విష్ణు స్తోత్రాలు, మిగతా పూజ చేసుకోవాలి. 

విఘ్నేశ్వరుని స్తోత్రాలు ఇంతకు ముందు పోస్టులో తెలియజేశాను. 




కేశవనామాలు ఇంకో పోస్ట్ లో వివరించడం జరిగింది. 

ఇప్పుడు ఈ పోస్టులో లక్ష్మీదేవి స్తోత్రాలు కొన్ని ఇస్తున్నాను. ఇవి చదువుకుని మిగతా పూజ చేసేసుకోవచ్చును. ఈ స్తోత్రాలకి అర్ధాలు కూడ తెలియజేస్తున్నాను.  


శ్రీ లక్ష్మీ స్తుతి స్తోత్రాలు 


వందే పద్మకరాం, ప్రసన్న వదనాం, సౌభాగ్యదాం, భాగ్యదాం, 
హస్తాభ్యాం అభయ ప్రదాం, మణి గణైర్, నానా విధైర్ భూషితామ్, 
భక్తా భిష్ట ఫల ప్రదాం, హరిహర బ్రహ్మాదిభి స్సేవితాం, 
పార్శ్వే పంకజ, శంఖ, పద్మ, నిధిభి ర్యుక్తాం,  సదా శక్తిభి: ॥

అర్థము:

ఓ అమ్మా, లక్ష్మీ మాతా! పద్మములను పోలిన చేతులు కలిగి (పద్మము చేత్తో పట్టుకుని), ప్రసన్నమైన ముఖము కలిగి, సౌభాగ్యాన్ని, భాగ్యాన్ని ప్రసాదిస్తూ, చేతులతో అభయాన్ని కూడా అందిస్తూ, నానావిధములైన మణుల, ఆభరణములతో అలంకరింపబడిన దానివై, భక్తుల కోరికలన్నీ తీరుస్తూ, విష్ణువు, శివుడు, బ్రహ్మల చేత పూజింపబడుతూ, నీ నాల్గు పక్కల నాలుగు చేతులలో కమలము, శంఖము, పద్మము, ఐశ్వర్య సంపద ధరించి,  ఎల్ల వేళలా శక్తి దాల్చిన నీకు నా పాదాభివందనములు సమర్పించు చున్నాను .   
 

సరసిజ నయనే, సరోజ హస్తే, ధవళతరాంశుక గంధమాల్య శోభే, 
భగవతి, హరివల్లభే, మనోజ్ఞే, త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్ ||

అర్థము:

ఓ తల్లీ, కమలముల వంటి కనులు, హస్తములు కలిగి, తెల్లని పుష్పమాలికల దండలు ధరించిన అమ్మా! ఓ భగవతీ, శ్రీహరి ప్రియసఖీ, సర్వము ఎఱిగిన తల్లీ, ముల్లోకముల లోని ప్రాణులందరినీ ఎల్లవేళలా రక్షిస్తూ ఉండు మాతా!
  

లక్ష్మీం, క్షీర సముద్రరాజ తనయాం, శ్రీరంగ ధామేశ్వరీం, 
దాసీ భూత సమస్త దేవ వనితాం, లోకైక దీపాంకురాం, 
శ్రీమన్ మందకటాక్ష, లభ్ద ,విభవ బ్రహ్మేంద్ర గంగా ధరాం, 
త్వాం, త్రైలోక్య కుటుంబినీం, సరసిజాం, వందే ముకుంద ప్రియాం  ॥ 

అర్థము:

ఓ లక్ష్మీమాత! పాల సముద్రారాజ తనయీ , శ్రీరంగక్షేత్ర ఈశ్వరీ , సమస్త భూత గణములు, దాసదాసులు, దేవ వనితలకూ,  సమస్త లోకాలకు వెలుగుని ప్రసాదించే ఏకైక జ్యోతివి నీవు. నీ చల్లని కృపా కటాక్షములచే బ్రహ్మ, ఇంద్రుడు, గంగాధరుడైన శివుడు వైభవాన్ని పొందుచున్నారు. ఓ మాతా, ముల్లోక నివాసినివైన నీకు, పద్మము నుండి వెలసిన నీకు, ఇవే నా నమస్సులు ఓ ముకుందుని ప్రియసఖీ!
 

మాతర్ నమామి, కమలే, కమలాయతాక్షి , 
శ్రీ విష్ణు హృత్కమల వాసిని, విశ్వమాత, 
క్షీరోదజే, కమల కోమల గర్భ, గౌరి, 
లక్ష్మీ ప్రసీద, సతతం, నమతాం శరణ్యే  ॥

అర్థము:

తల్లీ నీకు వందనములు! ఓ కమలమా! కమలములు పోలిన కనులున్న మాతా!  మహావిష్ణువు హృదయము నందు నివసించే, సమస్త విశ్వానికి తల్లీ! పాలకడలి నుండి పుట్టిన, కోమలములైన కమలముల గర్భమందుండే ఓ గౌరీమాతా , ఓ లక్ష్మీదేవీ, ఎల్లవేళలా రక్షింపుము తల్లీ, నిన్నే శరణు వేడుచున్నాను.  

For lyrics in English along with their meanings, please click Here

17, నవంబర్ 2018, శనివారం

Daily Puja - ఇంట్లో పూజ ప్రతిరోజూ ఏ విధముగా చేసుకోవాలి

మన ఇళ్లల్లో ప్రతిరోజు పూజ చేసుకోవడం అనేది సాధారణముగా  మనము మన పెద్దల దగ్గిర నుండి నేర్చుకుంటూ ఉంటాము. కాకపొతే మన పెద్దలు ఉన్నప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి మన పరిస్థితులు వేరు. 

ప్రస్తుత పరిస్థితులలో మనకి సమయం చాలా వ్యస్తంగా ఉండి పూజకి ఏ విధముగా సమయం కేటాయించుకోవాలో అర్ధం కాకుండా  సతమతమవుతూ  ఉంటు న్నాము. అటువంటి వారు అతి కొద్దీ సమయంలో తృప్తిగా ఎలా పూజ చేసుకోవాలి అన్నది  ఇక్కడ వివరించి చెప్పడానికి ప్రయత్నము చేస్తాను.   

నేను చెప్పే ఈ విధానాన్ని మీరు ఎలా కావాలనుకుంటే అల్లాగే మీకు అనుగుణముగా మార్చుకోవచ్చును. మీకు ఉన్న సమయము, సదుపాయాలని బట్టి, నేను విశదీకరించే సలహాలని బట్టి మీరు మీ విధానాన్ని రూపొందించుకో వచ్చును.

 
పూజ చేసే సందర్భంలో దేవునికి కేవలం పూజ కాకుండా ఇంకా కొన్నిసేవలవంటివి ముందూ, వెనకా  ఉంటాయి. ఎలాగైతే మనకి కొన్ని ముఖ్యమైన కాల్యకృత్యాలు, కలాపాలు ఉంటాయో అల్లాగే దేవునిచేత కూడ చేయిస్తాము. ఉదాహరణకి చేతులు, కాళ్ళు కడుక్కోవడం, స్నానం చెయ్యడం, ఇలాంటివి. 

ఇవి మీకు కుదిరితేనే చెయ్యాలి. తప్పనిసరి కాదు. నాకు ఇలాంటివి కొన్ని చెయ్యడము ఆనందముగా, తృప్తిగా ఉండటము వలన మీకు కూడ చెబుతున్నాను. 

పూజకు ముందు చేసే ఏర్పాటులు 

  1. ముందుగా మనము స్నానము చేసి శుభ్రమైన బట్టలు కట్టుకుందాము. పట్టు బట్టలు ఉంటే అవి విడిగా పెట్టుకుని రోజూ కట్టుకుని పూజ చెయ్యవచ్చును. నెలకొకసారి అవి డ్రై క్లినింగు చేయించుకోవచ్చును. 
  2. ఎలాగైతే మనం ఇల్లు శుభ్రము చేసుకుంటామో అదేవిధముగా భగవంతుని ఉంచే స్థలం శుభ్రం చేసుకోవాలి. తడి బట్టతో తుడిచి కూడ శుభ్రం చేసుకోవచ్చును. విగ్రహము, దేవుని   పటాలు కూడ అప్పుడప్పుడు శుభ్రము చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మన దేవుడు కళకళ లాడుతూ నవ్వుతూ ఉంటాడు. 
  3. దీపం కుందులు వారానికి ఒకసారి సబ్బుతో తోముకుంటే మంచిది. తక్కిన రోజుల్లో పాత వత్తులు తీసేసి, క్రొత్త వత్తులు పెట్టి దీపం వెలిగించుకోవాలి. 
  4. అలాగే పూజ చేసే పాత్రలు కూడా కడుక్కోవాలి. ఇవి ప్రతీ రోజు శుభ్రంగా నీళ్లతో కడిగేసుకుంటే చాలు. 
  5. Vim suddham అని ఒక లిక్విడ్ వస్తోంది ఈ మధ్య. దానితో అయినా, లేదా చింతపండుతో నైనా అప్పుడప్పుడు కడిగితే కుందులు, పాత్రలు మెరుస్తూ ఉంటాయి. మనస్సుకి హాయిగా ఉంటుంది అవి చూస్తే. ఎంత ఇంపుగా ఉంటాయో తెలుసా! అలా వాటికేసి తనివి తీరా చూస్తూ ఉండాలని ఉంటుంది.   
  6. దేవుడిని ఏదైనా మందిరము లాంటి దాన్లో పెట్టవచ్చును లేదా ఒక పీట మీద అయినా పెట్టవచ్చును. సాధారణముగా తూర్పు లేదా ఉత్తరము దిక్కులో పెట్టాలి. కుదరకపోతే ఎలాగైనా పెట్టుకుంటాము. 



పూజకు కావాల్సిన సామగ్రి 

  1. దేవుని విగ్రహాలు, బొమ్మలు వగైరా. 
  2. పూజకి చదివే స్తోత్రాలు, పుస్తకాలు, క్యాసెట్లు లాంటివి. 
  3. దీపం కుందులు (రెండు పెడితే మంచిది). 
  4. దీపం నూనె మరియు వత్తులు. 
  5. అగరవత్తులు, వాటికి స్టాండ్. అల్లాగే కర్పూరము - అది వెలిగించేందుకు ప్లేట్ కానీ స్పూన్ లాంటిది కానీ.
  6. ఒక పళ్ళెము మరియు చిన్నరాగి చెంబు కానీ స్టీల్ అయినా ఫర్వాలేదు. ఒక ఉద్ధరిణె (స్పూన్ లాంటిది). రెండు గిన్నెలు ఉంటే ఇంకా మంచిది. ఒకటి దేవునికి, ఇంకోటి మనం ఆచమనం వగైరా చేసుకోడానికి ఉంటాయి.  
  7. నైవేద్యం (పళ్ళు, కొబ్బరికాయ, పటికబెల్లం, పంచదార, బెల్లం, ఇటువంటి వాటిలో ఏవైనా పెట్టవచ్చును. అన్నం కానీ లేదా మరేదైనా వంటకం అప్పుడప్పుడైనా, లేదా రోజు వండి పెడితే అది మరి మంచిది.)
  8. పువ్వులతో పూజ చేస్తే పువ్వులు మరియు ఎప్పుడైనా కుంకుమ పసుపులతో పూజ చేస్తే అవి కూడా రెడీగా ఉంచుకోవాలి. 

పూజావిధానము 

  • కుందులలో వత్తులు పెట్టి, దీపం నూనె పోసి వెలిగించాలి. 
  • చెంబులో మంచి నీరు పట్టుకుని పళ్ళెము, చెంబు, ఉద్ధరిణెతో సహా దేవుని దగ్గర పెట్టుకోవాలి. రెండు గిన్నెలు ఉంటే రెండింట్లో నీళ్లు పెట్టుకోవచ్చును. 
  • దేవునికి కుడివైపు కూర్చుని పూజ చేయాలి. కుదరని పక్షంలో ఎదురుగానైనా కూర్చుని చేయవచ్చును. 
  • ముందుగా చెంబు లేదా పాత్ర లోని నీటిని ఉద్ధరిణితో తీసుకుని దేవునికి స్నానం చేయిస్తున్నట్లుగా చుట్టూ తిప్పి పళ్లెంలో పొయ్యాలి. అల్లా రెండు, మూడు సార్లు అయ్యాక మళ్ళీ కాసిని నీళ్లు తీసుకుని మూడు సార్లు ఆచమనం చేయించినట్లుగా దేవునికి చూపించి పళ్లెంలో వదలాలి. 
  • ఆ తరువాత శుక్లామ్బరధరం శ్లోకము చదివి, గురుస్తుతి చేసి నెత్తి మీద నీటి చుక్కలు బొటన వేలితో మూడు సార్లు జల్లుకుని, మూడు సార్లు అచ్యుతాయ నమః అనే మూడు నామాలు చదువుకుంటూ ఆచమనం చేసి పూజ మొదలు పెట్టాలి. ఆచమనం మనకోసం పెట్టుకున్న పాత్రలోంచి నీళ్లు తీసుకుని చెయ్యాలి.  
  • పూజలో మీరు ఏ శ్లోకాలు కావాలంటే అవి చదువుకుని అష్టోత్తరములు కూడా కావాలంటే చదువుకుని పూజ చేసుకోవచ్చును. నామాలు చదివేటప్పుడు పువ్వులు వేస్తూ కూడ పూజ చేసుకోవచ్చును. లేదా వట్టినే చదివేసుకోవచ్చును. 
  • ఇవన్నీ అయ్యాక దణ్ణం పెట్టుకుని లేచి నిలబడి అగరవత్తులు వెలిగించి దేవుళ్ళకి చుట్టూ తిప్పి వాసన చూపించి స్టాండ్ లో పెట్టాలి. 
  • అల్లాగే దీపాన్ని కుడి చేతితో దేవునికి చూపించాలి. 
  • ఆ పిమ్మట నైవేద్యం మీద కాసిని నీటి చుక్కలు వేసి దేవునికి ఆరగింపు పెట్టాలి. అంటే కుడి చేత్తో ఆ నైవేద్య పదార్థాన్ని దేవునికి చూపిస్తూ స్వాహా స్వాహా అని తినిపించినట్లుగా. 
  • నైవేద్యం అయ్యాక చేతులు మూతి కడిగినట్లుగా కాసిని నీళ్లు చూపించి పళ్లెంలో వదలాలి. అల్లాగే కాళ్ళకి చూపించి మళ్ళీ పళ్లెంలో వదలండి. మళ్ళీ కాస్త మంచి నీళ్లు తాగించినట్లుగా దేవునికి చూపించి పళ్లెంలో వదలాలి. 
  • ఇప్పుడు కర్పూరం వెలిగించి మంగళ హారతి చదవాలి. 
  • హారతి అయ్యాక కాసిని నీళ్లు కర్పూరం చుట్టూ త్రిప్పి పళ్లెంలో వదలండి. హారతిని కళ్ళకి అద్దుకోవాలి. 
  • అటు పిమ్మట ఆ పళ్ళెంలోని నీళ్ళని దేవుని పాత్రలోని నీళ్లలో కలిపేసి అదే తీర్థముగా తీసుకోవాలి. నైవేద్యం కూడా కళ్ళకి అద్దుకుని గ్రహించాలి. 

ఇది శాస్త్రోక్తం ప్రకారం సులభంగా చేసుకునే మార్గం. ఇదంతా చేయడానికి 10, 15 నిమిషాలు కంటె ఎక్కువ పట్టదు. దీన్ని ఇంకా మీకు కావాల్సిన విధంగా కూడ మార్చుకోవచ్చును. సమయం ఉంటే అరగంట, ఇంకా ఎక్కువ సేపు కూడా చెయ్యవచ్చును.