శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం పారాయణము ప్రతిరోజూ తిరుపతి తిరుమల దేవస్థానం లో అతి భక్తిశ్రద్ధలతో జరుగుతూ ఉంటుంది. భక్తులందరూ ఆ సమయం కోసం ఎదురుచూస్తూ ఉండి అయన దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుంటూ ఆనందిస్తూంటారు.
- వెంకటేశ్వర సుప్రభాతము లేదా మేలుకొలుపు
- వెంకటేశ్వర స్తోత్రము లేదా కీర్తన
- శ్రీ వెంకటేశ్వర ప్రపత్తి లేదా శరణాగతి
- మంగళాశాసనము లేదా మంగళ హారతి
ఇప్పుడు ఈ బ్లాగులో ( బ్లాగ్ అన్న పదానికి ఏదైనా తెలుగు పదం ఉందో లేదో ) నేను శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం గురించి తెలియజేస్తున్నాను . ఇందులో 29 చరణాలు / శ్లోకాలు ఉన్నాయి. ప్రతి యొక్క శ్లోకము రాస్తూ దాని అర్థాన్ని కూడా తెలియ జేస్తాను.
వెంకటేశ్వర స్వామిని భక్తులు నిద్ర లేపుతున్నారు పూజలు అందుకోవడం కోసం. అలా నిద్ర లేపుతూ చుట్టుపక్కల ప్రకృతిలో ఏమేం జరుగుతోందో తెలుపుతూ ఆయన్ని లేపడం జరుగుతోంది.
ఇక్కడ అందరూ దయచేసి ఒక విషయం గమనించాలి. వెంకటేశ్వర స్వామిని సంభోదించేటప్పుడు ఆయన్ని రామా అని, గోవిందా అనీ, ఇంకా అనేకమైన పేర్లు వాడుతారు. అందరూ విష్ణువు యొక్క రూపాలే కనుక.
శ్రీ వెంకటేశ్వర సుప్రభాతమ్
కౌసల్యా సుప్రజా రామా ,పూర్వాసంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల, కర్తవ్యమ్ దైవమాహ్నికమ్ || (1)
కౌసల్యాదేవి ముద్దులపట్టి శ్రీ రామా ! తెల్లవారే సమయం అయిపోతోంది. లేవవయ్యా ఓ సింహముతో పోలిన మానవా, నిత్య దైనందిన కర్మలు ఆచరించనీ.
ఉత్తిష్ఠో ఉత్తిష్ఠ , గోవింద, ఉత్తిష్ఠ గరుడధ్వజ
ఉత్తిష్ఠ కమలాకాంత, త్రైలోక్యం మంగళం కురు || (2)
ఓ గోవిందా (రక్షించే స్వామీ)! లేవండి , లేవండి స్వామీ ! ఓ గరుడ ధ్వజము గల స్వామీ , లేవండి. ఓ లక్ష్మీ కాంతా లేవండి. కమలా అంటే కమలములో ఉద్భవించిన దేవి. అంటే లక్ష్మీదేవి తనకు సతిగా ఉన్న స్వామిని లేపుతున్నాము. ఓ స్వామీ, ముల్లోకములకూ మంగళాన్ని (మంచిని) ప్రసాదించండి.
మాతః సమస్త జగతామ్ ! మధుకైటభారేహ్
వక్షో విహారిణి, మనోహర దివ్యమూర్తే
శ్రీస్వామిని, శ్రితజన ప్రియ దానశీలే
శ్రీవేంకటేశ దయితే, తవ సుప్రభాతమ్ || (3)
ఓ మాతా! అమ్మా పద్మావతీదేవి! సమస్త ప్రపంచానికీ తల్లీ , మధు, కైటభ దానవులకు శత్రువైన విష్ణుమూర్తి వక్షములో విహరించు లక్ష్మీ ! మనోహరమైన దివ్యమంగళ రూపుడైన మహావిష్ణువు యొక్క స్వామినీ! నిన్ను ఆశ్రయించు వారికి ప్రియమైన తల్లీ! కోరికలు తీర్చు దానగుణము కల మాతా! శ్రీ వేంకటేశ్వరుని పత్నీ! నీకు మంగళకరమైన ఉదయము గాక.
తవ సుప్రభాత మరవింద లోచనే
భవతు ప్రసన్న ముఖ చంద్రమండలే
విధి శంకరేంద్ర వనితాభి రర్చితే
వృషశైలనాథ దయితే దయానిధే || (4)
మీ మంగళమయ మైన ప్రాతఃకాలము ఎంతో కన్నుల విందుగా ఉంది. ఓ తల్లీ , నీ ప్రసన్న ముఖము చంద్రమండలము వలె ప్రకాశిస్తుండగా శంకరుడు, ఇంద్రుడు, దేవ వనితలు, మొదలైన వారంతా కూడ ఎంతో శ్రద్ధగా మిమ్ముల పూజిస్తున్నారు. ఓ వృషభాచల నాథుడైన వేంకటేశ్వరుని ప్రాణేశ్వరీ, దయతో నిండిన దేవీ . (నీకు వందనములు).
అత్రియాది సప్తఋషయస్స ముపాస్య సంధ్యాం
ఆకాశ సింధు, కమలాని మనోహరాణి,
ఆదాయ పాదయుగం అర్ఛయతుం ప్రపన్నాహ్
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || (5)
అత్రి మొదలైన సప్త ఋషులంతా కూడ సంధ్య వార్చగా ఆకాశమంతా సింధు వర్ణముతో కమలములాగా ఎంతో అందంగా వెలుగుతుండగా మీ పాద పద్మములను కూడ అర్చించుట కోసం ఎంతో ఆతురతో వేచి ఉన్నారు. ఓ శేషాద్రి శిఖర ప్రభూ మీ ఉదయము మంగళమయ మగు గాక !
పంచానన ఆబ్జభవ షణ్ముఖ వాసవాద్యా
త్రైవిక్రమాది చరితం విబుధా స్తువంతి
భాషాపతిః పఠతి వాసర శుద్ధి మారాత్
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || (6)
ఐదు ముఖముల శివుడు, కమలంలో పుట్టిన బ్రహ్మ, ఆరు ముఖముల సుబ్రహ్మణ్య స్వామి, వసువులు, దేవతలు మొదలైన వారంతా త్రివిక్రముడవైన నీ చరిత్రాన్ని చక్కగా స్తోత్రము చేస్తున్నారు. బృహస్పతి వారఫలాలు, తిథులు, మంచి చెడు ఘడియల పఠనము చేయుచున్నాడు. ఓ శేషాద్రి శిఖర ప్రభూ మీ ఉదయము మంగళమయ మగు గాక !
ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ నారికేళ
పూగద్రుమాది సుమనోహర పాలికానాం
ఆయాతి మందమనిలః సహ దివ్యగంధైహి
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || (7)
కొద్దిగా విచ్చుకున్న కలువ పూలు, కొబ్బరి పూలు, మరియు పారిజాతము, వక్కల పొదల నుండి వీచే పిల్ల గాలులు సువాసనలను వెదజల్లుతున్నాయి. ఓ శేషాద్రి శిఖర ప్రభూ మీ ఉదయము మంగళమయ మగు గాక !
ఉన్మీల్య నేత్రయుగ ముత్తమ పంజరస్థాహ్
పాత్రావశిష్ఠ కదళీఫల పాయసాని
భుక్త్వా సలీల మథాకేళి శుకా పఠంతి
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || (8)
పరవశముతో నిండిన అర్థనిమీలిత కన్నులతో ఉత్తమమైన పంజరాలలో ఉన్న ఉత్తమ పాత్రలలో ఉన్న అరటిపళ్ళు, పాయసము తనివి తీరా ఆరగిస్తూ ఆడుతూ, పాడుతూ చిలుకలు ఎంతగానో ఆనందిస్తున్నవి. ఓ శేషాద్రి శిఖర ప్రభూ మీ ఉదయము మంగళమయ మగు గాక !
తంత్రీ ప్రకర్ష మధుర స్వనయా విపంచ్యా
గాయత్యనంత చరితమ్ తవ నారదోపి
భాషా సమగ్ర మసకృత్ కర చారు రమ్యమ్
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || (9)
వీణల తీగలను తియ్యగా మీటుతూ నారదుడు మొదలైన వారు మీ యొక్క అంతులేని చరిత్రలనే పాడుతున్నారు ఎంతో విశిష్టమైన భాషా శైలిలో అద్భుతంగా పొల్లుపోకుండా ! ఓ శేషాద్రి శిఖర ప్రభూ మీ ఉదయము మంగళమయ మగు గాక !
భృంగావళీ చ మకరంద రసానువిద్ధ
ఝమ్కార గీత నినదై సహసేవనాయ
నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్యహ
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || (10)
తుమ్మెదలు, తేనెటీగలు మకరందము (తేనె) తాగుతూ పెద్దగా చప్పుళ్ళు చేస్తూ కలువపూల పుప్పొడిలోంచి పైకి ఎగురుతూ మీ సేవ కోసమై పాడుతున్నట్లుగా నినాదాలు చేస్తున్నాయి. ఓ శేషాద్రి శిఖర ప్రభూ మీ ఉదయము మంగళమయ మగు గాక !
యోషా గణేన వరదధ్ని విమధ్య మానౌ
ఘోషాలయేషు దధి మంధన తీవ్ర ఘోషా
రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాహ్
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || (11)
చుట్టుపక్కల గొల్లవారంతా తమ కుండల్లోకి పాలు పితుకుతుంటే ఆ పితుకుతున్న పాలు, కుండలూ కూడా పెద్దగా చప్పుళ్ళు చేస్తూంటే పక్కనే ఉన్న (అర్జున) చెట్లపైని ఉన్న కుంభ పక్షులన్నీ కూడా రెక్కలు విదిలిస్తూ కోపంతో గట్టిగా అరుస్తున్నాయి. ఓ శేషాద్రి శిఖర ప్రభూ మీ ఉదయము మంగళమయ మగు గాక !
పద్మేశ మిత్ర శతపత్ర గతాళివర్గాహః
హర్తుమ్ శ్రియం కువలయస్య నిజాఙ్గ లక్ష్మ్యాహ
భేరీ నినాద మివ బిభ్రతి తీవ్ర నాదం
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || (12)
పద్మముల మిత్రుడైన సూర్యుని జ్యోతిలో ప్రకాశిస్తున్న ఆ పద్మాల కంటే ఆకర్షణీయంగా ఉండాలని ఆ పువ్వులలో నుండి ఎగిరే తుమ్మెదలు గట్టిగా గోల చేస్తున్నాయి. అంతేకాక లక్ష్మీదేవి ఇరుపక్కలా ఉన్న ఏనుగులు కూడా భేరీ నినాదాలు చేస్తున్నాయి. ఓ శేషాద్రి శిఖర ప్రభూ, మీ ఉదయము మంగళకర మగు గాక !
శ్రీమన్ అభీష్ట వరదా ఖిల లోకబంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో
శ్రీ దేవతా గృహ భుజాంతర దివ్య మూర్తే
శ్రీ వేంకటాచల పతే తవ సుప్రభాతమ్ || (13)
శ్రీమాన్ ! కోరిన వరాలొసగే సమస్త లోకాలకూ బంధువా ! ఓ శ్రీనివాస (లక్ష్మికి నివాసమా), జగత్తులో ఒక్కగానొక్క దయా సాగరుడివి నీవు . లక్ష్మీదేవి కొలువున్న విశాల వక్షముతో అందమైన భుజములు గల దివ్య మంగళ మూర్తివి నీవు. ఓ వెంకటాచల ప్రభువా ! నీకు సుప్రభాతము.
శ్రీ స్వామి పుష్కరిణి కా ప్లవ నిర్మలాంగా
శ్రేయోర్థినో హర విరించి సనందనాద్యా
ద్వారే వసంతి వరవేత్ర హతోత్తమాంగా
శ్రీ వేంకటాచల పతే తవ సుప్రభాతమ్ || (14)
మీ పుష్కరిణి లోని పవిత్రమైన జలములతో తమ శ్రేయస్సుని కోరుకుంటూ స్నానమాచరించి శివుడు, బ్రహ్మ, సనక సనందాద్యులు మీ ద్వారము వద్ద ఉత్సుకతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఓ వెంకటాచల ప్రభువా ! నీకు సుప్రభాతము.
శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి
నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం
ఆఖ్యామ్ త్వదీయ వసతే రనిశం వదంతి
శ్రీ వేంకటాచల పతే తవ సుప్రభాతమ్ || (15)
శేషశైలము, గరుడాచలము, వెంకటాద్రి పర్వతము, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి, మొదలైన ఏడు కొండలూ కూడ నీ యొక్క ముఖ్యమైన నివాస స్థానములని చెప్పుకుంటున్నారు అందరూ అన్ని వేళలా కూడ . ఓ వెంకటాచల ప్రభువా ! నీకు సుప్రభాతము.
సేవాపరా శివసురేశ కృశాను ధర్మ
రక్షో అంబునాథ పవమాన ధనాధినాథాహ్
భద్దాంజలి ప్రవిలస న్నిజశీర్ష అదేశాహ్
శ్రీ వేంకటాచల పతే తవ సుప్రభాతమ్ || (16)
నీ సేవ కోసమై శివుడు, ఇంద్రుడు, అగ్నిదేవుడు, యముడు, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, మొదలైన వారంతా తమ తలలపై చేతులు జోడించుకుని నీ ఆజ్ఞల కోసం వేచి ఉన్నారు. ఓ వెంకటాచల ప్రభువా ! నీకు సుప్రభాతము.
ధాటీషు తే విహగరాజ మృగాధిరాజ
నాగాధిరాజ గజరాజ హయాధిరాజాహ్
స్వస్వాధికార మహిమాదిక మర్థయంతే
శ్రీ వేంకటాచల పతే తవ సుప్రభాతమ్ || (17)
మీ వాహనములైన పక్షిరాజు గరుత్మంతుడు, మృగరాజైన సింహము, సర్ప రాజైన ఆది శేషువు, గజరాజైన ఐరావతము, అశ్వ రాజైన ఏడుతలల తెల్లని ఉచ్చైశ్రవము, మొదలగునవి మీ సేవ ఇంకా బాగా చేయగలిగే శక్తిని ప్రసాదించమని వేడుకుంటున్నాయి. ఓ వెంకటాచల ప్రభువా ! నీకు సుప్రభాతము.
సూర్యేన్డు భౌమ బుధ వాక్పతి కావ్యసౌరి
స్వర్ భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానా
త్వద్దాస దాస పరమావధి దాసదాసాహ్
శ్రీ వేంకటాచల పతే తవ సుప్రభాతమ్ || (18)
సూర్యుడు, చంద్రుడు, (భౌమ) మంగళుడు, బుధుడు, బృహస్పతి, కావ్య కుమారుడైన శుక్రుడు, (సౌరి) శని, స్వరభాను (రాహువు), కేతువు మొదలైన నవగ్రహ దేవతలంతా నీ దాసులకంటే దాసులకు కూడా సేవ చేస్తామంటూ ఎదురుచూస్తున్నారు. ఓ వెంకటాచల ప్రభువా ! నీకు సుప్రభాతము.
త్వత్పాద ధూళి భరిత స్ఫూరితోత్తమాంగా
స్వర్గాపవర్గ నిరపే క్ష్య నిజాంతరంగాహ్
కల్పాగమా కలనయా ఆకులతాం లభంతే
శ్రీ వేంకటాచల పతే తవ సుప్రభాతమ్ || (19)
వారంతా కూడ నీ పాదధూళితో పవిత్రమైన ఉత్తమ శరీరులై స్వర్గము, స్వర్గము కానిది అనే భేదము చూడక తమ హృదయాంతరంగంలో ఈ కల్పము ముగిసే సమయంలో జరిగేదాన్ని ఊహించుకుని దుఃఖితులై సతమతమవుతున్నారు. ఓ వెంకటాచల ప్రభువా ! నీకు సుప్రభాతము.
త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణా
స్వర్గాపవర్గ పదవీం పరమాశ్రయంతః
మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే
శ్రీ వేంకటాచల పతే తవ సుప్రభాతమ్ || (20)
మీ గోపురాగ్రము మీద ఎక్కి ఎదురుచూస్తూ స్వర్గాన్ని, మోక్షాన్ని కూడ వదిలేసి మానవలోకంలోని మనుష్యులంతా మీ ఆశ్రయమే కోరి మీకే సేవ చేస్తామంటూ మీ కోసమే ఎదురు చూస్తున్నారు. ఓ వెంకటాచల ప్రభువా ! నీకు సుప్రభాతము.
శ్రీ భూమినాయక దయాది గుణామృతాబ్దే
దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే
శ్రీమన్ అనంత గరుడాదిభి రర్చితాంఘ్రే
శ్రీ వేంకటాచల పతే తవ సుప్రభాతమ్ || (21)
శ్రీ భూదేవి కి నాయకా ! దయ మొదలైన అమృత గుణముల సాగరా, ఓ దేవుళ్లకే దేవుడా , జగత్తుకి ఒక్కగానొక్క శరణమైన దైవమా ! అనంతనాగు సర్పము, గరుత్మంతుడు, మొదలైన వారిచే అర్చింపబడే దేవా ! ఓ వెంకటాచల ప్రభువా ! నీకు సుప్రభాతము.
శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ
వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే
శ్రీవత్సచిహ్న శరణాగత పారిజాత
శ్రీ వెంకటాచల పతే తవ సుప్రభాతమ్ || (22)
ఓ పద్మమునే నాభిగా పొందిన పురుషోత్తమా ! వసుదేవుని పుత్రుడు, మరియు వసువులందరికీ దేవుడవైన వాసుదేవా ! వైకుంఠ (కుంఠములు లేదా ఆందోళనలు లేని ప్రదేశం) వాసా, మా (లక్ష్మీ) ధవుడా, జనుల వ్యాకులత, సమస్యలు పోగొట్టే దేవా , ఓ చక్రాన్ని ధరించిన, శ్రీవత్స చిహ్నము కల స్వామీ, శరణాగతులకు పారిజాత పుష్పము లాంటి అదృష్టమా ! ఓ వెంకటాచల ప్రభువా ! నీకు సుప్రభాతము.
కందర్ప దర్పహర సుందర దివ్యమూర్తే
కాంతా కుచాంబురుహ కుట్మలలోల దృష్టే
కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే
శ్రీ వెంకటాచల పతే తవ సుప్రభాతమ్ || (23)
కందర్పుని (మన్మథుని) గర్వము అణచిన సుందరమైన దివ్యాకృతి కల స్వామీ ! కాంతలందరు (స్త్రీలు) నీ వక్షోజముల వైపు శృంగార మరియు అసూయా భరితమైన దృష్టితో చూసే సౌందర్యము కల స్వామీ ! కళ్యాణము, నిర్మలము లైన గుణములతో దివ్యంగా కీర్తించబడే స్వామీ ! ఓ వెంకటాచల ప్రభువా ! నీకు సుప్రభాతము.
మీనాకృతే, కమఠ, కోల, నృసింహ వర్ణిన్
స్వామిన్, పరశ్వథ తపోధన, రామచంద్ర,
శేషాంశ రామ, యదునందన, కల్కి రూప
శ్రీ వెంకటాచల పతే తవ సుప్రభాతమ్ || (24)
మీనాకృతి అంటే మత్స్యావతారం, (కమఠ) కూర్మ లేదా తాబేలు అవతారం, (కోల) వరాహ అవతారం, నృసింహావతారము, (స్వామి) వామన , (పరశ్వథ తపోధన ) పరశురామ , రామ, శేషాంచ రామ అంటే బలరాముడు, కృష్ణుడు, కల్కి ఇన్ని అవతారాలు దాల్చే ఓ వెంకటాచల ప్రభువా ! నీకు సుప్రభాతము.
ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం
దివ్యం వియత్సరితి హేమ ఘటేషు పూర్ణమ్
ధృత్వాద్య వైదిక శిఖామణయహ్ ప్రహృష్టా
తిష్ఠంతి వేంకటపతే తవ సుప్రభాతమ్ || (25)
ఏలకులు, లవంగాలు, కర్పూరము మొదలగు సుగంధాలు ఆకాశగంగ జలాలలో బాగా కలిపిన నీటితో నింపిన బంగారు బిందెలతో వేదాలలో ఆరితేరిన పండితులు మీకోసం కూర్చుని ఎదురు చూస్తున్నారు. ఓ వేంకట స్వామీ మీ ఉదయము మంగళమయ మగు గాక !
భాస్వానుదేతి వికచాని సరోరుహాణి
సంపూరయంతి నినదై కకుభో విహంగాహ్
శ్రీవైష్ణవా సతత మర్చిత మంగళాస్తే
ధామాశ్రయంతి తవ వేంకట సుప్రభాతమ్ || (26)
సూర్యుడు ఉదయిస్తున్నాడు. సరోరుహములు (కమలములు, పద్మములు) విప్పారుతున్నాయి. కకుభ వృక్షాల పైని (అర్జున చెట్టు) పక్షులు గట్టిగా అరుస్తున్నాయి. శ్రీవైష్ణవులు ఎల్లప్పుడూ మంగళము (అంతా మంచి జరగాలని ) కోరుకుంటూ మీ సన్నిధి కోసం వేచి ఉన్నారు. ఓ వెంకటేశా మీ ఉదయము మంగళమయ మగు గాక !
బ్రహ్మాదయ సురవరా స్స మహర్షయస్తే
సంత స్సనందన ముఖాస్తథ యోగివర్యాహ్
ధామాంతికే తవహి మంగళ వస్తుహస్తా
శ్రీ వెంకటాచల పతే తవ సుప్రభాతమ్ || (27)
బ్రహ్మ మొదలగు దేవతలందరూ, మహర్షులు, సంతులైన సనక సనందాదులూ మొదలగు ప్రముఖులైన యోగులంతా కూడ తమ చేతులలో మంగళకరమైన వస్తువులు (బహుమతులు) పట్టుకుని ఉన్నారు. ఓ వేంకటాచల ప్రభువా, మీ ఉదయము మంగళమయమగు గాక !
లక్ష్మీనివాస, నిరవద్య గుణైక సింధో
సంసార సాగర సముత్తరణైక సేతో
వేదాంత వేద్య నిజవైభవ భక్తభోగ్య
శ్రీ వెంకటాచల పతే తవ సుప్రభాతమ్ || (28)
ఓ లక్ష్మీదేవికి నివాసమా! మచ్చలేని గొప్ప గుణాల పెన్నిధీ ! ఈ సంసార సాగరాన్ని ఈదడానికి నీవే వంతెనలాంటి వాడివి. నీయొక్క మహిమలు వేదాలనెరిగిన పండితులకే సాధ్యము. మా వంటి భక్తులందరికీ నువ్వు అనుభవించ తగవైన వాడివి. ఓ వేంకటాచల పతీ ని ఉదయము మంగళమయ మగు గాక !
ఇత్థం వృషాచలపతే రివ సుప్రభాతమ్
యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాహ్
తేషామ్ ప్రభాతసమయే స్మ్రుతి రంగభాజాం
ప్రజ్ఞామ్ పరార్థ సులభామ్ పరమాం ప్రసూతే || (29)
ఇది వృషాచలపతి (శ్రీ వెంకటేశ్వర స్వామి) యొక్క సుప్రభాత గీతము . ఎవరైతే దీనిని ప్రతిరోజూ చిత్తశుద్ధితో చదువుతూ, పారాయణ చేస్తుంటారో, లేదా ప్రొద్దుటే జ్ఞాపకం చేసుకోవడము, రాగములతో పాడుకోవడము, భజించడము చేస్తారో వారంతా కూడ ప్రజ్ఞావంతులౌతారు, మోక్షాన్ని పొందుతారు.