9, అక్టోబర్ 2024, బుధవారం

ఆంజనేయ దండకము, మరియు స్తోత్రములు - Hanuman Worship Hymns


 ఆంజనేయ దండకము ప్రతిరోజూ సులభంగా చదువుకోడానికి క్లుప్తంగా ఇక్కడ తెలియజేస్తున్నాను. 

ఇందులో ఆంజనేయస్వామిని పది గుణములలో వర్ణించి కీర్తించడము జరిగింది.

నేను ప్రతి రోజూ హనుమాన్ చాలీసా చదువుతుంటాను. అది చదివేటప్పుడు ముందుగా ఇదే చదువుతుంటాను పూజ సమయంలో. 

ఈ దండకము తరువాత ఇంకొన్ని ఇంపుగా ఉండే స్తోత్రాలను చదువుతుంటాను. అవి కూడ తెలియ జేస్తున్నాను. 


ముందుగా ఆంజనేయ దండకము :

శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం 
ప్రభాదివ్యకాయం, ప్రకీర్తి ప్రదాయం 
భజే వాయుపుత్రం, భజే వాలగాత్రం 
భజేహం పవిత్రం, భజే సూర్యమిత్రం 
భజే రుద్రరూపం, భజే బ్రహ్మతేజం || (1)

అర్థము:-

 శ్రీ ఆంజనేయ స్వామీ ! ప్రసన్నంగా ఉండి, దివ్య తేజస్సుతో కూడిన శరీరం కలవాడా ! ఓ వాయుదేవుని పుత్రా నిన్ను భజిస్తున్నాను . పొడవైన,బలిష్ఠ మైన మెడ కలిగిన నిన్నే కీర్తిస్తున్నాను. పవిత్రమైన నిన్ను భజన చేస్తున్నాను. సూర్యునికి మిత్రుడవైన నిన్నే కీర్తిస్తున్నాను. రుద్రమైన భయంకర రూపుడవైన నిన్నే పొగడుతున్నాను.  బ్రహ్మ తేజస్సుడవైన నిన్నే కీర్తన చేస్తున్నాను. 

ఆంజనేయస్వామి స్తోత్రములు 

మనోజవం, మారుత తుల్య వేగం 
జితేంద్రియం, బుద్ధిమతాం వరిష్టం 
వాతాత్మజం, వానరయూధ ముఖ్యం 
శ్రీరామ దూతం, శిరసా నమామి || (2)

అర్థము:-

సదా యౌవనము, పటుత్వము అయిన మనస్సుతో, గాలితో పోలిన వేగము కలిగి, ఇంద్రియములను జయించిన, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడవై, వానర యోధులందరిలో ముఖ్యమైన వాడివి, వాయుపుత్రుడవు అయిన ఓ శ్రీరాముని దూతవైన ఆంజనేయ స్వామీ, నీకు నా శిరస్సు వంచి దాసోహములు సమర్పిస్తున్నాను. 

   
అతులిత బలధామం, స్వర్ణశైలాభ దేహం 
దనుజవన కృశానుం, జ్ఞానినా మగ్రగణ్యం 
సకల గుణ నిధానాం, వానరాణాం అధీశం 
రఘుపతి ప్రియభక్తం, వాతజాతం నమామి || (3)

అర్థము:-

అంతులేని బలము కలిగి, బంగారు కొండల కాంతి కలిగిన దేహము పొంది, రాక్షస సమూహములను గడ్డిపోచలుగా నలప కలుగు శక్తివంతుడవై, జ్ఞానులందరిలోకీ అగ్రేసరుడవై, అన్ని గుణములకూ నిధి వంటి వాడివై, వానరులలో అధిపతివై, రఘుపతి శ్రీ రామునికి ప్రియ భక్తుడవైన, గాలిపుత్రా! నీకు నమస్సులు. 

  
గోష్పదీకృత వారాశిం, మశకీకృత రాక్షసం 
రామాయణ మహామాలా రత్నం, వందే అనిలాత్మజం 
యత్ర యత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్ 
భాష్పవారి పరిపూర్ణ లోచనం, మారుతిమ్, నమత రాక్షసాంతకమ్ || (4) 

అర్థము:-

సముద్రాన్ని ఒక గోవు కాలిక్రింది గోతిని దాటినట్లుగా దాటావు (ఆవులు కాని గేదెలు కాని నడుస్తున్నప్పుడు వాటి గిట్టల ముద్రలు మట్టిలో పల్లముల లాగ కనిపిస్తాయి కదా.  సముద్రాన్ని ఆ పల్లములాగా హనుమంతుడు దాటాడని చెప్పబడింది). 
ఇక రాక్షసులనేమో దోమలు నలిపినట్లుగా నలిపేశాడు హనుమ. అటువంటి ఓ ఆంజనేయస్వామి, రామాయణము ఒక మాల అయితే ఆ మాలలో రత్నము వంటివాడవు నీవు. నీకు వందనములు ఓ అనిలపుత్రా  (గాలి పుత్రా) ! 
ఎక్కడెక్కడయితే శ్రీ రాముని కీర్తన జరుగుతుంటుందో అక్కడక్కడ ఆంజనేయస్వామి అంజలి జోడించి వింటూ ఉంటాడు (ఇప్పటికి కూడా). ఆ వినడము కూడా ఎంతో ఆనందంలో తన్మయుడైపోయి కళ్ళల్లో ఆనందభాష్పాలు  నిండిపోయేలా వింటూ ఉంటాడు. అటువంటి ఓ మారుతీ, రాక్షసాంతకా ! నీకు నా నమస్సులు.    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి