18, అక్టోబర్ 2024, శుక్రవారం

శ్రీ రామ అష్టకము - Sri Rama Worship With 8 Hymns


శ్రీ రాముని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆయనను మనము ప్రతిరోజూ స్మరిస్తూ, భజన చేస్తూ ఉందాము అని ఎనిమిది శ్లోకాలలో తెలియజేయ బడింది. 

శ్రీ రాముడు ఆ పరమాత్మ అవతారము. ఆయనకు వేరే ఎవ్వరూ సాటి లేరు అని ప్రతీ శ్లోకం ఆఖరున మాటి మాటికీ చెప్పబడి ఉంది ఈ అష్టకంలో. అటువంటి ఆయన భజనని రోజూ చేసుకుందాము అని చెప్పబడింది. 

ఈ రామాష్టకము నా దగ్గర ఒక చాలా పాత పూజల పుస్తకము (బాగా చిరిగి పోయింది) ఉంది. బహుశా రాజముండ్రి లో ప్రింట్ అయింది అనుకుంటాను. అందులోనిది నేను తెలియజేస్తున్నాను. ఆ పుస్తకంలోనే హరి అష్టకము, కృష్ణాష్టకం, విష్ణు స్తుతి, లక్ష్మీస్తుతి, శివ పంచాక్షరి, మొదలగు శ్లోకాలు కూడ ఉన్నాయి. అవే అన్నీ నేను కంఠస్థము పట్టి ప్రతిరోజూ పూజలలో 40 ఏళ్ల నుండీ చదువుకుంటున్నాను. 


 శ్రీ రామాష్టకం శ్లోకములు    

భజే విశేష సుందరం సమస్త పాప ఖండనం 
స్వభక్త చిత్త రంజనం సదైవ రామ మద్వయం || (1)

తాత్పర్యము :-

సదైవ అంటే ఎల్లవేళల. రామం అద్వయం అంటే ఇంకొక గొప్ప దైవము లేని శ్రీ రాముడు. (రామ అనే రెండు అక్షరములు అని కూడ మనం చెప్పుకోవచ్చును). 
అత్యంత అందమైన శ్రీ రాముని , అన్ని పాపాలనీ పోగొట్టే రాముని, తన భక్తుల మనస్సుకి హాయిని ప్రసాదించే రాముని, మనము ఎల్లవేళలా ఆ రాముని నామస్మరణం చేస్తూ ఉందాము. 
   

జటాకలాప శోభితం సమస్త పాప నాశకం 
స్వభక్త భీతి భంజనం భజేహ రామ మద్వయం || (2)

తాత్పర్యము :-

చక్కటి జడలతో ముఖము ప్రకాశిస్తూ ఉండే రాముని, అన్ని పాపములను నశింపజేసే రాముని, తన భక్తుల భయాన్ని పోగొట్టే రాముని, అటువంటి ఆ శ్రీ రాముని మనము ఎల్లవేళలా స్మరిస్తూ ఉందాము.  


నిజ స్వరూప బోధకం కృపాకరం భవాపహం 
సమం శివం నిరంజనం భజేహ రామ మద్వయం || (3)

తాత్పర్యము :-

నిజ స్వరూపము అంటే మన ఆత్మని మనకి తెలియజెప్పుట. ఆలా మన నిజస్వరూపాన్ని తెలియజేయు రాముని, దయామయుడైన రాముని, మన జన్మని తరింపజేసే రాముని, సమదృష్టితో చూసే రాముని, ఆనందమయుడు, పవిత్రుడు (మచ్చలు, కళంకము లేనివాడు),  అటువంటి ఆ శ్రీ రాముని మనము ఎల్లవేళలా స్మరిస్తూ ఉందాము.  


సదా ప్రపంచ కల్పితం హ్యనామ రూప వాస్తవం 
నరాకృతిం నిరామయం భజేహ రామ మద్వయం || (4)

తాత్పర్యము :-

నిరంతరము సృష్టిని సాగిస్తూ, తనకంటూ ఎటువంటి పేరు కాని రూపము కాని లేని వాడు, మానవ రూపం ధరించిన శ్రీ రాముని, ప్రసన్నచిత్తుడైన వాడు , అటువంటి ఆ శ్రీ రాముని మనము ఎల్లవేళలా స్మరిస్తూ ఉందాము. 


నిష్ప్రపంచ నిర్వికల్ప నిర్మలం నిరామయం 
చిదేక రూప సంతతం భజేహ రామ మద్వయం || (5)

తాత్పర్యము :-

నిష్ప్రపంచ అంటే ఎటువంటి తాపత్రయం లేనివాడు. నిర్వికల్ప అంటే తేడాలు, సందేహాలు, సీమలు లేని వాడు. పవిత్రమయిన రాముడు, ఎటువంటి చింతలు లేని ప్రసన్న మానసుడు, తన్మయమైన ఒకే రూపం దాల్చి కనబడే శ్రీ రాముడు, అటువంటి ఆ శ్రీ రాముని మనము ఎల్లవేళలా స్మరిస్తూ ఉందాము. 


భవాబ్ధి పోత రూపకం హ్యశేష దేహ కల్పితం 
గుణాకరం కృపాకరం భజేహ రామ మద్వయం || (6)

తాత్పర్యము :-

సంసార సాగరాన్నిదాటించు వాడు, అతను కల్పించని  దేహములంటూ లేని వాడు, సకల గుణముల నిధి, అందరికీ మంచి చేయువాడు మరియు దయామయుడు, అటువంటి ఆ శ్రీ రాముని మనము ఎల్లవేళలా స్మరిస్తూ ఉందాము.  


మహాసువాక్య భోధకైర్ విరాజమాన వాక్పదైహ్ 
పరం చ బ్రహ్మ వ్యాపకం భజేహ రామ మద్వయం || (7)

తాత్పర్యము :-

ఎవరయితే గొప్ప విశేషణముల ద్వారా పిలువబడుతూ, గొప్ప వాక్యముల (జ్ఞానము) ద్వారా తెలియజెప్ప బడుతుండునో, అపరబ్రహ్మ అయి అంతటా వ్యాప్తి చెంది ఉన్నాడో అటువంటి ఆ శ్రీ రాముని మనము ఎల్లవేళలా స్మరిస్తూ ఉందాము.  

శివప్రదం సుఖప్రదం భవచ్చిదం భ్రమాపహం 
విరాజమాన దైశికం భజేహ రామ మద్వయం || (8)

తాత్పర్యము :-

ఎవరయితే ఆనందము కలిగిస్తూ, సుఖాన్ని ప్రదాయించునో, సందేహములను, భయములను, అజ్ఞానమును పోగొట్టుతూ మన అందరికీ ఒక గొప్ప గురువుగా, మార్గదర్శిగా ఉన్నాడో,  అటువంటి ఆ శ్రీ రాముని మనము ఎల్లవేళలా స్మరిస్తూ ఉందాము.   


రామాష్టక ఫలశ్రుతి శ్లోకములు 


రామాష్టకం పఠతి యస్సుకరం సుపుణ్యం 
వ్యాసేన భాషితమిదం శృణుతే మనుష్యహః || (9)


తాత్పర్యము :-

ఈ రామాష్టకము ప్రతిరోజూ చదివితే యశస్సు, పుణ్యము కలుగుతాయి. దీన్ని వేదవ్యాసుడు రచించెను. రోజూ వినడం, చదవడం చెయ్యండి మానవులారా! 

విద్యామ్ శ్రియం విపుల సౌఖ్యం అనంతకీర్తిం 
సంప్రాప్య దేహ విలయే లభతేచ మోక్షం || (10)   

తాత్పర్యము :-

అలా చదివే, వినేవారికి విద్య, యశస్సు, ధనము , అనంత సౌఖ్యము, కీర్తి, ఇవన్నీ లభిస్తాయి. ఇంకా జీవితాంతములో మోక్షము లభిస్తుంది.  














కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి