శ్రీ రామ పూజ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్రీ రామ పూజ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, జూన్ 2025, మంగళవారం

శ్రీ రామ స్తోత్రములు - Sri Rama Stotram Lyrics


శ్రీ రామ పూజా స్తోత్రములు కొన్ని ఇక్కడ అర్థములతో సహా పొందుపరచడం జరుగుతోంది. ఇవి మనము ప్రతిరోజూ పూజా సమయములో ఆ భగవంతుని గుణగణాలను అనుభవిస్తూ చాల సులువుగా చదువుకోవచ్చును. 


శ్రీ రాముడు ఎంతో అందమైన వాడు. అతని అందాన్ని గురించి సీతాదేవి మరీ మరీ వినాలని కోరుకుంటూ ఉంటుంది. అందుకనే ఆమె లంకలో బంధింపబడి ఉన్నప్పుడు, హనుమంతుడు సముద్రము దాటి సీతాదేవిని కలుసుకున్నప్పుడు ఆమె శ్రీ రాముని వర్ణన చేయమని అడుగుతుంది (ఆంజనేయుడు నిజమైన రామదూత అవునో కాదో పరీక్షించడం కోసము). అప్పుడు ఆంజనేయస్వామి ఎంత అద్భుతంగా రాముని వర్ణన చేస్తాడో అది చదివిన వారికి మనస్సంతా కూడా ఏంటో ఆనందంతో పులకితమైపోతుంది. 

ప్రస్తుతము నేను ముందుగా శ్రీరామ తారక మంత్రముతో మొదలుపెట్టి ఆ తరువాత స్తోత్రాలని తెలుపుతాను,

రామ తారక మంత్రము 

ఈ శ్రీరామ మంత్రాన్ని పార్వతీదేవి కోరికపై శివుడు ఆమెకు తెలియజేస్తాడు. విష్ణు సహస్రనామాలు చదవలేని వారికోసమై ఏదైనా సులువు మార్గము తెలుపమని ఆమె కోరగా ఇదిగో ఐ మంత్రాన్ని జపిస్తే చాలు సమస్త పుణ్యాలు దక్కుతాయని శివుడు ఇది తెలియజేస్తాడు. 

"శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యమ్ రామ నామ వరాననే ". 

అర్థము :-

శ్రీ రామ, రామ, రామ, అని మూడు సార్లు రామ నామము జపిస్తే చాలు మొత్తము వెయ్యి నామములు చదివిన పుణ్య ఫలము దక్కుతుంది అని చెప్పాడు. 

(రమే రామే మనోరమే అంటే ఓ రమా ! రాముని మనస్సులో అనుభవిస్తూ జపించాలి అని అర్థము). 

శ్రీరామ స్తోత్రములు     

ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్ 

లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం || (1)

అర్థము :-

ఆపదలను (అపహరించేసి) తొలగించేసి, మరియు సర్వ సంపదలను ప్రసాదించేటి, లోకులందరికీ అభిమతముగా ఉంటూ ప్రియమైనట్టి ఆ శ్రీ రామునికి నేను పదే పదే నమస్కరించుచున్నాను. 

 

శ్రీ రాఘవమ్ దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిమ్ రఘుకులాన్వయ రత్నదీపం |  
ఆజానుబాహుమ్ అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరమ్ నమామి || (2) 

అర్థము :-

రఘుకుల వంశజుడు, దశరథునికి ఆత్మజుడు (ప్రియుడు), కుమారుడు, సాటి లేనివాడు, సీతాదేవికి పతి, రఘుకులము అంతటికీ రత్నదీపము వంటి వాడు, మోకాలిని తాకు చేతులు కలవాడు, కలువపువ్వు రేకుల వంటి కన్నులు కలవాడు, చీకట్లో తిరుగాడే రాక్షసులను నశింపజేయునట్టి శ్రీ రామునికి వందనములు.  


మర్త్యావతారే మనుజాకృతిం హరిమ్  
రామాభిధేయం రమణీయ దేహినమ్ | 
ధనుర్ధరం పద్మవిశాల లోచినమ్
భజామి నిత్యం న పరానృజిష్యే || (3)

అర్థము :-

భౌతిక అవతారము ఎత్తి మనుష్య రూపము దాల్చిన శ్రీ హరిని, రామ అను నామము దాల్చిన వానిని, కన్నులకు ఇంపైన అందమైన దేహములో ఉన్నవానిని, ధనుస్సు ధరించిన వాడు, విశాలముగా వికసించిన పద్మముల వంటి కన్నులు కలవాడు, అటువంటి శ్రీ రాముని రోజూ భజిస్తాను (పూజిస్తాను నేను) ఇంకెవ్వరిని కాదు.    


రాఘవం కరుణాకరం భవనాశనం దురితాపహమ్
మాధవం ఖగగామినం జలరూపిణం పరమేశ్వరమ్ | 
పాలకం జనతారకం భవహారకం రిపుమారకమ్ 
త్వామ్ భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || (4)

అర్థము :-

రాఘవుని (అంటే రాముని), కరుణాకరుడు అంటే జాలి, దయ కలిగినవాడు, సంసార బంధములను తొలగించు వాడు, ఆపదలను పోగొట్టువాడు, మాధవుడు అంటే అమ్మ (లక్ష్మీ రూపమైన సీతను ధరించిన వాడు, జనులను ఉద్ధరించే వాడు, భయములను తొలగించు వాడు, శత్రువులను చంపే వాడు, అయినటువంటి నిన్ను జగదీశ్వరుడువి, మనిషి రూపుడివి అయినట్టి రఘు కుల కుమారుడివైన శ్రీ రాముని నేను కొలిచెదను, భజన చేసెదను.    

18, అక్టోబర్ 2024, శుక్రవారం

శ్రీ రామ అష్టకము - Worship of Sri Rama With 8 Hymns


శ్రీ రాముని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆయనను మనము ప్రతిరోజూ స్మరిస్తూ, భజన చేస్తూ ఉందాము అని ఎనిమిది శ్లోకాలలో తెలియజేయ బడింది. 

శ్రీ రాముడు ఆ పరమాత్మ అవతారము. ఆయనకు వేరే ఎవ్వరూ సాటి లేరు అని ప్రతీ శ్లోకం ఆఖరున మాటి మాటికీ చెప్పబడి ఉంది ఈ అష్టకంలో. అటువంటి ఆయన భజనని రోజూ చేసుకుందాము అని చెప్పబడింది. 

ఈ రామాష్టకము నా దగ్గర ఒక చాలా పాత పూజల పుస్తకము (బాగా చిరిగి పోయింది) ఉంది. బహుశా రాజముండ్రి లో ప్రింట్ అయింది అనుకుంటాను. అందులోనిది నేను తెలియజేస్తున్నాను. ఆ పుస్తకంలోనే హరి అష్టకము, కృష్ణాష్టకం, విష్ణు స్తుతి, లక్ష్మీస్తుతి, శివ పంచాక్షరి, మొదలగు శ్లోకాలు కూడ ఉన్నాయి. అవే అన్నీ నేను కంఠస్థము పట్టి ప్రతిరోజూ పూజలలో 40 ఏళ్ల నుండీ చదువుకుంటున్నాను. 


 శ్రీ రామాష్టకం శ్లోకములు    

భజే విశేష సుందరం సమస్త పాప ఖండనం 
స్వభక్త చిత్త రంజనం సదైవ రామ మద్వయం || (1)

తాత్పర్యము :-

సదైవ అంటే ఎల్లవేళల. రామం అద్వయం అంటే ఇంకొక గొప్ప దైవము లేని శ్రీ రాముడు. (రామ అనే రెండు అక్షరములు అని కూడ మనం చెప్పుకోవచ్చును). 
అత్యంత అందమైన శ్రీ రాముని , అన్ని పాపాలనీ పోగొట్టే రాముని, తన భక్తుల మనస్సుకి హాయిని ప్రసాదించే రాముని, మనము ఎల్లవేళలా ఆ రాముని నామస్మరణం చేస్తూ ఉందాము. 
   

జటాకలాప శోభితం సమస్త పాప నాశకం 
స్వభక్త భీతి భంజనం భజేహ రామ మద్వయం || (2)

తాత్పర్యము :-

చక్కటి జడలతో ముఖము ప్రకాశిస్తూ ఉండే రాముని, అన్ని పాపములను నశింపజేసే రాముని, తన భక్తుల భయాన్ని పోగొట్టే రాముని, అటువంటి ఆ శ్రీ రాముని మనము ఎల్లవేళలా స్మరిస్తూ ఉందాము.  


నిజ స్వరూప బోధకం కృపాకరం భవాపహం 
సమం శివం నిరంజనం భజేహ రామ మద్వయం || (3)

తాత్పర్యము :-

నిజ స్వరూపము అంటే మన ఆత్మని మనకి తెలియజెప్పుట. ఆలా మన నిజస్వరూపాన్ని తెలియజేయు రాముని, దయామయుడైన రాముని, మన జన్మని తరింపజేసే రాముని, సమదృష్టితో చూసే రాముని, ఆనందమయుడు, పవిత్రుడు (మచ్చలు, కళంకము లేనివాడు),  అటువంటి ఆ శ్రీ రాముని మనము ఎల్లవేళలా స్మరిస్తూ ఉందాము.  


సదా ప్రపంచ కల్పితం హ్యనామ రూప వాస్తవం 
నరాకృతిం నిరామయం భజేహ రామ మద్వయం || (4)

తాత్పర్యము :-

నిరంతరము సృష్టిని సాగిస్తూ, తనకంటూ ఎటువంటి పేరు కాని రూపము కాని లేని వాడు, మానవ రూపం ధరించిన శ్రీ రాముని, ప్రసన్నచిత్తుడైన వాడు , అటువంటి ఆ శ్రీ రాముని మనము ఎల్లవేళలా స్మరిస్తూ ఉందాము. 


నిష్ప్రపంచ నిర్వికల్ప నిర్మలం నిరామయం 
చిదేక రూప సంతతం భజేహ రామ మద్వయం || (5)

తాత్పర్యము :-

నిష్ప్రపంచ అంటే ఎటువంటి తాపత్రయం లేనివాడు. నిర్వికల్ప అంటే తేడాలు, సందేహాలు, సీమలు లేని వాడు. పవిత్రమయిన రాముడు, ఎటువంటి చింతలు లేని ప్రసన్న మానసుడు, తన్మయమైన ఒకే రూపం దాల్చి కనబడే శ్రీ రాముడు, అటువంటి ఆ శ్రీ రాముని మనము ఎల్లవేళలా స్మరిస్తూ ఉందాము. 


భవాబ్ధి పోత రూపకం హ్యశేష దేహ కల్పితం 
గుణాకరం కృపాకరం భజేహ రామ మద్వయం || (6)

తాత్పర్యము :-

సంసార సాగరాన్నిదాటించు వాడు, అతను కల్పించని  దేహములంటూ లేని వాడు, సకల గుణముల నిధి, అందరికీ మంచి చేయువాడు మరియు దయామయుడు, అటువంటి ఆ శ్రీ రాముని మనము ఎల్లవేళలా స్మరిస్తూ ఉందాము.  


మహాసువాక్య భోధకైర్ విరాజమాన వాక్పదైహ్ 
పరం చ బ్రహ్మ వ్యాపకం భజేహ రామ మద్వయం || (7)

తాత్పర్యము :-

ఎవరయితే గొప్ప విశేషణముల ద్వారా పిలువబడుతూ, గొప్ప వాక్యముల (జ్ఞానము) ద్వారా తెలియజెప్ప బడుతుండునో, అపరబ్రహ్మ అయి అంతటా వ్యాప్తి చెంది ఉన్నాడో అటువంటి ఆ శ్రీ రాముని మనము ఎల్లవేళలా స్మరిస్తూ ఉందాము.  

శివప్రదం సుఖప్రదం భవచ్చిదం భ్రమాపహం 
విరాజమాన దైశికం భజేహ రామ మద్వయం || (8)

తాత్పర్యము :-

ఎవరయితే ఆనందము కలిగిస్తూ, సుఖాన్ని ప్రదాయించునో, సందేహములను, భయములను, అజ్ఞానమును పోగొట్టుతూ మన అందరికీ ఒక గొప్ప గురువుగా, మార్గదర్శిగా ఉన్నాడో,  అటువంటి ఆ శ్రీ రాముని మనము ఎల్లవేళలా స్మరిస్తూ ఉందాము.   


రామాష్టక ఫలశ్రుతి శ్లోకములు 


రామాష్టకం పఠతి యస్సుకరం సుపుణ్యం 
వ్యాసేన భాషితమిదం శృణుతే మనుష్యహః || (9)


తాత్పర్యము :-

ఈ రామాష్టకము ప్రతిరోజూ చదివితే యశస్సు, పుణ్యము కలుగుతాయి. దీన్ని వేదవ్యాసుడు రచించెను. రోజూ వినడం, చదవడం చెయ్యండి మానవులారా! 

విద్యామ్ శ్రియం విపుల సౌఖ్యం అనంతకీర్తిం 
సంప్రాప్య దేహ విలయే లభతేచ మోక్షం || (10)   

తాత్పర్యము :-

అలా చదివే, వినేవారికి విద్య, యశస్సు, ధనము , అనంత సౌఖ్యము, కీర్తి, ఇవన్నీ లభిస్తాయి. ఇంకా జీవితాంతములో మోక్షము లభిస్తుంది.