31, డిసెంబర్ 2024, మంగళవారం

తిరుప్పావై - పాశురము 17 - అంబరమే తణ్ణీరే శోరే - Tiruppavai - Paasuram 17

తిరుప్పావై 17వ పాశురములో గోదాదేవి శ్రీకృష్ణుని తల్లిదండ్రులను మరియు బలరామకృష్ణులను లేపడము వివరిస్తోంది. 



పదిమంది (ఇక్కడ పదిమంది అంటే చాలామంది కలిసి ఈ వ్రతాన్ని చేశారని మనం అనుకోవచ్చును) బాలికలనూ లేపి అందరూ స్నానం చేసి తయారయి నందగోపుని భవనానికి (కోవెలకు) చేరి అక్కడ కాపలాదారులతో తాళాలు తెరిపించుకుని లోనికి ప్రవేశించడము 16వ పాశురము వరకూ వివరించడం జరిగింది. 

ఇప్పుడు శ్రీకృష్ణుని లేపడానికి ముందు అతని తల్లిదండ్రులను, తక్కిన సన్నిహితులైన సభ్యులను లేపి వారి అనుగ్రహ, ఆమోదములు పొందాలి. అలా పెద్దల ఆశీర్వాదములు లేనిదే మన కోరికలు ఫలించవు. 

ఇక్కడ గోదాదేవి ఏ విధముగా వారిని ప్రసన్నులను చేసుకుంటోందో చూద్దాము.  




తిరుప్పావై- పాశురము - 17  


అంబరమే తణ్ణీరే శోఱే యఱం శెయ్యుమ్ 
ఎమ్బెరుమాన్! నందగోపాలా, యెళున్దిరాయ్!
కొంబనార్కు యెల్లామ్ కొళుందే! కులవిళక్కే! 
ఎమ్బెరుమాట్టి! యశోదాయ్  అఱివుఱాయ్ ! 
అంబర మూడరత్తోన్గి యులగళన్ద,
ఉంబర్ కోమానే! ఉఱంగాదు యెళున్దిరాయ్ !
శెమ్బోర్ కదండిచ్చెల్వా ! బలదేవా !
ఉమ్బియుమ్ నీయుమ్ ఉఱంగేలో రెమ్బావాయ్ || 

అర్థము :-

బట్టలు, పానీయములు, భోజనము విరివిగా దానము చేసే మా అందరికీ ప్రభువైన నందగోపాలా (శ్రీకృష్ణుని తండ్రి) మెలకువ తెచ్చుకోండి.    

కొంబనార్ అంటే నీటి ప్రెబ్బలి మొక్క వంటి స్త్రీలు. (ఈ మొక్క విశేషత ఏమిటంటే నదులు, చెరువుల ఒడ్డున ఉంటూ పెద్ద అలలు కాని వేగమైన ప్రవాహము కాని వచ్చినప్పుడు ఒంగి పోయి అణగిమణిగి ఉంటూ మళ్ళీ మాములుగా లేచి నిలబడుతుంది.) శ్రేష్టమైన స్త్రీలు ఇటువంటి వారు అని ఈ మొక్కతో పోల్చడము జరిగింది. వీరు పరిస్థితుల ఒత్తిడికి అణుగుతూ, బెదిరిపోకుండా, చెదిరిపోకుండా ఉంటూ మళ్ళీ స్థైర్యముగా లేచి నిలబడుతూ, పనులు చక్కబెట్టుకుంటూ, అందరికీ ఆసరాగా ఉంటారు.  

అటువంటి స్త్రీలలో మేటిది యశోదమ్మ. పరిస్థితులకూ, భర్తకూ అనుగుణముగా ఉంటూ తన ధర్మాన్ని, కర్తవ్యాన్ని నిర్వహిస్తూ తన పరివారాన్ని రక్షించుకుంటూ ఉంటుంది. అలాగ కొంబనార్లు అందరిలోకి శ్రేష్ఠురాలైన, కులానికి దీపము అయిన, మా స్వామిని యశోదమ్మా ! తెలివి తెచ్చుకో!

ఆకాశములోకి పెరిగిపోయి మూడు అడుగులతో ప్రపంచాన్ని కొలిచిన రాజకుమారా (శ్రీకృష్ణా ! నిద్రపోకుండా ఇంక మెలకువ తెచ్చుకో.

ఎర్రని తామరము రంగు పోలిన బంగారు కడియాన్ని చేతికి ధరించిన బలరామా! నువ్వూ, నీ  తమ్ముడూ కూడ లేవండి. 

అని ఈ 17వ పాశురము ద్వారా నందగోపుని, యశోదను, శ్రీకృష్ణుని, బలరాములను లేపే ప్రయత్నాలు చేసింది గోదాదేవి.    
    

30, డిసెంబర్ 2024, సోమవారం

తిరుప్పావై - 16వ పాశురము - నాయకనాయ్ నిన్ర - Tiruppavai - Paasuram 16


తిరుప్పావై 16వ పాశురము లో ద్వారపాలకులను వేడుకోవడము జరుగుతోంది. 

6 నుండి 15 పాశురముల వరకూ మొత్తం పది మంది బాలికలను లేపి తమతో కలుపుకుని తిరుప్పావై వ్రతమాచరించడానికి బయలుదేరింది ఆండాళ్. వారంతా కూడ చెరువులో చక్కగా స్నానాలు చేసి శుభ్రమైన దుస్తులు దాల్చి శ్రీకృష్ణ భవనానికి బయలు దేరారు. 

అక్కడ ద్వారపాలకులను లేపి, తలుపులు తీయుంచుకుని లోపలకు ప్రవేశించాలి. ద్వారపాలకులు సరైన కారణము లేనిదే ఎవరినీ లోపలకు వెళ్లనివ్వరు కదా. ఏ విధముగా వారిని ప్రసన్నులను చేసుకుంటారో చూద్దాము. 

తిరుప్పావై - పాశురము 16


నాయకనాయ్ నిన్ర నందగోపను డైయ 
క్కోయిల్ కాప్పానే ! కొడితోన్ఱుమ్- తోరణ 
వాశల్ కాప్పానే ! మణిక్కదవమ్ తాళ్ తిఱవాయ్;
ఆయర్ శిరుమియ రోముక్కు - అఱైపరై 
మాయన్ మణివణ్ణన్ నెన్నెలే వాయ్ నెఱుందాన్,
తూయోమాయ్ వన్దోమ్ తుయిలెళ ప్పాడువాన్ 
వాయాల్ మున్నం మున్నమ్ మాత్తాదే యమ్మా, నీ 
నేశనిలై క్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్ || 

అర్థము :-

మనకందరికీ నాయకుడై నెలకొన్న నందగోపుని భవన ద్వారపాలకులారా ! గరుడధ్వజము ఎగురుతూ కనబడే ఆ ధ్వజస్తంభ వాకిట కాపలా ఉండే ఓ రెండవ ద్వారపాలకా ! మీరంతా దయచేసి మణులు పొదగబడిన తలుపుల తాళాలు తీసి మమ్ములను లోనికి వెళ్లనివ్వండి. 

మేము చిన్ని పిల్లలం కదా! ఎటువంటి భయము, అనుమానము పెట్టుకోకండి. మేము చేయదలచిన నోముకు కావాల్సిన పఱై అనే దానిని మాకు ఇస్తానని ఆ ఎనలేని మహిమల మాయావి, మాణిక్యవర్ణుడు అయిన శ్రీకృష్ణుడు నిన్నటి రోజునే మాతో చెప్పాడు. 

అందుకని, దానికోసమే, మేము నిద్రపోకుండా మెళకువతో ఉండి పెందరాళే లేచి బయలుదేరాము మేలుకొలుపులు పాడుదామని. 

కావున మీరు ముందుగానే నోటితో కుదరదు అని చెప్పక ఈ ప్రేమ అనే బలమైన మాయా పాశముల ద్వారా బంధింపబడిన ద్వారాలను తెరవండి. తెరిచి మమ్ములను లోనికి వెళ్లనివ్వండి. 

ఈ విధముగా వారు ద్వారపాలకులను వేడుకుని, ఒప్పించి ద్వారములను తెరిపించుకుని లోనికి ప్రవేశించారు. 


ఇక్కడ ఒక నిగూఢమైన అర్థము ఉంది. 
భగవంతుని జేరాలంటే మనము ఒక క్రమశిక్షణలో ఉండాలి. ముందుగా సంకల్పము చేసుకోవాలి. ఇంద్రియాలని అదుపులోకి తెచ్చుకోవాలి. అడ్డులను తొలగించుకోవాలి. మన మనస్సును శుభ్రపరచు కోవాలి. అంటే మనస్సుకి ఉన్న సంకెళ్లను తొలగించుకుని, మన లక్ష్యం సాధించడానికి వీలుగా చేసుకోవాలి. ఇక్కడ మనము మనస్సుని, ఆత్మను కూడ బతిమాలుకొని మంచి చేసుకున్నట్లుగా భావించుకోవచ్చును.         

29, డిసెంబర్ 2024, ఆదివారం

తిరుప్పావై - పాశురము 15 - ఎళ్ళే ఇళంగిళియే - Tiruppavai - Pasuram 15

 తిరుప్పావై 15వ పాశురములో గోదాదేవి 10వ బాలికను లేపుతూ " ఏమే చిలుకా!" అని సంభోదిస్తోంది. చిలుక గుణము ఏమిటంటే గటగటా తియ్యటి పలుకులు వాగడము. ఈ బాలిక భక్తి, జ్ఞానములలో శ్రేష్ఠురాలు. మరి ఎగతాళిగా చిలుకా అని ఎందుకు సంభోదిస్తోందో చూద్దాము. 



తిరుప్పావై - పాశురము 15


ఎళ్ళే ! ఇళంగిళియే ! ఇన్నం ఉరంగుదియో ? 
శిల్లెన్రళై యేన్మిన్ ? నంగై మీర్ ! పోదరు కిన్ఱేన్,
వల్లె ఉన్ కట్టురైగళ్ పండే ఉన్ వాయఱిదుమ్!
వల్లీర్ గళ్ నీంగళే, నానేతా నాయిడుక;
ఒల్లె నీపోదాయ్ ! ఉనక్కెన్న వేఱుడైయై?
ఎల్లారుమ్ పోన్దారో ! పోన్దార్, పోందు ఎణ్ణిక్కొళ్;
వల్లానై కొన్రానై మాత్తారై మాత్త ళిక్క 
వల్లానై , మాయనై పాడే లో రెమ్బావాయ్ || 


అర్థము :-

ఏమే ! అందాల చిలకపలుకుల చిన్నారీ ! ఇంకా పండుకునే ఉన్నావా !

గొల్లుమని నాపై అరవకండి పరిపూర్ణులైన వారా, ఆరితేరిన వారా ! నేను బయల్దేరుతున్నాను.
 
ఏమోయ్ ! నీ ఘనకార్యాలు, నోటి దురుసూ మాకు తెలియనివా ఏమిటి?

సరేనమ్మా ! మీరంతా గొప్పవారు. నేనే దురుసు దాన్ని, కఠినురాలిని . 

అదేంటే, పోనీ నువ్వే చెప్పు. వేరు, వేరు అని విడదీస్తావు ఏమిటి? అలా ఒంటరిగా ఉంటావెందుకు, నీ ప్రత్యేకత ఏమిటీ ? 
 
సరే. అంతా వెళ్లిపోయారా? 

వెళ్లారు, అక్కడికి జేరాక లెక్కపెట్టుకుందువు గాని. పద. 

కువలయం అనే బలిష్టమైన ఏనుగును, మరియు చాణూర, ముష్టికులనే మల్లులను వధించిన ఆ మహా మాయావి అయిన శ్రీకృష్ణుని కీర్తించుదాము త్వరపడు. 

ఈ విధముగా ఆ బాలికను కూడ తమలో కలుపుకుని అంతా బయలుదేరారు. 

ఇక్కడితో బాలికలను లేపడాలు పూర్తయ్యాయి. ఇప్పుడు వ్రతము మొదలు పెట్టాలి.

28, డిసెంబర్ 2024, శనివారం

తిరుప్పావై - పాశురము 14 - "ఉంగళ్ పుజై క్కడై తోట్టత్తు వావియుళ్" - Tiruppavai - Paasuram 14

తిరుప్పావై 14వ పాశురములో ఆండాళ్ తోటి బాలికలతో ఇంకొక బాలికను లేపుతున్నారు. ఈ కన్య వారందరితో గొప్పగా నేనే అందరికన్నా ముందుగా లేచి వచ్చి మిమ్మల్నందరినీ లేపుతానని ముందటి రోజునే గొప్పలు పోయిందిట. అంత గప్పాయిలు కొట్టిన పిల్లని తామే ముందుగా లేచి వచ్చి లేపడము జరుగుతోంది ఇక్కడ.  



తిరుప్పావై - పాశురము 14 


ఉంగళ్ పుజై క్కడై తోట్టత్తు వావియుళ్ 
శెంగిళు  నీర్వాయ్ నెగిళ్ న్దు ఆంబల్ వాయ్ కూమ్బినగాణ్,
శెంగళ్ ప్పొడి కూరై వెణ్బల్ తవత్తవర్,
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోకిన్ఱార్ ;
ఎంగళై మున్నమ్ ఎళుప్పువాన్ వాయ్ పేశమ్ 
నంగాయ్, ఎళున్దిరాయ్ ! నాణాదాయ్ ! నావుడైయాయ్ !
శంగొడు శక్కరం ఏన్దుమ్  తడ క్కైయన్ 
పన్గయ క్కణ్ణానై ప్పాడే లో రెమ్బావాయ్ || 





అర్థము :-     


ఓ శ్రేష్ఠురాలా ! మీ ఇంటి వెనుక పెరటి తోటలో ఉన్న దిగుడు బావిలో ఉన్న ఎర్రటి తామరలు చిరునవ్వులు విసురుతున్నట్లుగా వికసించుకుంటున్నాయి. నల్లకలువలేమో ముడుచుకుంటున్నాయి. 

ఎర్రని కాషాయ వస్త్రధారులైన తెల్లటి దంతములు కల్గిన వైరాగ్యవంతులైన సన్యాసులూ, మునులూ తమ తమ గుళ్లకు, శంఖము ఊది పూజలు చేయడాని కోసము వెళుతున్నారు. 

ఏదో గొప్పగా మేము లేవకముందే వచ్చి మమ్మల్ని లేపుతానని ప్రగల్భాలు పలికావు కదా! చాలు చాలులే! ఇప్పుడైనా లే ఇంక. మాయలాడి మాటకారీ ! కొంచెము కూడ సిగ్గు లేదా? లెమ్ము, లెమ్ము!

శంఖము, చక్రాయుధము, మొదలైన ఆయుధాలను ధరించిన వాడునూ, ఆజానుబాహుడునూ అయి, కలువరేకుల వంటి కనులు కల్గిన శ్రీకృష్ణుని గానము చేద్దాము అని ఆ బాలికను కూడ తమలో కలుపుకుని ఇంకో గుమ్మము వైపు వెడతారు.  

 

               

27, డిసెంబర్ 2024, శుక్రవారం

తిరుప్పావై - పాశురము 13 - పుళ్ళిన్ వాయ్ కీణ్డానై - Tiruppavai - Paasuram 13

తిరుప్పావై 13వ పాశురము లో తుమ్మెదల వంటి అందమైన నల్లటి నేత్ర సౌందర్యము కలిగిన ఇంకో కన్యను వ్రతము చేయడం కోసమని లేపుతూ, మిగతా వారంతా కూడ శ్రీకృష్ణుని, శ్రీరాముని యొక్క గుణ గానములు చేస్తూ తరలి పోవుచున్నారని తెలియజేస్తోంది. కాబట్టి నువ్వు కూడ వేగిరమే పద అని వేడుకుంటోంది.   

తిరుప్పావై 13వ పాశురము 



పుళ్ళిన్ వాయ్ కీణ్డానై పొల్లావరక్కనై 
క్కిళ్ళి కళైన్ దానై క్కీర్తిమై పాడి ప్పోయ్ 
పిళ్ళై గ ళెల్లారుమ్ పావై క్కళమ్ బుక్కార్,
వెళ్లి యెళున్దు వియాళ ముఱంగిత్తు;
పుళ్ళుమ్ శిలంబినకాణ్ పోదరి కణ్ణినాయ్ !
కుళ్ళ కుళిర క్కుడైన్దు నీరాడాదే
పళ్ళిక్కిడ త్తియో పావాయ్ నీ! నన్నాళాల్ 
కళ్ళం తవిరిందు కలందే లో రెమ్బావాయ్ ||   



అర్థము :-

ఓ పిల్లా! మన జట్టులోని పిల్లలంతా కూడ బకాసురిని ముక్కు చీల్చి చెండాడిన ఆ శ్రీకృష్ణుని, మరియు అదే శ్రీకృష్ణుడు శ్రీరాముని అవతారంలో ఉన్నప్పుడు, అతి సునాయాసంగా రావణుడనే రాక్షసుని తన బాణముల ద్వారా నరికి చంపిన తీరునూ,  వీరగాధలుగా కీర్తిస్తూ వ్రతము కోసము నిర్ధారించబడిన స్నానశాలకు వెళ్లిపోయారు. ఇదిగో మేము ఇద్దరు, ముగ్గురమే నిన్ను కూడా తీసుకుపోదామని, నీకోసమని వచ్చాము. 

ఇప్పటికే తెల్లవారిపోయి చాల సమయమైనది. అదిగో చూడు. తెల్లవారిందని చెప్పటానికి శుక్ర నక్షత్రము ఉదయిస్తోంది. బృహస్పతి నక్షత్రమేమో అస్తమించింది. (పక్షులు కూడ ఆహారము కోసమని బయలుదేరి తిరుగుతున్నాయి)

జింక కళ్ళ లాంటి కళ్ళు, తుమ్మెదల వంటి అందమైన, సొగసైన నేత్ర సౌందర్యాన్ని పొందినదానా! చల్లటి నీటిలో మాతో కూడి స్నానం చెయ్యకుండా ఇంకా నిద్రపోతున్నావా! (నిదురపోతున్నట్లు నటిస్తున్నావా) బాగుంది నీ చేష్ట ! ఆ కపట చర్యలు మాని వెంటనే లేచి మాతో కలిసి వ్రతము ఆచరించడానికి కదలి రా! అని ఆ ఎనిమిదో బాలికను కూడ లేపారు.