18, డిసెంబర్ 2024, బుధవారం

తిరుప్పావై - ధనుర్మాసము చేయు విధానము - Tiruppavai/Dhanurmasam Festival


తిరుప్పావై అనేది ఒక వ్రతము పేరు.  తిరు అంటే "శ్రీ" అని అర్థము. అలాగే పావై అంటే "వ్రతము" అని అర్థము. 

పూర్వము రేపల్లె లో కరువు, మరియు వ్యాధులు సంభవించి ప్రజలందరూ అల్లల్లాడిపోతుంటే వారి రక్షణ కోసము, వానలు పడి మరల పంటలు పండి అందరూ ఆరోగ్య సంపదలతో ఆనందంగా ఉండటం కోసమని శ్రీకృష్ణ పరమాత్మ సలహా ననుసరించి పెళ్లికాని గోపబాలికలు ఒక వ్రతము చేస్తారు. అప్పుడు ఆ ఊరు మళ్ళీ సస్యశ్యామలంగా అవుతుంది.  

గోదాదేవి అని ఒక వైష్ణవ భక్తురాలు ఈ వ్రతము గురించి తండ్రిద్వారా విని తను కూడ ఈ వ్రతాన్ని చేసి శ్రీకృష్ణుని సాన్నిధ్యము జేరాలని అనుకుంటుంది. ఆ పరమాత్మను పెళ్లి చేసుకోవడమే కాక మిగతా ప్రజలందరికీ మార్గదర్శకంగా ఉండటం కోసమని ఆమె 30 పాశురములను (అంటే స్తోత్రాలవంటివి) తయారుచేసి ఆ వ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలో, దాని ఉద్దేశము మరియు ఫలితములు ఏంటో తెలియజేసింది. ఈ 30 పాశురముల కూర్పే తిరుప్పావై అని ప్రసిద్హి చెందింది.  

తిరుప్పావై వ్రతము చేయు విధానము 

ఈ వ్రతాన్నిగోదాదేవి తమిళ మాసము మార్గళి అంటే మన ధనుర్మాసములో చేసింది. అంటే ధనుర్రాశి మొదటి దినము నుండి మళ్ళీ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజు దాకా అన్నమాట. ఈ నెల మనకి సాధారణముగా డిసెంబర్ 16 నుండి జనవరి 14 దాకా అవుతుంది. లీప్ ఇయర్ ఉన్నప్పుడు కాస్త ఒక రోజు తేడా ఉండవచ్చును. ఈ సమయంలో  రోజుకి ఒక పాశురము చొప్పున మొత్తం 30 రోజుల్లో 30 పాశురాలు చదివి పూజ చేసుకోవాలి. 

రోజూ పూజ చేసుకునే వారు పూజ ఆఖరులో ఇవి చదివి చేసుకోవచ్చును. నేను అలాగే మొత్తం రోజూ చేసే పూజలో అన్నీ అయ్యాక ఆఖరున ఈ క్రింద చెప్పిన విధంగా చదువుకుని అప్పుడు ఆరగింపు పెడుతుంటాను. ఎందుకంటే ఇందులో సమర్పణ శ్లోకాలు, స్తోత్రాలు ఉన్నాయి కనుక.  

తిరుప్పావై పాశురము చదివే ముందు మూడు తనియలు ఉంటాయి. అవి నీళా తుంగస్తన ... , అన్నవయల్ పుదువై ... , మరియు శూడి కొడుత్త శుదర్కుడియే అన్నవి. 

పైన పేర్కొన్న మూడు తనియలు ఇక్కడ క్లిక్ చేసి చదువగలరు. 

అల్లాగే పాశురము చదివాక ఇంకో రెండు సమర్పణ శ్లోకాలు (తిరుప్పావై లోని 29, 30 పాశురాలు) చదివి ఆ తరువాత కర్కటే పూర్వ ఫల్గున్యాం అన్న శ్లోకము, మరల నీళా తుంగ ... అన్న శ్లోకము చదవాలి. అప్పుడు దేవునికి ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తాము. ఆ తరువాత రోజూలాగే మంగళహారతి ఇస్తాము.  

తిరుప్పావై ముఖ్యాంశాలు 


పూర్వం గోకులంలో గోపికలు కృష్ణుడితో కూడి చేసిన ఈ వ్రతాన్ని గురించి విన్న గోదాదేవి తను ఆ వ్రతం ద్వారా కృష్ణుని వివాహమాడాలనే కోరికను తీర్చుకోడానికి పూనుకుని తనతో బాటు మిగతా కన్యలకు కూడ మంచి జరగాలనుకుంటూ తిరుప్పావై వ్రతాన్ని మొదలెట్టింది. 

ముందుగా ఊరిలో అందరికీ ఈ వ్రతము గురించి, అది ఏ విధంగా చెయ్యాలి అనే దాన్ని గురించి మొదటి 5 పాశురాల ద్వారా తెలియజేస్తుంది.  

తెల్లవారక ముందే లేచి స్నానం చెయ్యాలి, శుభ్రమైన వస్త్రాలు దాల్చాలి, ఆడంబరంగా అలంకరించు కోకుండా సాదాగా ఉండాలనీ, గోల చెయ్యకూడదని, వీలైనంత మౌనంగా ఉండి, కృష్ణుని ధ్యానిస్తూ ఆయన కీర్తనలు పాడాలని తెలియజేస్తుంది. 

6వ పాశురము నుండి 15వ పాశురాలలో గోపికలని లేపడం చేస్తుంది. ఒక్కొక్క పాశురంలో ఒక్కొక్క గోపిక విశేషతని చెబుతూ ఒక్కొక్కదాన్ని లేపుతుంది. అలా లేపుతున్నప్పుడు చుట్టుపక్కల దృశ్యాలన్నిటిని వర్ణిస్తూ లేపడం చేసింది. పక్షుల కిలకిలలు, గుడి గంటల చప్పుళ్ళు, ఆవుల మందల విహరణలు, వాటి మెడలో గంటలు, మువ్వల చప్పుళ్ళు, ఇలా ప్రకృతిని అంతా అందంగా వర్ణించి చెప్పింది. 

16వ పాశురంలో ద్వారపాలకులను లేపి, 17వ పాశురములో నందుని, యశోదను, బలరామ కృష్ణులను లేపుతుంది. కానీ కృష్ణుడు ఇంకా నిద్రలోనే ఉంటాడు. అందుకని ముందుగా నీళాదేవిని లేపితే అప్పుడు కానీ కృష్ణుడు లేవడని ఎరిగి 18 నుండి 20 వరకు, మూడు పాశురాలలో నీళాదేవిని లేపుతుంది. 

21వ పాశురం నుండి 25 దాకా శ్రీకృష్ణ లీలలు, ఆయన గొప్పతనాన్ని పేర్కొంటుంది. ఆ తరువాత 26, 27 పాశురాలలో తన కోరికలు తెలియజేస్తుంది. 28వ శ్లోకంలో తమ అజ్ఞానాన్ని తెలియజేస్తూ, 29వ  శ్లోకంలో తెల్లవారకుండానే వచ్చి లేపినందుకు క్షమాపణ వేడుకుని తన కోరిక తీర్చమని వేడుకుంటుంది. ఈ పాశురము సమర్పణా భావాన్ని నువ్వే దిక్కు అన్న సత్యాన్ని సూచిస్తోంది. 

ఆఖరి పాశురము గోదాదేవి ఈ 30 పాశురాల కర్త అనీ దీన్ని ఎవరైతే పూర్తిగా సమర్పణా భావంతో పఠిస్తారో వారికి ముక్తి లభిస్తుంది అని తెలియజేయడం జరిగింది. 

తిరుప్పావైలోని ఒక్కొక్క పాశురము నేను తెలుగు లిపిలో రాసి వాటి అర్థములతో సహా ముందు ముందు పోస్టులలో ఒకటొకటే మొదలు పెడుతున్నాను. 

ప్రస్తుతము 9వ పాశురము 25వ తారీఖున మొదలు పెట్టి ఆ తర్వాతి రోజు నుండీ రోజూ ఒక్కొక్క పాశురము చొప్పున పబ్లిష్ చేస్తున్నాను. మొదటి ఎనిమిది పాశురములు నింపాదిగా సంక్రాతి అయిపోయాక ఎప్పుడైనా రాసి పబ్లిష్ చేస్తాను.    

For Tiruppavai Paasurams in English with full meanings, you can find all of them (30 pasurams) on my Lifestyle Tips Blog at this link       

14, డిసెంబర్ 2024, శనివారం

శ్రీ వెంకటేశ్వర ప్రపత్తి - Venkateswara Suprabhatam (Part 3) Hymns


"శ్రీ వెంకటేశ్వర ప్రపత్తి" సుప్రభాతం లోని మూడవ అధ్యాయము.

సాధారణముగా మనము ప్రతిరోజూ పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్తోత్రము మాత్రమే చదివి పూజ చేసుకుంటూ ఉంటాము. 

మొత్తం సుప్రభాతం చదవాలంటే 20 నిమిషాల కంటే ఎక్కువ సమయం పడుతుంది.

ఎందుకంటే అందులో 4 అధ్యాయాలు ఉన్నాయి కనుక.

మొదటి అధ్యాయం వేంకటేశ్వరుని మేలుకొలుపు (సుప్రభాత శ్లోకాలు), రెండవది స్తోత్రము, మూడవది వెంకటేశ్వర ప్రపత్తి (అంటే శరణాగతి శ్లోకాలు), నాలుగవది మంగళాశాసనము. 

ఇప్పుడు నేను ప్రపత్తి శ్లోకాలు వాటి అర్థాలతో సహా వివరిస్తున్నాను. ఈ స్తోత్రాల ద్వారా మనము భగవంతుని సన్నిధి కోరుతూ శరణు వేడుకుంటున్నాము. 

మొదటి శ్లోకములో ముందుగా అమ్మని (అంటే పద్మావతి/లక్ష్మీదేవి) శరణు వేడుకుని ఆ పిమ్మట వేంకటేశ్వరునితో సహా వేడుకుంటున్నాము. 

 వెంకటేశ్వర ప్రపత్తి


ఈశానామ్ జగదోస్య వేంకటపతేర్ విష్ణో పరాం ప్రేయసీమ్
తద్ వక్షస్థల నిత్యవాస రసికామ్ తక్షాన్తి సంవర్ధినీమ్  
పద్మాలంకృత పాణి పల్లవ యుగాం పద్మాసనస్థామ్ శ్రియమ్  
వాత్సల్యాది గుణోజ్జ్వలామ్ భగవతీమ్ వన్డే జగన్మాతరమ్ || (1)

అర్థము :-

ఈ సమస్త విశ్వానికీ ప్రభువైన వేంకటేశ్వరస్వామి అని పిలువబడే విష్ణుమూర్తి యొక్క ప్రియురాలివై ఆయన వక్షస్థలములో ఎల్లప్పుడూ నివాసముంటూ, అతని పొందును అనుభవిస్తూ, ఆయన తేజస్సును, కీర్తిని ప్రకాశింపజేస్తూ, పద్మముల చేత అలంకరింపబడిన చేతులు, పాదములతో పద్మాసనంలో (పద్మములో) కూర్చున్న తల్లీ, భక్తుల పట్ల వాత్సల్యము, అనురాగము, వంటి సహృదయ గుణములు కలిగిన ఓ భగవతీ, లోకాల తల్లీ, నీకు దాసోహములు.      


శ్రీమన్! కృపాజలనిధే, కృత సర్వలోక 
సర్వజ్ఞ! భక్త నతవత్సల, సర్వశేషిన్ 
స్వామిన్! సుశీల సులభాశ్రిత పారిజాత 
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || (2)

అర్థము :-

స్వామీ, ఓ దయాసాగరమా! సమస్త లోకముల సృష్టికర్తా! సమస్తము (భక్తుల మనస్సు) ఎరిగిన దేవా! భక్తులందు ప్రేమాభిమానములు కల స్వామీ, అంతటా నిండి ఉన్న స్వామీ, సద్గుణములు కలవారికి సులభంగా లభ్యమయ్యే పారిజాత వృక్షము వంటి  శ్రీవెంకటేశ్వరుని పాదపద్మములనే శరణు వేడుతున్నాను.
     

ఆ నూపురార్చిత సుజాత సుగంధి పుష్ప 
సౌరభ్య సౌరభకరౌ సమ సన్నివేశౌ 
సౌమ్యో సదానుభవనేపి నవాను భావ్యౌ 
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || (3)

అర్థము :-

నూపురములతో సహా (లేదా శిరస్సు మొదలు కాలి ఉంగరముల దాకా) పుష్పములతో, సుగంధ ద్రవ్యములతో అర్చింపబడుతూ, భక్తులచే సదా అనుభవింపబడుతూ ఉన్నప్పటికీ, తనివి తీరక  ఎప్పటికప్పుడే కొత్తగా అనిపించి అనుభవింపబడే శ్రీ వేంకటేశ్వరుని పాదములను శరణు వేడుతున్నాను.


సద్యో వికాసి సముదిత్వర సాంద్రరాగ 
సౌరభ్య నిర్భర సరోరుహ సామ్యవార్తామ్ 
సమ్యక్షు సాహస పదేషు విలేఖయంతౌ 
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || (4)

అర్థము :-

ఆ పాదములు ఎవైతే తామర కలువల కంటే ఎక్కువ అందమైన అరుణ కాంతులతో నా మనస్సుని ఉర్రూతలూగిస్తూ నన్ను వశపరచుకుని తనవైపుకు తొందరగా రమ్మని లాగుతున్నాయో (బహుశా నేను ఇలా ఆయన పాదపద్మములను తామరలతో పోల్చడం సాహస కార్యము అవుతుందేమో ఎందుకంటే ఆయన పాదాల ముందు అవేమీ లెఖ్ఖలోకి రావు) అటువంటి శ్రీ వేంకటేశ్వరుని పాదముల నేను శరణు వేడుతున్నాను.  


రేఖామయధ్వజ సుధాకల శాతపత్ర 
వజ్రామ్ కుశామ్బురుహ కల్పక శంఖ చక్రై హ్  
భవ్యైర్అలంకృత తలౌ పరతత్త్వ చిహ్నైహ్ 
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || (5)

అర్థము :-

ఏ పాదాల అరికాళ్ళు అందమైన రేఖలతో ధ్వజము, అమృతకలశము, ఛత్రము, వజ్రము, అంకుశము, పద్మము, కల్పకవృక్షము, శంఖః చక్రములు, మొదలైన దివ్యమైన చిహ్నములతో అలంకరింపబడి ఉన్నాయో ఆ శ్రీ వేంకటేశ్వరుని పాదముల నేను శరణు వేడుతున్నాను. 


తామ్రోదర ద్యుతి పరాజిత పద్మ రాగౌ 
బాహ్యైర్ మహోభి రభూత మహేంద్రనీలౌ 
ఉద్యన్నఖాంశుభి రుదస్త శశాంక భాసౌ 
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || (6)


అర్థము :- 

ఎవరి ఉదరము తామ్ర వర్ణము (రాగి బిందెల రంగు)తో ఉజ్జ్వలముగా ప్రకాశిస్తూ పద్మముల మరియు కెంపుల కాంతిని ఓటమిపాలు చేస్తున్నాయో, ఎవరి భుజముల కాంతి అతి దివ్య తేజస్సుతో మెరుస్తూ ఇంద్ర నీలమణుల కాంతిని కూడ మాపు చేస్తున్నాయో, ఎవరి కాలి గోళ్ళ వెలుగు చంద్రుని వెలుగును కూడ కించ పరుస్తున్నాయో శ్రీ వేంకటేశ్వరుని పాదముల నేను శరణు వేడుతున్నాను. 

 సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం 
సంవాహనేపి సపది క్లమ మాధధానౌ
కాంతావ వాఙ్గ్మానస గోచర సౌకుమారయౌ
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || (7)

అర్థము :-

ఎంతో ప్రేమ, ఆదుర్దాలతో లక్ష్మీదేవి తన మృదువైన చేతులతో ఆ పాదములను పిసుకుతున్నప్పటికీ అలసట, చంచలత్వము (భక్తులకి ఇంకా ఎంతో చెయ్యాలి అనే తపన) తీరని ఆ పాదముల అందచందాలు స్త్రీల పాదాల కన్నా ఆకర్షణీయత  కలిగి మాటలతో కాని ఊహలలో కానీ వర్ణించడానికి సాటి దొరకని ఆ దివ్యమైన  శ్రీ వేంకటేశ్వరుని పాదముల నేను శరణు వేడుతున్నాను.  


లక్ష్మీ మహీ తదనురూప నిజానుభావ 
నీళాది దివ్యమహిషీ కరపల్లవా నామ్ 
ఆరుణ్య సంక్రమణతః కిల సాంద్ర రాగౌ 
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || (8)

అర్థము :-

లక్ష్మీదేవి, భూదేవి, వారితో సమానంగా నీళాదేవి మొదలగు అనేక దివ్య మాతలు తమ మృదువైన చేతులతో మీ పాదముల తాకుతున్నప్పటికీ మీ పాదములు వారి చేతులయొక్క ఎరుపు రంగంతా ఎక్కిపోయిందా అన్నట్లుగా కందిపోయిన శ్రీ వేంకటేశ్వరుని పాదముల నేను శరణు వేడుతున్నాను.  


నిత్యా నమద్విధి శివాది కిరీట కోటి 
ప్రత్యుప్త దీప్త నవరత్న మహ ప్రరోహైహ్
నీరాజనా విధి ముదార ముపాద ధానౌ 
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || (9)

అర్థము :-

నిత్యమూ నమస్సులు సమర్పించుకునే బ్రహ్మ, శివుడు మొదలైన ప్రముఖుల కిరీటములలో పొదగబడిన మరియు ఉజ్జ్వలంగా ప్రకాశించే మేలిమి నవరత్నముల కిరణముల కాంతి నీరాజనం పట్టుతున్నదా అన్నట్లు ఉండే ఆ శ్రీ వేంకటేశ్వరుని పాదముల నే శరణు వేడుతున్నాను. 
     

"విష్ణో పదే పరమ" ఇత్యుదిత ప్రశంసౌ
యౌ "మధ్వ ఉత్స" ఇతి భోగ్య తయా ప్యుపాత్తౌ 
భూయస్తధేతి తవ పాణి తలౌ ప్రతిష్ఠౌ 
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || (10) 
  
అర్థము :-

"విష్ణో పదే పరమ " (విష్ణు మూర్తి పాదములే పరం బ్రహ్మ) అని వేదములలో  ప్రశంసించబడాయి. అలాగే మధ్వ ఉత్స (తేనెల జల్లు లాంటి మధురమైనవి ) అని అనుభవముల ద్వారా ప్రతిపాదించ బడినవి. అదే వాస్తవము అని మరల మీ చేతి సంజ్ఞ ద్వారా కూడ తెలియజేయబడుతున్నవి. (అభయముద్రలో ఒక చేయి పాదముల వైపు చూపిస్తూ ఉంటుంది). అటువంటి శ్రీ వేంకటేశ్వరుని పాదముల నేను శరణు వేడుతున్నాను. 
    

పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ 
యౌ దర్శితౌ స్వచరణౌ శరణం ప్రజేతి 
భూయోపి మహ్య మిహతౌ కరదర్శి తౌ తే 
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || (11)

అర్థము :-

అర్జుని వంటి పరాక్రమ వీరునికి నీవు స్వయంగా సారధివై నీ పాదముల శరణు కోరమని తెలియజేశావు భగవద్గిత ద్వారా. అదే మళ్లీ ఇప్పుడు నీ చేతి సంజ్ఞ ద్వారా కూడ చూపిస్తూ తెలియజేస్తున్నావు. అటువంటి నీ పాదములనే నేను శరణు వేడుతున్నాను. 
 

మన్మూర్ధ్ని కాళీయ ఫణే వికటాటవీషు 
శ్రీ వేంకటాద్రి శిఖరే శిరసి శ్రుతీనాం 
చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే 
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || (12)

అర్థము :-

నా శిరము పై , కాళీయుని పడగపై, భయంకరమైన అడవి యందు, వేంకటాచల శిఖరముపై, వేదాల సారమైన ఉపనిషత్తులందును, మనస్సులో వేరే ఆలోచనలు లేక నిన్నే స్మరించువారియందును, అంతటా సమాన భావమును కలిగి ఉంటావు. అటువంటి నీ పాదములనే నేను శరణు వేడుతున్నాను. 
 

అమ్లాన హృష్య దవనీతల కీర్ణపుష్పౌ 
శ్రీ వేంకటాద్రి శిఖరాభరణాయమానౌ
ఆనందితాఖిల మనో నయనౌ తవైతౌ 
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || (13)

అర్థము :-

ఏ పాదముల చెంత చుట్టూ వెదజల్లబడిన పుష్పముల తాజాతనము సమసిపోకుండా, ఎండిపోకుండా, అప్పుడే జల్లిన వాటివలె ఉంటాయో, ఏ పాదములు వెంకటాచల శిఖరానికి ఆభరణముల వంటివో, వేటి దర్శన భాగ్యము మనస్సుకి తనివితీరని ఆనందాన్ని కలిగిస్తాయో ఆ శ్రీవేంకటేశ్వరుని పాదములనే నేను శరణు వేడుతున్నాను.  


ప్రాయహ్ ప్రపన్న జనతా ప్రథమావ గాహ్యౌ 
మాతుఃహ్ స్తనా వివ శిశో రమృతాయమానౌ 
ప్రాప్తౌ పరస్పర తులా మతులాంతరౌతే 
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || (14)

అర్థము :-

నిన్ను దర్శించుకునే వారు ముందుగా నీ పాదముల దర్శనమే కోరుకుంటారు. ఏ విధంగా అయితే తల్లి పొందు చంటి బిడ్డలకు అమృతాన్ని అందిస్తుందో అలాగే నీ పాదముల పొందు భక్తులకు ఎనలేని తృప్తిని ఇస్తాయి. ఈ రెండు ఒకదానికి ఒకటి ఉపమానముగా చెప్పుకోవచ్చును. రెండిటిలో ఏదీ తక్కువైనది కాదు. అటువంటి శ్రీవేంకటేశ్వరుని పాదములనే నేను శరణు వేడుతున్నాను. 


సత్త్వోత్తరై స్సతత సేవ్య పదాంబుజేన 
సంసార తారక దయార్ద్ర దృగంచలేన 
సౌమ్యోపయంత్రు మునినా మమ దర్శితౌతే 
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || (15)

అర్థము :-

మీ పాదములు నాకు శ్రీ మనవాళ మహాముని ద్వారా చూపించబడినవి ( ఏ మహానుభావుని భావుని పాదములను పుణ్యపురుషులందరూ సేవిస్తుంటారో, మరియు ఎవరి చల్లని, దయతో కూడిన చూపులు అందరికీ సంసార సాగరమునుండి ముక్తిని పొందే మార్గాన్ని చూపిస్తాయో ఆ మహాపురుషుడు నాకు మీ పాదములను చూపించారు). కాబట్టి నేను అటువంటి  శ్రీవేంకటేశ్వరుని పాదములనే శరణు వేడుతున్నాను.  
  

శ్రీశ శ్రియా ఘటికయా త్వదుపాయ భావే 
ప్రాప్యే త్వయి స్వయ ముపేతయా స్ఫురంత్యా 
నిత్యాశ్రితాయ నిరవద్య గుణాయ తుభ్యమ్ 
స్యాం కింకరో వృషగిరీశ న జాతుమహ్యమ్ || (16)

అర్థము :-

ఓ శ్రీ వెంకటేశ్వరా ! ముక్తికి మార్గము మీరు ఉపాయము అయితే అటువంటి ఉపాయాన్ని లక్ష్మీదేవి మాకు అందిస్తుంది (అందుకే ముందుగా లక్ష్మిని పూజించి విష్ణువుని పూజిస్తుంటాము). అలాగే మీ సాన్నిధ్యాన్ని మేము పొందితే అదికూడా లక్ష్మీదేవి అందిస్తోంది. ఎందుకంటే ఆవిడ మీ దగ్గిరే ఉంటుంది ఎల్లవేళలా. అందుకని మేము కూడా ఎల్లవేళలా మీ శరణులోనే ఉండాలని కోరుకుంటున్నాను. అంతకంటే ఎవరినీ మేము ఎరగము. మీకే సమర్పించుకుంటున్నాను మీ దాసునిగా నన్ను నేను.  


ఓం ఇతిః  శ్రీవేంకటేశ్వర ప్రపత్తి సంపూర్ణమ్ ||

ఓం నమో శ్రీ పద్మావతీ శ్రీనివాసాయ నమః ||                               

27, నవంబర్ 2024, బుధవారం

గోవింద నామావళి - 108 Names of Lord Krishna/Sri Venkateswara Swamy


గోవింద నామావళి అన్నది వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించి కీర్తించే 108 నామాలు అన్నమాట. 
కానీ గోవిందుడు అంటే మరి కృష్ణుని నామము కదా! మరి వెంకటేశ్వరుని నామాలు ఎలా అయ్యాయి అని అంటారా ? కృష్ణుడూ , వెంకటేశ్వరుడు కూడ శ్రీహరి రూపాలే అని మీకు తెలుసు కదా మరి. 

అంతేకాదు. ఈ నామాలు చదువుతున్నప్పుడు మీకు శ్రీ రాముని, ఇంకా మిగతా విష్ణు రూపాలనీ కూడ మనము కీర్తిస్తున్నామని అర్థం అవుతుంది. అంటే వెంకటేశ్వర స్వామి లోనే అందరు దేవుళ్ళని మనము చూస్తున్నాం అని గ్రహించాలి. 

ఇవి ఎనిమిదేసి నామాల గుత్తులుగా తయారుచేశారు. ఇవి ఎవరు రాశారో సరిగ్గా తెలియదు.
 
ప్రతీ ఎనిమిది నామాల తరువాత (అంటే ఎనిమిది వరుసల తరువాత) గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా అని ఉంటుంది . దీన్ని రెండు సార్లు చదవాలి ప్రతి ఎనిమిది వరుసల తరువాత.  అలా రాగ యుక్తంగా చదువుతూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది. 

నేను ప్రతీ శనివారము దీన్ని చదువుతున్నాను ఎన్నో ఏళ్ల నుండి. దీన్ని నాకు కాకినాడ దగ్గరి పల్లెటూర్లో కళ్యాణ వేంకటేశ్వరస్వామి గుడిలో చాలా ఏళ్ళక్రితం ఇచ్చారు. శనివారాలు తప్పకుండా చదువుతూ ఉండమని చెప్పి ఇచ్చారు. 

నాకు ఇచ్చిన కాపీలు పంచి పెట్టిన వారి పేరు ముద్రించి ఉంది. అది శ్రీమతి సవితా రాణి, బాలకృష్ణా రెడ్డి గార్లు పంచి పెట్టారు.  

కొన్ని నామాలకి అర్థము కూడ తెలియజేస్తే మంచిదనిపించింది. అలా అవసరము అనిపించిన నామాలకి అర్థము ఇస్తున్నాను. 

గోవింద నామావళి   


ముందుగా మూడు సార్లు "ఓం గోవిందాయ నమః" అని చెప్పుకోండి. 

శ్రీ శ్రీనివాసా గోవిందా 
శ్రీ వెంకటేశా గోవిందా
భక్తవత్సలా గోవిందా (భక్తుల మీద ఆప్యాయత కలవాడు)
భాగవతప్రియ గోవిందా (తనకు కైంకర్యము చేసే వారికి ఇష్టమైన వాడు)
నిత్యనిర్మలా గోవిందా
నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుషా గోవిందా
పుండరీకాక్షా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా | 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా || 

నందనందనా గోవిందా (నందుని కొడుకు)
నవనీతచోరా  గోవిందా (వెన్నల దొంగ)
పశుపాలక శ్రీ గోవిందా
పాపవిమోచన గోవిందా 
దుష్టసంహారా గోవిందా
దురితనివారణ గోవిందా (చెడు మరియు దుర్మార్గములను పోగొట్టేవాడు)
శిష్టపరిపాలక గోవిందా
కష్టనివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా | 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా || 

వజ్రమకుట ధర గోవిందా (వజ్ర కిరీటము కలవాడు)
వరాహమూర్తి గోవిందా (వరాహ అవతారుడు)
గోపీజనలోల గోవిందా (గోపీజనులతో ఉండేవాడు)
గోవర్ధనోద్హారా గోవిందా (గోవర్ధన పర్వతము ఎత్తాడు ఇంద్రుడి కోపం తుఫానుల నుండి రక్షిస్తాడు)
దశరథనందన గోవిందా 
దశముఖమర్దన గోవిందా (పది తలల రావణుని చంపాడు)
పక్షివాహన గోవిందా  (గరుడ పక్షి వాహనముగ కలవాడు)
పాండవప్రియా గోవిందా 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా | 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా || 

మత్స్యకూర్మా గోవిందా (మత్స్య అవతారము , కూర్మ అవతారము ఎత్తాడు)
మధుసూదన హరి గోవిందా (మధు అనే రాక్షసుని దండించాడు)
వరాహనరసింహ గోవిందా (వరాహ మరియు నారసింహ అవతారాలు దాల్చాడు)
వామనభృగురామ గోవిందా (వామనుడిగా, భృగు మహర్షి కొడుకు పరశురామునిగా ) 
బలరామానుజ గోవిందా (బలరాముడు సోదరుడుగా కలవాడు)
బౌధ్హకల్కిధర గోవిందా (బుద్హావతారము, కల్కి అవతారము దాల్చినవాడు) 
వేణుగానప్రియ గోవిందా (కృష్ణుడు)
వేంకటరమణా గోవిందా (వేంకటేశ్వరుడు)
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా | 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా || 

సీతానాయక గోవిందా 
శ్రితపరిపాలక గోవిందా 
దరిద్రజనపోషక గోవిందా 
ధర్మసంస్థాపక గోవిందా 
అనాధరక్షక గోవిందా 
ఆపద్భాంధవ గోవిందా 
శరణాగత వత్సల గోవిందా 
కరుణాసాగర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా | 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా || 

కమలదళాక్ష గోవిందా 
కామితఫలదాతా గోవిందా (కోరికలు దీర్చేవాడు)
పాపవినాశక గోవిందా (పాపాలు పోగెట్టేవాడు)
పాహిమురారే గోవిందా (రక్షించు మురాసురుని చంపినవాడా)
శ్రీముద్రాంకిత గోవిందా (శ్రీముద్ర అంటే నుదిటి పై బొట్టు ఉన్నవాడు)
శ్రీవత్సాంకిత గోవిందా (శ్రీవత్స చిహ్నము ఉన్నవాడు)
ధరణీనాయక గోవిందా (ధరణి అంటే భూమి మరియు భూదేవి)
దినకరతేజా గోవిందా (సూర్యుని తేజస్సు కలవాడు)
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా | 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా || 

పద్మావతిప్రియ గోవిందా 
ప్రసన్నమూర్తీ గోవిందా 
ఆశ్రితపక్షా గోవిందా 
అభయహస్తప్రదర్శన గోవిందా 
శంఖచక్రధర గోవిందా 
శార్ఙ్గగదాధర గోవిందా 
విరజాతీరస్థ గోవిందా (తిరుపతిలో వేంకటేశ్వరుని పాదాల కింద నీరు ఉంటాయి. అదే విరజా నది)
విరోధిమర్దన గోవిందా (విరోధులను చంపేవాడు)
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా | 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా || 

సాలగ్రామధర గోవిందా  (సాలగ్రామము అనేది ఒక పవిత్రమైన రాతి శిల (ఉండ లాంటి ముక్కలు. అది పూజింపబడుతుంది దేవునితో సమానంగా)  
సహస్రనామా గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా 
లక్ష్మణాగ్రజ గోవిందా 
కస్తూరి తిలకా గోవిందా 
కాంచనాంబర ధర గోవిందా (కాంచనము అంటే బంగారము. బంగారు దుస్తులు ధరించినవాడు)
గరుడవాహన గోవిందా 
గజరాజ రక్షక గోవిందా   
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా | 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా || 

వానర సేవిత గోవిందా 
వారధి బంధన గోవిందా 
ఏడుకొండలవాడ గోవిందా 
ఏకస్వరూప గోవిందా 
శ్రీరామకృష్ణ గోవిందా 
రఘుకులనందన గోవిందా 
ప్రత్యక్షదేవా గోవిందా 
పరమ దయాకర గోవిందా 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా | 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా || 

వజ్రకవచ ధర గోవిందా 
వైజయంతిమాలా గోవిందా 
వడ్డికాసులవాడ గోవిందా 
వాసుదేవతనయ గోవిందా 
బిల్వపత్రార్చిత గోవిందా 
భిక్షుక సంస్తుత గోవిందా 
స్త్రీ పుం రూపా గోవిందా 
శివకేశవ మూర్తీ గోవిందా 
బ్రహ్మాండ రూపా గోవిందా 
భక్త రక్షక గోవిందా 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా | 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా || 

నిత్య కళ్యాణ గోవిందా 
నీరజనాభా గోవిందా 
హాతిరామప్రియ గోవిందా (హాతిరామ్ ఒక పరమ భక్తుడు)
హరిసర్వోత్తమ గోవిందా 
జనార్ధనమూర్తి గోవిందా 
జగత్ సాక్షిరూప గోవిందా 
అభిషేక ప్రియ గోవిందా 
ఆపన్నివారణ గోవిందా 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా |  
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా || 

రత్నకిరీటా గోవిందా 
రామానుజసుత గోవిందా (రామానుజుల వారు వేంకటేశ్వరునికి యజ్నోపవీతం చేసి, శంఖ చక్రములు ధరింపచేశారు. అందుచేత వెంకటేశ్వర స్వామి ఆయన కొడుకు అయ్యాడు)
స్వయంప్రకాశ గోవిందా 
సహస్రాక్షా గోవిందా 
నిత్యశుభ ప్రద గోవిందా 
నిఖిల లోకేశా గోవిందా 
ఆనందరూపా గోవిందా 
ఆద్యంత రహితా గోవిందా 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా | 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా || 

ఇహపర దాయక గోవిందా (ఇహము అంటే భూలోక సుఖములు, పర అంటే స్వర్గ సుఖాలు)
ఇభరాజ రక్షక గోవిందా  (ఇభ అంటే ఏనుగు. గజేంద్రుని రక్షించిన వాడు)
పరమ దయాళో గోవిందా 
పద్మనాభ హరి గోవిందా 
తిరుమల వాసా గోవిందా 
తులసీ వనమాలా గోవిందా 
శేషాద్రి నిలయ గోవిందా 
శేష శాయిని గోవిందా 
శ్రీ శ్రీనివాస గోవిందా 
శ్రీ వెంకటేశ గోవిందా 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా | 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా || 

శ్రీ ఏడుకొండల వాడా, వేంకటరమణా, గోవిందా, గోవిందా, గోవింద || 

For the English version of Govinda NaamaavaLi, please visit this link.




15, నవంబర్ 2024, శుక్రవారం

సుమతీ శతకము - కనకపు సింహాసనమున శునకము - Poems From Sumathi Shatakamu





మీరంతా కూడ చిన్నప్పుడు స్కూల్లో "కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి" అన్న పద్యము చదువుకునే ఉంటారు. ఇది సుమతీ శతకము లోనిది. ఇలాంటివే బోళ్ళు పద్యాలు ఉన్నాయి సుమతి శతకములో. అందులోవి ఎక్కువగా చలామణిలో ఉన్న కొన్ని పద్యాలను అర్థ, తాత్పర్యములతో బాటు ఈ పోస్ట్ లో తెలియజేస్తున్నాను.

ముందుగా సుమతీ శతకము గురించి కొన్ని వాక్యాలు. 

సుమతీ శతకము అంటే "సుమతీ" అనే పదముతో ముగింపబడిన వంద పద్యాల సంపుటి అని అర్థము.  సుమతి అన్నది కవి పేరు కాదు. మంచి బుద్ధిమంతుడు అని అర్థము 

వేమన శతకము వేమారెడ్డి రాశారు. కాని సుమతీ శతకాన్ని రచించినది బద్దెన భూపాలుడు. ఈయన వేమన కంటే వంద ఏళ్ళు ముందటి వారు. 

సుమతి అంటే మంచి (సజ్జన) బుద్ధి కలవాడని, తెలివైన వాడని అర్థాలు వస్తాయి. ప్రతీ పద్యము చివరన బద్దెన "ఓ మంచి బుద్ధి గలవాడా" అని తన పాఠకులను సంభోదిస్తున్నాడు. 

ఇప్పుడు పద్యాలు వాటి అర్థాలు తెలియజేస్తాను.

ఆంగ్ల భాషలోకి నేను అనువదించిన పద్యాలను చూడాలనుకుంటే ఈ లింకు పై క్లిక్ చెయ్యండి:
 

సుమతీ శతకము 


శ్రీ రాముని దయచేతను 
నారూఢిగ సకల జనులు నౌరా యనగా
ధారాళమైన నీతులు 
నోరూ రగ జవులు పుట్ట నుడివెద సుమతీ || (1) 

అర్థము :-

ఓ మంచిబుద్ధి కలవాడా ! శ్రీ రాముని దయతో నేను సమస్త జనులు తప్పకుండ ఔరా అనే విధముగా ధారాళంగా నోరూరి ఎలాగయితే నీళ్లు కారుతాయో అలాంటి రసములు కారే నీతులు బోలెడన్ని చెబుతాను. 
 

కనకపు సింహాసనమున 
శునకము  గూర్చుండబెట్టి శుభలగ్నమునన్  
దొనరగ బట్టముఁ గట్టిన 
వెనుకటి గుణమేల మాను వినరా సుమతి || (2)

అర్థము :-
బంగారపు సింహాసనము పై ఒక కుక్కని మంచి ముహూర్తము చూసి పట్టాభిషేకము చేసి కూర్చుండబెడితే అది తన సహజ స్వభావమును ఎలాగైతే మానలేదో, (అలాగే అల్పుడికి గొప్ప పదవి ఇచ్చినప్పటికీ తన నీచ గుణమును మానలేడు అని) వినరా ఓ మంచిబుద్ధి వాడా!  


అక్కరకు రాని చుట్టము 
మొక్కిన వరమీని వేల్పు, మోహరమున దా 
నెక్కిన పారని గుఱ్ఱము 
గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ || (3)

అర్థము :-

అవసరానికి పనికిరాని చుట్టములను (బంధువులను), మొక్కితే వరములియ్యని దేవుడిని, రణరంగమున తాను ఎక్కిన గుర్రము పరుగెత్తక పోయినచో, వాటిని వెంటనే వదిలెయ్యాలి కదా బుద్ధిమంతుడా !       


అప్పిచ్చువాడు, వైద్యుడు, 
నెప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్ 
జొప్పడిన యూర నుండుము,
జొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ || (4)

అర్థము :-

అప్పులు ఇచ్చేవాడు, వైద్యుడు, అన్ని సమయాలలో ఎడతెగక పారే ఏరు , బ్రాహ్మణుడు, ఇవన్నీ ఉండే ఊరిలో నివసించు. ఇటువంటివి లేని చోట ఉండకుము ఓ మంచిబుద్ధి వాడా!


ఒక యూరికి నొక కరణము, 
ఒక తీర్పరి యైన గాక, నొగి దఱుచైనన్ 
గకవికలు గాక యుండునె 
సకలంబును గొట్టువడట సహజము సుమతీ || (5)

అర్థము :-

ఒక ఊరికి ఒక కరణము , ఒక తీర్పు చెప్పేవాడు ఉండాలి. అలా కాక ఎక్కువమంది ఉన్నట్లయితే వారిలో భేదాలు, కొట్లాటలు బయలుదేరి ఆ ఊరంతా సర్వనాశనము కాక మానదు కదా బుద్ధిమంతుడా!


తన కోపమె తన శత్రువు,
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ,
తన సంతోషమె స్వర్గము,
తన దుఃఖమె నరక మండ్రు తథ్యము సుమతీ || (6)

అర్థము :-

మన కోపమే మనకి శత్రువు. కోపము అణచుకుంటూ శాంతముగా ఉండటమే మనకి రక్షణగా ఉంటుంది. దయ మనకి చుట్టములాంటిది. సంతోషమే మనకి స్వర్గము. ఆ సంతోషము లోపించి దుఃఖాలలో తెలియాడుతుంటే అంతకన్నా వేరే నరకము ఉండదు. ఇది నిజమురా ఓ బుద్ధిమంతుడా!


ఉపకారికి నుపకారము 
విపరీతము గాదు, సేయ వివరింపంగా 
అపకారికి నుపకారము 
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ || (7)

అర్థము :-

ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారము చేయడము ఏమంత గొప్ప కాదు. అపకారము చేసిన వాడికి అతను చేసిన దాన్ని గురించి తప్పు పట్టుకోకుండా ఉపకారము చేయడం లోనే నీ యొక్క నేర్పరితనము, గొప్పతనము ఉన్నాయి. (అలా చేసినప్పుడు వారే సిగ్గు పడి మళ్ళా కీడు చేయడం మానేస్తారు). 


ఎప్పుడు సంపద కలిగిన 
నప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్ 
తెప్పలుగ జెరువు నిండిన 
గప్పలు పదివేలు చేరు కదరా సుమతీ || (8)

అర్థము :-

ఎప్పుడైతే సంపదలు కలిగి ధనవంతుడవు అవుతావో ఒక్కసారిగా బంధువులంతా వచ్చి చుట్టుముట్టేస్తారు. ఎలాగంటే చెరువు నిండా నీళ్లు నిండగానే వేలకొలది కప్పలు ఎలా వచ్చేస్తాయో అలాగన్నమాట .
 
ఇక్కడ ఇంకో సామెత కూడా చెప్పుకోవచ్చును "బెల్లం చుట్టూ చీమలు చేరినట్లుగా"


ధనపతి సఖుడై యుండగ 
నెనయంగా శివుడు భిక్షమెత్తగ వలసెన్
దన వారి కెంత గలిగిన
దన భాగ్యమె తనకు గాక తథ్యము సుమతీ || (9)

అర్థము :-

ధనపతి కుబేరుడు తనకు దగ్గరివాడై ఉన్నప్పట్టికీ శివునికి భిక్షమెత్తుకోవాల్సి వస్తోంది. తన వాళ్లకి ఎంత ఉన్నప్పటికీ అది వారి సొత్తే కాని నీకు పనికిరాదు కదా ! ఇదే నిజము తెలుసుకో ఓ బుద్ధిమంతుడా !  


నడువకుమీ తెరువొక్కట, 
గుడువకుమీ శత్రునింట గూరిమి తోడన్,
ముడువకుమీ పరధనముల,
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ || (10)

అర్థము :-

(ఇతర మనుష్యులు లేని) రోడ్డు మీద ఒంటరిగా పోరాదు. శత్రువు ఇంట్లో ఇష్టంగా (జాగ్రత్త పడకుండా) తినకు. పరుల సొమ్ము దొంగిలించి దాచుకోకు. ఇతరుల మనస్సు నొచ్చే విధంగా మాటలాడరాదు ఓ మంచివాడా !

     
కులకాంత తోడ నెప్పుడు
గలహింపకు, వట్టి తప్పు ఘటియింపకుమీ,
కలకంఠి కంట కన్నీ 
రొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ || (11)

అర్థము :-

చేసుకున్న భార్యతో ఎప్పుడూ కూడ వాదులాడకు (దెబ్బలాడకు). లేనిపోని నేరాలు మోపి నిందించకు. మధురభాషిణి, ఉత్తమురాలు అయిన స్త్రీ కంటి నుండి నీరు కారితే ఆ ఇంటిలో సిరి (లక్ష్మీదేవి) ఉండదు. 


కూరిమి గల దినముల 
నేరము లెన్నడును గలుగ నేరవు, మరి యా 
కూరిమి విరసంబైనను 
నేరములే దోచు చుండు నిక్కము సుమతీ || (12)

అర్థము :-

స్నేహము ఉన్నంత కాలము నేరములు అన్నవి ఉండవు ఆ స్నేహితుల మధ్యలో. 
కానీ ఆ స్నేహము చెడినంతనే ప్రతీది నేరము లాగానే కనిపిస్తుంది. ఇది నిజము బుద్ధిమంతుడా !     

వినదగు నెవ్వరు జెప్పిన, 
వినినంతనే వేగపడక వివరింప దగున్, 
కని కల్ల నిజము దెలిసిన 
మనుజుడె పో నీతిపరుడు మహిలో సుమతీ || (13)

అర్థము :-

ఎవరు ఏం చెప్పినా వినడం మంచిదే. కాని వినగానే తొందర పడకుండా పరీక్షించి అందులోని నిజాలు, అబద్ధాలు తెలిసికొని మసలుకొనే వాడే అసలైన నీతిపరుడు, బుద్ధిమంతుడు అనిపించుకుంటాడు. 


పిలువని పనులకు బోవుట,
గలయని సతి గతియు, రాజు గానని కొలువుం,
బిలువని పేరంటంబును, 
వలువని చెలిమియును జేయ వలదుర సుమతీ || (14)     

అర్థము :- 

పిలువని పనులు చేయాలని చూడకు. మనస్సులు, మనోభావాలు కలవని స్త్రీ తో సమాగమము చెయ్యకు. రాజు చూడని కొలువు అంటే పాలకులు కానీ అధికారులు కానీ చూడని సేవ చెయ్యకు. అటువంటి సేవ వల్ల సంపాదన, గుర్తింపు ఉండదు. పిలువని పేరంటానికి వెళ్లి అవమానాల పాలు గాకుము. అలాగే కోరని స్నేహమును కూడ చేయకురా ఓ బుద్ధిమంతుడా !


సిరి తా వచ్చిన వచ్చును 
సరళముగ నారికేళ సలిలము భంగిన్,
సిరి తా బోయిన బోవును 
కరి మ్రింగిన వెలగ పండు కరణిని సుమతీ || (15)

అర్థము :-

సంపద వచ్చినప్పుడు కొబ్బరి కాయ లోనికి నీళ్లు ఎంత రమ్యంగా వస్తాయో అల్లాగే వస్తుంది . అదే సంపద వెళ్లిపోయేటప్పుడేమో క్షణం లో మాయమై పోతుంది ఏ విధంగా నైతే ఏనుగు మింగిన వెలగపండు లోని గుజ్జు మాయమై పోతుందో అల్లాగే. ఇది తెలుసుకో బుద్ధిమంతుడా !  


బంగారు కుదువ బెట్టకు,
సంగరమున బారిపోకు సరసుడవైతే, 
నంగడి వెచ్చము వాడకు, 
వెంగలితో జెలిమి వలదు, వినరా సుమతీ || (16)

అర్థము :-

బంగారాన్ని తాకట్టు పెట్టకు. యుద్ధ రంగము నుండి పారిపోకు. సరైన, తెలివి గలవాడివి అయితే దుకాణము నుండి అప్పులు తెచ్చుకుని వాడుకోకు. మూర్ఖుడితో స్నేహము చెయ్యకు. వినరా ఓ బుద్ధిమంతుడా ! 

2, నవంబర్ 2024, శనివారం

వేమన పద్యాలు - ఉప్పుకప్పురంబు నొక్క పోలిక నుండు - Inspirational Poetry by Vemana


వేమన పద్యాలు కనీసం ఒకటో, రెండో మనము చిన్నప్పుడు స్కూళ్లల్లో చదువుకునే ఉంటాము. అందులో "ఉప్పు కప్పురంబు..." అన్నది చాలా ముఖ్యమైనది. 

వేమన పద్యాలను కొన్నింటిని (కనీసము ఒక డజను పద్యాలను) అర్థములతో సహా నేను వివరిస్తాను. అంతకు ముందు కొద్దిగా వేమన గురించి, ఆ పద్యాలు ఏ సందర్భములో రాయబడినవో తెలియజేసి, తదుపరి పద్యాల జోలికి వెళదాము.

లోకానికి ప్రియుడవైన ఓ రాముడా (దేముడా)! ఓ వేమనా, ఇదయ్యా లోకం తీరు అని పద్యాలని రాసుకున్నాడు. శ్రీ రాముని బదులు శివుని ఉద్దేశిస్తున్నట్లుగా కూడ చెప్పుకోవచ్చును. 

సమాజంలో జరుగుతున్న అన్యాయాలనీ , అక్రమాలనీ , మనుష్యుల తత్త్వాలనీ పద్యాల ద్వారా మన కళ్ళకి కనబడేలా వివరించి చెప్పారు వేమన. ప్రతీ చిన్న విషయాన్ని కూడ అతి సూక్ష్మంగా పరిశీలించి మనకి అర్థము అయ్యేలా తెలియజేస్తూ జాగ్రత్తగా మసలుకోవాలని హెచ్చరించారు. 

వేమన అసలు పేరు గోన వేమ బుద్ధా రెడ్డి. ఇతను కొండవీడు జమీందారుల వంశజుడు. సమాజం లోని అవినీతిని అక్రమాలను చూసి చాలా విరక్తి చెందిపోయి అన్నీ వదిలేసుకొని, ఒక యోగిలా వీధులలో తిరుగుతూ, పద్యాల ద్వారా అందరినీ పలుకరిస్తున్నట్లూ, హెచ్చరిస్తున్నట్లూ, ఎగతాళి చేస్తున్నట్లుగా అల్లా వాగుతుండేవారుట. వంటి మీద సరైన బట్ట కూడ ఉండేది కాదుట. అప్పుడు అందరూ ఇతనిని పిచ్చివాడిలా చూస్తూ వెంటబడేవారుట.

అతి కొద్దిమంది ఇతని మాటలలో విలువని గ్రహించి గుర్తించేవారుట. ఆ విధంగా ఈయన పద్యాలు గుర్తించబడి అవి వాడుకలోకి వచ్చాయి. చాలా మంది ఈ పద్యాలని సేకరించి పుస్తకరూపంలో ప్రచురించారు. అటువంటి వారిలో ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అతి ప్రముఖుడు. ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ లో పనిచేసే ఒక అధికారి. అప్పట్లో కడప మరియు రాజమండ్రిలో పనిచేస్తూ మన తెలుగు భాషని అభివృద్ధి చేశారు. ఆయన చాలా కష్టపడి మన భాషకోసం పనిచేశారు. వేమన మరియు సుమతీ శతకాల పద్యాలు అన్నీ సేకరించి వాటిని ఇంగ్లీష్ లోకి కూడ అనువదించారు.  


వేమన పద్యములు 


ఉప్పుకప్పురంబు నొక్క పోలిక నుండు 
చూడ చూడ రుచుల జాడ వేరు 
పురుషులందు పుణ్యపురుషులు వేరయా 
విశ్వదాభిరామ వినుర వేమ || (1)

అర్థము :-

ఉప్పు, కర్పూరము కూడ చూడటానికి ఒకేలా ఉంటాయి. అవి తిని చూస్తే కాని వాటికి ఉన్న తేడా తెలియదు. అలాగే మనుషులంతా ఒకేలా ఉంటారు. వాళ్ళతో కొన్ని రోజులు గడిపితే కాని వారిలో మంచి స్వభావము, మంచి గుణములు కలవారు ఎవ్వరో చెడు గుణముల వారు ఎవ్వరో మనకి తెలిసిరాదు. 

ప్రతీ పద్యాన్ని "విశ్వదాభిరామ వినురవేమ" అని ముగించాడు వేమన. అంటే తనకు తానే నీతులు, సామెతలు చెప్పుకుంటున్నట్లుగా ఆ పద్యాలని అల్లాడు. అలాగే అందరికీ ప్రియమైన దేవుడు శ్రీ రాముని సంభోదిస్తున్నట్లుగా ఈ పద్యాలను చెప్పుకున్నాడన్నమాట. 

ఓ దేముడా, ఇదయ్యా లోకం తీరు అని ప్రతీ పద్యాన్ని అల్లాడు. 


అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను 
సజ్జనుండు బల్కు చల్లగాను 
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా 
విశ్వదాభిరామ వినుర వేమ || (2)

అర్థము :-

అల్పుడు అంటే ఇక్కడ అజ్ఞాని అని, ఆకతాయి (అల్లరిచిల్లరి వాడు) అని, పొగరుబోతు అని, ఇలాంటివాళ్ళు ఎప్పుడూ గట్టిగా మాట్లాడుతూ తమ మాటే నెగ్గించుకోవడం కోసం చూస్తుంటారు. అదే సజ్జనుడు అంటే తెలివైన వాడు, మంచి స్వభావము కలవాడు చాలా నింపాదిగా అందరికీ నచ్చేవిధంగా మాట్లాడుతాడు. కంచు గిన్నెలు (ఇంగ్లీషులో బ్రాన్జ్)  చాల బిగ్గరగా చెవులకి బాధాకరంగా, కర్కశంగా మోగుతాయి. కాని మంచి విలువైన బంగారమేమో చప్పుడు కాకుండా చక్కగా, ఇంపుగా మోగుతుంది. ఈ పద్యములో అల్పుడుని కంచుతో, సజ్జనుడిని బంగారంతో పోల్చాడు వేమన.  


ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికిన 
నలుపు నలుపే కాని తెలుపు కాదు 
కొయ్యబొమ్మ తెచ్చి కొట్టినా పలుకునా 
విశ్వదాభిరామ వినుర వేమ || (3)

అర్థము :-

ఎలుక చర్మము నల్లగా ఉంటుంది. దాన్ని తెచ్చి ఒక ఏడాదిపాటు అదే పనిగా ఉతికినా అది నల్లగానే ఉంటుంది. అంతేకాని తెల్లబడదు. ఎందుకంటే దాని స్వభావము స్వతహాగా అలా చేశాడు దేముడు. అలాగే కొయ్యబొమ్మని తెచ్చి మాట్లాడు, మాట్లాడు అని ఎంత కొట్టినా అది పలుకలేదు కదా. ఇక్కడ వేమన మనిషి నైజాన్ని తెలియజేస్తున్నాడు. మనిషిలోని జీన్స్ ఎలా ఉంటాయో దాన్ని బట్టి అతని స్వభావము ఉంటుంది. అది మారదు అని చెప్తున్నాడు.  


మేడిపండు చూడ మేలిమై యుండు 
పొట్ట విచ్చి చూడ పురుగులుండు 
పిరికివాని మది బింక మీలాగురా 
విశ్వదాభిరామ వినుర వేమ || (4)

అర్థము :-

మేడిపండు అంటే అంత సరిగ్గా తెలియదు నాకు. బహుశా అత్తిపండు అయినా అవచ్చు లేదా రేగి, నేరేడు పళ్ళలాంటివి అవచ్చును. వీటిలో ఏ పండైనా సరే అవి చూడటానికి బలే చక్కగా నున్నగా ఇంపుగా మెరుస్తూ ఉంటాయి. గబగబా తీసుకుని నోట్లో పడేసుకుందాము అనిపిస్తాయి. కానీ జాగ్రత్త ! అందులో పురుగులుంటాయి. చూసుకుని తినాలి విరగకొట్టి. 
ఈ పద్యంలో వేమన మేడిపండుని పిరికివాడిని పోల్చి చెబుతున్నాడు. పిరికి వాడు మేడిపండు లాంటివాడని. పైనుంచి చూడటానికి పిరికివాడు, ధైర్యవంతుడు ఒకేలా ఉంటారు. కాబట్టి పరీక్షిస్తే కానీ తేడా తెలియదని. పిరికివానితో జాగ్రత్తగా ఉండాలని. అలాంటివాళ్ళు ఆఖరిక్షణంలో సాయానికి రారని. నా ఉద్దేశ్యము ఇక్కడ వేమన ఇంకోటి కూడ చెబుతున్నాడేమో! పిరికివాళ్ళు కుత్సితులు కూడ ఉండవచ్చునేమో అందుకని వేమన మనని హెచ్చరిస్తున్నాడేమో!
   

గంగిగోవు పాలు గరిటెడైనను చాలు 
కడివెడైన నేమి ఖరము పాలు 
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు 
విశ్వదాభిరామ వినుర వేమ || (5)

అర్థము :-

గంగిగోవు పాలు అంటే మంచి శ్రేష్టమైన ఆవుపాలు ఒక గరిటెడు తాగినా చాలునని. ఖరము అంటే గాడిద. గాడిద పాలు ఒక కుండనిండా ఉన్నా అవి ఎందుకూ పనికిరావు. వాటిని తాగలేము, ఎందుకూ ఉపయోగించుకోలేము అని చెబుతున్నాడు వేమన. అదే విధముగా మంచి భక్తి, ప్రేమలతో పెట్టిన అన్నము ఒక ముద్ద తిన్నా చాలా తృప్తిగా ఉంటుంది. తిట్టుకుంటూ, అయిష్టంగా పెట్టే తిండి తినలేము కదా. తిన్నా అది సహించదు, అరగదు కూడ.     


అనువు గాని చోట అధికుల మనరాదు 
కొంచె ముండుటెల్ల కొదవ కాదు 
కొండ అద్దమందు కొంచెమై ఉండదా 
విశ్వదాభిరామ వినుర వేమ || (6)

అర్థము :-

ఈ పద్యములో వేమన సమయ, సందర్భాలని బట్టి మసలుకోవాలి అని చెబుతున్నాడు. కొత్త ప్రదేశములో కెళ్ళి నేను గొప్పవాడినని చెప్పుకోకూడదు. అక్కడి మనుషులు ఎటువంటివారో, వారిలో ఎవరైనా గొప్పవాళ్ళు ఉండవచ్చును కూడ. అంతేకాక ఎవరో కొత్తవాడు వచ్చి నేను గొప్ప అంటే వాళ్లకి ఇష్టముండకపోవచ్చును. చితకబాది తరిమేయవచ్చును. అందుకని జాగ్రత్తగా తక్కువ వాడిలాగానే ప్రవర్తించాలి. తరువాత వాళ్లే గుర్తించి ప్రశంశిస్తారు.  కొండ చాలా పెద్దది అయినప్పటికీ ఒక చిన్న అద్దములో దాని బొమ్మని చూస్తే ఎంత చిన్నదిగా కనిపిస్తోందో చూస్తున్నారు కదా. అలాగే నన్నమాట. 
కొండ ఏంటో పెద్దదని మనకి తెలుసు. అలాగే కొత్త ప్రదేశంలో వాళ్ళు నీ గొప్పతనాన్ని మెల్లిగా గుర్తిస్తారు. నిజం నింపాదిగా తెలుస్తుంది. 


పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానంబు 
మాట కన్న నెంచ మనసు దృఢము 
కులము కన్న మిగుల గుణము ప్రధానంబు 
విశ్వదాభిరామ వినుర వేమ || (7)

అర్థము :- 

పూజ కంటే బుద్ధి ముఖ్యమైనది. ఇక్కడ పూజ అంటే దేవుని పూజ అయినా కావచ్చు లేదా మనిషి పై గౌరవమైనా కావచ్చును. ఒట్టినే పుజించేసి లోలోపల నిజమైన భక్తి గౌరవాలు లేకుంటే లాభం లేదు. అలాగే పైపైన మంచిగా మాట్లాడుతూ ఆ మాటల పైన నిలకడ లేకపోతె ఆ మాటలకి ఎటువంటి విలువ ఉండదు. అదేవిధంగా గొప్ప కులములో పుట్టడము కంటే మంచి గుణాలతో ఉన్నవాడే గొప్పవాడు అని వేమన ఈ పద్యం ద్వారా చెబుతున్నాడు. 

అంటే మనము మనుషులు చూపించే గౌరవము కంటే వారి బుధ్హికి, వాళ్ళ మాటల కంటే వారి మనస్సు యొక్క దృఢత్వానికి, వారి కులము కంటే వారి గుణానికి ప్రాధాన్యత ఇవ్వాలి.  


నీటిలోన మొసలి నిగిడి ఏనుగు బట్టు 
బయట కుక్కచేత భంగ పడును 
స్థానబలము కాని తన బలిమి కాదయా 
విశ్వదాభిరామ వినుర వేమ || (8)

అర్థము :-

నీటిలో ఉండే మొసలి ఏనుగునైనా పట్టుకుని పీడించగలదు. అదే మొసలి బయటికొస్తే కుక్కలతో కూడ గెలవలేదు. ఇక్కడ స్థానబలము యొక్క గొప్పతనాన్ని చెబుతున్నాడు వేమన. 

ఇంకో విధంగా ఆలోచిస్తే ఎవరైనా తమ ఇంట్లో ఉండి ప్రగల్భాలు (అంటే గొప్పలు) చెప్పుకోవచ్చును. వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు బయటికొస్తే వాళ్ళ అసలు విలువేంటో తెలిసొస్తుంది. 
 

అన్ని దానములను అన్నదానమె గొప్ప 
కన్నతల్లి కంటె ఘనము లేదు 
ఎన్న గురునికన్న నెక్కుడు లేదయా 
విశ్వదాభిరామ వినుర వేమ || (9)

అర్థము :-

దానములన్నింటిలోకీ అన్నదానమే గొప్పది. కన్నతల్లి కంటే ఎక్కువ ఎవరూ కారు. అదేవిధంగా గురువు కంటే ఎవరూ ఎక్కువ కారు అని వేమన చెబుతున్నాడు ఈ పద్యము ద్వారా. ఎవరైనా ఆకలితో వచ్చి అన్నము అడిగితే పెట్టాలి. అంట కంటే గొప్ప పుణ్యము దేనితోనూ రాదు. నవమాసాలు నానా యాతనలను పడుతూ మోసి కని, ఆ తర్వాత కూడా తన కష్టాలు దిగమింగి ఎంతో ప్రేమతో పెంచే తల్లి కంటే ఎవ్వరూ గొప్ప కారు. చదువు చెప్పి జ్ఞానాన్ని ఇచ్చి మనని గొప్పవాళ్లుగా చేసే గురువు కూడ ఎంతో పూజనీయుడు. 


ఉప్పులేని కూర ఒప్పదు రుచులకు 
పప్పులేని తిండి ఫలము లేదు 
అప్పులేని వాడె అధిక సంపన్నుడు 
విశ్వదాభిరామ వినుర వేమ || (10)

అర్థము :-

ఈ పద్యములో కాస్త తికమకగా చెప్పాడు వేమన. మొదటి రెండు పనికిరానివని చెప్పాడు. మూడో వాక్యములో నేమో లేని వాడు గొప్పవాడు అంటున్నాడు. 

ఉప్పులేని కూరకి రుచి ఉండదు. అది పనికిరాదు. పప్పు లేకుండా తినే తిండి వలన ఎటువంటి ప్రయోజనము లేదు. శరీరానికి బలము రాదు. ఈ రెండూ కూడ పనికిరావని చెప్పాడు. ఆ తర్వాతేమో  అప్పు లేనివాడు అందరికంటే గొప్ప ధనవంతుడు అని అన్నాడు వేమన. ఇది అక్షరాల నిజము. ధనవంతుడై ఉండి అప్పులుంటే అతడు ఏనాటికైనా అప్పులలో ములిగిపోతాడు. అంతకన్నా అప్పు లేనివాడు తన సంపాదనతో బతుకుతూ ఎంతో హాయిగా ఉంటాడు.  


అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు 
తినగ తినగ వేము తీయనుండు  
సాధనమున పనులు సమకూరు ధరలోన 
విశ్వదాభిరామ వినుర వేమ || (11)

అర్థము :-

ఈ పద్యము మనకి ప్రేరేపణ కలిగించేది. ఏదైనా ఒక రాగం నేర్చుకునేటప్పుడు దాన్ని అదే పనిగా  మళ్ళీ మళ్ళీ పాడుతూ సాధన చేస్తే మంచిగా పాడగలుగుతాము. ఇక పొతే వేప ఆకు కానీ పుల్లని కానీ పదే పదే తింటూ ఉంటె అది అలవాటయి ఇంకా చేదు అనిపించదు. తియ్యగా ఉంటుంది. 

ఇదే విధముగా మనము ఏ పనినైనా అలా సాధనతో చేస్తూ పొతే అవి మంచిగా చేసుకోగలుగుతాము అని చెబుతున్నాడు వేమన.  


తప్పులెన్నువారు తండోపతండము 
ఉర్విజనులకెల్ల నుండు దప్పు 
తప్పులెన్నువారు తమతప్పు లెరుగరు
విశ్వదాభిరామ వినుర వేమ || (12)

అర్థము :- 

ఇక్కడ వేమన ఇతరులలో తప్పులు వెదికి వారిని అవమానపరిచే వారి గురించి చెప్తున్నాడు. 
తప్పులు లెక్కపెట్టేవాళ్ళు తండోపతండములుగా ఉంటారు. అంటే వందలు, వేలకొద్ది ఉంటారు అని. ఇకపోతే తప్పులు లేని అంటే తప్పు చేయని వాళ్ళం ఎవరమూ ఉండము. ఏదో ఒక సమయంలో అందరమూ తప్పులు చేసే ఉంటాము అని వేమన అంటున్నాడు. కాని తప్పులు లెక్క పెట్టేవారికి వాళ్ళ తప్పులు కనిపించవు అని. వాళ్లంతా గొప్పవాళ్ళము అనుకుంటారు. అటువంటి వారికి దూరంగా ఉండడమే మంచిది.  


ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు 
కాచి యతుకవచ్చు క్రమముగాను 
మనసు విరిగెనేని మరికూర్చ వచ్చునా
విశ్వదాభిరామ వినుర వేమ || (13)  

అర్థము :-

ఈ పద్యములో మనస్సుని గాయ పరిచే వాళ్ళ గురించి తెలియజేయడం జరిగింది. 
వేమన చెప్పేది ఏమిటంటే ఇనుప సామాను విరిగి రెండేసి మూడేసి ముక్కలైపోయినా వాటిని మళ్ళీ అతికించి సరిచేసేయ్యవచ్చునని. ఆ ముక్కలని కాస్తంత కాచి వేడి చేస్తే కొద్దిగా కరిగి అతుక్కుంటాయి. చల్లారాక మామూలుగా గట్టిగా అయిపోతాయి. కానీ మనస్సు విరిగితే అది మళ్ళీ అతికించడం చాలా కష్టము. అనకూడని మాటలతో కాని, చెయ్యకూడని చేష్టలతో కాని ఎవరి మనస్సునైనా విరక్కొడితే అది ఇంక అతకదు. అందుచేత ఎవరినీ నొప్పించకుండా ఉండాలని సందేశము ఇస్తున్నాడు వేమన. (సంసార జీవితంలో వేమన చాలా ఇబ్బందులు పడ్డాడు భార్యతోను, ఇంకా అయినవాళ్లతోను కూడ. అతని మనస్సు విరిగిపోయి సన్యాసిలా తిరిగాడు అని చెప్పుకుంటారు.) 


చెప్పులోని రాయి, చెవిలోని జోరీగ,
కంటి నలుసు, కాలి ముల్లు,
ఇంటిలోని పోరు ఇంతింత కాదయా 
విశ్వదాభిరామ వినుర వేమ || (14)

అర్థము :-   

ఈ పద్యము కూడ వేమన జీవిత అనుభవము లోని సత్యాన్ని చెప్పేది. 
చెప్పులో రాయి దూరితే ఎంత ఇబ్బందిగా ఉంటుందో, చెవిలో జోరీగ అంటే పెద్ద ఈగలు (జుయ్ మని చప్పుడు చేస్తూ ఎగురుతుంటాయి. కందిరీగలు లాంటివి) వాటితో ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో , కాంతిలో నలక పడితే ఎంత కష్టంగా ఉంటుందో, కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ఎంత బాధగా ఉంటుందో తెలుసు కదా. ఇంటిలో పోరు కూడా అలాంటిదే అస్సలు భరించలేము అని చెబుతున్నాడు వేమన. ఇల్లు ఎప్పుడూ కూడ సుఖమయంగా ఉండేట్లా చూసుకోవాలి.   
   

ఈ పద్యాలన్నీ కూడ మనకి రోజూ ఉపయోగపడే మంచి సందేశాలని ఇస్తున్నాయి. మనము ఈ ప్రపంచములో ఏ విధముగా మసలుకోవాలో వేమన తన జీవితానుభావాల ద్వారా తెలియజేసి ఎంతో మంచి చేశాడు. 

ఇవన్నీ మనము మన పిల్లలకి కూడ తెలియజేస్తే వారికీ మార్గదర్శనము చేసినవారము అవుతాము.

 

గమనిక :-

ఆంగ్లభాష లోకి ఈ పద్యాలను, మరియు సుమతీ శతకము లోని కొన్ని పద్యాలను అనువదించి నేను ఇంకో వెబ్సైటు పై ఒక పోస్ట్ పబ్లిష్ చేశాను విదేశీయులు చదవడం కోసమని. అది చదవాలనుకుంటే మీరు ఈ క్రింది లింకు క్లిక్ చేసి చూడవచ్చును. 

Inspirational Poetry by Two Telugu Poets