మీరంతా కూడ చిన్నప్పుడు స్కూల్లో "కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి" అన్న పద్యము చదువుకునే ఉంటారు. ఇది సుమతీ శతకము లోనిది. ఇలాంటివే బోళ్ళు పద్యాలు ఉన్నాయి సుమతి శతకములో. ఇలాంటివే కొన్ని పద్యాలు అర్థ/తాత్పర్యములతో బాటు ఈ పోస్ట్ లో తెలియజేస్తున్నాను.
ముందుగా సుమతీ శతకము గురించి కొన్ని వాక్యాలు.
సుమతీ శతకము అంటే "సుమతీ" అనే పదముతో ముగింపబడిన వంద పద్యాల సంపుటి అని అర్థము. సుమతి అన్నది కవి పేరు కాదు.
వేమన శతకము వేమారెడ్డి రాశారు. కాని సుమతీ శతకాన్ని రచించినది బద్దెన భూపాలుడు. ఈయన వేమన కంటే వంద ఏళ్ళు ముందటి వారు.
సుమతి అంటే మంచి, సజ్జన బుద్ధి కలవాడని, మంచి తెలివైన వాడని అర్థాలు వస్తాయి. ప్రతీ పద్యము చివరన బద్దెన "ఓ మంచి బుద్ధి గలవాడా" అని సంభోదిస్తున్నాడు.
ఇప్పుడు పద్యాలు వాటి అర్థాలు తెలియజేస్తాను.
ఆంగ్ల భాషలోకి నేను అనువదించిన పద్యాలను చూడాలనుకుంటే ఈ లింకు పై క్లిక్ చెయ్యండి:
సుమతీ శతకము
శ్రీ రాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగా
ధారాళమైన నీతులు
నోరూ రగ జవులు పుట్ట నుడివెద సుమతీ || (1)
అర్థము :-
ఓ మంచిబుద్ధి కలవాడా ! శ్రీ రాముని దయతో నేను సమస్త జనులు తప్పకుండ ఔరా అనే విధముగా ధారాళంగా నోరూరి ఎలాగయితే నీళ్లు కారుతాయో అలాంటి రసములు కారే నీతులు బోలెడన్ని చెబుతాను.
కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునన్
దొనరగ బట్టముఁ గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతి || (2)
అర్థము :-
బంగారపు సింహాసనము పై ఒక కుక్కని మంచి ముహూర్తము చూసి పట్టాభిషేకము చేసి కూర్చుండబెడితే అది తన సహజ స్వభావమును ఎలాగైతే మానలేదో, (అలాగే అల్పుడికి గొప్ప పదవి ఇచ్చినప్పటికీ తన నీచ గుణమును మానలేడు అని) వినరా ఓ మంచిబుద్ధి వాడా!
అక్కరకు రాని చుట్టము
మొక్కిన వరమీని వేల్పు, మోహరమున దా
నెక్కిన పారని గుఱ్ఱము
గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ || (3)
అర్థము :-
అవసరానికి పనికిరాని చుట్టములను (బంధువులను), మొక్కితే వరములియ్యని దేవుడిని, రణరంగమున తాను ఎక్కిన గుర్రము పరుగెత్తక పోయినచో, వాటిని వెంటనే వదిలెయ్యాలి కదా బుద్ధిమంతుడా !
అప్పిచ్చువాడు, వైద్యుడు,
నెప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము,
జొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ || (4)
అర్థము :-
అప్పులు ఇచ్చేవాడు, వైద్యుడు, అన్ని సమయాలలో ఎడతెగక పారే ఏరు , బ్రాహ్మణుడు, ఇవన్నీ ఉండే ఊరిలో నివసించు. ఇటువంటివి లేని చోట ఉండకుము ఓ మంచిబుద్ధి వాడా!
ఒక యూరికి నొక కరణము,
ఒక తీర్పరి యైన గాక, నొగి దఱుచైనన్
గకవికలు గాక యుండునె
సకలంబును గొట్టువడట సహజము సుమతీ || (5)
అర్థము :-
ఒక ఊరికి ఒక కరణము , ఒక తీర్పు చెప్పేవాడు ఉండాలి. అలా కాక ఎక్కువమంది ఉన్నట్లయితే వారిలో భేదాలు, కొట్లాటలు బయలుదేరి ఆ ఊరంతా సర్వనాశనము కాక మానదు కదా బుద్ధిమంతుడా!
తన కోపమె తన శత్రువు,
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ,
తన సంతోషమె స్వర్గము,
తన దుఃఖమె నరక మండ్రు తథ్యము సుమతీ || (6)
అర్థము :-
మన కోపమే మనకి శత్రువు. కోపము అణచుకుంటూ శాంతముగా ఉండటమే మనకి రక్షణగా ఉంటుంది. దయ మనకి చుట్టములాంటిది. సంతోషమే మనకి స్వర్గము. ఆ సంతోషము లోపించి దుఃఖాలలో తెలియాడుతుంటే అంతకన్నా వేరే నరకము ఉండదు. ఇది నిజమురా ఓ బుద్ధిమంతుడా!
ఉపకారికి నుపకారము
విపరీతము గాదు, సేయ వివరింపంగా
అపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ || (7)
అర్థము :-
ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారము చేయడము ఏమంత గొప్ప కాదు. అపకారము చేసిన వాడికి అతను చేసిన దాన్ని గురించి తప్పు పట్టుకోకుండా ఉపకారము చేయడం లోనే నీ యొక్క నేర్పరితనము, గొప్పతనము ఉన్నాయి. (అలా చేసినప్పుడు వారే సిగ్గు పడి మళ్ళా కీడు చేయడం మానేస్తారు).
ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్
తెప్పలుగ జెరువు నిండిన
గప్పలు పదివేలు చేరు కదరా సుమతీ || (8)
అర్థము :-
ఎప్పుడైతే సంపదలు కలిగి ధనవంతుడవు అవుతావో ఒక్కసారిగా బంధువులంతా వచ్చి చుట్టుముట్టేస్తారు. ఎలాగంటే చెరువు నిండా నీళ్లు నిండగానే వేలకొలది కప్పలు ఎలా వచ్చేస్తాయో అలాగన్నమాట .
ఇక్కడ ఇంకో సామెత కూడా చెప్పుకోవచ్చును "బెల్లం చుట్టూ చీమలు చేరినట్లుగా"
ధనపతి సఖుడై యుండగ
నెనయంగా శివుడు భిక్షమెత్తగ వలసెన్
దన వారి కెంత గలిగిన
దన భాగ్యమె తనకు గాక తథ్యము సుమతీ || (9)
అర్థము :-
ధనపతి కుబేరుడు తనకు దగ్గరివాడై ఉన్నప్పట్టికీ శివునికి భిక్షమెత్తుకోవాల్సి వస్తోంది. తన వాళ్లకి ఎంత ఉన్నప్పటికీ అది వారి సొత్తే కాని నీకు పనికిరాదు కదా ! ఇదే నిజము తెలుసుకో ఓ బుద్ధిమంతుడా !
నడువకుమీ తెరువొక్కట,
గుడువకుమీ శత్రునింట గూరిమి తోడన్,
ముడువకుమీ పరధనముల,
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ || (10)
అర్థము :-
(ఇతర మనుష్యులు లేని) రోడ్డు మీద ఒంటరిగా పోరాదు. శత్రువు ఇంట్లో ఇష్టంగా (జాగ్రత్త పడకుండా) తినకు. పరుల సొమ్ము దొంగిలించి దాచుకోకు. ఇతరుల మనస్సు నొచ్చే విధంగా మాటలాడరాదు ఓ మంచివాడా !
కులకాంత తోడ నెప్పుడు
గలహింపకు, వట్టి తప్పు ఘటియింపకుమీ,
కలకంఠి కంట కన్నీ
రొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ || (11)
అర్థము :-
చేసుకున్న భార్యతో ఎప్పుడూ కూడ వాదులాడకు (దెబ్బలాడకు). లేనిపోని నేరాలు మోపి నిందించకు. మధురభాషిణి, ఉత్తమురాలు అయిన స్త్రీ కంటి నుండి నీరు కారితే ఆ ఇంటిలో సిరి (లక్ష్మీదేవి) ఉండదు.
కూరిమి గల దినముల
నేరము లెన్నడును గలుగ నేరవు, మరి యా
కూరిమి విరసంబైనను
నేరములే దోచు చుండు నిక్కము సుమతీ || (12)
అర్థము :-
స్నేహము ఉన్నంత కాలము నేరములు అన్నవి ఉండవు ఆ స్నేహితుల మధ్యలో.
కానీ ఆ స్నేహము చెడినంతనే ప్రతీది నేరము లాగానే కనిపిస్తుంది. ఇది నిజము బుద్ధిమంతుడా !
వినదగు నెవ్వరు జెప్పిన,
వినినంతనే వేగపడక వివరింప దగున్,
కని కల్ల నిజము దెలిసిన
మనుజుడె పో నీతిపరుడు మహిలో సుమతీ || (13)
అర్థము :-
ఎవరు ఏం చెప్పినా వినడం మంచిదే. కాని వినగానే తొందర పడకుండా పరీక్షించి అందులోని నిజాలు, అబద్ధాలు తెలిసికొని మసలుకొనే వాడే అసలైన నీతిపరుడు, బుద్ధిమంతుడు అనిపించుకుంటాడు.
పిలువని పనులకు బోవుట,
గలయని సతి గతియు, రాజు గానని కొలువుం,
బిలువని పేరంటంబును,
వలువని చెలిమియును జేయ వలదుర సుమతీ || (14)
అర్థము :-
పిలువని పనులు చేయాలని చూడకు. మనస్సులు, మనోభావాలు కలవని స్త్రీ తో సమాగమము చెయ్యకు. రాజు చూడని కొలువు అంటే పాలకులు కానీ అధికారులు కానీ చూడని సేవ చెయ్యకు. అటువంటి సేవ వల్ల సంపాదన, గుర్తింపు ఉండదు. పిలువని పేరంటానికి వెళ్లి అవమానాల పాలు గాకుము. అలాగే కోరని స్నేహమును కూడ చేయకురా ఓ బుద్ధిమంతుడా !
సిరి తా వచ్చిన వచ్చును
సరళముగ నారికేళ సలిలము భంగిన్,
సిరి తా బోయిన బోవును
కరి మ్రింగిన వెలగ పండు కరణిని సుమతీ || (15)
అర్థము :-
సంపద వచ్చినప్పుడు కొబ్బరి కాయ లోనికి నీళ్లు ఎంత రమ్యంగా వస్తాయో అల్లాగే వస్తుంది . అదే సంపద వెళ్లిపోయేటప్పుడేమో క్షణం లో మాయమై పోతుంది ఏ విధంగా నైతే ఏనుగు మింగిన వెలగపండు లోని గుజ్జు మాయమై పోతుందో అల్లాగే. ఇది తెలుసుకో బుద్ధిమంతుడా !
బంగారు కుదువ బెట్టకు,
సంగరమున బారిపోకు సరసుడవైతే,
నంగడి వెచ్చము వాడకు,
వెంగలితో జెలిమి వలదు, వినరా సుమతీ || (16)
అర్థము :-
బంగారాన్ని తాకట్టు పెట్టకు. యుద్ధ రంగము నుండి పారిపోకు. సరైన, తెలివి గలవాడివి అయితే దుకాణము నుండి అప్పులు తెచ్చుకుని వాడుకోకు. మూర్ఖుడితో స్నేహము చెయ్యకు. వినరా ఓ బుద్ధిమంతుడా !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి