24, మే 2024, శుక్రవారం

హనుమాన్ చాలీసా - Hanuman Chalisa

 

హనుమాన్ చాలీసాఅంటే హనుమంతుని స్తుతి చేస్తూ అల్లబడిన 40 దోహాలు. దోహా అంటే రెండు వరుసల అల్లికలు (స్తోత్రములు లేదా పద్యములు).  

ఈ హనుమాన్ చాలీసా ని మహాకవి తులసీదాసు అవధీ భాషలో రచించెను. 

శ్రీ సీతారాములకు అత్యంత ప్రియ భక్తుడు హనుమంతుడు. అతను శ్రీరామునికి ఎంతో ప్రేమతో, నిస్వార్ధముగా సేవ చేసి తరించెను. ఎప్పుడూ చిరంజీవిగా ఉండేట్లా వరము పొందాడు.  


శ్రీ సీతారాముల కటాక్షము లభించాలంటే ముందుగా ఆంజనేయ స్వామిని స్తుతించి ప్రసన్నము చేసుకోవాలి. 


ఈ చాలీసా ని ముఖ్యంగా ప్రతి మంగళవారము భక్తులందరూ అంత్యత ప్రియంగా చదువుతుంటారు. అన్ని రోజులూ చదివితే ఇంకా మంచిది. 


ఇప్పుడు ఈ హనుమాన్ చాలీసా ని విశదీకరిస్తున్నాను. ప్రతీ పదాన్ని కూడ ఏ విధంగా పలకాలో ఆ విధంగానే రాసి మీకు సులువుగా చదువుకునెట్లా తెలియజేస్తున్నాను.  

హనుమాన్ చాలీసాకి ముందు వెనుక కూడ చదవాల్సిన కొన్ని స్తుతులు ఉన్నాయి. 

ముందు చదవాల్సిన స్తుతులు :


శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం, ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం, భజే వాయుపుత్రం భజే వాలగాత్రం, భజేహం పవిత్రం, భజే రుద్రరూపం, భజే బ్రహ్మతేజం|| 

ఓం నమో శ్రీ ఆంజనేయ స్వామినే నమః 
ఓం నమో శ్రీ సీతారామాయ నమః
 
ఆపదామహర్తారం దాతారం సర్వసంపదాం 
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాహ్యమం|| 

అసాధ్య సాధక స్వామిన్, అసాధ్యం తవ కింవదా? 
రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో || 


అతులిత బలధామం స్వర్ణ శైలాభ దేహుం 
దనుజవన కృశానుం  జ్ఞానినామగ్రగణ్యం 
సకల గుణ నిధానామ్ వానరాణాం అధీశం 
రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి|| 

గోష్పదీ కృత వారాశిం మశకీ కృత రాక్షసం 
రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం|| 

యత్రయత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్ 
భాష్పవారి పరిపూర్ణ లోచనమ్ మారుతిం నమత రాక్షసాంతకమ్|| 


ఓం శ్రీ గురుచరణ సరోజరజ నిజ మను ముకుర సిధారు 
వరణౌ రఘువర విమల యశు జో దాయకు ఫల చారు | 
బుధ్ధి హీనతను జానికౌ సుమిరౌ పవన కుమారు 
బల బుధ్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికారు ||  

హనుమాన్ చాలీసా - Hanuman Chalisa     


జయ హనుమాను, జ్ఞాన గుణ సాగరు, 
జయ కపీసు, తిహు లోక ఉజాగరు ||  
రామదూత, అతులిత బలధామ, 
అంజని పుత్ర, పవనసుత నామ || 
మహావీర, విక్రమ, బజరంగీ, 
కుమతి నివారు, సుమతి కే సంగీ || 
కంచన వరణ, విరాజు సురేశ, 
కానన కుండలు, కుంచితు కేశా || 
హాతు వజ్ర, ఔరు ధ్వజా విరాజై, 
కాంధే మూంజ జనేవూ సాజై || 
శంకర సువను, కేసరి నందను, 
తేజ ప్రతాపు, మహా జగు వందను || 
విద్యా వాన్, గుణీ అతి చాతురు, 
రామ కాజు కరిబేకో ఆతురు || 
ప్రభు చరిత్ర సునీబేకో రసియా, 
రామలఖను సీతా మను బసియా || 
సూక్ష్మ రూప ధరి సియహి దిఖావా, 
వికట రూప ధరి లంక జరావా || 
భీమ రూప ధరి అసుర సహారే ,
రామచంద్ర కే కాజు సవారే ||   
లాయి సజీవను లఖను జియాయే,
శ్రీ రఘు బీరు హరఖి ఉర లాగే || 
రఘుపతి కీన్హీ బహుత్ బడాయి,
కహా భరత సమ తుము ప్రియ భాయి || 
సహస వదను తుమరో యశు గావై,
అసు కహి శ్రీపతి కంఠు లగావై || 
సనకాదిక బ్రహ్మాది మునీశా,
నారద శారద సహితు అహీశా || 
యమ కుబేరు దిక్పాలు జహాతే,
కవి కోవిదు కహ్ సకై కహా తే ||  
తుమ ఉపకారు సుగ్రీవహి కీన్హా,
రామ మిలాయి రాజ పద్ దీన్హా || 
తుమరో మంత్రు విభీషను మానా,
లంకేశు భయే సబు జగు జానా ||
యుగ సహస్ర యోజను పరు భాను,
లీల్యో తాహి మధుర ఫల జాను || 
ప్రభు ముద్రికా మేలి ముఖ మాయి,
జలధి లాంఘి గయె అచరజు నాహి || 
దుర్గమ కాజు జగతుకె జేతే,
సుగమ అనుగ్రహు తుమరే తేతే || 
రామ ద్వారే తుమ రఖవారే,
హోతు న ఆజ్ఞా బిను పైఠారే ||
సబ సుఖ లహై తుమారీ శరణా,
తుమ రక్షకు కాహూకో డరనా || 
ఆపను తేజు సంహారో ఆపై,
తీనో లోకు హాంకతే కాంపై || 
భూత పిశాచ నికటు నహి ఆవై,
మహావీరు జబ నాము సునావై || 
నాశై రోగు హరై సబ పీడా,  
జపతు నిరంతరు హనుమతు బీరా || 
సంకట సే హనుమాను ఛుడావై,
మను క్రమ వచను జో లావై || 
సబ పర రాము తపస్వీ రాజా,
తినకే కామ సకల తుమ్ సాజా || 
ఔర్ మనోరథ జో కోయి లావై,
తాసు అమిత జీవన ఫల పావై || 
చారోమ్ జుగ ప్రతాప తుమారా,
హై ప్రసిద్హ జగత ఉజియారా || 
సాధు సంత కే తుమ రఖవారే,
అసుర నికందను, రామ దులారే || 
అష్ట సిధ్ధి నవనిధి కే దాతా,
అస వర దినిహు జానకీ మాతా || 
రామ రసాయను తుమరే పాసా,
సాదర తుము రఘుపతి కే దాసా || 
తుమరే భజను రాము కో భావై,
జనమ జనమ కే దుఖ బిసరావై || 
అంతః కాలు రఘుబర పుర జాయి,
జహాఁ జన్మ హరిభక్త కహాయి || 
ఔర్ దేవతా చిత్త న ధరయి,
హనుమత సేఇ సర్వ సుఖ కరయి || 
సంకట కటై, మిటై సబ పీడా,
జో సుమిరై హనుమతు బల బీరా || 
జయ్ జయ్  జయ్ హనుమాను గోసాయి,
కృపా కరహు గురు దేవ్ కినాయి || 
యహ శత బారు పాఠు కరు జోయి,
ఛూటహి బంది మహా సుఖ హోయి || 
జో యహ పఢీ హనుమాను చాలీసా,
హోఇ సిధ్ధి, సాఖీ గౌరీశా || 
తులసీదాస సదా హరి చేరా,
కీజై నాథ్ హ్రిదయ మహు డేరా || 

వెనుక చదవాల్సిన  స్తుతి 


ఓం పవన తనయు, సంకట హరను, మంగళ మూరతి రూపు, 
రామలఖను సీతా సహితు హ్రిదయ బసహు సుర భూపు ||

ఓం నమో శ్రీ ఆంజనేయ స్వామినే నమః | 
ఓం నమో శ్రీ సీతారామాయ నమః ||             
          

5, ఏప్రిల్ 2020, ఆదివారం

పంచముఖీ ఆంజనేయస్వామి - Panchamukhi Hanuman

మన హిందూ సంప్రదాయంలో ఆంజనేయస్వామికి ప్రముఖ స్థానమున్నది. శ్రీరాముని బంటుగా మరియు భక్తికి ప్రతీకగా ఆంజనేయుని మనం పూజిస్తాము. ఆయనని పూజిస్తే మన ఆపదలన్నింటి నుండి మనని రక్షిస్తాడనీ, శ్రీరామునికి  మనని దగ్గరగా చేరుస్తాడని మన నమ్మకము. 
 అంతే కాదు హనుమంతుని మనము ఐదు ముఖములతో కూడిన రూపంగా ఎక్కువగా ధ్యానిస్తుంటాము. 




పంచముఖీ ఆంజనేయస్వామి గుణగణాలు 


  • తూర్పు ముఖంగా మన వైపు చూస్తున్న స్వామి సకల పాపాలను హరించి మనకు చిత్తశుధ్ధి కలిగేట్లా చేస్తాడు. 
  • దక్షిణ ముఖంగా చూస్తున్న కరాళ ఉగ్రనరసింహ స్వామి శత్రుభయాన్ని పోగొట్టి మన అభీష్టములు ఫలించేట్లా చేస్తాడు. 
  • పడమటి ముఖంగా ఉన్న మహావీర గరుడస్వామి దుష్టప్రభావములు, మరియు హాని కలిగించే విష ప్రభావాల నుండి మనని రక్షించి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాడు.
  • ఉత్తర ముఖంగా చూస్తున్న లక్ష్మీ వరాహ స్వామి గ్రహముల చెడు ప్రభావముల నుండి మనని రక్షించి అష్టైశ్వర్యాలు కలిగిస్తాడు.
  • ఊర్ధ్వ ముఖంగా ఉండే హయగ్రీవస్వామి సకల విద్యలు, మరియు జయాన్ని, మంచి జీవన సహచరిని ప్రసాదిస్తాడు.


పంచముఖి అవతారము


రామాయణం లోని వర్ణనల ప్రకారము పంచముఖి ఆంజనేయస్వామి యొక్క అవతరణ ఈ విధముగా జరిగెను.

రామ, రావణ యుద్ధము జరుగుతున్నప్పుడు రావణుడు పాతాళ లోక అధిపతి యైన అహిరావణుని సాయము తీసికొనెను  అహిరావణుడు తన మాయలతో విభీషణుని రూపము దాల్చి రామ లక్ష్మణులను బంధించి పాతాళము లోనికి తీసుకుపోయెను. అప్పుడు ఆంజనేయస్వామి అహిరావణుని మృత్యు రహస్యమును తెలుసుకోగా తెలిసినది ఏమిటంటే అక్కడ పాతాళ లోకములో ఒక చోట రహస్యంగా ఐదు దిశలలో వెలుగుతున్న ఐదు దీపములను ఒకే సారి ఆర్పితే వాని మృత్యువు సంభవించును అని.

వెంటనే ఆంజనేయుడు పంచముఖి అవతారమెత్తి తన ముఖములను ఆ ఐదు దిశలకేసి పెట్టి తన నోటి గాలితో ఒకే సారిగా ఆ ఐదు దీపాలనీ ఆర్పేశాడు.

ఈ విధంగా పంచముఖి ఆంజనేయుని అవతరణ జరిగింది.

పంచతత్త్వముల సహాయంతో ఆంజనేయస్వామి లంకా యాత్ర వర్ణన 


కంబ రామాయణం లో పంచతత్త్వముల నుపయోగించి హనుమంతుని లంకా యాత్రను అతి అద్భుతంగా వర్ణించడం జరిగింది.

"వాయుపుత్రుడైన ఆంజనేయుడు (ఇక్కడ వాయువు తత్త్వము) వెంటనే సముద్ర జలాలను (ఇక్కడ జల తత్త్వము) ఆకాశ మార్గమున దాటి (ఇక్కడ ఆకాశ తత్త్వము), భూదేవి పుత్రిక సీతామాతను (ఇక్కడ భూ తత్త్వము) కలుసుకుని, లంకా నగరాన్ని మంటలలో దహించి (ఇక్కడ అగ్ని తత్త్వము) సీతామాత క్షేమ సమాచారమును రామునికి అందించెను".


ఇంతటి మహనీయుడైన శ్రీ ఆంజనేయస్వామిని ప్రతి మంగళవారము మరియు శనివారం కూడా భక్తితో మనస్ఫూర్తిగా పూజిస్తే అందరి ఆపదలను, కష్టములను తొలగించి వారికి సుఖ సంతోషములు అందచేస్తాడు. ఇంతే కాదు శ్రీ సీతారాముల కృపాకటాక్షములకు కూడ దగ్గర చేస్తాడు. 

4, ఏప్రిల్ 2020, శనివారం

గురు స్తుతి - ఆచార్య వందనము శ్లోకములు - వైష్ణవ సంప్రదాయం పద్దతిలో

ప్రతి రోజూ చేసుకునే పూజ మరియు విశిష్ట పూజలు ప్రారంభము మొదలెట్టే ముందు మనం ఈ ఆచార్య పరంపర మరియు గురువుల పూజతో మొదలు పెట్టాలి. 

మన తల్లి తండ్రులు, భగవంతుడు కూడా మనకు ఆచార్యులే అవుతారు. వీరందరిని తలుచుకుని స్తుతించి అటు పిమ్మట పూజని మొదలు పెట్టాలి. వీరు మనకు జన్మనిచ్చిన వారు, మనకు విద్య మరియు శాస్త్ర జ్ఞానమును ప్రసాదించి మనని ప్రాయోజకులనుగా తీర్చి దిద్దినవారు. అందుకని ప్రతిదినము వీరిని ధ్యానించి మన కృతజ్ఞతలను తెలుపుకొనుట మన కర్తవ్యము. అలా చేస్తే దేవునికి కూడా అత్యంత ప్రియంగా ఉంటుంది. 



వైష్ణవ సంప్రదాయం పద్దతిలో పూజ చేసే వారందరూ వారి గురువులు,  మరియు ఆచార్యులతో బాటు ఆళ్వార్లను (దేవుని పరమ భక్తులను) కూడా ముందుగా స్మరిస్తూ వారందరికీ నమస్కారములు సమర్పించి ఆ పిమ్మట పూజ మొదలు పెట్టడం ఆనవాయితీ.

మన ప్రస్తుత ఆచార్యులు, గురువుల నుండి మొదలు పెట్టి వారి పై తరముల వారిని కూడా మనకు తెలిసినంతవరకూ స్మరించి పూజించుకోవాలి. ఈ విధముగా పూజించుటకై మన పూర్వీకులు ఈ క్రింది శ్లోకములను (వైష్ణవ తనియలను) సృష్టించారు.

గురుస్తుతి -ఆచార్య వందనము 


శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవమ్
యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిమ్ || (1)

లక్ష్మీనాథ సమారంభామ్ నాథయామున మధ్యమామ్
అస్మదాచార్య పర్యన్తామ్  వందే గురుపరంపరామ్ || (2)

యోనిత్య మచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ
వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే |
అస్మద్గురో: భగవతోస్య దయైక సింధో:
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే || (3)

మాతాపితా యువత యస్తనయా విభూతి:
సర్వమ్ యదేవ నియమేన మదన్వయానాం |
ఆద్యస్య న: కులపతే: వకుళాభి రామం
శ్రీమత్తదంఘ్రి యుగళం ప్రణమామి మూర్ధ్నా: || (4)

భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ
శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ |
భక్తంఘ్రిరేణు పరకాల యతింద్రమిశ్రాన్
శ్రీమత్పరాంకుశ మునిం  ప్రణతోస్మి నిత్యమ్ || (5)

పై శ్లోకములకు అర్థములు:

1) మొదటి శ్లోకము:
ఈ శ్లోకము లో మనవాళ మాముని కి నమస్కరించడం జరిగింది. ఆయన ఒక గొప్ప భక్తుడు మరియు ముని కూడ.
రామానుజాచార్యులు వైష్ణవ మత ఉద్ధారము మరియు ప్రచారము చేయుచు ప్రజలకు వెలుగు మార్గము చూపించే కార్యక్రమాలలో నిష్టగా పనిచేయుచు 120 ఏళ్ళకి శరీరము త్యజించగా ఆ కార్యక్రమాన్ని ఇంకా ముందుకి సాగించుటకై మనవాళ మాముని అవతరించెను. ఈయన తన భక్తి జ్ఞాన రసములతో అనేక ఉపదేశములు చేయుచు భగవంతుని సేవలో మనస్ఫూర్తిగా విలీనమై ఉంటుండెను.
ఈయన భక్తి నిష్ఠలకు స్వయంగా శ్రీ రంగనాథస్వామి మిక్కిలి సంతోషించి తబ్బిబ్బు అయిపోయెను.
స్వయంగా ఆ రంగనాథ స్వామియే ఈ శ్లోకము రాసి ఉండవచ్చునని ఆయన భక్తులు మరియు శిష్యుల నమ్మకము.

శ్లోకార్థము:
శ్రీ శైలేశ దయాపాత్రుడు (ఇక్కడ శ్రీ శైలేశుడు ఆయన గురువు మరియు శ్రీశైలేశ నివాసి అయిన తిరువాయిమొళి పిళ్ళై). శ్రీశైలేశుడు అంటే మన దైవమైన శ్రీ రంగనాథ స్వామి కూడా.

అందుచేత ఇక్కడ అర్థము ఏమిటంటే మనవాళ మాముని తన గురువైన తిరువాయిమొళి పిళ్ళై కు అల్లాగే శ్రీ రంగనాథ స్వామికి కూడా దయాపాత్రుడు.  మఱియును జ్ఞానము భక్తి విషయములలో మిక్కిలి దిట్ట. అంతే కాదు. ఆయన యతీన్ద్రులైన శ్రీ రామానుజాచార్యులకు కూడ అతి సన్నిహితుడు. అట్టి రమ్యజామాతృ ముని కి నేను నమస్కరించుచున్నాను.

మనవాళ మాముని కి ఇంకో పేరు రమ్యజామాతృ ముని అని కూడా ఉంది.
ఇక్కడ ఈ శ్లోకాన్ని రాసినది భగవంతుడే కనుక ఆయనే నమస్కారము చేసినట్లుగా మనము అనుకోవచ్చును.

అంటే ఈ విధంగా ఆ దేవుడే మనవాళ మాముని యొక్క గొప్పతనము మనకు తెలియచేసినట్లుగా మనము అనుకోవచ్చును. అందుకే ఈ శ్లోకాన్ని మనము ముందుగా చదివి ఆ మునికి మన దాసోహములు అర్పించుకుంటున్నాము.


2) రెండవ శ్లోకము:
వైష్ణవ ఆచార్యులు మరియు భక్తుల నమ్మకము ప్రకారము మన మొదటి గురువు స్వయంగా ఆ పరంధాముడైన శ్రీమన్నారాయణ స్వామియే. ఆయన మొదటిగా గురుమంత్రమును (అంటే తిరుమంత్రము) శ్రీ బదరీనారాయణ స్వామికి ఆ తరువాత విష్ణు రూపంలో శ్రీ మహాలక్ష్మికి  ఉపదేశించారు. కాబట్టి మనము ఆయనతో మొదలు పెట్టి మధ్యలోనున్న పలువురు గురువులతో బాటుగా మన ప్రస్తుత గురువు వరకు అందరికీ నమస్సులు అర్పించుకోవాలి.

శ్లోకార్థము:

లక్ష్మీనాథులైన ఆ పరంధామునితో మొదలిడి, మధ్యలో ఉన్న నాథముని మఱియును యామునాచార్యుల క్రమము వరకూ, ఇంకా ఆ తరువాతి గురువులందరితో పాటుగా ప్రతి ఒక్కరికీ, దాసోహములు సమర్పించుతూ, నా ప్రస్తుత ఆచార్యులకు కూడ నేను నమస్కరించు చున్నాను. 

3) మూడవ శ్లోకము:
ఈ శ్లోకంలో మన శ్రీవైష్ణవ పునాదికర్త మఱియును ఆచార్యులును అయిన శ్రీ రామానుజాచార్య మహాపురుషునికి ప్రణామములు సమర్పిస్తున్నాము. 
(ఆ మహావిష్ణువు శయ్య అయిన ఆదిశేషువే వైష్ణవ మత పునరుద్ధరణ కోసము రామానుజాచార్యులుగా అవతరించెనని చెప్పుకుంటారు).

శ్లోకార్థము:

ఏ మహాపురుషుడైతే స్వయంగా ఆ పరంధాముని పాదపద్మములనే తన ప్రీతి భాగ్యముగా మఱియును సంపద గాను భావించి తక్కిన వాటినన్నిటినీ తృణప్రాయముగా విసర్జించెనో, ఎవరైతే తన మనస్సు అంతయు దయతో నిండిన సముద్రము వంటివారో, అట్టి నా పరమ పూజ్య గురువైన శ్రీ రామానుజాచార్యులు వారి పాదములను ఆశ్రయించి శరణు కోరుచున్నాను.

4) నాలుగవ శ్లోకము:
నాల్గవ శ్లోకములో నమ్మాళ్వార్ ధ్యానము చేయబడుతోంది.
నమ్మాళ్వార్ గారు భగవంతునికి అతి సన్నిహితుడు మరియు ప్రీతిపాత్రుడైన 12 మంది ఆళ్వార్లలో ప్రముఖ స్థానము పొందినవారు. కలియుగ ప్రారంభములో ఈయన అవతరించి 32 ఏళ్ళు భగవంతుని సేవ చేసి ఆయన సాన్నిధ్యము చెందెను.

ఆచార్య పరంపరలో మొదటి స్థానము భగవంతుడిది. పిమ్మట లక్ష్మి దేవి, బదరీనారాయణుడు/విక్ష్వక్షేనుడు, ఆ తరువాతి స్థానము ఈ నమ్మాళ్వార్ గారిదే.

శ్లోకార్థము:

ఎవరి పాదములైతే పొగడపూవు వాసనలు విరజల్లుచు తల్లి తండ్రుల ప్రేమలు అందించునో, ఏ పాదములైతే ఈ ప్రాపంచిక బంధములు మరియు పాపకర్మలతో కూడిన సముద్రము నుండి (ఏ విధముగా అయితే ఒక సుపుత్రుడు తన తల్లి తండ్రుల కర్మలు చేసి వారికీ మోక్షము చేరే అవకాశము కల్పిస్తాడో) విముక్తిని ప్రసాదించి మోక్షమనే ఒడ్డుకు చేర్చేందుకై తహ తహ లాడుచుండునో, ఏ పాదములైతే మనకు మరియు మన రాబోవు సంతానములకు కూడ సుస్థిరమైన సుఖ శాంతులను ప్రసాదించునో అట్టి పాదయుగ్మములకు నేను శిరసా ప్రణామములు సమర్పించుకుంటున్నాను.

5) ఐదవ శ్లోకము:
అయిదవ శ్లోకంలో వైష్ణవ మతాన్ని తమ భక్తి, ప్రేమ రసములతో వ్యాపింపజేసిన 12 మంది వైష్ణవ ఆళ్వార్ లనూ వారి జన్మ కాలానుగుణంగా పేర్కొని వారికి దాసోహములు సమర్పించడం జరుగుతోంది.

శ్లోకార్థము:

ఈ శ్లోకం ద్వారా 12 మంది ఆళ్వార్ల పేర్లు చెప్పుతూ వారికి, మరియు శ్రీ రామానుజాచార్యుల వారికీ కూడ  ప్రతిదినము నమస్సులు అర్పించెదమని వేడుకుంటున్నాము.

భూతం = భూత యోగి (పూదత్త ఆళ్వార్)
సరశ్చ = సరో యోగి (పొయిగై ఆళ్వార్)
మహదాహ్వయ = మహా యోగి (పేయాళ్వార్)
భట్టనాథ = భట్టనాథులు (పెరియాళ్వార్ అనగా విష్ణుచిత్తులు)
శ్రీ = గోదాదేవి (ఆండాళ్)
భక్తిసార = తిరుమళిశైయాళ్వార్
కులశేఖర = కులశేఖరాళ్వార్
యోగివాహాన్ = తిరుప్పాణాళ్వార్ (మునివాహన)
భక్తఅంఘ్రిరేను = తొండరప్పొడియాళ్వార్ (విప్రనారాయణ)
పరకాల = తిరుమంగైయాళ్వార్ (పరకాల ముని, కలివైరి)
యతీన్ద్ర = రామానుజాచార్యులు (ఈయన ఆళ్వార్ కాదు. మన మొదటి గురువు)
మిశ్రాన్ = మిశ్ర కవి లేదా మధురకవి ఆళ్వార్
పరాంకుశ ముని = నమ్మాళ్వార్  (శఠకోపన్)

ఈ పై వారందరినీ కూడా వరుస క్రమములో ధ్యానిస్తూ నిత్యమూ ప్రతి రోజూ కూడా నమస్సులు చెప్పుకుంటూ మనము పూజ మొదలెట్టుకోవాలి. ఇది ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయం లోనిది. 

 

18, మార్చి 2020, బుధవారం

COVID-19 కరోనా వైరస్ వ్యాధి లక్షణములు- జాగ్రత్తలు

కరోనా వైరస్ వ్యాధి

COVID-19 అనేది కరోనా వైరస్ వల్ల వచ్చే వ్యాధి పేరు.

కరోనా వైరస్ ఒక విధమైన సూక్ష్మ జీవి లాంటిది. అందులో అనేక వర్గాలు ఉన్నాయి. ప్రస్తుతము ప్రపంచము అంతటా వ్యాపించి భయపెడుతున్నది ఒక విధమైన సూక్ష్మ కణము ఏదైతే జంతువుల నుండి మనుషులకి సంక్రమించే వ్యాధి అయి ఉండవచ్చునని వైజ్ఞానికుల అనుమానము. ఇది చైనా లో మొదటిసారిగా 2019 చివరి నెలలలో గుర్తించబడింది అనీ అక్కడినుండి ఇతర దేశాలకు వ్యాపించిందనీ అనుమానము. అందుకని ఈ వ్యాధి పేరు కరోనా వైరస్ వ్యాధి- 2019 అని పేరు పెట్టారు.


COVID-19 లక్షణములు


కరోనా వైరస్ వ్యాధి 2019 సోకిన వ్యక్తి లక్షణములు ఈ క్రింద చెప్పబడిన విధముగా ఉండవచ్చునని వైద్య శాస్త్రజ్ఞుల అభిప్రాయము.


  • ఏ వ్యక్తి అయితే ఈ వ్యాధి సోకడానికి ముందటి 14 రోజులలో విదేశ యాత్ర చేసి ఉండునో 
  • ఏ వ్యక్తి అయితే ఈ వ్యాధి సోకడానికి ముందటి 14 రోజులలో వ్యాధి సోకిన వ్యక్తికి సన్నిహితముగా ఉన్నాడో 
  • ఏ వ్యక్తి అయితే పైన పేర్కొన్న వారితో కొంత సంపర్కము కలిగి, జ్వరము లేక ఊపిరి బాధలతో (ఊపిరి పీల్చుకోడములో గాని, దగ్గూ జలుబులతో) భాధ పడటం గాని జరుగుతోందో 
  • సంఘ సేవలో కాని సమాజ సేవలో కానీ తిరుగు సమయంలో పైన చెప్పబడిన వ్యక్తులతో సంపర్కము ఏర్పడి  శ్వాసకోశ బాధలతో ఉన్నచో 
  • సంఘ సేవ, వైద్య సేవలలో తిరుగు వ్యక్తులు ఈ పైన చెప్పబడిన ఏ ఒక విధమైన వర్గం లోకి చెందిన వ్యక్తితో నైనా సన్నిహిత సంపర్కములో ఉండి ఉన్నట్లయితే 

పైన పేర్కొన్న వారందరూ కూడ వెంటనే తమ వైద్యులని కలుసుకుని ఈ వ్యాధికి పరీక్ష చేయించు కోవాలి. ఆ డాక్టర్ చెప్పిన విధముగా తప్పక చేయాలి.

సన్నిహిత సంపర్కము (Close Contact Meaning) 

సన్నిహిత సంపర్కము అనగా దగ్గరలో ఉండుట. 
ఈ వ్యాధి లక్షణములు కలిగిన మనిషికి 3, 4 అడుగుల దూరములో ఉంటే అది సన్నిహిత సంబంధము అవుతుంది. లేదా అట్టి వ్యక్తిని తాకినా లేదా అతని వస్తువులను ముట్టుకున్నా కూడ అది సన్నిహిత సంపర్కమే అవుతుంది.  కాబట్టి అటువంటి వారందరూ కూడా ఈ పరీక్ష చేయించుకోవాలి తప్పకుండా. 

COVID 19 తీసుకొన వలసిన జాగ్రత్తలు 

  • ఈ వ్యాధి నుండి కాపాడుకొనుటకై తరచుగా చేతులు కడుక్కొన వలయును. ముఖ్యంగా బయటి నుండి ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడల్లా. సబ్బుతో కడుక్కుంటే ఇంకా మంచిది. 
  • నోటికి, ముక్కుకి ఏదైనా కప్పుకుని బయటకు వెళ్ళుట మంచిది. కనీసము రుమాలు పెట్టుకో వలయును. 
  • దగ్గినా, తుమ్మినా రుమాలు అడ్డు పెట్టుకుని చేయవలెను. 
  • కన్ను, ముక్కు, నోరు వీటిని ముట్టుకోకుండా ఉంటె మంచిది. లేదంటే మీ చేతి క్రిములు వాటికి పట్టుకునే ప్రమాద ముండవచ్చును. 
  • బయటి మనుషులకి 3, 4 అడుగుల దూరంగా ఉంటే మంచిది. అంటే సన్నిహిత సంపర్కము లేకుండా చూసుకోవాలి.  
  • ఏవైనా పైన చెప్పబడిన కానీ ఇంకేమైనా కానీ అనారోగ్య సమస్యలుంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆయన చెప్పినట్లు ఉండాలి. చేయాలి కూడ. 
  • మానసిక ఆవేదనలకు, లేని పోని భయాలకు గురి కాకుండా సమయాన్ని సదుపయోగం చేసుకుంటూ, ఇతరులకు ధైర్యము చెప్పుతూ ప్రశాంతముగా ఉండాలి. 

9, జూన్ 2019, ఆదివారం

పురుషసూక్తము - సృష్టి రచనా రహస్యము - The Creation Story

పురుషసూక్తము ఆదిదేవుని గురించి మఱియును సృష్టి 
రచనా విధానము గురించియు మనకు తెలుపుతున్నది. 
ఇది ఒక స్తోత్ర కావ్యము లాంటిది.



ఆ పరమపురుషుడు మఱియును సమస్త లోకాలకు మూల పురుషుడైన పరబ్రహ్మము యొక్క ప్రశస్తిని మరియు సృష్టి ఏ విధముగా మొదలు అయి ఎలా వృద్హి చెందినదో ఆ సంపూర్ణ  విధానము ఈ పురుషసూక్తములో మిక్కిలి విశదముగా వివరించబడినది.



ఆ పరంధాముడు ఏ విధముగా బ్రహ్మాండ మందు ఆవిర్భవించెనో మఱియును ఈ అద్భుతమైన సృష్టి కార్యమును ఏ విధంగా ఒనరించెనో అన్ని సంగతులూ కూడా ఈ పురుషసూక్తములో చక్కని శ్లోకముల ద్వారా పూర్తిగా చెప్పబడింది.

పురుషసూక్త పఠనము అన్ని గొప్ప పూజలు మఱియును యజ్ఞ సమయములందును యధావిధిగా చేయబడుట మనము ఎప్పుడూ చూస్తుంటాము. దీని పఠనము చేసినచో అన్ని కార్యములు, పూజలు, యజ్ఞములూ కూడా ఏ విధమైన ఆటంకములు, విఘ్నాలు లేకుండా సఫలమగును. అంతే కాక మనకు ఆ పరంధాముని ఆశీస్సులను ప్రసాదించును.



పురుష సూక్తము లో రెండు విభాగములు ఉన్నాయి.

మొదటి భాగము సృష్టి రచనా విధానము గురించి తెలుపుతోంది. ఇందులో 18 శ్లోకములు ఉన్నవి.

రెండవ భాగము ఆ పరమపురుషుని మరియు విరాట్పురుషుని యొక్క ఉనికిని, స్వభావములను విశదీకరిస్తోంది. ఇందులో 6 శ్లోకములు ఉన్నాయి.

పూర్తి అయినతరువాత చివరన ఇచ్చిన ఒక శాంతి పాఠము కూడా పఠనము చేయుట మన సాంప్రదాయము మరియు శుభకరము కూడ.

1. పురుష సూక్తము (మొదటి భాగము)


1. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సమస్రపాత్ |
స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠ ద్దశాజ్ఞులమ్ ||

(పురుషుడు - అంటే భగవంతుడు లేదా పరమాత్మ - వేయి శిరములు కల్గినవాడు. అనగా ఊహకు మించిన వాడు. అలాగే వేయి  కనులు, వేయి పాదములు కలిగినవాడు. భూమితో కూడిన సమస్త విశ్వమును మించి ఇంకా ఎక్కువ విస్తీర్ణము కలవాడు. అనగా సమస్త విశ్వము కన్నా అధికమైన ఆకారమున్నవాడు. ఇక్కడ తాత్పర్యమేమిటంటే మన కొలతలకు, ఊహకు కూడ మించినవాడు అని.)  

2. పురుష ఏవేదమ్ సర్వమ్ య ద్భూతం యచ్చ భవ్యమ్ |
ఉతామృతత్వ స్యేశానః య దన్నే నాతిరోహతి ||

(ఆ పరమాత్ముడే సమస్త వేదములును మరియు భూత, భవిష్య, వర్తమానములును. ఆయనే అమరత్వానికి అధిపతి మరియును సమస్త ఆహారములకు అధిపతి.)

3. ఏతావా నస్య మహిమా ఆతో జ్యాయాగంశ్చ పూరుషః |
పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి ||

(ఆయన మహిమ అటువంటిది. ఆయన ఉనికి మన కల్పనకు అతీతమైనది. మనకు కనపడు ఈ సమస్త జీవలోకం అయన ఒక పాదము మాత్రమే. అంటే నాలుగవ భాగము మాత్రమే. మిగతా మూడు భాగాలు కూడ మృత్యువు లేని స్వర్గలోకము.)

4. త్రిపా దూర్ధ్వ ఉదై త్పురుషః పాదో స్యేహాభవాత్పునః |
తతో విష్వ జ్వ్యక్రామత్ సాశనానశనే అభి ||

(ఆయన లోని మూడు భాగములు పైకి వ్యాపించగా ఒక భాగమును మాత్రము క్రిందికి వ్యాపింపచేసెను. ఆ భాగము మరల సమస్త జీవములను జీవము లేని స్థాణువులనూ కూడా ఆక్రమించెను.) 

5. తస్మాద్విరాడజాయత విరాజో అధిపూరుషః |
స జాతో త్యరిచ్యత పశ్చాద్భూమి మధో పురః ||

(అటువంటి ఆయన నుండి విరాట్ పురుషుడు ఉద్భవించెను. విరాట్ పురుషుని నుండి పురుషుడు అనగా జీవుడు ఉద్భవించెను. పిమ్మట ఆ పురుషుడు తనను దేవతలు, మనుష్యులు, వృక్షములుగా ఆ విరాట్ పురుషుని నుండి వేరు చేసుకొనెను. ఆ తర్వాత భూమి, పాతాళములు  ఉద్భవించెను.)

6. యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞ మతన్వత |
వసన్తో అస్యాసీ దాజ్యమ్ గ్రీష్మ ఇధ్మః శర ద్ధవిః ||

(ఆ పురుషుడి ఉనికితో (ఆయనే కర్తగా భావించి) దేవతలు యజ్ఞము చేసినపుడు వసంతాన్ని ఆజ్యముగా పోసి, గ్రీష్మమునే సమిధలుగా  మంటలు లేపి, శరత్ కాలాన్ని నైవేద్యముగా సమర్పించారు.)

7. సప్తాస్యాసన్ పరిధయః త్రిస్సప్త సమిధః కృతాః |
దేవా యద్యజ్ఞం తన్వానాః అభధ్నన్ పురుషం పశుమ్ ||

(ఆ పురుషుని చుట్టూ ఏడు సరిహద్దులు అనగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారం, బుద్ధి తత్త్వములతో చుట్టేసి, ఇరువదిఒక్క సమిధలతో ఆ దేవతలు యజ్ఞము చేసారు. యజ్ఞ పశువుగా ఆ పురుషుని బంధించారు.)

8. తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్ పురుషం జాత మగ్రతః |
తేన దేవా అయజన్త సాధ్యా ఋషయశ్చ యే ||

(ఆ విధముగా మొదట జన్మించిన పురుషుని ఎవరైతే యజ్ఞానికి శ్రేష్టులో సంప్రోక్షించి దేవతలు, సిద్ధిసాధకులు, ఋషులు సృష్టి యజ్ఞమును  జేసిరి.) 

9. తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభ్రుతం పృషదాజ్యమ్ |
పశూమ్నాన్  శ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే ||

(పిమ్మట ఆ సృష్టి యజ్ఞము నుండి ఉద్భవించెను పెరుగు, నెయ్యి. ఆ తర్వాత సృష్టించబడినవి యజ్ఞ పశువులు, గాలిలో ఎగిరే పక్షులు, అడవి మృగాలు, గ్రామాలలోని జంతువులు.) 

10. తస్మా ద్యజ్ఞాత్ సర్వహుతః ఋచః సామాని జజ్ఞిరే |
ఛందాగంసి జజ్ఞిరే తస్మాత్ యజు స్తస్మా దజాయత ||

(ఆ సృష్టి యజ్ఞమునుండే ఋగ్వేదము, సామవేదముల మంత్రములు, గాయత్రీ మంత్రము మొదలగు సకల చ్ఛందములు, మరియు యజుర్వేద మంత్రములు కూడ ఉద్భవించెను.)

11. తస్మా దశ్వా అజాయన్త యే కే చోభయా దతః |
గావో హ జజ్ఞిరే తస్మాత్ తస్మా జ్జాతా అజావయః ||

(ఆ యజ్ఞమునుండే అశ్వములు మరియు ఏక దంత వరుస అలాగే రెండు దంత వరుసలు గల్గిన జంతువులూ సృష్టించబడాయి. ఆవులు, మేకలు, గొర్రెలు పుట్టాయి.)

12. యత్పురుషం వ్యదధుః కతిధా వ్యకల్పయన్ |
ముఖం కిమస్య కౌ బాహూ కావూరూ పాదా వుచ్యేతే ||

(ఎప్పుడైతే దేవతలు ఆ మహా పురుషుని సృష్టించారో అప్పుడు ఆయన రూపకల్పనని ఏ విధంగా తీర్చిదిద్దారు? ముఖం ఏ ఆకృతి తీసుకున్నది? చేతులు ఏవి? తొడలు, పాదాలు ఏమిటయ్యాయి?) 

13. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూ రాజన్య కృతః |
ఊరూ తదస్య యద్వైశ్య పద్ భ్వాగం శూద్రో అజాయత ||

(బ్రాహ్మణులు ముఖమయ్యారు. బాహువులు క్షత్రియులయ్యారు. తొడలనుండి వైశ్యులు అల్లాగే పాదాలనుండి శూద్రులు రూపొందారు.)

14. చంద్రమా మనసో జాతః చక్షోః సూర్యో అజాయత |
ముఖా దింద్రశ్చాగ్నిశ్చ ప్రాణా ద్వాయు రజాయత ||

(మనస్సు నుండి చంద్రుడు పుట్టాడు. కనులనుండి సూర్యుడు, ముఖము నుండి ఇంద్రుడు మరియు అగ్ని ఉద్భవించారు. ప్రాణము అనగా ఊపిరి నుండి వాయువు ఉద్భవించెను.)

15. నాభ్యా ఆసీ దంతరిక్షమ్ శీర్షణో ద్యౌః సమవర్తత |
పద్ భ్యాం భూమి ర్దిశః శ్రోత్రాత్ తథా లోకాన్ అకల్పయన్ ||

(నాభి నుండి అంతరిక్షం అంటే ఆకాశము వచ్చింది. శిరము నుండి స్వర్గలోకము వెలువడెను. పాదములనుండి భూమి, చెవుల నుండి దిక్కులు వచ్చెను. ఈ విధముగా ఆ పురుషుని సంకల్పమాత్రాన సమస్త లోకము వెలువడెను.)

16. వేదాహ మేతం పురుషం మహాన్తమ్ ఆదిత్యవర్ణం తమసస్తు పారే |
సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామానికృత్వా భివదన్ యాదాస్తే ||

(నేను జ్ఞానము పొందాను ఆ పురుషుని గురించి ఎవరైతే మహానుభావుడు, అలాగే సూర్యుని వలె దేదీప్యమానుడు, ఈ కనపడే ప్రకృతికి భిన్నమైనవాడు, మరియు సకల ప్రాణులను సృష్టించి, నామకరణము చేసి, వాటిలో ప్రవేశించి వాటిని నడిపించేవాడు కూడ ఆయనే అని తెలుసుకున్నాను.)

17. ధాతా పురస్తా ద్య ముదాజహార శక్రః ప్రవిద్వాన్ ప్రదిశ శ్చతస్రః |
తమేవం విద్వా నమృత ఇహ భవతి నాన్యః పన్థా ఆయనాయ విద్యతే ||

(బ్రహ్మ దేవుడు ఆ పురుషుని తన సృష్టికి  మూల కారణముగా ఎరిగెను. వేయి కళ్ళు ఉన్న ఇంద్రుడు కూడా ఆ మహాపురుషుని మహిమలను తెలిసికొని నాలు దిక్కులా చాటెను. ఆయన మహిమను తెలుసుకున్నవాడు ఈ జన్మలోనే ముక్తి పొందురని కూడ తెలుసుకున్నారు. ఇంత కన్నా వేరే మార్గము లేదు కూడ.) 

18. యజ్ఞేన యజ్ఞ మయజన్త దేవాః తాని ధర్మాణి ప్రథమా న్యాసన్ |
తేహ నాకం మహిమాన స్సచన్తే యత్ర పూర్వే సాధ్యా స్సంతి దేవాః ||

(ఈ విధముగా దేవతలు మానస యజ్ఞము యొక్క గొప్పతనమును తెలుసు కున్నారు. ఈ యజ్ఞ కర్మలు తక్కిన కర్మల కంటే శ్రేష్ఠమైనవిగా గణించబడినవి. ఏ విధముగా అయితే సాధ్యోపాసకులు పరిపూర్ణ జ్ఞానముతో తిన్నగా వైకుంఠంలో నివసించుతారో అదే విధముగా ఈ శ్రేష్టమైన మానస యజ్ఞ కర్మలను అనుసంధించేవారు కూడా ఆ లోకములోనికి ప్రవేశము పొందుతారు.)

పురుష సూక్తము (రెండవ భాగము)


అద్భ్య సంభూతః పృథివ్యై రసాచ్చ | విశ్వకర్మణః సమవర్తతాధి | 
తస్య త్వష్టా విదధద్రూపమేతి | తత్పురుషస్య విశ్వమా జానమగ్రే || (1)

(జలము మరియు పృథ్వి యొక్క సారము నుండి బ్రహ్మాండము ఉద్భవించెను. అటు పిమ్మట ఆ బ్రహ్మాండము యొక్క సృష్టికర్త మరియు యజమాని అయిన విరాట్ పురుషుడు తన ఉనికిని సకల లోకములలోను నింపుకొనెను.)

వేదాహమేతం పురుషం మహాన్తమ్ | ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ | 
తమేవం విద్వానం అమృత ఇహ భవతి | నాన్య పంథా విద్యతేయనాయ || (2)

గమనిక:- పైన ఇవ్వబడిన 16వ శ్లోకము ఈ రెండవ శ్లోకము వేరు వేరు అని గమనించగలరు.

(నేను ఎరిగితిని ఈ పురుషుడు ఎవరైతో బృహద్రూపుడు మరియు సూర్యుని వలె తేజోమయుడై అంధకారమును జయించువాడో. ఇతని సకల జ్ఞానమును ఎరింగినవారు మృత్యువుని ఈ జన్మలోనే జయిస్తారు. అంతకంటే గొప్పదారి వేరే ఏమీ లేదు కూడా మోక్షానికి.)

ప్రజాపతిశ్చరతి గర్భే అంతః | అజాయమానో బహుథా విజాయతే |
తస్య ధీరా పరిజానన్తి యోనిమ్ | మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః || (3)

(ఆ పరమ పురుషుడు జన్మించకుండానే ఈ ప్రపంచములో అన్ని విధములుగా వ్యాపించుచున్నాడు. ఈ ఉనికి యొక్క మూలాన్ని జ్ఞానులు పరీక్షించి తెలుసుకుంటున్నారు. ఆ విధంగా మరీచి వంటి గొప్ప జ్ఞానులుగా కాగలుగుతున్నారు.)

యో దేవేభ్య: ఆతపతి | యో దేవానాం పురోహితః |
పూర్వో యో దేవేభ్యో జాత: | నమో రుచాయ బ్రాహ్మయే || (4)

(ఎవరైతే దేవతల యందు ప్రజ్వరిల్లుతూ ఆ దేవతలకు పురోహితునిగా శోభిల్లుతూ దేవతలందరి కంటే ముందుగా ఉనికిలో ప్రవేశించెనో అట్టి ఆ పరమ పురుషునికి నా నమోస్సులు.)

రుచమ్ బ్రాహ్మమ్ జనయంతః | దేవా అగ్రే తదబ్రువన్ |
యస్తు వేవమ్ బ్రాహ్మణో విద్యాత్ | తస్య దేవా అసన్ వశే || (5)

(ఆ పరబ్రహ్మ స్వరూపమును ఎఱిగినవారై దేవతలు ఆ జ్ఞానమును వ్యాపింపజేసిరి. అల్లాగే ఆ జ్ఞానమును ఇచ్చే ముందు ఇలా చెప్పారు.  ఎవరైతో ఆ జ్ఞానమును తెలిసికొని మసలుకుందురో వారికి దేవతలు కూడా తోడుగా నిలబడి ఉంటారు అని .)

హ్రీశ్చతే లక్ష్మిశ్చ పత్నౌ | అహోరాత్రే పార్శ్వౌ |
నక్షత్రాణి రూపమ్ | అశ్వినౌ వ్యాత్తమ్ ||

ఇష్టమ్ మనీషాణ | అముమ్ మనీషాణ | సర్వమ్ మనీషాణ || (6)

(వినయమునకు దేవి అయిన హ్రీ దేవి , లక్ష్మీదేవి ఆయనకు భార్యలు. పగలు రేయిలు పార్శ్వములు. ఆయన ఆకారము నక్షత్రమండలము. ఆయన  వాక్కు అశ్వినీ  దేవతల వంటిది.)

(ఓ పరమాత్మా మా అభీష్టములు ప్రసాదించండి. ఆనందములు ప్రసాదించండి. మీ సర్వస్వమును  ప్రసాదించండి.)

శాంతి పాఠము

ఓం  తచ్ఛం యోరావృణీమహే | గాతుమ్ యజ్ఞాయ | గాతుమ్ యజ్ఞపతయే | 
దేవీస్వస్తిరస్తు నః | స్వస్తిర్మానుషేభ్యహ్ | ఊర్ధ్వం జిగాతు భేషజమ్ | 
శం నో అస్తు ద్విపదే | శం చతుష్పదే | 
ఓమ్ శాంతిః శాంతిః శాంతిః ||

(సమస్త జీవరాశుల కళ్యాణము కొరకై యజ్ఞములు వర్ధిల్లు గాక! యజ్ఞపతి అయిన పరమాత్మ వర్ధిల్లు గాక!
దేవతలు సుఖముగా ఉందురు గాక! మానవులు సుఖమొందు గాక! ఔషదముల మరియు సకల వృక్షములు కూడా ఏపుగా పైకి ఎదుగు గాక !
ద్విపాదములున్న జీవులు కూడ సుఖమొందురు గాక! నాలుగుపాద జీవులు కూడ వర్ధిల్లు గాక!
అంతటా సుఖశాంతులు ప్రజ్జ్వరిల్లు గాక!)