14, సెప్టెంబర్ 2026, సోమవారం

Madhuraashtakam Lyrics - మధురాష్టకం



"మధురాష్టకం" అనబడే ఎనిమిది శ్లోకాల సంపుటి (శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణ గానము చేస్తూ) శుద్ధ అద్వైతాచార్యులైన శ్రీ వల్లభాచార్య స్వామివారిచే రచించబడినది. ఈయన గొప్ప కృష్ణ భక్తులు. పుష్టిమార్గ సంస్థాపకులు. కృష్ణభక్తిని ఒక నూతన భావముతో మలిచి శ్రీనాథరూపము సృష్టించి శ్రీనాథ భక్తి మార్గము స్థాపించిరి. అదియే పుష్టిమార్గమని పేరు పొందెను. 
 

ఈయన ఇప్పటి ఛత్తీష్ గఢ్ లోని చంపారణ్యము లో ఒక తెలుగింట జన్మించిరి. వారణాసిలో చదువు, అధ్యాపక వృత్తి, పుష్టిమార్గ ప్రచారము జరిపెను. కాని కృష్ణ భక్తులై ఆయన జన్మభూమితో  అవినాభావ సంబంధము పెట్టుకుని, ఏడాదిలో నాలుగు నెలలు ఆ ప్రాతాలలోనే గడుపుట వలన, బ్రజ భూమి (కృష్ణ జన్మభూమి) వాస్తవ్యులుగా పరిగణింపబడుతారు. ఈయన భక్తి కాలమందు నివసించెను. ( నివాస కాలము: 1479 నుండి 1531వరకు).



మధురాష్ఠక శ్లోకములు అర్థములతో సహా:



అధరం మధురం వదనం మధురం

నయనం మధురం హసితం మధురం | 

హృదయం మధురం గమనం మధురం

మధురాధిపతేరఖిలం మధురం || (1)

అర్థము:

పెదవులు తీపి, ముఖమూ తీపి, కన్నులు తీపి, మందహాసమూ తీపి, హృదయమూ తియ్యనైనది, నడకా తియ్యనైనది, మధురాధిపతి అయిన కృష్ణుని సర్వస్వమూ మధురమైనదే.




వచనం మధురం చరితం మధురం

వసనం మధురం వలితం మధురం | 

చలితం మధురం భ్రమితం మధురం

మధురాధిపతేరఖిలం మధురం || (2)

అర్థము:

పలుకు మధురము, నడవడి (చరిత్ర) మధురము. నిలకడ (నివాసము) మధురమైనది, బట్టలు మధురమైనవి. కదలికా ఇంపైనదే, తిరుగుడూ మధురమైనదే. మధురాధిపతి సర్వస్వమూ ఇంపైనదే.   




వేణు-ర్మధురో రేణు-ర్మధురః

పాణి-ర్మధురః పాదౌ మధురౌ | 

నృత్యం మధురం సఖ్యం మధురం

మధురాధిపతేరఖిలం మధురం || (3)

అర్థము:

అతని వేణువూ తియ్యనిది, చెలరేగే ధూళీ ఇంపైనదే. అరచేతులూ ఇంపైనవి, పాదాలూ ఇంపైనవి. నృత్యమూ ఇంపుగా ఉంటుంది, చెలిమీ తియ్యనైనది. మధురాధిపతి సర్వస్వమూ  తీపిని అందించేవే.




గీతం మధురం పీతం మధురం

భుక్తం మధురం సుప్తం మధురం | 

రూపం మధురం తిలకం మధురం

మధురాధిపతేరఖిలం మధురం || (4)

అర్థము:

అతని గీతము మధురం, వస్త్రం మధురం. తినే పదార్థమూ, తినే తీరూ, పడుకున్న తీరూ అన్నీ ఇంపుగానే ఉంటాయి. అతని రూపము తియ్యగా ఉంటుంది, దిద్దుకున్న తిలకమూ అందముగా, ఇంపుగా ఉంటుంది. మధురాధిపతి యొక్క సర్వస్వము ఎంతో బాగుంటాయి.  




కరణం మధురం తరణం మధురం

హరణం మధురం స్మరణం మధురం | 

వమితం మధురం శమితం మధురం

మధురాధిపతేరఖిలం మధురం || (5)

అర్థము:

చేతలు మధురమైనవి, ఈతలు మధురమైనవి. దోచుకోవడమూ ఇంపు, స్మరించుకోవడము ఇంపు. ఆతని మాటలూ తియ్యగా ఉంటాయి, శాంతమూ మధురంగా ఉంటుంది. మధురాధిపతి యొక్క సర్వస్వమూ బాగుంటాయి.




గుంజా మధురా మాలా మధురా

యమునా మధురా వీచీ మధురా |  

సలిలం మధురం కమలం మధురం

మధురాధిపతేరఖిలం మధురం || (6)

అర్థము:

గుంజా అంటే గురివింద గింజ. అది ఎంత అద్భుతంగా ఉంటుందో తెసులుసు కదా. కృష్ణుడు ధరించిన ఆ గింజలూ బాగున్నాయి, ఆటను ధరించిన మాలా బాగుంది. గురివింద గింజల మాల, తులసిమాల కూడ ఆయన వంటిపై ఎంతో అందంగా మధురంగా ఉంటాయి.
అతను విహరించే యమునా నదీ సుమధురం, అందులో నుండి వీచే తరంగాలూ మధురంగా ఉంటాయి.
ఆ నదిలోని నీరూ తియ్యగా ఉంటాయి, కమలంలో మధురంగా ఉంటాయి.
అల్లాగ మధురాధిపతి అయినా శ్రీకృష్ణుని సర్వస్వము మధురంగా, ఇంపుగా ఉంటాయి.




గోపీ మధురా లీలా మధురా

యుక్తం మధురం ముక్తం మధురం | 

దృష్టం మధురం శిష్టం మధురం

మధురాధిపతేరఖిలం మధురం || (7)

అర్థము:

అతని చుట్టూ ఉన్న గోపికలూ మధురంగా ఉంటారు, వారితో సలిపే లీలలూ అద్భుతంగా ఉంటాయి. అతని కలయికగా తియ్యగా ఉంటుంది, అతని ద్వారా పొందే మోక్షము (ముక్తి) కూడా ఎంతో హాయిగా ఉంటుంది.
అతను చూపించే దివ్యదర్శనం (లేదా అతని రూపము) అపురూపంగా ఉంటుంది, అతని శిష్ట వచనములు కూడా ఎంతో హాయిని కలిగిస్తాయి.
మధురాధిపతి యొక్క సర్వస్వమూ తీపిని, తృప్తిని కలిగించేవే.




గోపా మధురా గావో మధురా

యష్టి ర్మధురా సృష్టి ర్మధురా | 

దలితం మధురం ఫలితం మధురం

మధురాధిపతేరఖిలం మధురం || (8)

అర్థము:

గోపబాలురూ బాగుంటారు, వారి ఆవుల మందలూ బాగుంటాయి. వారి చేతుల్లో ఉన్న బెత్తాలు (కర్రలు) చూడటానికి నున్నగా బాగుంటాయి, అలాగే ఆ చుట్టూతా ఉన్న సృష్టి ( ప్రకృతి దృశ్యాలు) ఏంటో మధురంగా ఉంటాయి.
అతని ద్వారా చేయబడే దండనలు (రాక్షస సంహారము) బాగుంటాయి, అతను ప్రసాదించే ఫలితాలూ మధురంగా ఉంటాయి. 
ఆ కృష్ణపరమాత్మ (మధురాధిపతి) యొక్క సర్వస్వము, సకల విభవాలు, చేష్టలూ కూడా ఎంతో మధురమైనవే. 


ఇతి శ్రీ వల్లభాచార్య విరచిత మధురాష్టకం సంపూర్ణమ్ || 

ఓం నమో శ్రీకృష్ణాయ నమః | 
ఓం నమో నారాయణాయ నమః || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి