
అంతే కాదు హనుమంతుని మనము ఐదు ముఖములతో కూడిన రూపంగా ఎక్కువగా ధ్యానిస్తుంటాము.
పంచముఖీ ఆంజనేయస్వామి గుణగణాలు
- తూర్పు ముఖంగా మన వైపు చూస్తున్న స్వామి సకల పాపాలను హరించి మనకు చిత్తశుధ్ధి కలిగేట్లా చేస్తాడు.
- దక్షిణ ముఖంగా చూస్తున్న కరాళ ఉగ్రనరసింహ స్వామి శత్రుభయాన్ని పోగొట్టి మన అభీష్టములు ఫలించేట్లా చేస్తాడు.
- పడమటి ముఖంగా ఉన్న మహావీర గరుడస్వామి దుష్టప్రభావములు, మరియు హాని కలిగించే విష ప్రభావాల నుండి మనని రక్షించి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాడు.
- ఉత్తర ముఖంగా చూస్తున్న లక్ష్మీ వరాహ స్వామి గ్రహముల చెడు ప్రభావముల నుండి మనని రక్షించి అష్టైశ్వర్యాలు కలిగిస్తాడు.
- ఊర్ధ్వ ముఖంగా ఉండే హయగ్రీవస్వామి సకల విద్యలు, మరియు జయాన్ని, మంచి జీవన సహచరిని ప్రసాదిస్తాడు.
పంచముఖి అవతారము
రామాయణం లోని వర్ణనల ప్రకారము పంచముఖి ఆంజనేయస్వామి యొక్క అవతరణ ఈ విధముగా జరిగెను.
రామ, రావణ యుద్ధము జరుగుతున్నప్పుడు రావణుడు పాతాళ లోక అధిపతి యైన అహిరావణుని సాయము తీసికొనెను అహిరావణుడు తన మాయలతో విభీషణుని రూపము దాల్చి రామ లక్ష్మణులను బంధించి పాతాళము లోనికి తీసుకుపోయెను. అప్పుడు ఆంజనేయస్వామి అహిరావణుని మృత్యు రహస్యమును తెలుసుకోగా తెలిసినది ఏమిటంటే అక్కడ పాతాళ లోకములో ఒక చోట రహస్యంగా ఐదు దిశలలో వెలుగుతున్న ఐదు దీపములను ఒకే సారి ఆర్పితే వాని మృత్యువు సంభవించును అని.
వెంటనే ఆంజనేయుడు పంచముఖి అవతారమెత్తి తన ముఖములను ఆ ఐదు దిశలకేసి పెట్టి తన నోటి గాలితో ఒకే సారిగా ఆ ఐదు దీపాలనీ ఆర్పేశాడు.
ఈ విధంగా పంచముఖి ఆంజనేయుని అవతరణ జరిగింది.
పంచతత్త్వముల సహాయంతో ఆంజనేయస్వామి లంకా యాత్ర వర్ణన
కంబ రామాయణం లో పంచతత్త్వముల నుపయోగించి హనుమంతుని లంకా యాత్రను అతి అద్భుతంగా వర్ణించడం జరిగింది.
"వాయుపుత్రుడైన ఆంజనేయుడు (ఇక్కడ వాయువు తత్త్వము) వెంటనే సముద్ర జలాలను (ఇక్కడ జల తత్త్వము) ఆకాశ మార్గమున దాటి (ఇక్కడ ఆకాశ తత్త్వము), భూదేవి పుత్రిక సీతామాతను (ఇక్కడ భూ తత్త్వము) కలుసుకుని, లంకా నగరాన్ని మంటలలో దహించి (ఇక్కడ అగ్ని తత్త్వము) సీతామాత క్షేమ సమాచారమును రామునికి అందించెను".
ఇంతటి మహనీయుడైన శ్రీ ఆంజనేయస్వామిని ప్రతి మంగళవారము మరియు శనివారం కూడా భక్తితో మనస్ఫూర్తిగా పూజిస్తే అందరి ఆపదలను, కష్టములను తొలగించి వారికి సుఖ సంతోషములు అందచేస్తాడు. ఇంతే కాదు శ్రీ సీతారాముల కృపాకటాక్షములకు కూడ దగ్గర చేస్తాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి