4, ఏప్రిల్ 2020, శనివారం

గురు స్తుతి - ఆచార్య వందనము శ్లోకములు

దైనిక పూజ మరియు విశిష్ట పూజల ప్రారంభము కూడా నిత్యమూ మన ఆచార్య పరంపర మరియు గురువుల పూజతో మొదలవుతుంది. మన తల్లి తండ్రులు, భగవంతుడు కూడా మనకు ఆచార్యులే అవుతారు. వీరందరిని తలుచుకుని స్తుతించి అటు పిమ్మట పూజని మొదలు పెట్టాలి. వీరు మనకు జన్మనిచ్చి మనకు విద్య మరియు శాస్త్ర జ్ఞానమును ప్రసాదించి మనని ప్రాయోజకులనుగా తీర్చి దిద్దినవారు. అందుకని ప్రతిదినము వీరిని ధ్యానించి మన కృతజ్ఞతలను తెలుపుకొనుట మన కర్తవ్యము.








వైష్ణవ సంప్రదాయం పద్దతిలో పూజ చేసే వారందరూ వారి గురువులు,  మరియు ఆచార్యులతో బాటు ఆళ్వార్లను (దేవుని పరమ భక్తులను) కూడా ముందుగా స్మరిస్తూ వారందరికీ నమస్కారములు సమర్పించి ఆ పిమ్మట పూజ మొదలు పెట్టడం ఆనవాయితీ.

మన ప్రస్తుత ఆచార్యులు, గురువుల నుండి మొదలు పెట్టి వారి పై తరముల వారిని కూడా మనకు తెలిసినంతవరకూ స్మరించి పూజించుకోవాలి. ఈ విధముగా పూజించుటకై మన పూర్వీకులు ఈ క్రింది శ్లోకములను (వైష్ణవ తనియలను) సృష్టించారు.

గురుస్తుతి -ఆచార్య వందనము 


శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవమ్
యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిమ్ || (1)

లక్ష్మీనాథ సమారంభామ్ నాథయామున మధ్యమామ్
అస్మదాచార్య పర్యన్తామ్  వందే గురుపరంపరామ్ || (2)

యోనిత్య మచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ
వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే |
అస్మద్గురో: భగవతోస్య దయైక సింధో:
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే || (3)

మాతాపితా యువత యస్తనయా విభూతి:
సర్వమ్ యదేవ నియమేన మదన్వయానాం |
ఆద్యస్య న: కులపతే: వకుళాభి రామం
శ్రీమత్తదంఘ్రి యుగళం ప్రణమామి మూర్ధ్నా: || (4)

భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ
శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ |
భక్తంఘ్రిరేణు పరకాల యతింద్రమిశ్రాన్
శ్రీమత్పరాంకుశ మునిం  ప్రణతోస్మి నిత్యమ్ || (5)

పై శ్లోకములకు అర్థములు:

1) మొదటి శ్లోకము:
ఈ శ్లోకము లో మనవాళ మాముని కి నమస్కరించడం జరిగింది. ఆయన ఒక గొప్ప భక్తుడు మరియు ముని కూడ.
రామానుజాచార్యులు వైష్ణవ మత ఉద్ధారము మరియు ప్రచారము చేయుచు ప్రజలకు వెలుగు మార్గము చూపించే కార్యక్రమాలలో నిష్టగా పనిచేయుచు 120 ఏళ్ళకి శరీరము త్యజించగా ఆ కార్యక్రమాన్ని ఇంకా ముందుకి సాగించుటకై మనవాళ మాముని అవతరించెను. ఈయన తన భక్తి జ్ఞాన రసములతో అనేక ఉపదేశములు చేయుచు భగవంతుని సేవలో మనస్ఫూర్తిగా విలీనమై ఉంటుండెను.
ఈయన భక్తి నిష్ఠలకు స్వయంగా శ్రీ రంగనాథస్వామి మిక్కిలి సంతోషించి తబ్బిబ్బు అయిపోయెను.
స్వయంగా ఆ రంగనాథ స్వామియే ఈ శ్లోకము రాసి ఉండవచ్చునని ఆయన భక్తులు మరియు శిష్యుల నమ్మకము.

శ్లోకార్థము:
శ్రీ శైలేశ దయాపాత్రుడు (ఇక్కడ శ్రీ శైలేశుడు ఆయన గురువు మరియు శ్రీశైలేశ నివాసి అయిన తిరువాయిమొళి పిళ్ళై). శ్రీశైలేశుడు అంటే మన దైవమైన శ్రీ రంగనాథ స్వామి కూడా.

అందుచేత ఇక్కడ అర్థము ఏమిటంటే మనవాళ మాముని తన గురువైన తిరువాయిమొళి పిళ్ళై కు అల్లాగే శ్రీ రంగనాథ స్వామికి కూడా దయాపాత్రుడు.  మఱియును జ్ఞానము భక్తి విషయములలో మిక్కిలి దిట్ట. అంతే కాదు. ఆయన యతీన్ద్రులైన శ్రీ రామానుజాచార్యులకు కూడ అతి సన్నిహితుడు. అట్టి రమ్యజామాతృ ముని కి నేను నమస్కరించుచున్నాను.

మనవాళ మాముని కి ఇంకో పేరు రమ్యజామాతృ ముని అని కూడా ఉంది.
ఇక్కడ ఈ శ్లోకాన్ని రాసినది భగవంతుడే కనుక ఆయనే నమస్కారము చేసినట్లుగా మనము అనుకోవచ్చును.

అంటే ఈ విధంగా ఆ దేవుడే మనవాళ మాముని యొక్క గొప్పతనము మనకు తెలియచేసినట్లుగా మనము అనుకోవచ్చును. అందుకే ఈ శ్లోకాన్ని మనము ముందుగా చదివి ఆ మునికి మన దాసోహములు అర్పించుకుంటున్నాము.


2) రెండవ శ్లోకము:
వైష్ణవ ఆచార్యులు మరియు భక్తుల నమ్మకము ప్రకారము మన మొదటి గురువు స్వయంగా ఆ పరంధాముడైన శ్రీమన్నారాయణ స్వామియే. ఆయన మొదటిగా గురుమంత్రమును (అంటే తిరుమంత్రము) శ్రీ బదరీనారాయణ స్వామికి ఆ తరువాత విష్ణు రూపంలో శ్రీ మహాలక్ష్మికి  ఉపదేశించారు. కాబట్టి మనము ఆయనతో మొదలు పెట్టి మధ్యలోనున్న పలువురు గురువులతో బాటుగా మన ప్రస్తుత గురువు వరకు అందరికీ నమస్సులు అర్పించుకోవాలి.

శ్లోకార్థము:

లక్ష్మీనాథులైన ఆ పరంధామునితో మొదలిడి మధ్యలో ఉన్న నాథముని మఱియును యామునాచార్యుల క్రమము వరకూ, ఇంకా ఆ తరువాతి గురువులందరితో పాటుగా ఒక్కరికీ దాసోహములు సమర్పించుతూ, నా ప్రస్తుత ఆచార్యులకు కూడ నేను నమస్కరించు చున్నాను. 

3) మూడవ శ్లోకము:
ఈ శ్లోకంలో మన శ్రీవైష్ణవ పునాదికర్త మఱియును ఆచార్యులును అయిన శ్రీ రామానుజాచార్య మహాపురుషునికి ప్రణామములు సమర్పిస్తున్నాము. (ఆ మహావిష్ణువు శయ్య అయిన శేషువే వైష్ణవ మత పునరుద్ధరణ కోసము రామానుజాచార్యులుగా అవతరించెనని చెప్పుకుంటారు).

శ్లోకార్థము:

ఏ మహాపురుషుడైతే స్వయంగా ఆ పరంధాముని పాదపద్మములనే తన ప్రీతి భాగ్యముగా మఱియును సంపద గాను భావించి తక్కిన వాటినన్నిటినీ తృణప్రాయముగా విసర్జించెనో, ఎవరైతే తన మనస్సు అంతయు దయతో నిండిన సముద్రము వంటివారో అట్టి నా పరమ పూజ్య గురువైన శ్రీ రామానుజాచార్యులు వారి పాదములను ఆశ్రయించి శరణు కోరుచున్నాను.

4) నాలుగవ శ్లోకము:
నాల్గవ శ్లోకములో నమ్మాళ్వార్ ధ్యానము చేయబడుతోంది.
నమ్మాళ్వార్ గారు భగవంతునికి అతి సన్నిహితుడు మరియు ప్రీతిపాత్రుడైన 12 మంది ఆళ్వార్లలో ప్రముఖ స్థానము పొందినవారు. కలియుగ ప్రారంభములో ఈయన అవతరించి 32 ఏళ్ళు భగవంతుని సేవ చేసి ఆయన సాన్నిధ్యము చెందెను.

ఆచార్య పరంపరలో మొదటి స్థానము భగవంతుడిది. పిమ్మట లక్ష్మి దేవి, బదరీనారాయణుడు/విక్ష్వక్షేనుడు, ఆ తరువాతి స్థానము ఈ నమ్మాళ్వార్ గారిదే.

శ్లోకార్థము:

ఎవరి పాదములైతే పొగడపూవు వాసనలు విరజల్లుచు తల్లి తండ్రుల ప్రేమలు అందించునో, ఏ పాదములైతే ఈ ప్రాపంచిక బంధములు మరియు పాపకర్మలతో కూడిన సముద్రము నుండి (ఏ విధముగా అయితే ఒక సుపుత్రుడు తన తల్లి తండ్రుల కర్మలు చేసి వారికీ మోక్షము చేరే అవకాశము కల్పిస్తాడో) విముక్తిని ప్రసాదించి మోక్షమనే ఒడ్డుకు చేర్చేందుకై తహ తహ లాడుచుండునో, ఏ పాదములైతే మనకు మరియు మన రాబోవు సంతానములకు కూడ సుస్థిరమైన సుఖ శాంతులను ప్రసాదించునో అట్టి పాదయుగ్మములకు నేను శిరసా ప్రణామములు సమర్పించుకుంటున్నాను.

5) ఐదవ శ్లోకము:
అయిదవ శ్లోకంలో వైష్ణవ మతాన్ని తమ భక్తి, ప్రేమ రసములతో వ్యాపింపజేసిన 12 మంది వైష్ణవ ఆళ్వార్ లనూ వారి జన్మ కాలానుగుణంగా పేర్కొని వారికి దాసోహములు సమర్పించడం జరుగుతోంది.

శ్లోకార్థము:

12 మంది ఆళ్వార్ల పేర్లు చెప్పుతూ వారికి ప్రతిదినము నమస్సులు అర్పించెదమని వేడుకుంటున్నాము.

భూతం = భూత యోగి (పూదత్త ఆళ్వార్)
సరశ్చ = సరో యోగి (పొయిగై ఆళ్వార్)
మహదాహ్వయ = మహా యోగి (పేయాళ్వార్)
భట్టనాథ = భట్టనాథులు (పెరియాళ్వార్ అనగా విష్ణుచిత్తులు)
శ్రీ = గోదాదేవి (ఆండాళ్)
భక్తిసార = తిరుమళిశైయాళ్వార్
కులశేఖర = కులశేఖరాళ్వార్
యోగివాహాన్ = తిరుప్పాణాళ్వార్ (మునివాహన)
భక్తఅంఘ్రిరేను = తొండరప్పొడియాళ్వార్ (విప్రనారాయణ)
పరకాల = తిరుమంగైయాళ్వార్ (పరకాల ముని, కలివైరి)
యతీన్ద్ర = రామానుజాచార్యులు (ఈయన ఆళ్వార్ కాదు. మన మొదటి గురువు)
మిశ్రాన్ = మిశ్ర కవి లేదా మధురకవి ఆళ్వార్
పరాంకుశ ముని = నమ్మాళ్వార్  (శఠకోపన్)

ఈ పై వారందరినీ కూడా వరుస క్రమములో ధ్యానిస్తూ నిత్యమూ నమస్సులు అర్పిస్తున్నాము.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి