ఆంజనేయస్వామి పూజ చేసేటప్పుడు ఆయనను ద్వాదశ నామాలతో (అంటే 12 పేర్లతో) కీర్తిస్తూ పూజించడము పరిపాటి.
ఆంజనేయస్వామి అంజనాదేవి కుమారుడు. తండ్రి పేరు కేసరి. చాలా కాలము వరకు పిల్లలు లేకపోవుట చేత ఇద్దరూ కలసి శివపరమాత్మను, సూర్యుని ఉపాసన చేస్తారు. శివుడు తాండవం చేస్తూంటే రజస్ఖలనము జరిగిందని, అది సముద్రములో పడితే తట్టుకోలేక సముద్రుడు (వరుణుడు) దాన్ని సూర్యుడికి అప్పగించాడనీ, అప్పుడు సూర్యుడు దాన్ని వాయుదేవునికి ఇచ్చి అంజనాదేవి గర్భములోకి జేర్చమని చెప్పాడని ప్రతీతి. ఆ విధముగా ఆంజనేయుడు పుట్టాడు. అందుచేత ఆంజనేయుడు చాలా శక్తిమంతుడు, యుక్తిమంతుడు, దైవీక గుణములు కలవాడు అయ్యాడు.
ఈ ద్వాదశనామాలు అతని ఘనకార్యములను వెల్లడిస్తున్నాయి. రామాయణములో శ్రీరాముని అత్యంత ప్రియభక్తుడు, సన్నిహితుడు ఆంజనేయస్వామి. ఇద్దరూ కలవటం వల్లనే రాముడు లంకకు జేరి రావణాసురుడిని చంపగలిగెను. సీతాదేవి ఎక్కడుందో ఆంజనేయుని ద్వారానే కనుక్కోగలిగారు. మొత్తము రామాయణములో అతనిది ఒక ముఖ్య పాత్ర. అటువంటి ఆ మహాభక్తుడైన ఆ ఆంజనేయుని ఈ పన్నెండు నామాలతో ఘనముగా కీర్తించడము జరిగింది.
ఈ ద్వాదశ నామాలను ఒక రాగములో కీర్తిస్తూ చదువుకోవాలి.
ఆంజనేయస్వామి ద్వాదశ నామావళి
- హనుమా ( ఆంజనేయుని దవుడలు వజ్రాయుధముతో గాయము చెంది వంకరగా అయిపోయినవి. అందుకని హనూమన్ అన్న పేరు వచ్చింది) హను అంటే దవుడ, మాన్ అంటే వంకరపోయినవి.
- అంజనాదేవి కుమారుడు (సూనుః అంటే కుమారుడా అని అర్థము)
- వాయుపుత్రుడు
- మహాబలుడు
- రామునికి ప్రీతిపాత్రుడు
- అర్జునుడి స్నేహితుడు (అర్జుని రథానికి కట్టిన జెండాలో తను ఉన్నాడు)
- పింగాక్షుడు అంటే గోధుమరంగు కన్నులవాడు
- అమిత అంటే ఎల్లలు లేని, అవధులు లేని పరాక్రమ వంతుడు.
- ఉదధి అంటే సముద్రము, క్రమణము అంటే దాటుట. సముద్రము దాటినవాడు.
- సీతాశోకమును పోగొట్టినవాడు
- లక్ష్మణుడికి ప్రాణము తీసుకొచ్చినవాడు
- దశగ్రీవుడు అంటే 10 తలలు కలవాడు. అట్టి రావణాసురుని గర్వభంగము చేశాడు.
ఫలశ్రుతి
- స్వాపకాలము అంటే రాత్రి పూట అని కానీ, తెల్లవారు ఝామునే కానీ ప్రతీ రోజూ చదివే వారికి, మరియు యాత్రలు, ప్రయాణములు చేయునప్పుడు చదివిన వారికీ కూడ మృత్యువు భయము ఉండదు. ఎల్లా వేళలా అన్ని చోట్లా విజయమే చేకూరుతుంది.
- హనుమంతుని స్మరణ చేసే వారికి బుద్ధి వికాసము, బలము, యశస్సు, ధైర్యము పెంపొందును.
- ఎటువంటి భయములు ఉండవు. రోగాలు కూడ ఉండవు. అజాడ్యము అంటే సోమరితనము ఉండదు. వాక్కు పటుత్వము పెరుగును.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి